వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హలాల్ చేయబడుతున్న మానవ సమాజ చిత్రం 'బక్రీ'

By Pratap
|
Google Oneindia TeluguNews

కథ ఎలా రాయబడుతుందీ..!? జీవితం నుంచి కథ పుడుతుందా..? కథ కేవలం కల్పితమేనా..! లేదేమో..! కతంటే కల్పితాకల్పితాల మధ్య ఊగిసలాడే ఒక శిల్పం, నిజాన్ని కల్పననీ కలిపి ఒక జీవితపు కోణాన్ని ఆవిష్కరించే చిత్రం. అందుకే కథలో కొన్ని స్వప్నాలుంటాయి, జీవితంలో కనిపిస్తూ కూడా బయటకి చెప్పకూడని రహస్యాలుంటాయి..... నిజమే కదా..! కథంటే ఒక బహిరంగ రహస్యాన్ని మరోసారి ఆవిష్కరించటమేనేమో ..! మన జీవితాల చుట్టూ,మనలనే తిప్పిన సంఘటనల రూపం కాబట్టే కొన్ని కథలలా ఆకట్టుకుంటాయి.. చుట్టూ ఉన్న సమాజం లో మనం చూసిన విషయాలే కథలుగా మరోసారి మనలని.., మనం బతుకుతున్న పరిసరాలనీ మరోసారి గుర్తు చేస్తూంటాయి.... ఒకరకంగా అవి కేవలం కథలు కాదు జీవన చిత్రాలు అందుకే కొన్ని కథలలా మనసులోయ ముద్రించుకు పోతాయి. మన ఊరినో,జీవితం లోని ఒక సంఘటననో నిరంతరం గుర్తు చేస్తూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి... బక్రీ లోని కథల్లాగా....

 Naresh Kumar reviews Anwars short stories 'Bakri'

వరంగల్ కు చెందిన కవీ, కథకుడిగా అన్వర్ మనకు సుపరిచితుడే, ఆయన రాసిన కథలని కలుపుకొని వచ్చిందే ఈ బక్రీ.. అన్వర్ నుంచి మరో కొత్త పుస్తకం... పదిహేను కథలుగా పదిహేను కోణాలలో జరిగే దోపిడీనీ, ఆధిపత్యాన్నీ, అణచివేతనూ, ఆవేదనను మనముందుంచే ప్రయత్నమే ఈ "బక్రీ". పుస్తకం లోని కథ పేరే ఈ కథా సంపుటి పేరు కూడా . ప్రతీ కథలోనూ అంతర్లీనంగా ఒక ఎలిజీ వినిపిస్తూనే ఉంటుంది. మధ్యతరగతి సమాజం ముందు పెద్ద అద్దాన్ని నిలబెట్టినట్టూ .., ఆ అద్దం నిండా మనమోహమే కనిపించినట్టూ అనిపిస్తుంది. కనిపించే బింబం మీదే ఉన్న ఒక్కొ గాయాన్నీ ఆప్యాయంగా తడుముకొని భాదని కూడా ప్రేమగా అనుభూతించాలనిపిస్తుంది....

పదేళ్ళకింద కొత్త కోడలు గా ఆ ఊరొచ్చి , వేరే జిల్లాలో పని చేస్తూ వారానికి ఒక సారి వచ్చిపోయే భర్తకి భారం కాకుండా ఇద్దరు పిల్లలని సాకుతూ, తానే పని భారమంతా మీద వేసుకొని ఇౡ కట్టించి మరీ ధైర్యంగా నిలిచిన ఆమె "పిచ్చిది" ఎలా అయ్యింది? ఆ పిచ్చిలోనే ఎందుకు హఠాత్తుగా చచ్చిపోయింది ? అసలు "పిచ్చిదాన్ని" ఎవరు చంపారు? మానవ సంబంధాలలోని వికృత కోణాన్ని, మంచివాళ్ళలా మనచుట్టూ తిరిగే మనలోని పిచ్చివాళ్ళనూ చూపించే కథ "పిచ్చిది". మనిషినుంచి రాక్షసుడుగా రూపాంతరం చెందే పిచ్చిదాని మామలను మనం రోజూ ఎంతమందిని చూడటంలేదూ అనిపిస్తుంది. ఆఖరున పిచ్చిదాని భర్త అన్నట్టు... పిచ్చిది దయ్యామైతదా..!??? అయితే బాగుండు.... పిచ్చిది దయ్యామైవచ్చి మనుషుల్లా తిరిగే దయ్యాలని పీక్కుతింటే బాగుండు.. "పిచ్చిది" కథ చదివాక ఇలాగే అనిపిస్తుంది. మనం నిస్సహాయంగా చూస్తున్నప్పుడు కనీసం దయ్యం అనే ఊహ ఒక్క సారినిజమైతే బాగుండు అని ప్రతీ పాఠకుడూ కోరుకుంటాడు. ..

