వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తాత్విక పర్యవసానాల నేపథ్యం'

By Pratap
|
Google Oneindia TeluguNews

డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ప్రాథమికంగా కవి. అయితే, తెలంగాణ ఉద్యమ అవసరాల రీత్యా తెలంగాణ చరిత్రను కూడా తవ్వి తీశారు. తెలంగాణ ఆధునిక, ప్రాచీన కవిత్వాలను సంపుటాలుగా పోత పోశారు. ఆయన దాలి దీర్ఘ కవిత అందరి ప్రశంసలు అందుకుంది. ఆయన పలువురు కపులను తీర్చి దిద్దారు. సాహిత్య సంస్థలకు ప్రాణం పోశారు. ఆయనతో ఇంటర్వ్యూ -

ప్ర. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి?

జ: ఈ రెండో థ (నిజానికి మూడోథ) తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి నేను క్రియాశీలంగా ఉన్న. ఈ థ ప్రారంభంలో జరిగిన రెండవ సభ (దీన్ని ఫోరమ్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్సెషన్‌ నిర్వహించింది. 1997 జనవరిలో)లో నేను వక్తగా పాల్గొన్న. నాల్గవ సభ (దీన్ని ''తెలంగాణ మహాసభ'' సూర్యాపేటలో 1997 ఆగష్టు?లో నిర్వహించింది)లో వక్తగా పాల్గొని తెలంగాణచరిత్ర విస్మరణ గురించి మాట్లాడిన. ఈ సభా ప్రాంగణంలో నా ''దాలి'' తొలిరూపంలోని కవితా భాగాన్ని నిలువెత్తు పోస్టర్‌గా కూడ వేసిండ్రు. ఆ వెను వెంటనే ''తెలంగాణ మహాసభ'' నిర్వహించిన చాలా సభలలో బియ్యాల జనార్ధనరావు, చెరుకు సుధాకర్‌ నేను పాల్గొన్నం. (మాతో పాటు నాగేందర్‌ స్కైలు కూడా పాల్గొనేవారు)

నిజానికి అంతకుముందే తెలంగాణ ఉద్యమానికి పునాదివేసిన ఉద్యమాల్లో ఒకటైన ''జలసాధన సమితి ''ఉద్యమంలో 1992 నుంచే వక్తగా, కార్యకర్తగా, తెలంగాణ జలవనరుల దోపిడికి సంబంధించిన రీసోర్స్‌ పర్సన్‌గా పాల్గొంటూ వచ్చిన.

1997 నుంచే నా ''దాలి''ని మొదలుపెట్టి 2001లో పూర్తి చేసిన. అదే సంవత్సరం నుంచి మొదలు పెట్టి, శివకుమార్‌, గుడిహాళం రఘునాథంలతో కలిసి రాసిన ''నల్లవలస''ను 1999లో పూర్తి చేసినం. ఇవి తెలంగాణ తొలి సమగ్ర దీర్ఘ కవితలుగా ప్రసిద్ధి గాంచినవి. నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌ లాంటి వాళ్ళు ''నల్లవలస'' కవితా పాదాలు కోట్‌ చేసి అనేక సభలను ఉర్రూతలూగించిండ్రు.

Interview with Sunkireddy Narayana reddy by kasula Linga Reddy

''తెలంగాణ సాంస్కృతిక వేదిక'' ఆవిర్భావానికి క్రియాశీలంగా పనిచేసిన. దీని కోసం 1998 నవంబర్‌ 1న ''తెలంగాణ రైటర్స్‌'' పేరుతో ప్రెస్‌క్లబ్‌లో సభ జరిపి మొట్టమొదటిసారిగా తెలంగాణ కవుల్నీ,రచయితల్నీ ఒక్క చోటుకు చేర్చినం.ఆ రోజు అఫ్సర్‌ అన్న మాటలు ఇప్పటికీ గుర్తే ''నల్లగొండ నుంచి వచ్చి ఇంతమందిని ఒక్క చోట చేర్చి సమావేశాన్ని విజయవంతం చేయడం అభినందనీయం'' అని అన్నాడాయన. ఆ సన్నాహక సమావేశం జరగడానికి చాలా కాలం ముందు నుంచే వివిధ సందర్భాలలో వివిధ స్థలాలలో కె.శ్రీనివాస్‌, అంబటి సురేంద్రరాజు, నందిని సిదారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, డా||ఎస్వీ,తూర్పు మల్లారెడ్డి, డా|| కాసుల లింగారెడ్డి, నేను తదితరులం కలుసుకొని చర్చలు చేసినం. ప్రాతిపదికలు ఖరారు చేసినం. తెలంగాణ అంశం కేంద్రంగా అస్తిత్వవాదుల, మార్క్సిస్టుల,తదితరుల కలయికగా వేదికను 1999 జనవరి 1న ప్రకటించినం. భిన్న ధ్రువాలను కలపడంలో నా చొరవ క్రియాశీలత పనిచేసిందని నమ్ముతున్న. వేదిక ప్రథమ రాష్ట్ర సదస్సును నల్లగొండలో 13-06-1999న నా చొరవతో బోధనం, దొడ్డి రామ్మూర్తి తదితరుల సహకారంతో నిర్వహించినం. ఈ సదస్సులో చేసిన తీర్మానం ప్రకారం పొక్కిలి మత్తడి వచ్చినవి. నేను సురేంద్రరాజు కలిసి తెచ్చిన ''మత్తడి'' (2002) 20వ శతాబ్ది తెలంగాణ కవిత్వానికి తొలిదర్పణం. ఈ సంకలనాలు ''తెలంగాణ సాహిత్య చైతన్యానికి ప్రాతినిధ్యం వహించినవ''ని గుడిపాటి లాంటి విమర్శకులు అభిప్రాయ పడినారు. అనంతరం తెలంగాణ కవిత్వం విస్తృతంగా రావడానికి ఇవి ప్రేరణ నిచ్చినవి.

