• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెప్పాననుకున్నా..! (కథ)

By Pratap
|

T Lalitha Prasad
ఏదో చెప్పలేని బాధ. దెయ్యంలా పట్టుకుంది. రోజు రోజుకూ పెరిగిపోతోంది. వదిలించుకోవడం నా వల్లకావడం లేదు. చాలా ప్రయత్నించాను. లాభం లేదు. మనసును పట్టి కుదిపేస్తోంది. ఇది నా జీవితమంతా ఉంటుందేమో! భయం.. కంగారుగా ఉంది. అసలేం జరిగిందో కూడా తెలుసుకోలేకపోతున్నాను. కారణమేమిటని నన్ను నేను ప్రశ్నించుకోని క్షణం లేదు, పగలూ, రాత్రి...
ఆఫీసులో ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువమంది ఉన్నారు. కానీ పైకి చాలా సుకుమారంగా కనిపించడం, అందంగా నవ్వడం, చక్కగా పలకరించడంతోపాటు కనిపంచని కాఠిన్యంతో మెడలు వంచి పనిచేయించడమే వీళ్లకి బొత్తిగా గిట్టడం లేదు. (‘‘.... ఫోనిక్స్‌ స్టాండిరగ్‌ ఇన్‌ ఎ ఫ్లాక్‌ ఆఫ్‌ చికెన్స్‌''.. మిన్ననే సురేష్‌ అంటూంటే క్యాంటిన్‌ దగ్గర విన్నా!) వేరే సెక్షన్‌లో వాళ్లూ ఎంతో గౌరవంగా చూస్తారు. మర్యాదగా పలకరిస్తారు. కానీ మా సెక్షణలో పని అనగానే మిలటరీ రేంజ్‌లోకి అడుగుపెట్టినట్టే ఫీలవుతుంటారు!

నీ స్నేహంతో ఆ పలకరింపులు, చూపులు,ఆ వెనక జోక్స్‌ వేసుకోవడం... అన్నీంటినీ చాలా తేలిగ్గా, సరదాగా తీసుకోవడం అల వాటయింది. కానీ అవతల డిస్పాచ్‌ సెక్షన్‌లో నిజంగా సీరియస్‌గా ఉంటాడే.. అతనే నిజానికి నా మీద కామెంట్స్‌ అన్నింటికీ అర్హుడు. ముమ్మాటికీ అతనే శాడిజానికి తగిన బొమ్మ! కానీ ఒక ఆదివారం సాయంత్రం అలా షికారుకి వెళుతూంటే నిన్ను, ఆ శాడిస్ట్‌నీ చూసి ఆశ్చర్యపోయాను. ఇద్దరూ రోడ్డు పక్క ఒక చాట్‌ బండి దగ్గర మాట్లాడుకుంటూన్నారు. స్కూటర్‌మీద కూర్చుని వున్నాడు. నువ్వేమో తెగ జోక్‌లు వినిపిస్తున్నట్టు వాడు తెగ నవ్వేస్తున్నాడు. నన్ను నేను ఓసారి గిల్లుకున్నాను. అది మీ ఇద్దరేనా అని! మీరు నన్ను చూడలేదు. నేను వేరే దారిలో ఇంటికి తిరిగి వచ్చేశాను.

ఆమధ్య మంత్రిగారు వచ్చినపుడు ఆయనకు ఏదో పాయింట్‌ వివరిస్తూనే నీ వైపు చూసి కొంటె నవ్వు నవ్వాడు. వీడు సామాన్యుడు కాదుసుమా అనుకున్నాను. నిన్ను హెచ్చరిద్దామనుకున్నా! కానీ అంతటి స్వేచ్ఛా, అంత దగ్గరి స్నేహం మనకు లేవు. మనం కొలీగ్స్‌ మాత్రమే. ఆఫీసు కాగానే నీదారి వేరు, నీ ప్రపంచమే వేరు. నా గోల నాది! పోనీ కేంటీన్‌లో మాట్లాడినా ఏవో ఫైళ్ల గురించి తప్ప వేరే పర్సనల్‌ సంగతులకు ఛాన్స్‌ లేదు. అందరూ మనల్నే చూస్తుంటారు కూడా! (‘‘వీళ్లు గతంలో భార్యాభర్తలేమో..!'' ఎవరో ఎందుకు ఆ శాడిస్ట్‌గాడి అసిస్టెంటే అన్నాడు.)

