• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రపంచ పర్వ్యాప్తమైన కవి

By Pratap
|

ఎక్కడికి వెళ్ళినా చుట్టిముట్టిన భూమ్యాకర్షణ శక్తినీ, శరీరం మొత్తాన్నీ సహజంగా, అనివార్యంగా, అనంతంగా స్పృశిస్తూ చుట్టూ వీచే గాలినీ తప్పించు కోవడం మనిషికి సాధ్యం కాదు. ఆ మనిషి సున్నితమైన మనసూ, భావుకత్వమూ, ఊహాశాలితా, అవగాహనా, దృక్పథమూ ఉన్న మనిషి అయితే ఒక్క మాటలో కవి అయితే ఆ భూమ్యాకర్షణ శక్తి, ఆ గాలీ ఆ మనిషిని నండూరి సుబ్బారావు అన్నట్టు 'కూకుండనీదురా కూసింత సేపు'. ఇవ్వాళ్టి కవికి భూమ్యాకర్షణ శక్తీ, గాలీ వంటి ప్రాకృతిక పరిసరాలు మాత్రమే కాదు, మహా సంక్షోభం మనసులోపల సంక్షోభంగా పర్యవసించే పరిస్థితీ ఉంది. అలా బైటా లోపలా చుట్టూరా సంక్షోభం ఉన్నప్పుడు కవి ఆ సంక్షోభానికి అక్షరాలుతొడగక తప్పదు. కాసుల లింగారెడ్డి అటువంటి ఆర్ద్రమైన స్పందనలున్న మనిషి, తన బాధ్యత గుర్తించిన కవి.

ఆ స్పందనకూ, బాధ్యతకూ నిదర్శనం ఈ సంపుటం. ఈ ముప్ఫై ఐదు కవితల సంపుటంలో మూడో వంతుకు పైగా తెలంగాణ మీద రాసిన కవితలే. అంకితమూ తెలంగాణకే. మిగిలిన కవితల్లో విప్లవోద్యమ అమరవీరుల గురించీ, విప్లవోద్యమంపై రాజ్యహింస గురించీ, సామ్రాజ్యవాద దురహంకారం గురించీ, సుదూర ప్రజాపోరాటాల గురించీ, ఆత్మీయ అనుభూతుల గురించీ ఏమి రాసినా, చివరికి అనువాదం చేయడానికి ఎంచుకున్న కవితలలోనైనా పలుకుతున్నది తెలంగాణ సోయే. అది ఆయా కవుల అవ గాహనను బట్టి, దృక్పథాన్ని బట్టి అటు ఇటుగా మారుతుండవచ్చు. కొన్నిసార్లు కొన్ని తప్పుడు అవగాహనలు కూడ ప్రవేశిస్తుండవచ్చు. తమ నేలమీద, తమ ప్రజల మీద ప్రేమను కవిత్వీకరించడంలో ఆ కవులు కొన్ని సార్లు పూర్తి విజయం సాధించలేక పోతుండవచ్చు. కాని ఆ లోపాలు ఎలా ఉన్నా, ఇవాళ తెలంగాణ కవులు ఒక అత్యవసరమైన, అత్యంత కీలకమైన సాహిత్య ప్రయోజనాన్ని అనివార్యంగా, సహజంగా, ఉద్దేశ్యపూర్వకంగా సాధిస్తున్నారనేదే గుర్తించవలసిన అంశం. ఇవాళ్టి తెలంగాణ కవులు సమాజ సాహిత్య సంబంధాలలో ఒక ఆదర్శవంతమైన స్థితిని పాటించి కవిత్వానికి, సాహిత్య విమర్శకూ వినూత్న కానుకలు అందిస్తున్నారనేదే గుర్తించవలసిన అంశం.