'మత్తడి' ముందుమాటలో ఇచ్చిన హామీ కొనసాగింపుగానో, కాసుల ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ''తెలంగాణ తోవలు''లో నేను రాసిన వ్యాసం (లెక్క తప్పిన తెలుగు సాహిత్య చరిత్ర) కొనసాగింపుగానో, అయిదారేళ్ళ తపన అనంతరం ''ముంగిలి'' (2009) (తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర) వచ్చింది. రాష్ట్ర విభజనకు ఇది తొలి సూచి అయ్యింది. బి.నర్సింగరావు, వేదకుమార్‌ గార్ల చలువ వల్ల వెలుగుచూసిన ఈ గ్రంథానికి గొప్ప ఆదరణ లభించింది. బన్న అయిలయ్య, కాత్యాయనీ విద్మహే తెలంగాణ అభిమానం వల్ల ఈ గ్రంథం కాకతీయ విశ్వవిద్యాలయ ఎంఏ. తెలుగు సిలబస్‌లో చేరింది. కే.సి.ఆర్‌ ప్రశంస ఈ గ్రంథ చారిత్రక అవసరాన్ని సూచించింది. ఆ తర్వాత నా ''తెలంగాణ చరిత్ర'' (2011) రాష్ట్ర విభజన అనివార్యతను సూచించింది. ఆ వరుసలో 'గనుమ'', సంగిశెట్టితో కలిసి వేసిన ''1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం'' సురవరం తెలంగాణ వ్యాసాలు; లగడపాటి, ఆంజనేయరెడ్డి, హనుమచ్ఛాస్త్రి, ముక్తేవి రవీంద్రనాథ్‌, శైలజానాధ్‌ లాంటి వాళ్ళు చేసిన తెలంగాణ చరిత్ర వక్రీకరణకు రాసిన సమాధానాలు... రచనా పరంగా ఇవి నాకు సంతృప్తి కలిగించినవి.

అయితే ఒక అసంతృప్తి మిగిలే ఉంది. జిల్లా స్థాయిలో కొందరు, రాష్ట్ర స్థాయిలో కొందరు ప్రత్యక్ష ఉద్యమంలో పనిచేయకుండా అడ్డుకున్నరు. అందువల్ల క్షేత్ర స్థాయిలో నేను తగినంతగా పనిచేయలేదనే అసంతృప్తి వెన్నాడుతూనే ఉంది. బహుశా నన్ను అక్కడ అడ్డుకున్నందువల్లే రచనా రంగంలో నేను విస్తృతమయినానేమో.?

ప్ర. తాత్త్విక నేపథ్యంలేని ఉద్యమాలు ఇటీవల జాస్మిన్‌ విప్లవాల లాగా దారుణంగా విఫలమైన పరిస్థితిని చూశాముగదా?తెలంగాణ ఉద్యమానికి ఏ తాత్త్విక నేపథ్యం ఉందంటారు?
జ. ప్రజాబాహుళ్య ఆగ్రహం పాల్గొన్న ఏ ఉద్యమమూ విఫలం కాలేదు. కాదు. దాని ముద్ర చరిత్ర పొడుగూతా ఉంటది. అది పాక్షిక విజయమేకావచ్చు. తాత్కాలిక ఓటమి కావచ్చు. స్పార్టకస్‌ దగ్గర్నించి, శంభుకుడు, జాబాలి, లోకాయతుల దగ్గర్నించి జాస్మిన్‌ ఉద్యమాల దాకా. వాటి వెనుక మనకు గ్రాహ్యంకాని తాత్వికత ఉండే ఉంటుంది. ఆధిపత్యం ఎక్కడ ఉంటుందో దాని నీడనే ప్రతిఘటన ఉంటుంది.
1969 తెలంగాణ ఉద్యమం తాత్త్విక సమర్ధన లేని కారణంగా అది విఫలమైందని అనుకుంటున్నం. దానిని నేను ప్రపంచంలోనే తొలి అస్తిత్వ ఉద్యమంగా భావిస్త. దాని ఓటమి పరోక్ష విజయం కొనసాగింపే ప్రస్తుత ఉద్యమం. అగ్నికి ముగింపు లేదు. సకల ఆధిపత్యాల అంతందాకా. ఇప్పటి ఉద్యమానికి ఒక సుదీర్ఘ తాత్త్విక పర్యవసనాల ప్రభావం నేపథ్యంగా ఉంది.

