వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేల మీద విశ్వాస ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

యాకూబ్ అంటే అమ్మ ! యాకూబ్ కవితో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడినట్టుంటుంది. ప్రేమ, ఆర్తి కలిసిన జీరగొంతుతో మాట్లాడుతారు. ఎక్కడో కొండల్లోంచి పారుతున్న ఏటిలోంచి పరమ సున్నితమైన అలొకటి వచ్చి
చర్మం మొత్తం పాకి ప్రకృతి పాటేదో పాడుతున్నట్టు మాట్లాడుతారు. చలి కాలం ఉదయం పూట తాటిచెట్ల మొదళ్లను వొరుసుకుంటూ నెమ్మది నమ్మదిగా ప్రవహించే మా ఊరి గెడ్డలా మాట్లాడుతారు. యాకూబ్ కవిత్వం చదివితే వొకానొక 'బాల్యం రాత్రి' కలలో భయపడ్డప్పుడు అమ్మను పట్టుకుని ధైర్యంగా నిద్రపోయినట్టుంటుంది. అమ్మతో మాట్లాడి యుగాల కాలంనాటి శక్తిని పొందనిమనిషి ఈ భూమ్మీద వుంటాడంటే నేను నమ్మను.

యాకూబ్ కవిత్వంతో నా పరిచయమెలా జరిగింది ? - యాకూబ్ కవిత్వంపై విశ్లేషణ - 'బహుత్ ఖూబ్ యాకూబ్' వొకరోజు ఎక్కడ నుంచో దొరకబుచ్చుకున్నాను. యాకూబ్ కవి - కవిత్వం మీద వచ్చిన ఈ ఆత్మీయ విశ్లేషణ చదివాక నాకే తెలియని వొక తన్మయత్వానికి లోనయ్యాను. ఆ కవిత్వ పాద మృదుపాయలకు వివశున్నయ్యాను.. 'వొక అనుభవాన్ని లేదా అనుభూతిని ఇంత అద్భుతంగా వాక్యంలోకి తర్జుమా చేయొచ్చా!' అనే ఆశ్చర్యం. పసిబాలుడు కాళ్లను పెనవేసుకుంటే కలిగే అనుభూతిలాంటిదేదో నన్ను ఆవహించింది . అవి మా అమ్మ చేతి వేళ్ళ స్పర్శలానూ తగిలాయి. యాకూబ్ కవిత్వంలో వున్న ఆ సున్నితత్వం నన్ను అత్యంత ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ మూడు సంపుటాల కవిత్వం చదివాక - అమ్మలో వుండే దయ, జాలి, ప్రేమ, ఆగ్రహం, నిరసన, ధిక్కారం - అన్నీ యాకూబ్ కవిత్వం ద్వారా నాలోకి - ఆ కవిత్వ మృదుత్వం.. తద్వారా నా కవిత్వంలోకీ తర్జుమాఅవుతున్నాయనుకుంటాను.

కవి వొక్కడు కాదు - అనేక కవుల సమూహం.
యాకూబ్ కవిత్వం నుంచి నేను నేర్చుకున్నాను.

Balasudhakar Mouli explains Yakoob's poetry

1.'ప్రవహించే జ్ఞాపకం' ఏమిటి ?

సృజనకారుడైన కవి - తన చుట్టూ వున్న ప్రపంచంతో తనను తాను వొక గాఢ పరిచయంగా మలచుకుని, తనదైన తాత్వికత నుంచి సంభాషిస్తే 'ప్రవహించే జ్ఞాపకం' అవుతుంది. అందరి జీవితాల్లోనూ ప్రవహించే జ్ఞాపకాలు వుంటాయని నమ్ముతున్నాను. అందుకే - ప్రవహించే జ్ఞాపకం మానవ సమూహానికి చెందిన
విశ్వగీతమని అంటున్నాను.