N Venugopal on Kasula Linga Reddy's poetry book

ఇవాళ్టి తెలంగాణ కవులందరిలోకి లింగారెడ్డిది విశిష్ఠ స్వరం. లింగారెడ్డి కవిత్వం నాలుగైదు విభిన్న అంశాల రసాయనిక సంయోజనంగా రూపుదిద్దుకున్నది. భావాల రీత్యా, అవగాహనల రీత్యా, దృక్పథం రీత్యా ఆయన విద్యార్థి ఉద్యమం నాటినుంచీ విప్లవోద్యమ పక్షంలో, మార్క్సిస్టు శిబిరంలో ఉన్నారు. విద్యార్థిగా పొందిన శిక్షణ మానవ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని, దాని సమస్యలను పరిష్కరించే వైద్య వృత్తిలో, అందులోనూ ప్రత్యేకంగా ఎంచుకున్నది శిశువైద్యం అనే సున్నితమైన విభాగాన్ని. (శిశు వైద్యం అనగానే నా పది పన్నెండేళ్ళ వయసునుంచీ నాకు ప్రబలమైన ఆకర్షణగా నిలిచి, చనువు పంచి ఇచ్చి, గౌరవం చూరగొన్న డా.రామనాథం గారే గుర్తొస్తారు. ఆయన రాజకీయాభిప్రాయా లలో ఎంత కఠినుడో, పిల్లలతో వ్యవహరించడంలో, పిల్లలకు వైద్యం చేయడంలో అంత సున్నితుడు, అచ్చంగా కవిలాంటి వాడు). ఇరవైఐదు ఏళ్ళకు పైగా కవిత్వం రాస్తూ కవిత్వపు నిర్మాణపు మెళకువలు నేర్చుకున్నవారు. ఎంత సన్నిహితమైన దాన్నయినా విమర్శనాత్మకంగా చూడవలసివుంటుందనీ ఎరుక ఉన్నవారు.

అటువంటి విస్తృతీ, లోతూ ఉన్న కవిత్వాన్ని గురించి బహుశా నా వంటి విమర్శకుడు చెప్పగలిగింది చాలా తక్కువ. కాని చిరకాల మైత్రివల్ల లింగారెడ్డి నా మీద ఈ బాధ్యత పెట్టారు. ఈ కవితల శిల్ప, నిర్మాణ అంశాల వైపు పోకుండా వస్తువును దర్శించడంలో లింగారెడ్డి ప్రదర్శించిన జాగరూకత, విమర్శనాత్మకత, సున్నితత్వం ఎలా ఉన్నాయో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

మొట్టమొదట ఈ కవితలన్నీ తెలంగాణ సందర్భంలో, తెలంగాణ సోయి అంతస్సూ త్రంగా రాసినవే గానీ వీటిలో ఎంతో వస్తు వైవిధ్యం ఉంది. 'ఇవాళ్టి కవికి సమూహమూ, ఏకాంతమూ రెండూ ప్రాథమిక విధులుగానే ఉన్నాయి' అని పాబ్లో నెరూడా అన్నట్టు, 'నేను సమాజం గురించి మాత్రమే రాస్తాను' అని గాని, 'నేను నా వైయక్తిక అనుభూతిని మాత్రమే పాడుకుంటాను' అని గాని అనే అంశం ఇవాళ్టి కవికి లేదు. పూర్తిగా ఆత్మాశ్రయమైన, వైయక్తికమైన, హృదయాంతర్గతమైన, సన్నిహితమైన అనుభూతిలో కూడ సామాజికాంశాలు చొరబారి ఉన్నాయి. సుదూరంగా కనిపించే సామాజికాంశాలను కూడ ఆత్మీయ స్పర్శతో తీసుకోక తప్పని స్థితి ఉంది. ఈ స్థితికి ఈ ముప్ఫై ఐదు కవితలూ ఉదాహరణలు.

