• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ పోరాట కవి రుక్నుద్దిన్‌

By Pratap
|

Ruknuddin
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా' మోగించిన రుక్నుద్దిన్‌ కలం, గళం మూగపోయింది. ఆయన గుజరాత్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు గాలిబ్‌ వద్ద సోమవారం కన్నుమూశారు. వలసాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని తన అక్షరాలతో బోనులో నిలబెట్టడమే గాకుండా, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు జైలు శిక్ష సైతం అనుభవించాడు. కవిగా అక్షరాలను సంధించడమే గాకుండా, మహబూబ్‌నగర్‌ జిల్లా అంతటా తిరిగి తన మాటాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిండు.

కేవలం 22 యేండ్ల వయసులో మొత్తం పాలమూరు జిల్లా అంతటా తిండి తిప్పలు లేకుండా రాత్రనకా పగలనకా తిరుగుతూ ఉద్యమానికి ఊపిరిపోసిన రుక్నుద్దిన్‌ కవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, పరిశోధకుడిగా, ప్రొఫెసర్‌గా తెలంగాణ ముఖచిత్రానికి మెరుగైన రంగుల్ని అద్దిండు. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌లు ఆయన కార్యక్షేత్రాలుగా ఉండేవి. పాలెం ఓరియంటల్‌ కళాశాలలో బిఓఎల్‌ చదువుతూ గురువు శ్రీరంగాచార్య ప్రోత్సాహం, గైడెన్స్‌లో ఉద్యమ కవిత్వాన్ని, కరపత్రాల్ని రాసిండు. మిత్రుడు, క్లాస్‌మేట్‌, రూమ్‌మేట్‌ కూడా అయిన జి.యాదగిరితో కలిసి కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొచ్చిండు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్న దశలోనే అప్పుచేసి ‘విప్లవ ఢంకా' పేరుతో కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొచ్చిండ్రు. ఈ అప్పుని ఉద్యోగాలు వచ్చిన తర్వాత తీర్చామని నాటి ఉద్యమస్ఫూర్తిని, చైతన్యాన్ని రుక్నుద్దిన్‌ సహ రచయిత అయిన జి.యాదగిరి ఇప్పటికీ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.

తండ్రి, అన్న కమ్మరి పనిచేసి రుక్నుద్దిన్‌ని చదివించారు. దానికి తగ్గట్టుగానే చదువులో పాలెం కళాశాల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి స్థానాల్లో నిలిచేవారు. పాలెంలో రుక్నుద్దిన్‌ క్లాస్‌మేట్‌లు, రూమ్మేట్లు వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్న జి.యాదగిరి ఒకరు కాగా మరొకరు రైటిస్ట్‌ తెలుగు ప్రొఫెసర్‌ కసిరెడ్డి వెంకటరెడ్డి.

మొదట తెలుగు పండితుడిగా టీచర్‌ ఉద్యోగంలో చేరిన రుక్నుద్దిన్‌ పోల్కంపల్లి, మాసపేట తదితర గ్రామాల్లో పనిచేశాడు. అనంతరం 1976లో జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికై జడ్చర్ల, మఖ్తల్‌, కల్వకుర్తి, భువనగిరి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. సంస్కృతంలో కూడా ఎమ్మే చేసిన రుక్నుద్దిన్‌ 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అసిస్టెంట్‌ రీడర్‌గా జాయినై ఎందరో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాడు. తాను జూనియర్‌ కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు తలలో నాలుకలా ఉండడమే గాకుండా వారికి అన్నివిధాల సహాయ సహకారాలందించే వారు. తన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు తన చేతనైన సాయం జేసేవాడు. ఈయన నేతృత్వంలో ఎందరో విద్యార్ధులు, ఎంఫిల్‌, పి.హెచ్‌డీ పట్టాలను పొందారు. చందాల కేశవదాసు మీద జరిగిన పరిశోధనకు కూడా రుక్నుద్దిన్‌గారే గైడ్‌గా వ్యవహరించారు.

లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల భావాల మూలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎబివిపీ విద్యార్ధుల నుంచి దాడుల్ని కూడా ఎదుర్కొన్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన ధైర్యశాలి రుక్నుద్దిన్‌. కులాలు, మతాల పట్టింపులు ఏమాత్రం లేని రుక్నుద్దిన్‌కు ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు. కొడుకు మతాంతర వివాహాన్ని కూడా ఆయన ఆహ్వానించాడు.

1947లో కల్వకుర్తి తాలూకా రాచూరులో చాంద్‌బీ, జహంగీర్‌ దంపతులకు జన్మించిన రుక్నుద్దిన్‌ విద్యార్థి దశలో అత్యంత పేదరికం అనుభవించాడు.

ఆకలి, కసి, తెలంగాణపై సీమాంధ్రుల ఆధిపత్యం ఆయన్ని పోరాట కవిగా తర్చిదిద్దింది. విద్యార్థిగా ఉన్నప్పుడే గుళ్ళు, చెరువు గట్లమీద శాసనాలను సేకరించి పరిశోధన చేసేవాడు. అలాగే 1984లో తెలుగులో జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన చేసిండు. విశ్వదర్శనం గేయ సంపుటి. రిటైర్మెంట్‌ సందర్భంగా ప్రయాణం పేరిట తాను నడిచివచ్చిన దారిని గుర్తు చేసుకుంటూ పుస్తకాన్ని వెలువరించారు.

‘తెలంగాణము' నా జన్మ హక్కని

తెలిసి చాటవోయీ!

దుష్ట శత్రువుల కరకర గోయుచు

దును మాడుమురోయీ!

మృతవీరుల హృదయాంత రంగముల ముచ్చట గూర్చోయీ! అంటూ ఆనాడు కవిత్వాన్ని ఆయుధంగా మలిచి ఆధిపత్యాంధ్రులపై ప్రయోగించాడు. ఇట్లా అనేక కవితలు ‘విప్లవ ఢంకా'లో చోటు చేసుకున్నాయి.

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలుగులో సాహిత్యం వెలువడలేదని సీమాంధ్ర సాహిత్యకారులు, చరిత్రకారులు, విమర్శకులు గుడ్డిగా అవాకులు చవాకులు పేలుతున్న సందర్భంలో ఆనాటి ఉద్యమ కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి నేను ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం' పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కవిత్వం రాసిన తొట్ట తొలికవుల్లో రుక్నుద్దిన్‌ది అద్వితీయస్థానం.

‘సింగిడి' తెలంగాణ రచయితల సంఘం తరపున ముస్లిం ప్రత్యేక సంచికను తెస్తున్నాం దానికి మీరు మార్గదర్శన చేయాలని అడిగినప్పుడు, అవసరమైన మంచి పని చేస్తున్నారు, నా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. అయితే నేనిప్పుడు మా కొడుకు దగ్గరికి అమెరికాకు వెళ్తున్నాను తిరిగి వచ్చిన తర్వాత కలుద్దాం కలకాలం నిలిచిపోయేలా సంచికను తీసుకొద్దాం అని చెప్పిన రుక్నుద్దిన్‌ అమెరికా నుంచే అనారోగ్యంతో వచ్చారు. అక్కడి వాతావరణం సరిపడక అస్వస్థులయ్యారు. చివరకు అదే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆశించిన ప్రత్యేక తెలంగాణ సాధన, అందుకు కవులుగా, రచయితలుగా ఎవరికీ, దేనికీ తలవంచకుండా పోరాడడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.

- సంగిశెట్టి శ్రీనివాస్‌

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 A prominent writer Sangishetty Srinivas has condoled the death of Ruknuddin, the first poet in separate Telangana movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more