ప్రవహించే జ్ఞాపకం చదివాక మనిషి నిలబడతాడు. చుట్టుతా నుంచి వొక విశ్వాసాన్ని గాఢంగా గుండె లోతుల్లోకి పీల్చుకుని మరీ నిలబడతాడు. మనిషిని సరిగ్గా నిలబడనివ్వని కఠిన వాస్తవ పరిస్థితులు వున్న ఈ వ్యవస్థలో మనిషి కచ్చితంగా మిగిలి - ధైర్యంగా నిలబడితీరుతాడు. అలా నిలబడ్డాడంటే ముందుగా పాఠకుడు అయిన మనిషి - తనను తాను గుర్తించాలి. ఈ కవిత్వం పాఠకుణ్ణి Invention చేస్తుంది. అద్దంలాంటి కవిత్వమిది. ప్రవహించే జ్ఞాపకంలో ఎంత విశాలమైన మానవ వస్తువు వుందో, అంత గాఢమైన విశ్వాస ప్రకటన వుంది. ఎంత గాఢ విశ్వాస ప్రకటన వుందో - అన్ని కవిత్వ నిర్మాణవ్యూహాలున్నాయి. ఈ కవిత్వానికి ఈ బలం ఎక్కడ నుంచి వచ్చింది ? - నేననుకోవడం - హృదయప్రకంపనే కవిత్వమయినప్పుడు కవిత్వం యిలాగే వుంటుందని ! కవిత్వానికి ఆ చేవ - కవే కవిత్వమయినప్పుడు వస్తుందని నా విశ్వాసం..

'ప్రవహించే జ్ఞాపకం' - నాకు నా తలను ప్రేమతో నిమిరే మా అమ్మ చేతివేళ్ల అలల కదలిక. ఇంత కంటే ప్రవహించే జ్ఞాపకం గురించి చెప్పడానికి ఏముంటుంది !

'యాకూబ్ కవి' కవిత్వం చదువుతుంటే 'పాఠకుడు' - కవిత్వపాదాలలోకి తనలోకీ ఏకకాలంలో తొంగిచూస్తాడు. తన వేర్లేవో, తన మూలాలేవో, వుండాల్సి వుండకుండా పోతున్న సజీవ లక్షణమేదో తనకు దొరికినట్టు గొప్ప నమ్మకంతో - తడి నిండిన కళ్లతో - ద్రవీభూతమైన గుండెతో.. మళ్లా తిరిగి ప్రపంచంలోకి కొత్తగా చూస్తాడు.

ప్రవహించే జ్ఞాపకాన్ని ముట్టుకున్నప్పుడు నాకు మా అమ్మను ముట్టుకున్నట్టనిపించింది. యాకూబ్ మా అమ్మెందుకు కాదు. యాకూబ్ లో మా అమ్ముంది - అమ్మ కన్నీళ్లున్నాయి - అమ్మ ప్రేమ వుంది - అమ్మ ఆగ్రహం వుంది - అమ్మ నిరసన వుంది - అవన్నీ కూడగట్టుకుని నిలబడితే అమ్మ ఇచ్చిన స్ఫూర్తి
అణువణువునా నిండి వుంటుంది. ప్రవహించే జ్ఞాపకం ద్వారా నేను నేర్చుకున్నాను. కవిత్వం అంతరంగ పొరల గుండా ప్రవహించే ధిక్కారం, కొన్నికవితల్లో వేలాడే భయంకర నిశ్శబ్దం గుండెను ముక్కలు ముక్కలు చేస్తుంది. ఈశకలాలు తాకి ఇంకా ఎవరైనా మనిషి కాకుండా పోగలరా !?

యాకూబ్ యిప్పుడు నేను
తీగల చింత నేను
తమ్ముడి ఉత్తరంలోను
నేనూ రొట్టమాకు రేవునే

మట్టితో పెనవేసుకుపోయిన చెలిమి, ఊరితో పెనవేసుకుపోయిన అనుభూతి - యాకూబ్ కవిత్వమంటే.

కవి ప్రతి అనుభవమూ మన అనుభవం అవుతుంది. కవి తాత్విక ప్రపంచంతో చదువరికి వొకా గాఢ అనుబంధం ఏర్పడినప్పుడు - ఆ కవిత్వ స్పర్శ అంత త్వరగా వొదలదు.

