• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోరటి వెంకన్నకు అవార్డు: చంద్రునికో నూలుపోగు

By Pratap
|

గోరటి వెంకన్న స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్లు గొప్ప కవులు కాలేరేమో... నగరంలో జీవిస్తూ కాళిదాసు ప్రకృతిని వర్ణించాడు మేఘసందేశం రాశాడు. దేశాన్ని, ప్రకృతిని వర్ణించాడు. జాషువా గబ్బిలం రాశాడు. కరుణశ్రీ పుష్పవిలాపం రాశాడు. అంగలకుర్తి విద్యాసాగర రావు మనిషి ఒక్కడే విడిగా మనలేదు రాశాడు. సినారె విశ్వంభర రాశాడు. ఎన్. గోపి జలగీతం రాశాడు. శీలా వీర్రాజు మళ్లీ వెలుగు రాశాడు.

రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాశాడు. ప్రశాంత శాంతినికేతన్‌కు రూపకల్పన చేశాడు. ఇలా మహాకవులు సమాజంతో పెనవేసుకుపోయిన ప్రకృతిని ప్రేమించారు. ప్రకృతితో మమేకమయ్యారు. మనిషిని ప్రకృతిలో భాగం చేశారు. ప్రకృతి మాత ఒడిలో ఆడుకునే పసిపిల్లలుగా కేరింతలు కొట్టారు. తోచిన విధంగా పలు కోణాల్లో ప్రకృతికి, మనిషికి మధ్య గల సబంధాన్ని, ప్రకృతికి, మనిషికి, సమాజానికి, సమూహానికి, వర్గానికి మధ్య గల సంబంధాన్ని అనేక పార్వ్శాల్లో దృశ్యీకరించారు.

Gorati Venkanna

వాటి సెల్యులాయిడ్‌పై మలిస్తే అవి మరింత మనోహన్నత విజువల్ కావ్యాలు. గోరటి వెకన్న ఈ కోవలో ఎదుగుతూ వచ్చిన మహాకవి. ప్రజాకవి. వాగ్గేయకారుడు. అదనంగా జీర గొంతుతో జేసుదాసులా తనలో బైరాగి రాగాల్ని, తత్వాల్నిఅంతర్లయగా పరుచుకున్న కవితాశైలి ఆయనది. అతని వస్తువు అందరికీ తెలిసిందే. ఇంత అందంగా ప్రకృతిని చూడాలని గోరటి వెంకన్నను, అందెశ్రీని, కాళిదాసును చదివినప్పుడే తెలిసి వస్తుంది.

విషాదాన్ని నివేదించడం, అందునా తాత్వీకరించడం ఠాగూర్‌కే అంత గొప్పగా సాధ్యమైంది. అంతే గొప్పగా విషాదాన్ని ఆలపించిన బైరాగి తత్వాల విశిష్టత గోరటి వెంకన్నది. ఆవేశం, ఆవేదన, కరుణ, ప్రేమ ప్రకృతిలో లీనమయ్యే స్వభావాన్ని ఆయన కవిత్వం మనలో తట్టిలేపుతుంది. తాదాత్మ్యం, లీనం కావడం అనేవి ఆయా ప్రక్రియల ఉదాత్తతను, ఉన్నత శిఖరాలను తెలుపుతాయి.

గోరటి వెంకన్న వెంకన్న ఏది రాసినా, ఈ ఉదాత్తీకరణ, తాదాత్మ్యం, ఆ భావంలో లీనమయ్యే స్వభావాన్ని మనలోంచి ఊటలా, జలపాతంలో వెలికి తీస్తుంది. ఆయన పదాల వెంట, భావాల వెంట మనం పరిగెడుతాం. ఆయన కవిత్వానికి పరవశమైపోతాం. అదే శక్తి సామర్థ్యాలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమస్ఫూర్తిని రగిలించడానికి ఉపయోగపడ్డాయి.

గోరటి వెంకన్న, అందెశ్రీ సమకాలికులు. సన్నిహిత కుటుంబ స్నేహితులు. శైలిలో, శిల్పంలో ఎవరి ప్రత్యేకత వారిది. అయితే వైవిధ్యంతో పాటు వారిలో అనేక సారూప్యాలు గమనించవచ్చు. ప్రకృతిని వర్ణించడంలో, మనల్ని తమలోకి లాక్కోవడంలో ఇద్దరూ ఇద్దరే. గోరటి వెంకన్న పల్లెను దాటి నగరానికి వచ్చి, తిరిగి పల్లెను, ప్రకృతిని, వాటి విశిష్టతను మళ్లీ కనుక్కున్నవాడిగా కవిత్వీకరిస్తాడు.

గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది అనే పాటలో గాని, మా వూరి సంత పాటలో గానీ, నగరాన్ని ప్రకృతీకరించే క్రమంలో నగర ఛాయలను, అమాయకత్వానికి, అమానుషత్వానికి బలైన ప్రజలను అర్ద్రంగా చిత్రించారు. మనకు తెలియకుండా కన్నీరు ఉబికి వస్తుంది.

పల్లె కన్నీరు పెడ్తుందో, కనిపించని కుట్రల అనే పాట ప్రపంచీకరణ పరిణామంలో గ్రామీణ ప్రజల ప్రకృతి సహజీవనం విచ్ఛిన్నమైన తీరును, వృత్తులు కోల్పోయిన విషాదాన్ని చిత్రించారు. అప్పుడెప్పుడో రెండు వందల ఏళ్ల కింద వర్డ్స్‌వర్త్ అనే మహాకవి నగరీకరథ పొందుతున్న కొద్దీ మనిషి కోల్పోతున్న స్వేచ్ఛను, ప్రకృతితో గల సంబంధాన్ని కవిత్వీకరించాడు. అతడొక విశ్వ కవి. గోరటి వెంకన్న నేటి కాలంలో జరుగుతున్న పల్లెల విధ్వంసాన్ని, తదనంతర పరిణామాలాను, ప్రకృతికి దూరమవుతున్న తీరును కవిత్వీకరించాడు. అంతేకాదు ప్రకృతి ఎంత గొప్పదో, ఎంత అందంగా ఉంటుందో వర్ణిస్తాడు.

1995లో రాసిన పల్లె అందాలు కవితలో ఇలా అంటాడు. నా పల్లె అందాలు సూసితే కనువిందురో/ ఎత్తు వంపుల తోని డొంకదారుల సూడు/ యేపుగ పెరిగినట్టి యాపలు ఈదులు సూడు/ అల్లుకున్న అడవి తీగె లాదొండ పొదులురో..., బోనం పటువలకు పసుపు బొట్లు పెట్టుకోని/ జోరుగ సిగమూగె సోర ఆడోళ్ల తీరు/ రేల పూతల కొమ్మలు సిరిమాన మొలుకుతున్నయో, గాలికి ఊగాటాడుతూ నేలక తలలొంచి/ సెరువు నీళ్లను ముద్దాడుతాయి/ నల్లతుమ్మ ెట్లు పల్లె పొలిమేరకెంతందమో, మడికట్ల గుడ్డి కొంగ వడివడిగ నడకజూడు/ వాగులనీదె కొంగ మేఘంతో సెలిమి జూడు/ నీటనున్న సేప కనుపాపలోని మెరుపు జూడు అంటూ వర్ణించిన కవిత వెంకన్నలోని స్వచ్ఛమైన, ప్రకృతిలో జీవించే మనిషి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

మానవుడు కలగనటం ఆగనంతవరకు పాట ఆగదు. ఆగని పాటని తనలోకి పీల్చిన, నిలువెత్తు నడిచే పాట, ఆడే పాట, గజ్జల రవళితో గుండెల్ని చిలికే గోరటి వెంకన్న అంటూ అభినందిస్తాడు కె. శివారెడ్డి. జానపద కళారూపమైన పాట ఒక మహా ప్రవాహం - ఆదిమకాలాల నుంచి ప్రవహిస్తూ వస్తుంది. దీన్లోకి ఎన్నో నదులు, ఉపనదులు చేరిపోయాయి. పోతాయి. ఆ అనంత ప్రవాహాల్లోను, మరో మధురమైన గొప్పనది కలిసింది. ఆ నది పేరు గోరటి వెంకన్న - గోరటి వెంకన్న కొత్త జలాన్ని తెచ్చాడు. దోసిళ్లతో తాగుతాం - సర్వావయవాల్తో అనుభవిస్తాం అంటాడు కవి శివారెడ్డి.

- బిఎస్ రాములు

గోరటి వెంకన్న కాళోజీ అవార్డును అందుకుంటున్న సందర్భంగా....

English summary
A prominent Telugu writer BS Ramulu described the essence of Gorati Venkanna's contribution to the Telugu Literature through his songs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X