ఇందులో తెలంగాణ ఇతివృత్తం పన్నెండు పదమూడు కవితలలో ఉంది గాని అక్కడ కూడ అది విసుగెత్తించే పునరుక్తిలా మొనాటనస్‌ కాలేదు. ఒక్క ఇతివృత్తాన్నే భిన్న సందర్భాలలో భిన్నంగా ఎలా దర్శించవచ్చునో ఆ కవితలు చూపుతాయి. ఇక మిగిలిన కవితల్లో సగం కవిత్వానికి అత్యంత సన్నిహిత వస్తువైన మానవ సంబంధాల గురించి రాసినవి. మిగిలిన మూడో వంతు పెంపుడు పిల్లి నుంచి రకరకాల పండ్లచెట్ల ప్రకృతిదాకా, తహ్రీర్‌ స్క్వేర్‌ ప్రజా ప్రజ్వలనం నుంచి బరాక్‌ ఒబామా అనే భ్రమ దాకా, మతతత్వం నుంచి తీవ్రవాదం దాకా, బాసగూడ హత్యాకాండ నుంచి కిషన్‌జీ అమరత్వం దాకా విస్తారమైన వస్తువుల మీద కేంద్రీకరించినవి. ఇవి కాక నాలుగు అనువాద కవితలు (ఒకటి అమెరికన్‌ కవి వాల్ట్‌ విట్‌మన్‌ది, ఒకటి హిందీ కవి మమతా కాలియాది, రెండు గుజరాతీ కవి జయంత్‌ పారామార్‌వి) కూడ ఉన్నాయి.

ఒక పెంపుడు పిల్లి మరణాన్ని కవితా వస్తువుగా తీసుకుని, ఆ వస్తువు నెపంతో మానవ సంబంధాలనూ, వేరు వేరు వైఖరులనూ, గతాన్నీ వివరించడానికీ, విశ్లేషించడానికీ లింగారెడ్డి చేసిన ప్రయత్నం ఆశ్చర్యం గొలుపుతుంది. నిజానికి పెంపుడు జంతువుల మీద, వాటికీ మనిషికీ ఉండే అన్యోన్య, అవ్యాజ ప్రేమానుబంధాల మీద కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. కాని ఇక్కడ లింగారెడ్డికి పిల్లి కేవలం పిల్లి కాదు. అది ఎక్కడనుంచి ఏ స్థితిలో ఎట్లా తమ గూట్లోకి , గుండెల్లోకి వచ్చిందో గుర్తు చేసుకుంటారు. దాన్ని తన బిడ్డలు ఎట్లా 'కౌగిట్లో పెంచుకున్నారో' తలచుకుంటారు. అది ఇంట్లోంచి వెళ్ళి పోయి కుక్క నోట చిక్కడానికి తమ నిర్లక్ష్యమే కారణమా అని విచికిత్స చేస్తారు. ఆ పిల్లితో తన కొడుకు పెంచుకున్న బంధాన్ని, అప్పటిదాకా బిడ్డల కోసమే భరించినా, దాని మరణంతో నిరాశపడి మౌనంలోకి జారిన సహచరిని చూపుతారు. 'నా ఇంట్లో నన్ను పరాయిని చేసిన నీ గడుసుతనం నేనెట్లా మరువను' అని పిల్లి ఇంట్లో ఇంటి పెద్దనే పక్కకు జరుపగల కీలక వ్యక్తిగా ఎలా మారిందో చూపుతారు. 'నువ్వంటూ రాకుండా ఉంటే ఎంత బాగుండేది! ఈ దుఃఖభారాన్ని మోసే బాధన్నా తప్పేది!' అని, సాధారణంగా మానవ సంబంధాల వియోగ స్థితిలో ప్రతి ఒక్కరూ ప్రకటించే నిర్వేదంతో కవిత ముగిస్తారు. నిజానికి ఇది పిల్లికి సంబంధించిన కవిత మాత్రమే కాదు, మనం నిత్య జీవితంలో సంబంధంలోకి వచ్చే, ఎప్పుడో ఒకప్పుడు ఎడబాటును ఎదుర్కోక తప్పని ప్రతి వస్తువుకూ, వ్యక్తికీ వర్తించే ప్రతీకాత్మక కవిత.