1. పోస్ట్‌ కలోనియలిజం యూరప్‌ వలసాధిపత్య దృక్కోణాన్ని తిరస్కరించి సొంతదేశం, సొంత నేలపై సొంత సాంస్కృతిక వారసత్వంపై దృష్టి మళ్ళేలా చేసింది.

2 పశ్చిమ దేశాల కేంద్రంగా ప్రాచ్యదేశాల్ని నిర్వచించడాన్ని,వారి ఆధిక్య భావనను ఎడ్వర్డ్‌ సయీద్‌ 'ఓరియంటలిజం' తిరస్కరించింది.

3. సబాల్టర్న్‌ అధ్యయనం ఆధిపత్య, కులీన దృక్కోణాన్ని తిరస్కరించి అధీన, విస్మృత సమూహాల అధ్యయనాన్ని ప్రేరేపించింది.

4. పోస్ట్‌ మోడర్నిజం విశ్వజనీన భావనలకు భిన్నంగా, ప్రాంతీయ చరిత్రల గురించిన స్పృహను, విభిన్నతలను నిర్ధిష్టతలను ముందుకు తెచ్చింది. అఖండత ధ్వంసమైన తరువాత మాత్రమే ఒక నిర్మాణంలోని మిగతా భావాలు స్వతంత్రతనీ గుర్తింపునీ పొందగలుగుతాయనీ చెప్పింది.

5.నియో మార్క్సిస్టుల ఆలోచనాధార కొన్ని కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చింది.

6. మిగతా అస్తిత్వ ఉద్యమాల ప్రభావం పని చేసింది.

7. పీడక వర్గ ఆధిపత్యాన్ని అభావం చేయడమే మార్క్సిస్టు సూత్రంలోని ఆధిపత్య ధిక్కార భావన కూడా పనిచేసింది.

ఈ అన్నింటి వాతావరణం ఒక యుగస్వభావాన్ని సంతరించిపెట్టింది. ఒక యుగ స్వభావానికి లోనైన ప్రజలకు, కవులకు, మేధావులకు ఫలానా తాత్త్వికత తమని ప్రభావితం చేస్తుందన్న ఎరుక ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కాని ఆ ప్రభావం తప్పక ఉంటుంది.

అందుకే 1969 ఉద్యమంలో మమేకం కావడానికి (అది ప్రజల్ని విచ్ఛిన్నం చేసేవాదమని ఆనాటి మార్క్సిస్టులు, సంకుచిత వాదమని బూర్జువాలు, సోకాల్డ్‌ తెలుగు భాషావాదులు సిద్ధాంతీకరించనందువల్ల మొత్తంగా అది పాపకార్యమని ప్రచారం చేసినందువల్ల- దానికి లోనుకాని కాళోజీ, ఇతర యువ కవులు తప్ప) సందేహించిన కవులు, మేధావుల్లా కాకుండా, ప్రస్తుత ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, కవులు, మేధావులు సందేహించకుండా, బిడియపడకుండా గొప్ప ఉత్సాహంతో మమేకమయిండ్రు.

ప్ర.హరిత విప్లవం, నూతన ఆర్థిక విధానాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించిందని మీరు భావిస్తున్నారా?
జ. ఈ రెండూ ఉనికిలో లేని కాలంలో అంటే 1952లోనే, 1969లోనే తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించింది. వాటివల్ల ఉద్యమం ఉద్భవించిందనేది సరైనది కాదు. వాటి ప్రభావం ఉద్యమ క్రమం మీద కొంత ఉండొచ్చు.

ప్ర. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవడంలో కవులు, రచయితల పాత్ర సంతృప్తికరంగానే ఉందంటారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ పాత్ర ఎట్లా ఉండాలంటారు?
జ. కవుల, రచయితల, మేధావుల పాత్ర అద్భుతంగా ఉంది. ఏ ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో, అవి నెరవేర్చుకోవడానికి మరింత శక్తివంతంగా పని చేయాల్సి ఉంటుంది. ''కవులు శాశ్వత ప్రతిపక్షం'' అని చాన్నాళ్ళ కిందట ఓసారి అన్న. ఆ పాత్రనూ అప్పుడూ పోషించాలె.