ఆమధ్య పండగ సెలవుల్లో నువ్వు ఊరెళ్లలేదని తెలిసింది. నీ దగ్గరికి వచ్చాను. మనం యూనివర్సిటీ కేంపస్‌కి వెళ్లి చెట్ల నీడల్లో కూచున్నాం. గుర్తుందా! నేను చెట్టునానుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. నువ్వేమో సన్నగా గీతాదత్‌ పాటేదో పాడుతున్నావ్‌. సడన్‌గా నీ గొంతులో ఏదో చిత్రమైన శ్రావ్యత నన్నీలోకంలోకి లాక్కొచ్చింది. నువ్వు గీతాదత్‌వి అయిపోయావ్‌. నేను రచయిత్రిని అయిపోయాను. ఇద్దరం ఆ పాట రాగం, భావ తాదాత్మ్యంలో అలా..! అదో అందం, ఆనందం.. ఓ అద్భుతం. చీకటిపడుతోంది. చలిగాలిలో నీ కురులు చంపలపై తెరలా పడుతూ ఆడుతున్నాయి.. అదేదో సినిమాలో మధుబాలలా అనిపించావ్‌! నీ పాట ఆగలేదు. ఆ సమయం, ఆ ప్రాంతం, నీ శ్రావ్యమైన ఆలాపన.. గొప్ప మాయగా తోచింది! ఆఫీసు, ఫైళ్ళు, కాగితాలు, రంగు ఇంకులు, జిడ్డుమొమాలూ, శాడిస్టు జాగిలాలకి దూరంగా వెళితే.. మనిషిలో మాధుర్యం, ఒక్కింత శూన్యత పెద్ద కేన్వాస్‌ మీద అద్భుత రంగుల లయ..! ఇది జీవితమంతా నిండితే బావుణ్ణనిపించింది. నిజం. అపుడే నువ్వు అన్నావు, ‘‘నీ మొహం.. నువ్వనుకుంటున్నదేం లేదు. మేమేమీ ప్రిప్లాన్డ్‌గానూ కలవ లేదు. కానీ అతనిలో మంచి మాటకారి కూడా ఉన్నాడన్నది కనుగొన్నది నేనే నేమో!''

‘‘అంటే.. కొంపదీసి నువ్వుగాని.. ' అని బుగ్గలు పట్టి అడిగాను.

కానీ ఏదీ చెప్పలేదు.చెప్పదు కూడా. ఎందుకంటే అది ఉండీ లేని, కనిపించీ కనిపించని భావన. గట్టిగా అడగబోతే అలా తలొంచుకుని నిలబడుతుంది.. టీచర్‌ దగ్గర చిన్న పిల్లలా!

గదికి వెళ్లగానే మళ్లీ ఏదో మిస్టరీ ఆవహించింది. అది జీవితాంతం పరిశోధించమంటుంది. ఎండాకాలం ఆకులు రాలి చెట్లు విశ్రాంతి తీసుకుంటాయా? కానీ నా ఆలోచన, దహిస్తున్న బాధేదో నీకు కూడా చెప్పలేకపోయాను. పాటలో, మాధుర్యంలో కలిసిపోయానంతే.. సాయంసంధ్య మహిమ! ఆలోచనల స్రవంతిలో నిన్ను మాత్రం స్పష్టంగా చూడలేకపోతున్నాను. నీటి మీద రాతలా రాసినట్టే ఉంటుంది. కలిసినట్టే ఉంటుంది. ఎంతో చెప్పినట్టే ఉంటుంది... అన్నీ అనిపించడమే..!

ఎండాకాలం మధ్యాహ్నాలు, సాయంత్రాలు నిన్ను కలిసినపుడల్లా నీకు ఎంతో చెప్పాలనుకుంటాను. చెప్పేనని తిరిగి వచ్చే స్తాను.. చెప్పలేకపోయానన్నది రాత్రంతా దహించేస్తుంది. అతనికి నువ్వేం చెబుతున్నావో తెలీదు. మీరేం మాట్లాడుకుంటున్నారో తెలీదు.. ప్రేమలో పడ్డ కాలేజీ పిల్లల్లా అనిపాస్తారు. ఆలోచిస్తే. మీరురజూ కలవరు.. తెలుసు. అప్పుడు నేను చూసినపుడు చాలా రోజులుగా దొంగచాటుగా కలిసిన ట్టనిపించింది. ఎందుకు?