మానవ సంబంధాల మీద, మానవ అనుభూతుల మీద, అనుభవాల మీద, దృశ్యాల మీద రాయకుండా ఉండడం ఏ కవికైనా అసాధ్యం. అందువల్లనే ఈ సంపుటంలో దాదాపు మూడో వంతు కవితలు ఆ ఇతివృత్తాలు ఉన్నాయి. మన సమాజంలో కాన్సర్‌ వ్యాధి (పాలీ సైథీమియా) పీడితుడైన మనిషి పట్ల కుటుంబ సభ్యులు, చివరికి సహచరి చూపే అనార్ద్రత అమానవీయ స్థాయిలో ఉంటున్నది. ఆ అనుభవాన్ని, రోగి మనోవేదనను, మొత్తంగా మానవ సంబంధాల దయనీయ స్థితిని లింగారెడ్డి రెండు కవితలలో ('కుట్ర కాదు...కుతంత్రం లేదు', 'సమాధులు కట్టుకుంటున్నాను') చాలా బాగా పలికించారు. అది స్వానుభవమైనా, ఇతరుల అనుభవమైనా సార్వజనీన అనుభవంగా పలికించగలగడమే కవిత్వం అనే మాటను నిజం చేశారు.

అయితే, ఆ అనుభవం నిరాశామయ అనుభవం కాదనీ, 'అస్తిత్వ పోరాటం అనివార్య దినచర్య' అనీ మరొక నిరాశా సందర్భంలో ('సూర్యుళ్ళు ఇద్దరు-ఆకాశం ఒక్కటే' కవితలో) పలికించిన ప్రేరణాత్మక వాక్యాలు కవిలోని ఆశావహక దృష్టినీ, ఎన్ని అవరోధాలనైనా ధిక్కరించే, అధిగమించే స్ఫూర్తినీ, దృఢదీక్షనూ చూపుతాయి. 'ఒక ద్రోహపు గాయం', 'ప్రయాణం తెగిపడదు' కవితలు కాస్త నిరాశనే ఎక్కువ ధ్వనించినా, 'కాలం ఒక జలపాతం, ఎగిసి పడే ఒక వాల్కనో, అభావాన్ని అభావం చేసే తీరుతుంది, అస్తిత్వం ఆకారం పొందే తీరుతుంది' అనే పాదాలు ('కాలం ఒక జలపాతం') ఆశనే ప్రకటిస్తాయి.

సున్నితంగా, సన్నిహితంగా, నిత్య చలనశీలంగా, జ్వలన సరోవరంగా ఉండవలసిన స్త్రీ పురుష సంబంధం ఏ దైహిక, సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల గడ్డకట్టిన సరోవరం అవుతుందనే ప్రశ్న ఏదో ఒక సందర్భంలో రాని వాళ్ళు అతి తక్కువ మంది కావచ్చు. ఆ ప్రశ్నను, ఆ ప్రశ్నానంతర విచికిత్స స్థితిని లింగారెడ్డి 'ఫ్రోజెన్‌ సరోవరం' కవిత బాగా పట్టుకుంది. 'నిజం చెప్పు...నిజం చెప్పు', 'కలల తీరం' కవితలు కూడ అటువంటి ప్రేమ వైఫల్యాన్ని, లేదా ప్రేమ ఉందా లేదా అనే సందేహాన్ని చిత్రించిన కవితలే 'నేను...నా తోట ...ఒక కోయిల' కవిత ఒంటరితనం నుంచి మనిషిని విముక్తం చేసేదేమిటనే తాత్విక ప్రశ్నకు సమాధానం. ఒంటరితనానికి విరుగుడు సమూహం అనే తక్షణ సమాధానమే సహజమని ఎవరికైనా అనిపిస్తుంది. కాని కవి ఇక్కడ ప్రకృతిలోకి వెళ్ళినప్పుడే 'ఒంటరితనం తోకముడుస్తుం' దంటారు. ఆ సమాధానానికి చేరడానికి తన తోటలోని ఒక్కొక్క పూల చెట్టునూ మనకు పరిచయం చేస్తారు. అన్నిటికన్నా మిన్నగా తోటతో అవినాభావ సంబంధం ఉండే కోయిలనూ ప్రవేశపెడతారు. దాని రంగు ముఖ్యం కాదనీ అంతస్సౌందర్యం ముఖ్యమనీ అంటారు. ఇలా మానవ సంబంధాల గురించి రాసినా కవితను ఒక తాత్విక స్థాయికి తీసుకపోవడం లింగారెడ్డి ప్రత్యేకత.