' ఎవడిక్కావాలి మనిషి రోదన
ఎవడు వింటాడు మనిషి పిలుపు
మనిషి పక్కనే మనిషి ఎప్పుడు నిల్చుంటాడు నిర్భయంగా
ఎవడు బతుకుతాడు చచ్చిందాకా -
మనకిప్పుడు ఏ ఆయుధమూ అవసరం లేదు
మనిషి ఉంటే చాలు ' (చావు కథ కాదు )

ఆయుధం అవసరం లేదట - మనిషి మనిషి మిగిలితే చాలట - కవి దేన్ని స్వప్నిస్తున్నాడు ? ఏ వ్యవస్థని కోరుకుంటున్నాడు?కవి వ్యక్తిత్వాన్ని కవిత్వంలో దొరకబుచ్చుకోవచ్చు. ఈ కవిత పలవరించిన రెండు దశాబ్దాల కిందటికీ యిప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా ! నిర్భయం గురించి అంటున్నాను.

ప్రవహించే జ్ఞాపకంలో గుండెల్ని పిండేసి, మెలిపెట్టే వాక్యాలుంటాయి. నిజానికి అవి ఉత్త వాక్యాలే కావు. రక్తమాంసాలున్న సజీవ దేహాల నెత్తుటి కేకలు. పరమ సున్నితమైనవీ - ఆగ్రహాన్ని తొడుక్కున్నవీ -
మంటల్లా మండేవీ - మనిషి లోపల ఇంకా మిగిలున్న మనిషి తనం చిగుర్లను తాకేవీ - యాకూబ్ కవిత్వ వాక్యాలు. అవి - ఈ దేశ ప్రజలకు ప్రతీకలు

'ఇరవై ఎనిమిదోవాడు' పోయెంలో అనాథ శరణాలయాలలో పిల్లల మీద రాస్తారు యాకూబ్ కవి. అక్కడ కవి అంటాడు.

తనలాంటి అనాథ గాయాల చేయి
తగుల్తుంది అమ్మలా..... ' .... అని

ఎంత హృదయవిదారకత ! ఎంత సున్నితత్వం !
యాకూబ్ కవిత్వమంటే ఇదే. గాయపడిన వాడే గాయపడినవాణ్ణి దగ్గరకు తీసుకుని ఓదార్చగలడు. అమ్మలా సాకగలడు. ఈ కవిత్వమంతటా యాకూబ్ 'అమ్మ చేయి'పరుచుకుని వుంటుంది.

యాకూబ్ ఎంత ఆశాజీవంటే.... ఇదే కవితలో -

ఒక్కొరొక్కరూ అనాథలై
వెనుతిరుగుతారు సమూహాల్లోకి..... ' - అని అంటారు

ఏ మనిషైనా సమూహంలోకి వెళ్లాల్సిందే. సమూహమే మనిషికి శక్తినిస్తుందంటాడు. రెండున్నర దశాబ్దాలుగా వొరిగిపోకుండా సమూహం బలాన్ని ప్రవచించిన కవుల్లో యాకూబ్ ప్రముఖులు. యాకూబ్ తరం, యాకూబ్ ముందుతరం నుంచి నేటి మా కొత్తతరం తొలుత నేర్చుకోవాల్సిందిదే అనుకుంటున్నాను - నమ్మిన
దానికి కట్టుబడి వుండడం - ప్రధానం.

2.ఒక కవి కవిత్వాన్ని చదువుతున్నప్పుడు - 'కవి' తన కవితా సంపుటిలో గ్రహించిన వివిధ వస్తువులు - వాటి వైశాల్యత - పరిమితులు గురించి ఆలోచిస్తుంటాను. ఒక కవిత్వ ప్రేమికుడిగా నన్ను కవిత్వరూపం ఎంత
ఆకట్టుకుంటుందో, కవిత్వ వస్తువూ అంతే ప్రధానంగా ఆకట్టుకుంటుంది. వస్తువుకు తగిన రూపం వచ్చిందా ! లేదా ! అని ఆలోచిస్తుంటాను. వస్తువూ, రూపం సమపాళ్లలో వుంటే - ఆ కవిత రక్తంలోకి Inject అవుతుంది.

'సరిహద్దురేఖ' - అనేక కవిత్వ వస్తువుల సమూహం. అనేక రకాల కవిత్వ వ్యక్తీకరణల సమూహం. చాలా గంభీరంగానూ, గాఢతతోనూ వుండి - మళ్లీ మళ్లీ వస్తువును నెమరువేసుకునేటట్టు చేసే కవిత్వ సంపుటిది.