ప్ర. లాటిన్‌ అమెరికా దేశాల్లోని సామాజిక, రాజకీయ పరిస్థితులకు తెలంగాణకు చాలా సారూప్యముంది కదా? మీరు అక్కడి సాహిత్యాన్ని చదువుతారా? యువకవులను చదువుమని రికమండ్‌ చేస్తారా?
జ. లాటిన్‌ అమెరికా దేశాల అమెరికా వ్యతిరేక ధిక్కారం, తెలంగాణలోని సీమాంద్ర వ్యతిరేక ధిక్కారం సారూప్య అంశాలే. అక్కడి సామ్రాజ్య వ్యతిరేకత ప్రత్యక్ష ధిక్కారం. తెలంగాణ సామ్రాజ్య వ్యతిరేక ధిక్కారం వయా సీమాంధ్ర ధిక్కారం. అక్కడి సాహిత్యం తప్పక అధ్యయనం చేయదగిందే. దాన్నించి ప్రేరణ పొందాల్సిందే.

ప్ర. భౌగోళిక తెలంగాణ ఏర్పడడం ఖాయమైనట్లే కదా? ఇంతటితో తెలంగాణ సమాజంలో ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రజాస్వామ్యపు మేడిపండులో పురుగులు పూర్తిగా తొలగిపోతాయా? నయావలస వాదపు వనరుల దోపిడి, శ్రమదోపిడి అరికట్టడం ఎట్లా?
జ. సీమాంధ్ర పెత్తనం, వనరుల దోపిడి పోతుంది. ఆమేరకు తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. లోపలి పెత్తనం స్వల్ప మార్పులతో అలాగే ఉంటుంది. మేడిపండు తీపితోనూ పురుగులతోనూ అలాగే ఉంటుంది. దానిమీద ఎప్పటిలాగే పోరాటం చేయాల్సిందే. నయావలస దోపిడి అంతం గురించి రాజకీయార్ధశాస్త్ర నిపుణులను అడగవలసిన ప్రశ్న. నేను కవిని మాత్రమే. నాకంత పరిజ్ఞానం లేదు. నా అవగాన మేరకు స్థానికీకరణ ప్రాతిపదికన సీమాంధ్ర వలస వాదులను పారదోలినట్లే, నయా వలస, నయా సామ్రాజ్య వాదులను కూడా పారదోలాలి.

ప్ర. ప్రపంచీకరణ సాంస్కృతిక ఏకీకరణను రుద్దుతోంది కదా? ఈ అమెరికనైజేషన్‌ను మీరు ఆహ్వానిస్తారా? లేదా గుస్తావో ఎస్తేవా అన్నట్లు స్థానికీకరణను ప్రమోట్‌ చేస్తారా? స్థానికీకరణను ముందుకు తీసుకపోయే పని అయితే అది ఎట్లా జరగాలంటారు?
జ. బుద్ధి ఉన్న వాడెవడూ ఆహ్వానించడు. పెట్టుబడిదారీ వ్యవస్థ తొలిరోజుల్లో పోటీతత్వాన్ని (లీజ్‌ఫేర్‌) ప్రోత్సహించింది. అది మేలు చేసింది. తర్వాత అది పోటీనే మింగేసింది. ప్రపంచీకరణ వల్ల కూడా కొంతమేలు జరుగుతుంది. జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాని దాని లక్ష్యం బహుదుర్మార్గమైంది. ప్రపంచీకరణ భావన లక్ష్యం ప్రపంచదేశాల ప్రజాస్వామిక వేదిక నిర్మాణం కాదు. అమెరికా లేదా కొన్ని దేశాల సరికొత్త ఆధిపత్యానికి దారి తీసి సరికొత్త వలసవాద భావన ప్రపంచీకరణ. దాని ఫలితమే సాంస్కృతిక ఏకీకరణ. ఒక నల్లగొండ కవి అన్నట్లు ''తోటలో అన్ని పూలబదులు ఒక పువ్వే ఉండాలనడం ఎంత అసహ్యకరమో'' సాంస్కృతిక ఏకీకరణ అంత అసహ్యకరం. ఆంధ్ర వలసాధిపత్యం తెలంగాణ వైవిద్యాన్ని, విభిన్నతను ధ్వంసం చేసినట్లు, అది అన్ని దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని విభిన్నతలను ధ్వంసం చేసేది. కోస్తాంద్ర సాంస్కృతిక రాజకీయ ఆర్ధిక ఆధిపత్యాన్ని స్థానికీకరణ ప్రాతిపదికగా ధిక్కరించిన తెలంగాణ ఉద్యమం ప్రపంచానికి మోడల్‌ కావాలె. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మోడల్ని అనుసరించాలె అదే ప్రపంచీకరణలోని దుర్లక్షణానికి విరుగుడు. ఒకప్పటి తెలంగాణ సంతలో కనిపించే వస్తుమార్పిడిలోని ప్రజాస్వామిక సూత్రాన్ని అలవర్చుకోవాలె. గిరిజన ప్రాంతాల సంతలోని మైదాన ప్రాంత వ్యాపారులలాంటి దోపిడికి చరమగీతం పాడాలె.