నువ్వామధ్య సెలవుల్లో వెళ్లిన తర్వాత ఒక మెయిల్‌ పంపావు.. అతనికి గుడ్‌లక్‌ చెప్పమని! ఆశ్చర్యమేసింది. చెబితే అతని రియాక్షన్‌ గమనించడానికి అయిష్టంగానైనా వెళ్లాలనుకున్నాను. అదీ నీ కోసం. మొబైల్‌ ఉన్నా, నెంబర్లు ఉన్నా..స్వయంగా చెప్పడంలో ఉండే దగ్గరతనం నాకూ తెలుసు. అందుకే నన్ను మెసెంజర్‌గా చేసుకున్నావ్‌. మనం తెలుకునేలోగానే చాలా దగ్గరవాళ్లమైపోయాం. నన్నిలా అడగడం అందుకు సాక్ష్యం. అతనికిక ఏం చెప్పానో తెలీదుగాని.. ఏదో చెప్పాను.. అతను నవ్వాడు. పులి కూడా నవ్వుతుందండోయ్‌... అన్నట్టు చూశాడు. నేనేమీ అనలేదు. ప్రశంతంగా చూశాను. అతను తల వొంచుకుని వెళిపోయాడు. నాలో ఏదో అలజడి మొదలైంది. ఇంకా ఎంతో చెప్పాలనుకున్నాను. చెప్పేననే అనుకున్నాను. తీరా చూస్తునుగదా.. అతను అలా ఎండుటాకులు తొక్కుకుంటూ రోడ్డు అంచున వెళిపోతూ కనిపించాడు.

నువ్వు మళ్లీ కలవలేదు. వస్తావని ఎంతో ఎదురుచూశాను. ప్రతీ సాయంత్రం మీరిద్దరూ కనపడతారని అటుగా పనిగట్టుకుని ఆ దారితో సంబంధం లేకున్నా అటే తిరిగి ఇంటికి మళ్లేదాన్ని. మీరిద్దరూ తప్ప అందరూ, అన్నీ. అలానే ఉన్నాయి. ఉంటాయి. బహుశా మీరిద్దరి మధ్యా విభేదాలు వచ్చి విడిపోయారేమో నన్నంతగా బాధ, చక్కటి స్నేహం, చక్కటి పలకరింపులు మనం, మన సాయంత్రాలు.. అన్నీ నేనే రబ్బరుతో చెరిపేసేనేమో!.. తలిస్తేనే భయంగా ఉంది.

క్షమాపణ చెప్పడానికి నువ్వు లేవు. రాలేదు. వస్తావో రావో కూడా తెలీదు. సంవత్సరాలు గడిచిపోయాయి. నన్ను నమ్మిచెప్పమన్న నీ చివరి మాట. పోనీ కోరిక..నేను చెప్పనే లేకపోయా. ఆ మాట నీ పాటలో అందం, తీయందనం..నా చుట్టూ, నా యింటి చుట్టూ, తిరుగుతూనే ఉంది. చీరకొంగు కుర్చీనో, ఇంటి గుమ్మంలో చెట్టు రెమ్మనో తగిలి పట్టితే నువ్వు ఆటలాడిరచేందుకు పట్టుకున్నావనే అనుకుంటా. తిరిగి వచ్చావని చిన్నపిల్లలా ఎంతోసంబరపడి వెనక్కి తిరిగిచూస్తాను. ఏళ్లనాటి నుంచి పట్టిన దుఖంలా అమాంతం బాధ కమ్మేస్తుంది.. ఇల్లు, ఆఫీసు, కొంటె చూపులు, కోపగించుకోవడాలు, రోడ్డుమీద పిల్లల ఆటలు.. అన్నీ విడిచి అలా నడిచిపోతూంటాను. తేరుకునే సరికి అదే చెట్టు నీడలో ఆ చెట్టుకి అనుకని కూర్చుంటాను. ఎవరో పిలిచినట్టు.. నీ నవ్వులు సాయంత్రాలు చిరుగాలికి ఊగే రెమ్మల్లా పలకరిస్తాయి.

చాలా కాలం తర్వాత నీ గురించిన సమాచారం చూచాయగా తెలిసి ఆనందించాను. తమాషా.. సరిగ్గా నేను ఉద్యోగంలో చేరి ట్రయినింగ్‌కి వెళ్లిన ఊరికే నిన్ను ట్రాన్సఫర్‌ చేశారని తెలిసింది.

కానీ ఒక్కటి మాత్రం నమ్ము... నీ మాట నిజంగానే నేను ప్రతీ అక్షరం చెప్పాననే అనుకున్నాను.. చెప్పలేదని.. చెప్పలేకపోయానని ఇపుడు తెలుస్తోంది.

- టి. లలితాప్రసాద్

English summary
A prominent poet and story writer T Lalitha Prasad has expressed in his Telugu short story emotions of human being.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X