ఒక సమస్య ఎదురౌతుంది. దాన్ని ఛేదించాలి. ఛేదించిన వరకూ సమర్ధుడు అలసిపోడు - విరామం తీసుకోడు. ఈ కవితా సంపుటిలో అనేక క్లిష్ట సమస్యలను, సమాధానం తెలిసి తీరాల్సిన అనేక ప్రశ్నలను చర్చించి ఒక ప్రజాస్వామ్య దృక్కోణాన్ని ఏర్పరిచి మనకి అందించారు యాకూబ్ కవి. 'సరిహద్దురేఖ'ను చదివిన ఎవరైనా దాన్ని బలవంతాన లోపలకు తీసుకోవడం వుండదు - కవిత్వ వస్తువిస్తృతి వల్ల దానంతట అదే లోపలకు లోపలలోపలకు సహజంగా ప్రవహిస్తుంది - లోపల వొక అలజడిని మాత్రం కచ్చితంగా సృష్టిస్తుంది. నిజాయితీ గల కవిత్వం చేయాల్సిన పనే అది.

'సరిహద్దురేఖ' మీద నిలబడ్డాక - నాకు ఈ దేశం కనిపించింది. ఈ దేశం స్థితిగతులు చాలా స్పష్టంగా, గంభీరమైన రూపంతో కనిపించడం జరిగింది.

సరిహద్దురేఖంటే - ప్రవహించే పకం నుంచి మొలుచుకొచ్చిందే. ప్రధానంగా 'లౌకికస్వప్నం' ఏదయితే చర్చించబడిందో - ఆ స్వరం ఈ కవిత్వసంపుటిలో ఏ కవిత చదువుతున్నా - విన్పించింది. 'లౌకిక స్వప్నం'
లేకుండా సరిహద్దురేఖ సంపుటి వుందా !? లేదు.

సరిహద్దురేఖంతా చదివాక - వొక Biography చదివినట్టనిపించింది. ఆ Biography వొక సామాన్యుడిదే గావొచ్చు - సామాన్యులే అధిక శాతం వున్న ఈ దేశానిదే గావొచ్చు. కవి యింత విస్తృతంగా మాట్లాడుతాడా ! అనే ఆశ్చర్యం - ఆశ్చర్యంతో కూడిన ఆనందం. ఎందుకంటే 'సరిహద్దురేఖ' నాకొక తెలివిడిని యిచ్చిందనుకుంటాను.

'కవిత్వాన్ని యింత సీరియస్ గా తీసుకోవాలి' - అనే వొక నమ్మకాన్ని యిచ్చింది.

అప్పుడెప్పుడో కొన్నాళ్ల కిందట సరిహద్దురేఖ పేరు విన్నాను. ఆ కవిత్వం ఏదో వొక ప్రధానమైన విషయాన్నే చర్చించి వుంటుందనుకున్నా. ఆ శీర్షిక చుట్టూ రకరకాల ఆలోచనలు అల్లుకున్నాను. ఈ వ్యవస్థ మీద, దీని
తీరుతెన్నుల మీద 'కవి మేథావి' ధృక్పథం వ్యాప్తి చెంది వుంటుంది - అనే ఊహలు చేసేవాణ్ణి. నా ఊహలు నిజమని నిరూపించిన కవిత్వం సరిహద్దురేఖ అంటే 'కవిత్వ శీర్షిక - లోపల విషయాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది' - అనే దానికీ ఈ సంపుటి పేరు ఉదాహరణ.

సరిహద్దురేఖ దేశ యదార్ధస్థితికి Symble. విశాలమైన, విస్తారమైన భావాలను పొదిగివున్న కవితలివి.

'లౌకిక స్వప్నం గురించే మాట్లాడుతాను' కవితలో..