ప్ర. అనేక సాహిత్య సంఘాల్లో ప్రధాన భూమిక పోషించారు కదా ఇవాళ తెలంగాణ సాహిత్య సంఘాలు ఇన్ని చీలికలు పేలికలుగా కొనసాగుతుండడానికి కారణమేమంటారు? సాహిత్య వేత్తల్లో కెరీరిజం, ఈగో, స్వార్ధం పెరిగిపోవడమేనంటారా?
జ. ఇది అందరికి అవగతమైన విషయమే?

ప్ర. మీ ''తోవ ఎక్కడ'' నేపథ్యం ఏమిటి? ఒక రాజకీయ డాక్యుమెంటుకు పెట్టే పెరులా ఉంది కదా? మీరు విప్లవ రాజకీయాలతో విభేదించిన కారణంగా అట్లా పెట్టారనుకోవచ్చా?
జ. రాజుల్లా, మతాధిపతుల్లా కొందరు ప్రశ్నను సహించరు? ప్రశ్న అనేక వైజ్ఞానిక, తాత్విక ఆవిష్కరణలకు మూలం. మనలోకి మనం చూసుకోవడానికి, నడచివచ్చిన గతాన్ని సమీక్షించుకోవడానికి ప్రశ్న పనికివస్తుంది. ఆ ప్రశ్నలోని వేదనను, ఆర్తిని, వికలమైన కలను గుర్తించలేని వాళ్ళకు చెప్పగలిగేదేమీలేదు.

ఆ ప్రశ్న నేను దళిత, ముస్లిముల పక్కన నిలబడేలా, తెలంగాణ ఉద్యమంలో తేలేలా చేసింది. ఆ ప్రశ్న సరైనదేనని ఈ ఇరవై ఏళ్ళ కాలం నిరూపించింది.

ప్ర. మిమ్మల్ని మీరు ఎట్లా నిర్వచించుకుంటారు? అనార్కిస్టా? మార్క్సిస్టా? ఆధునికానంతరవాదా?
జ. ఈ ప్రశ్న వేయాల్సింది ఇట్లా కాదు. ''ప్రజలవైపా? ప్రజా వ్యతిరేకులవైపా'' అని ''ఎస్టాబ్లిష్‌మెంట్‌కు అనుకూలంగానా? ప్రతికూలంగానా'' అని వేయాల్సింది. అదే ఒక రచయితకు గీటురాయి. సరే అడిగిండ్రు గనక చెపుత.

అనార్కిజం,ఫ్యూచరిజం, నిహిలిజంలు అమానుషమైన రాజ్యవ్యవస్థలను మత వ్యవస్థలను మొత్తంగా ఎస్టాబ్లిష్‌మెంట్‌ని అస్థిరపరచడానికి వచ్చిన తాత్త్వికతలు. వాటికి భవిష్యత్తును ఎట్లా నిర్మించాలనే ప్రణాళిక లేకపోయినా చారిత్రక అవసరంగా వచ్చినవి అవి. తెలుగులో వేమన అలాంటి వాడు. ప్రస్తుతం అనార్కిస్టు అనే పదాన్ని తిట్టు పదంగా, నియమ నిబంధనలకు, నైతికతకు కట్టుబడనివాడు అనే అర్థంలో వాడుతున్నారు. దేనికీ నిబద్ధుడు కాని వాడు తన ఇచ్ఛ ప్రకారం నడచుకునేవాడు, దాన్ని వ్యక్తీకరించేవాడు అనే అర్థంలోనూ వాడుతున్నారు. తమకు ఇష్టం లేని వారిని, తమ ఆధిపత్యానికి లొంగని వారిని అలా పిలుస్తున్నారు. పరమఛాందసుల దగ్గర్నించి మంచి మార్క్సిస్టుల వరకు అలాగే వ్యవహరిస్తున్నరు. కాళోజీ దేనికీ నిబద్ధం కాకుండా తన ఇచ్చ ప్రకారమే నడచుకున్నా ఆయన్ని అలా పిలిచే సాహసం చేయకపోవడానికి కారణమేమిటో తెలియదు. ''అనార్కిస్టును'' అని చెప్పే సాహసం చేయలేనుగాని తొలినాళ్ళ అర్థంలోని అనార్కిస్టు ఛాయలు ఉండి ఉండొచ్చు.