 Naresh Kumar reviews Anwars short stories 'Bakri'

పురుషాధిపత్యాన్నీ, స్త్రీ లో ఉన్న రెండు కోణాలనీ బ్యాలెన్స్డ్ గా చూపిన కథ "పరాయి వాడు". ఆడదాన్ని నీచంగా చూసే మగవాడు చెడ్డవాడే..,కానీ అతనికోసం వచ్చే ఆడవాళ్ళు..?? ఇంటికి వచ్చిన మరో ఆడమనిషిని పడగ్గదిలోకి తీసుకు వెళుతూ "నువ్వొక పదిహేన్నిమిషాలు బయట నిలబడు" అనే భర్తని ఏమీ అనలేక నిస్సహాయంగా వీధిలో నిలుచోని విచిత్రంగా చూసే మనుషులతో వోళ్ళంతా సిగ్గుని కప్పుకొని నిలబడ్డ లక్ష్ములని..... నిజం చెప్పండీ మీరేపుడూ చూడనే లేదా?? అయ్యో ఆమె తలరాత అంటూ నిట్టూర్చి కాసేపు ఆ ఇంటి వ్యవహారాన్ని చెప్పుకొని లోపల్లోపలే ఎంజాయ్ చేయలేదా? "డాడీ ఫ్రెండ్స్ వస్తే మనం బయటికెందుకెళ్ళాలి మమ్మీ" అని అడిగిన కొడుకు కి ఏసమాధానమూ చెప్పలేక కుమిలిపోయిన లక్ష్మిని మనం ఎప్పటికీ మర్చిపోలేం.. కథ చదువుతున్నంతసేపూ బలంగా వెళ్ళూనుకున్న పితృస్వామ్య వ్యవస్త ఎంతటి వికృత రూపాన్ని సంతరించుకుందో అన్న విషయం గుర్తొచ్చి తరతరాల సాంప్రదాయాల మీద ఛీత్కారం మరింత పెరుగుతుంది. కథకీ చుట్టూ ఉండే సమాజానికీ ఎంత దగ్గరి తనం ఉందో చెప్పే కథ పరాయివాడు.. అయితే ఇక్కడ లక్ష్మి పాత్ర తన భర్త మీద తిరగబడకుండా అలా నిస్సహాయంగా ఉందాలి? ఆమెలో తిరగబడే గుణాన్నిచూపి పరిష్కారం దిశగా కథని నడిపి మరొక ముగింపు కూడా ఇచ్చిఉండవచ్చు అనిపిస్తుంది.. కానీ ఇక్కడ రచయిత ఉద్దేశం వేరనిపిస్తుంది. పరిష్కారాన్ని తాను చెప్పకుండా అనేక ఆలోచనలను పాటకుడి ముందుంచటమే ఇక్కడ రచయిత ఉద్దేశం అనిపించింది....