'మూడు గోపురాలు, మూడు సింహాలు
మూడు రంగులు -
ప్రశ్నార్థకాలుగా మారిపోయాయి
అన్ని ప్రతీకలు మరోసారి వంచించబడ్డాయి '

ఎంతగా దుఃఖపడితే గానీ, ఎంతగా దుఃఖానుభవానికి లోనయితే గానీ, తనని తాను నిజాయితీగా తర్కించుకుంటే గానీ యిలాంటి కవిత్వ వాక్యాలు రాయగలడం - ఏ కవికైనా దుస్సహం.

కవికి ధైర్యం కావాలి. కవిత్వంలో కవి విస్ఫోటనం చెందాలి. లౌకిక స్వప్నం గురించి మాట్లాడిన కవితల్లో యాకూబ్ కవి - చాలా నెమ్మదిగామొదలుపెట్టి అక్కడ నుంచి వొక్కసారి ఆకాశాన్ని అలుముకున్న పొగలా విస్ఫోటనంచెందుతాడు.

నన్నూ, నిన్నూ నిట్టనిలువునా నిలబెట్టి ప్రశ్నిస్తాడు.

ఈ కవితలోనే..

' మనిషి తప్ప మిగిలిన సమస్యలే ప్రధానమైపోతున్నప్పుడు
మత చదరంగంలో
మనుషులే పావులవుతారు ! '

మనిషి కోసం - మనిషి మనుగడ కోసం - మనిషితనం కోసం - గొంతు చించుకుని, గుండె రొద పడి - ధైర్యంతో మాట్లాడే మనిషి కావలనుకుంటే.. ఆ మనిషి నిక్కచ్చిగా యాకూబే అవుతారు. యాకూబ్ 'మనిషి' - 'మనిషి కవి' . మనిషి ని.. మాణం కోసం - నడుం బిగించిన కవి. తన వ్యక్తిత్వమేటో, తన కవిత్వ గుణమేటో యాకూబ్ కవి హృదయలిపిలో ప్రకటించిన కవిత్వ సంపుటే సరిహద్దురేఖ. సరిహద్దురేఖలో కవి తాత్విక విశ్వరూపం కనిపిస్తుంది.

కవి - 'వల' కవితలో - ''భూమికిప్పుడు స్వేచ్ఛ కావాలి'' అంటాడు.

'మాట్లాడుకుందాం' కవితలో -

'మనందరికీ ఇది మాట్లాడే సమయం
సరిహద్దుల్ని చెరిపేసే సమయం
రండి
స్వేచ్ఛగా మాట్లాడుకుందాం ' - అంటాడు

'కాలనాళిక' కవితలో -

' స్వేచ్ఛను శ్వాసిస్తున్న వాణ్ణి
ఎవరో నన్ను బంధించినా స్వేచ్ఛాగీతాన్ని పాడుతాను
విస్మృత మార్గాల గుండా మనిషి అడుగుల్ని
ఆవిష్కరించి
కొత్తలోకాన్ని ఆవిష్కరిస్తాను ' ... ఇలా యాకూబ్ కవి అనేక కవితల్లో స్వేచ్ఛ గురించి మాట్లాడుతారు.

దుర్మార్గమైన వ్యవస్థలో - మనిషికి స్వేచ్ఛ లేదు. మనిషిని కన్న నేలకు స్వేచ్ఛ లేదు. విముక్తి కావాలంటాడు కవి. కట్టుబాట్లు నుంచి, మతం నుంచి, నేలను హస్తగతం చేసుకున్న కబందహస్తాల నుంచి, సరిహద్దుల నుంచి - విముక్తి కావాలంటాడు.

ఒక మనిషి కవిని, కవి మనిషిని.. నువ్వు చూడాలంటే - కచ్చితంగా 'సరిహద్దురేఖ'ను చదివితీరాలి. ఈ సంక్లిష్ట వ్యవస్థ నిర్మాణంలో నీకూ నాకూ సరైన దృష్టినిచ్చేది 'సరిహద్దురేఖ'లాంటి కవిత్వమే.

అన్నింటి కన్నా - 'మనిషి కావడం' ముఖ్యం. సరిహద్దురేఖ మనుషులను తయారిచేసే జీవమున్న వొక పరికరం.

'యాకూబ్ కవి' వ్యక్తిత్వం - సరిహద్దురేఖని నిర్వచించాలంటే.. నాకు అన్నింటి కన్నా ముందు వరసలో కన్పించే కవిత - 'గాయకుడి గాయం'.