మార్క్సిజాన్ని సొంత కెరీర్‌కు ఉపయోగించుకునే మార్క్సిస్టును కాను. అసలు అర్ధంలో ''మార్క్సిస్టు''నని చెప్పుకునే సాహసం చేయలేను. కాని ఆ ప్రభావం మాత్రం నా మీద బలంగానే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ వాతావణం ఆ ప్రభావాన్ని వేసింది. చాలా మంది ''మార్స్కిస్టుల''మని చెప్పుకునే వారికి భిన్నంగా కట్నం తీసుకోకుండా, సాంప్రదాయేతర, కులాంతర వివాహం చేసుకున్న. రికమండేషన్‌ లేకుండా ఉద్యోగం తెచ్చుకున్న ఏపీసీఎల్‌సీలో పనిచేసిన. ప్రజా ఉద్యమాలకనుకూలంగా రచనలు చేసిన. మొత్తంగా యాంటీ ఎష్టాబ్లిష్‌మెంట్‌గా బతికన. అయినా మార్క్సిస్టునని చెప్పుకోలేను. అయినా దళిత, బహుజన, ముస్లిం మిత్రులు నీలో మార్క్సిస్టు డిఎన్‌ఏ ఇంకా ఉందంటారు. కొందరు కాదంటారు.
తెలంగాణ, దళిత, ముస్లిం తదితర అస్తిత్వ ఉద్యమాల సందర్భంగా నేను ఆధునికానంతర వాదినేనని నిర్ధ్వంద్వంగ అంగీకరిస్త. అయినా మార్క్సిజానికి, ఆధునికానంతర వాదానికి శత్రువైరుధ్యం లేదని నాకనిపిస్తుంది. మార్క్సిజంలోని ఖాళీలను ఆధునికానంతరవాదం పూరిస్తుందని, మార్క్సిజం దాని పాజిటివ్‌ అంశాలను స్వీకరించాలని, అప్పుడే అది పరిపుష్టం అవుతుందని భావిస్తున్న. మార్క్సిజం అంతిమ లక్ష్యం కోసం పనిచేస్తుంది. ఆధునికానంతర వాద ప్రాతిపదికన వచ్చిన అస్తిత్వవాదాలు తక్షణ లక్ష్యం కోసం పని చేస్తున్నవి. మార్క్సిజం రాజ్యాన్ని సమూలంగా పెకిలించడానికి పని చేస్తుంది. అస్తిత్వ ఉద్యమాలు రాజ్యం యొక్క ఒక్కొక్క కోరను విరిచేయడానికి పనిచేస్తవి. మార్క్సిజం ఆర్ధిక, రాజకీయ మూలం మీద ఎక్కుపెడుతుంది.అస్తిత్వ ఉద్యమాలు సామాజిక,సాంస్కృతిక మూలాల మీద ఎక్కుపెట్టి రాజకీయ, ఆర్ధిక మూలంవైపు ప్రయాణిస్తవి. అస్తిత్వ ఉద్యమాల్లోని సారాన్ని స్వీకరించే పనిలో మార్కిస్టులు ఉన్నారని నాకనిపిస్తుంది. లేకపోతే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళ మద్ధతుకు వేరే ప్రాతిపదిక లేదు. కాకపోతే తమ ఆధ్వర్యంలోనే అన్నీ జరగాలనుకుంటరు. అది అసంబద్ధం. చరిత్ర గమనం ఎవరిచేతిలో బందీకాదు.

ప్ర. ''జముకు'' నారాయణరెడ్డి అప్పుడప్పుడే కవిత్వం రాస్తున్న మాకు ఆ కాలంలో ఒక ఇన్స్పిరేషన్‌. ఆ నేపథ్యం చెప్పండి.
జ. ఈ ముఖాముఖి తెలంగాణ సందర్భం. దాని గురించి వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు.

ప్ర. సాహిత్య సంఘాల్లో మీ పాత్ర చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటి రైటర్స సర్కిల్‌, తెలంగాణ సాంస్కృతిక వేదిక, సింగిడి మీ ఆలోచనా విధానాన్నే ప్రతిబింబించాయా చాలా సందర్భల్లో మీరు సబ్‌మిసివ్‌గా ఉండటానికి కారణాలేంటి?
జ. నందిని సిద్ధారెడ్డి, సలంద్ర, గుడిహాళం, నేను, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, జింబో, వారాల ఆనంద్‌ తదితరులం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమకాలీనులం. మా అందరి భాగస్వామ్యంలో సిద్దారెడ్డి చొరవతో ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌ ఏర్పడింది. అది ఏర్పడిన కొద్దిరోజులకే స్వల్ప కారణాలతో సిద్ధారెడ్డి పక్కకు జరిగిండు. అయిదో కన్వీనర్‌నయిన నామీద దాని నిర్వహణ బాధ్యత పడింది. అప్పటి నుంచి నాలుగయిదు సంవత్సరాలు నేను కేంద్రంగా, గుడిహాళం, కె.ఎన్‌.చారి, గుంటూరు ఏసుపాదం తదితరుల సహకారంతో నడిచింది. తెలంగాణ సాస్కృతిక వేదిక గురించి పైన్నే చెప్పిన. మిగతా సంస్థల గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు పెరిగిపోతవి. మొత్తంగా అన్ని సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన. ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌ , శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి,తె.సాం.వేదిక, సింగిడి నా ఆలోచనల పరిణామాన్ని సూచిస్తవి.