అమెరికా సామ్రాజ్యవాద రాజకీయాలను, దాని రాజకీయార్థిక ప్రయోజనాలను మరిచిపోయి, తొలిసారిగా సల్లజాతికి చెందిన బరాక్‌ ఒబామా అధ్యకక్షుడిగా ఎన్నిక కావడమే ఒక గొప్ప విప్లవమన్నట్టుగా, ఆ ఒక్క వ్యక్తి అమెరికా విదేశాంగ విధానాన్ని మార్చి పారేయగలడన్నట్టుగా కొందరైనా భ్రమపడ్డారు, భ్రమల్ని ప్రచారం చేశారు. తన మతమనే భ్రమలో మైనారిటీ మిత్రుడూ, వర్ణం తనదనే వ్యామోహంలో దళిత కవిపుంగవుడూ, ప్రవృత్తి తనదనే తాదాత్మ్యంతో అనువాద కవి సహచరుడూ, అభ్యుదయ కవి సారధీ అటువంటి భ్రమలకు లోనవుతున్నప్పుడు లింగారెడ్డి గొప్ప రాజకీయార్థిక స్పష్టతతో ఒబామా 'రాకాసి అనకొండ కాపలాదారు' అన్న నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటిస్తారు. ఆ అనుభవాన్ని భారత రాజకీయాల అనుభవంతో పోల్చి వ్యవస్థ మారకుండా వ్యక్తుల మార్పు వల్ల ఏం జరుగుతుందని ప్రశ్నిస్తారు. ఈజిప్టులో హోస్ని ముబారక్‌ నిరంకుశ పాలన మీద యువతరం తిరుగుబాటు తహ్రీర్‌ స్క్వేర్‌ ప్రజా సంచలనాన్ని లింగారెడ్డి 'ఒక ఎడారి నదై నవ్వితే పువ్వై పులకరించిన తడారిన గుండెలు...వేసవి ఇసుక తుఫానులో వెలిసిన ఒయాసిస్సు' అని హృద్యంగా గుండెకు హత్తుకుంటారు.

ఇందులో నేరుగా వ్యక్తుల మీద రాసిన కవితలున్నాయి.(ఒబామా మీద, రాజశేఖర రెడ్డి మీద రాసిన కవితలు మినహాయిస్తే ) ప్రపంచానికంతా కిషన్‌ జీ గా తెలిసిన పెద్దపల్లి పొత్తిల్ల బిడ్డ మల్లోజుల కోటేశ్వర రావు స్మృతిలో రాసిన 'కలల కనుగుడ్లు చిట్లిన రాత్రి' శివసగర్‌ స్మృతిలో రాసిన 'శివుడా! ఎప్పుడొస్తావు?', జీతన్‌ మరాండీ ఉరిశిక్ష సందర్భంగా రాసిన 'మరణం చివరి చరణం కాదు', విదార్థి సహచరుడు, సహాధ్యాయి ఆనారోగ్య పీడితుడైనప్పుడు రాసిన 'ఒక చూపు కోల్పోయిన కల' ఆయా వస్తువులతో కవి సాన్నిహిత్యానికి, ఆర్ద్రకవితాభివ్యక్తికి అద్దం పడతాయి.