' నేను పాటలకు ప్రాణం పోసి
పావురాళ్లుగా ఎగరేసిన వాణ్ణి ' - అని కవితని ప్రారంభిస్తారు

పావురాళ్లు స్వేచ్ఛకు సంకేతం. దానినే కవితంతా కొనసాగిస్తారు.

' నా గొంతు అక్షరాలకు రాగాల ఊపిరి పోసేది '

కవి - ఈ నేల మీద లిఖించాల్సినదేదో కోల్పోబోతున్నట్టు ముందుగానే సూచన చేసిన కవిత్వవాక్యమిది. కవి గతాన్ని గుర్తుచేసుకుంటున్నాడు అంటే - వర్తమానంలో దాన్ని బహుశా కోల్పోయే వుండొచ్చు - అని సూచిస్తూ -- ఆ సూచన చెప్తూ - యదార్ధంలోకి వస్తాడు. చెప్పాల్సింది చెప్పేస్తాడు.

' అన్నిట్లాగే పాట కూడా నా నుంచి దూరమైంది '

తర్వాత విశ్వాస ప్రకటన -

' పాట కోసం అన్వేషిస్తున్నాను !
ఆత్మవిశ్వాసపు ఆయువును పాటలో వెతుక్కుందామని ప్రయత్నిస్తున్నాను
------
ఈ గాయాల్ని మాయం చేసే పాట కోసం నిరీక్షిస్తున్నాను ' -

సరిహద్దురేఖ కవిత్వ సంపుటిలో వ్యాపించి వున్న తాత్విక సారాంశమంతా 'గాయకుడి గాయం' కవితలోనే యిమిడి వుందనుకుంటున్నాను. విశ్లేషించుకుంటూ వెళ్తే - వొక్కో కవితా - వొక్కో పుస్తకమౌతుంది.
బరువున్న కవిత్వంను తూచడం చాలా కష్టతరమైన పని. కానీ ఆ కవిత్వం ఎక్కడలేని శక్తినిస్తుంది. గత వర్తమాన భవిష్యత్ చరిత్రలు ఆ కవిత్వం నిండా దట్టించబడి వుంటాయి.

'దేశభక్తి కూర్చి, గురించి ' కవితలో -
' అందరూ మాట్లాడ్డం ఆపేసిన దగ్గర్నుండే
నేను
మాట్లాడ్డం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా ' - యాకూబ్ అంటే యిదే.

... ఈ దుర్మార్గమైన వ్యవస్థలో యాకూబ్ కోరుకునేది ఏమిటి ? - అనే దానికి ప్రతి కవితా ఉదాహరణగా నిలిచినా 'ఆఖరి అధ్యాయం' కవిత మరీ ముఖ్యమైనది.

ఒకటా, రెండా 'సరిహద్దురేఖ' కవితలన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాస్తే 'సరిహద్దురేఖ'లాంటి కవిత్వాన్నే రాయాలి - అని అన్పిస్తుంది 'సరిహద్దురేఖ'ను ఎక్కడ ఆపాలో అర్థంకాక ! అసలు ఆపాలని అన్పించనూలేక యిలా -

3.'కవి' తను నమ్మిన సైద్ధాంతిక అవగాహన్న మీద - రెండు మూడు దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలబడడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఒక కవి అలా స్థిరంగా వున్నాడంటే - అతని ప్రాపంచిక దృక్పథం, దాని వేర్లు ఎంత దృఢంగా వున్నాయో అర్థమౌతుంటుంది.

కాలం పెట్టే పరీక్షల సుడిగుండలో పడని కవి అజేయుడు. అజేయుడు తను నిలబడ్డమే కాకుండా - చుట్టూ వున్న వాళ్లని.. తనలాగే నిలబెట్టగలడు. 'ఎడతెగని ప్రయాణం'లో 'కవి అజేయుడు' కనిపిస్తాడు.. ప్రతిదీ ప్రపంచీకరణ మాయకు లోనవుతున్న సందర్భంలో సృజనశీలి ముఖ్యంగా కవి వాటిని ఎదుర్కొంటూ
కవిత్వాయుధంతో నిలబడ్డం గర్వించదగినది.