ఇక రెండో అంశం. అది సబ్‌మిస్సివ్‌నెస్‌ గురించి. అది సబ్‌మిస్సివ్‌నెస్‌ కాదు. మోడెస్టీ. ప్రవర్తనలో, మాట్లాడే తీరులోనే మీరనే సబ్‌మిసివ్‌నే కాని ఆలోచనలో, సత్య ప్రకటనలో, కార్యాచరణలో కాదు. నేను ఇష్టపడే శివారెడ్డి, సిద్ధారెడ్డి, వరవరరావులను అవసరమైన సందర్భాల్లో వ్యతిరేకించిన. ప్రభుత్వోద్యోగంలో ఉంటూ ఏపీసీఎల్‌సీలో పని చేయడానికి వెరవలేదు. మా నాయన అంటే ఎనలేని గౌరవం ఉన్న నేను నా పెళ్ళి విషయంలో ఆయనను ధిక్కరించిన.

ప్ర. తెలంగాణ సాంస్కృతిక వేదిక చాలా దారుణమైన ఆరోపణలకు గురైంది కదా! దానికి కారణాలేమిటంటారు. ఇవాళ్ళ దాన్ని పునరుద్ధరించే ఆలోచనలేమైనా ఉన్నాయా?
జ. తెలంగాణ సాంస్కృతిక వేదిక, సరైన సమయంలో సరైన తాత్త్విక ప్రాతిపదికన ఏర్పడిన సంస్థ. తెలంగాణ ఉద్యమానికి దిశను సూచించిన సంస్థ. ప్రతాపరెడ్డి అన్నట్లు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా స్థానికీకరణను స్థానిక సంస్కృతిని ప్రతిపాదించిన సంస్థ. సామాజిక తెలంగాణకు బీజావాపన చేసిన సంస్థ. సీమాంధ్ర ఆధిపత్య వ్యతిరేకతను గట్టిగా వినిపించిన సంస్థ.

తమ ఇంటనే పొద్దు పొడవాలనుకునే కొందరు,వేరే ఇంట పొద్దు పొడిచే సరికి భరించలేక అసహనంతో చేసిన ఆరోపణలు అవి.అవి పూర్తిగా నిరాధారం.సత్యదూరం.అయినా తెలంగాణ సాంస్కృతిక వేదిక స్పిరిట్‌ దశదిశలా విస్తరించింది. దాని పునరుద్ధరణను కాలం, అవసరం నిర్ణయిస్తుంది.

ప్ర. ''భూమి బ్లాంక్‌ చెక్‌, నీళ్ళు విలువను రాస్తయ్‌'', ''వలస కొచ్చిన కొంగ చెరువునాదంటదా'' అని అత్యంత బలమైన కవిత్వంగా ముందుకొచ్చిన ''దాలి'' పట్ల తెలుగు సాహిత్య విమర్శకులు ఒక వ్యూహాత్మక మౌనం పాటించడం ద్వారా మిమ్మల్ని మార్జినలైజ్‌ చేసే ప్రయత్నం చేశారనిపిస్తుంది. మీరేమంటారు?
జ. ఆ ప్రయత్నం చేసిండ్రనేది నిజమే. వాళ్ళ పాదుకలు మోయనందుకే అది. నన్ను మార్జినలైజ్‌ చేయాలనే ప్రయత్నం జరిగినప్పుడల్లా గీతల్ని దాటి పైకెగిసిన ఎవరూ సూదిని మూటగట్టలేరు. ఎవరూ గింజను మొలకెత్తకుండా ఆజ్ఞాపించలేరు. అయితే అందర్నీ ఆ గాటకట్టలేం. కె.శ్రీనివాస్‌, కాసుల ప్రతాపరెడ్డి, గుడిపాటి వఝుల శివకుమార్‌, యస్‌.రామకృష్ణ, జింబో, హెచ్చార్కే, కాలువ మల్లయ్య లాంటి వాళ్ళు 'దాలి' సెగను లోకానికి ప్రసరింపజేసిండ్రు.