హైదరాబాద్‌లో తస్లీమా నస్రీన్‌ మీద దాడి నేపథ్యంలో మతోన్మాదం ('ఇంపొజిసన్‌'), దిల్‌షుక్‌ నగర్‌ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తీవ్రవాదం మీద ('ఒకే నాణెం-రెండు ముఖాలు') రాసిన కవితలు మరింత నిశితమైన చర్చ అవసరమైనవి. అటువంటి చర్చకు ఒక ముందుమాటలో అవకాశం లేదు. తస్లీమా నస్రీన్‌ మీద దాడిని ఖండించడం అవసరమే. కాని ఆమెను ముస్లిం వ్యతిరేకతకు చిహ్నంగా వాడుకుంటున్న హిందుత్వవాదుల మీద, ఇస్లామోఫోబియాలో ఆమెను ఒక పావు చేసుకుంటున్న అమెరికన్‌, క్రైస్తవ సామ్రాజ్యవాదం మీద అంతే సులభంగా మాట్లాడగలమా అని పశ్నించుకోవలసి ఉంది. అలాగే దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబు దాడులను ఖండించవలసిందే. ఆ దాడుల్లో మరణించిన, గాయపడిన అమాయకుల పట్ల సంపూర్ణ సానుభూతి తెలుపవలిసందే. కాని అమెరికా వాడినట్టుగా, హిందూ మతోన్మాదులు వాడినట్టుగా, ఎక్కడ ఏం జరిగినా విచారణ లేకుండా ముస్లింలను నేరస్తులను చేసి భారత రాజ్యం వాడినట్లుగా నిర్విచక్షణగా టెర్రరిస్టు అనే మాట వాడవచ్చునా ప్రశ్నించుకోవలసి ఉంది.

ఇక లింగారెడ్డి కవిత్వానికి, ఆలోచనకూ, ఆచరణకూ, అస్తిత్వానికి మూలధాతువైన తెలంగాణ ఆయన కవిత్వంలోకి ఎంత సాంద్రంగా, ఆర్ద్రంగా, స్పష్టమైన అవగాహనతో ప్రవహించిందో చెప్పవలసి ఎంతో ఉంది. ఇప్పటికే పెద్దదైపోయిన ముందుమాటలో అది కూడ వివరించి మీకూ కవిత్వానికి మధ్య ఎక్కువసేపు నిలబడడం భావ్యం కాదు. కాకపోతే ఒకటి రెండు సూచనలు చేయవలిసి ఉంది. తెలంగాణ వస్తువుగా స్వీకరించి పన్నెండుకు పైగా కవితలు రాసిన కవి, తన ఇంతకు ముందు సంపుటానికి మంచి తెలంగాణ మాటను శీర్షికగా పెట్టుకున్న కవి సంస్కృత సమాసభూయిష్టతను, తెలంగాణేతర పదజాలాన్ని కాస్త తగ్గించుకుంటే బావుండును. అలాగే తెలంగాణ ప్రజల కడగండ్లకు ఎంతో సున్నితంగా స్పందించగలిగిన కవి తెలంగాణ-ఆంధ్ర సంబంధాన్ని సగటు రాజకీయ నాయకుల లాగ భార్య-భర్తల సంబంధంతో పోల్చడం, ఈ విలీనం రద్దును 'ఇడుపు కాయితం'తో పోల్చడం అన్ని సందర్భాలలో కుదురుతుందా చూడవలిసి ఉంది. అయితే ఈ కాసిన్ని లోపాలు ఈ కవిత్వపు అసంఖ్యాక గుణాలను ఎంత మాత్రం తగ్గించలేవు. తెలంగాణ ప్రజాఉద్యమంలో ఒక కీలక సందర్భంలో అద్భుతమైన కవితా సంపుటి వెలువరిస్తున్నందుకు లింగారెడ్డికి అభినందనలు. ఇంకా విరివిగా రాయాలని, తెలంగాణ సోయితో ప్రపంచ పర్వ్యాప్తం అవుతున్న లింగారెడ్డి తన వస్తుశిల్పాలను మరింత పదును పెట్టుకుని ప్రపంచస్థాయికి ఎదగాలనీ ఆకాంక్షిస్తూ...

- ఎన్‌. వేణుగోపాల్‌

డాక్టర్ కాసుల లింగారెడ్డి 'ఇడుపుకాయితం' కవితా సంకలనానికి రాసిన ముందుమాట

English summary
An eminent literary critic and editor of Veekshanam N Venugopal writes on Dr Kasula Lingareddy's poetry collection Idupu Kaayatham (Divorce agreement).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X