యాకూబ్ కవి - తడి తడి అడుగుల 'ప్రవహించే జ్ఞాపకం' కవి - గంభీరంగా మాట్లాడిన 'సరిహద్దురేఖ' కవి - 'ఎడతెగని ప్రయాణం'లో 'శాంతి ప్రవచనం' చెప్తున్నాడు.

' మనం కోరుకునే శాంతి
గుండె చప్పుడుకు, తుపాకి మొనకు మధ్య
ఊగిసలాడుతుంది ' - కవి కుండబద్దలు కొట్టినట్టు నిజం చెప్తున్నాడు.

ముగింపు చూడండి -

' రేషన్ లో శాంతిని ఈ రాజ్యం ఎంత కేటాయిస్తే
అంతే సంచిలో తెచ్చుకోవాలి
అంతటితోనే సరిపుచ్చుకుంటూ గడపాలి '

గుండెను పిండేసే వాక్యాలు కావా యివి ? నిజాన్ని నిర్భయంగా ప్రకటించిన వాక్యాలు కావా యివి ? మన అసమర్థతను వెక్కిరించటం లేదా ?! మనిషి శాంతిని కూడా రాజ్యమే నిర్వహించాలా ? ఎంత విషాదం ! ఈ కవితలో అంతర్గతంగా ధిక్కారం వుంది. కాప్టిలిస్ట్ సిస్టం శరాఘాతాలకు మనిషి ముందు గాయపడతాడు - గాయపడ్డాక ఏం చేస్తాడు ? - చావుని చేరుతాడు లేదా లేచి నిలబడి ఎదురుతిరుగుతాడు. 'ఎదురుతిరగమని చెప్పడమే' - ఈ కవిత లోలోపల ఉబికే జ్వాలగా నా కళ్లకు కనిపిస్తుంది.

'తస్లీమా నస్రీన్' మీద రాసిన కవిత ఎన్నదగింది. బహుశా కవి అప్పట్లో హైద్రాబాద్ మీటింగ్ లో తస్లీమాపై జరిగిన దాడిని ప్రత్యక్షంగా చూసే వుంటాడు. లేదా - హైద్రాబాద్ గాలి మోసుకొచ్చిన ఆ వివక్షను హృదయం
చెవితో విని వుంటాడు.

' రాతలు
రహస్య నివేదికల్లా భయపెడుతుంటాయి
భావాలు
శిక్షాస్మృతుల్లా వెంటాడుతుంటాయి '

రాతలు, భావాలు 'స్వేచ్ఛా రెక్కలు' తొడుక్కోవాలి. అది ప్రజాస్వామ్యం. మరెందుకు తస్లీమాలాంటి రచయితల ప్రజాస్వామ్యాన్ని నియత్రించడం జరుగుతుంది. ? - అనేది వొక పెద్ద ప్రశ్న. భారతదేశంలో ఆమెపై
జరిగిన దాడిని ఏమనుకోవాలి ? కవి దానికి వెతికిన జవాబు ఏమిటి ?

' అన్ని మనమే నిషేధించుకుంటున్నాం
అన్ని ఆంక్షలు మనమే నిర్ణయిస్తున్నాం ' - అన్న కవి ఆలోచనా తీరేమిటో అర్థమౌతుందనుకుంటున్నా.

యాకూబ్ కవిత్వ వస్తువుల్లో - మనుషులొస్తారు, స్థలాలు వొస్తాయి - వాటన్నిటినీ గుండెల్లో పెట్టుకుని ప్రేమతో, ఆర్తితో కవిత్వం చేస్తారు. కవి ఇస్మాయిల్ మీదా, జానపద వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మీదా కవిత్వం
కట్టారు. 'కుప్పం' మీద కవిత్వం రాశారు. యాకూబ్ కవిత్వానికి వస్తు విస్తృతి ఎక్కువని మళ్లీ 'ఎడతెగని ప్రయాణమూ' నిరూపిస్తుంది.