ప్ర. ఇవ్వాళ తెలుగులో అతి తక్కువ మంది కవులున్నారు. నేననేది నిజమైన కవుల గురించి. వాళ్ళలో మీరు ముందు వరుసలో ఉంటారు. ఇంత అద్భుతంగా కవిత్వాన్ని శిల్పంగా చెక్కగలిగిన మీరు కవిత్వేతర ప్రక్రియల్లో, ముఖ్యంగా రాజకీయ వ్యాసాలకు సమాధానం చెప్పేపని చేయడం ద్వారా తెలంగాణ కవిత్వం నష్టపోతుందని అనిపిస్తుంది. ఏమంటారు?
జ. తెలంగాణ వికాసోద్యమంలో శేషాద్రి రమణకవులు, మాడపాటి, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, గంగుల శాయిరెడ్డి, కవిరాజమూర్తి, భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, గవ్వా సోదరులు, ఒద్ది రాజు సోదరులు, షబ్నవీసులాంటి వాళ్ళు ఏకకాలంలో అనేక రంగాల్లో పనిచేయాల్సివచ్చింది. అలాగే నేనూ నాలాంటి చాలామంది చేయాల్సివస్తున్నది. అందులో భాగంగానే ముంగిలి, తెలంగాణ చరిత్ర, రాజకీయ వ్యాసాలకు సమాధానాలు రాయాల్సి వచ్చింది. అయినా కవిత్వం ఆపలేదు. పత్రికల్లో ప్రచారం చేయించుకునే కొంతమంది కవులకంటే ఎక్కువ కవితలు, మంచి కవితలు రాసిన.

ప్ర. మీ కొత్త కవితా సంపుటి గురించి చెప్పండి. ఎప్పుడొస్తది? ఏమి సందేశమిస్తది?
జ. త్వరలో వస్తుంది. అందులో ఏముందనేది వచ్చినంక చూస్తారు గదా!

ప్ర. మీ ''తెలంగాణ చరిత్ర'' ఆవిష్కరణ సందర్భంగా కే.సి.ఆర్‌ మిమ్మల్ని ఆస్థాన కవిగా ప్రపోజ్‌ చేస్తారని గుర్తుంది. అట్లాంటిది వస్తే ఏం చేస్తారు?
జ. కేసిఆర్‌ అన్నది అదికాదు. నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్ర, సంస్కృతుల అధ్యయానికి పరిశోధనకు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ బాధ్యత నప్పగిస్తానన్నడు. అయినా అట్లాంటి వాటి కోసం నేనేపనీ చేయలేదు.

ప్ర. కవిగా, తెలంగాణ చరిత్ర రచయితగా, తెలంగాణ సాహిత్య చరిత్ర పరిశోధకుడిగా, ఉద్యమ కారుడిగా తెలంగాణ భవిష్యత్‌ నిర్మాణం గురించి చెప్పండి.
జ. తెలంగాణ చరిత్రను, సాహిత్య చరిత్రను సమగ్రంగా పునర్నించడానికి పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలె. ఎంతోమంది తెలంగాణ కవుల కావ్యాలు, రచయితల పుస్తకాలు మరుగున పడినవి. వాటిని ముద్రించడానికి సాహిత్య అకాడమీని ఏర్పాటు చేయాలే. తెలంగాణ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు, చరిత్ర శాఖల్లో తెలంగాణ అంశాల మీద మాత్రమే పరిశోధనలు చేయించాలె. లింగ్విస్టిక్‌ డిపార్ట్‌మెంట్‌లో తెలంగాణ తెలుగు భాష మీద పరిశోధన చేయించి తెలంగాణ భాషా చరిత్రను రాయించాలె. తెలంగాణ భాషా పదకోశాన్ని ''శబ్ద సాగరం'' స్థాయిలో ముద్రించాలె. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ప్రతిబింబించే విధంగా పాఠ్యపుస్తకాలను (కే.జి నుంచి పీ.జి వరకు) తయారు చేయించి ముద్రించాలె. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రను భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర మాదిరిగా తయారు చేయించి ముద్రించాలె. విభిన్న రంగాలకు, విభిన్న అస్తిత్వాలకు చెందిన వైతాళికుల విగ్రహాలను తెలంగాణ రాష్ట్రమంతటా ప్రతిష్ఠించాలె. భారత స్వాతంత్రోద్యమ ఫలాలు కొందరికే దక్కినట్టుగా కాకుండా, రాష్ట్రోద్యమ ఫలాలు అన్ని సమూహాలకు, వర్గాలకు నిష్పత్తి ప్రాతిపదికగా దక్కేట్టు చూడాలె.

ఇంటర్వ్యూ: డాక్టర్ కాసుల లింగారెడ్డి

పాలపిట్ట మాసపత్రిక సౌజన్యంతో...

English summary
A prominent literary person Sunkireddy Narayana Reddy in an interview given to Dr Kasula Linga Reddy explained his contribution for the Telugu literature in general and Telangana in perticular.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X