తొలి కవితా సంపుటి నుంచి యాకూబ్ కవిత్వం చర్చకు పెట్టిన వస్తువు - మనిషి. యాకూబ్ - ఆగ్రహంగా చెప్పినా, ఆవేదనతో చెప్పినా, ప్రేమగా చెప్పినా యాకూబ్ కవిత్వ కేంద్రబిందువు - మనిషే. ఎడతెగని ప్రయాణంలో- 'మసీదు - మందిరం', 'ఎజెండా', 'జిందాబాద్ కాశ్మీర్' - ఈ కవితలు యాకూబ్ కవి ప్రత్యేకతను మరోసారి చెబుతాయి. 'అతడు, ఆమె : మార్కెట్' పోయెం చదవాల్సిన గొప్ప పోయెం.

4.చదవడం చాలా ఆరోగ్యకరమైన విషయమని ఈ మూణ్ణెళ్లూ నేను చదివిన యాకూబ్ కవిత్వం నిరూపించింది. రోజు రోజుకీ ఒత్తిడిమయమైపోతూ.. యాంత్రికంగా మారిపోతున్న కాలంలో నుంచి నేను ఈ కవిత్వాన్ని చదువుకున్నాను. ఏ అనుభవమూ ఊరకనే పోదు. ఒక కవిత యిచ్చే విశ్వాసం జీవితకాలమంతా వుంటుంది. ఈ మూడు సంపుటాల కవిత్వం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సృజనకారుడికి ఈ వ్యవస్థతో నిత్యం ఘర్షణ వుండాలంటారు. ఈ కుటిల వ్యవస్థ మనుషుల్లో స్పందనా శీలాన్ని నాశనం చేస్తుంది. ఈ కాలమంతా - వొక రకంగా నాలో స్పందనను ఆవిరి చేయకుండా 'యాకూబ్ కవి కవిత్వం' నన్ను కాపాడింది. నిజంగా - అనేక
విషమస్థితుల మధ్య మనిషి జీవించాలి. గతవర్తమానాలను అనుభవిస్తూ -
భవిష్యత్తుని స్వప్నించాలి. ఏదీ బరువు కాకూడదు..

ఈ మూడు సంపుటాల్లో - రెండు దశాబ్దాల చరిత్రను చదివాను నేను. నా కళ్ల ముందు - ఒక అపూర్వమైన జీవితంలాంటి కవిత్వం - యిన్ని రోజులూ కదలాడింది. ఒక కవి జీవితం - సకల అంశాలూ.. బహుశా నా అనుభవంలోకి వచ్చాయనుకుంటున్నాను.

కవి - తొలి కవిత్వసంపుటితోనే తన అజెండాని లోకానికి తెలుపుతాడట ! యాకూబ్ కవి సమాజంపై తన విశ్వాసం - చేసిన విశ్వాస ప్రకటన - ఏం మారలేదు అప్పటికీ, యిప్పటికీ. తొలి సంపుటితో ఏ విశ్వాస ప్రకటన చేసారో, ఎడతెగని ప్రయాణంలోనూ సడలని ఆ విశ్వాస ప్రకటనే కనిపిస్తుంది. యాకూబ్ కవిత్వమంతా
వొక గొప్ప విశ్వాస ప్రకటన. మనిషి మీద విశ్వాసం -బతుకుతున్న నేల మీద విశ్వాసం. జీవితాలను తేజోవంతం చేయడానికి - వొకింత విశ్వాసాన్ని అందించే వొక జీవితకాల ప్రయత్నమే యాకూబ్ కవిత్వం.

ఈ మూడు సంపుటాలూ - ఒకే దారానికి గుచ్చబడ్డ మూడు పువ్వులు.

ఓ కవితలో కవిని నిర్వచిస్తూ - 'కవి.. కాలాన్ని లిఖించే చరిత్రకారుడు' అంటారు యాకూబ్.

కవి యాకూబ్ - నిజమైన చరిత్రకారులు. ఒక దేశాన్ని, దాని సకల చలనాలతో ముడిపడివున్న జీవితాన్ని కవిత్వంలోకి బట్వాడా చేసిన చరిత్రకారులు. నిజమైన చరిత్రకారులు - గతం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తుంటారు.

- బాలసుధాకర్ మౌళి

English summary
A young poet Balasudhar Mouli speaks the merits of senior Telugu poet Yakoob's literary works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X