అవయవదానం గురించి చర్చించే కథ "శరీరాన్నిచ్చిపోండి" ఈ కథ నిజానికి రచయిత మానసిక సంఘ్జర్షణనుంచే వచ్చినట్టనిపిస్తుంది. ఆత్మహత్యతో జీవితాన్ని ముగించాలనుకునే వారికి ఒక్క పదినిమిషాల ముందయినా సరే ఒక మనిషి దగ్గరగా ఉండి మాట్లాడగలిగినట్టయితే అతని ఆత్మహత్య ఆలోచనలు 60%పైగా తగ్గిపోతాయట. ఇంకో అయిదునిమిషాల్లో చచ్చిపోవటానికి రైల్వేట్రాక్ ఎక్కి న మనిషి ,అతన్ని కలుసుకుని ఆపిన చివరి మనిషి చెప్పిన మాటలు విన్నాక... "మంచి చాయ్ తాగుదామా"!? అన్నప్పుడు నిజంగా మనమే కొత్త ఊపిరి తీసుకున్న అనుభూతిని పొందుతామ్. అవయవదానం గురించి కూడా చర్చిస్తూనే కథని క్లుప్తంగా ముగించటం.., మరీ అనవసరమైన, పెద్ద పెద్ద డైలాగుల ఫార్ములా వాడకపోవటం వల్ల కథ సూటిగా పాఠకుడి మనసులోకి వెళ్ళిపోతుంది...

"ఇస్కూ మౌత్ నై ఆరై " (దీనికి చావు రావటం లేదు) ఆర్నెలలుగా ప్రతీ ఉదయం జహీరా బీ అలా ఎందుకనుకుంటోంది... అదీ ఇంటికి వచ్చిన ఒక మేకపిల్లని చూసి...! ఏడుగురు పిల్లల తల్లి అయినా ఏనాడూ ఒక మనిషిగా తనని చూడని భర్త ఒక మేకని తెచ్చి అందరికంటే అపూరూపంగా చూసుకునే భర్త ని చూస్తూ ఇస్కూ మౌత్ నై ఆరై అనుకుంటూనే ఉన్న జహీరా బీ, ఈ ప్రపంచం లో ఉండే (పైకి కనిపించకున్నా) అధిక శాతం పురుషులకీ ప్రతీక అయిన యాకూబ్ మియా... అటు భార్య నైనా,మేకనైనా ఒకలాగే చూస్తాడని ఎంతప్రేమ కురిపించినా దానివెనక అతని ఉద్దేశం ఒకటే అని అర్థమై....గొంతు కోయాయబడి,ఖండాలుగా నరకబడి మాంసం కుప్పలుగా పొగుపడ్డది నిజానికి బక్రీనా లేయక జహీరా బీనా..!? తరాల వివక్షాభూతాన్ని ఒక ప్రశ్న గా మనముందు నిలబెట్టే అద్బుతమైన కథ "బక్రీ" ... ఆమెకకు వచ్చిన మౌత్ వీనికైనా రాకపాయే మనసులోనే అనుకునే జహీరాబీతో పాటుగా మనమూ అనుకుంటాం...

హిందూ ముస్లిం అనే భావన పిల్లల్లోయ ఎంతటి దూరాన్ని పెంచుతుందో, మనిషి మనిషికీ కట్టిన మతం అనే ఒక "ట్యాగ్" ఎంత గా పసిమనసుల మీద గుచ్చుతుందో తెలిపే కథ "ఇమ్రాన్ ఉరఫ్ రామూ". ఖండాంతరాల దూరాలని కూడా తుడిచి పెడుతూ ఒక మధ్య తరగతి ముస్లిం యువకుడికీ 'వరంగల్' కి టూరిస్ట్ గా వచ్చిన అమెరికా అమ్మాయి మార్గరెట్ కీ మధ్య ఒక అందమైన ప్రేమకథ "అమెరిక టూ వరంగల్" సన్నని సంగీతం తో కొబ్బరాకుల్లోంచి చంద్రున్ని చూస్తూ కూచున్నప్పటి ఘాడమైన అనుభూతినిచ్చే కథ. జీవితం పెడదారులు పడితే మనిషి పరిస్తితేమిటో చెప్పే "రెండు సెల్ఫోన్లూ,ఏడు సిమ్ములూ, అమ్మ అంటే ఏమిటో తండ్రీ,బాల్యమూ ఎంతవిలువైనవో చెబుతూనే ఒక మద్యతరగతి ముస్లిం కుటుంబాన్నీ,మతాలమధ్య ఉండే గోడలని బద్దలు కొట్టి మతాంతర వివాహం అయిన విషయాన్నీ గుర్తు చేస్తూనే తల్లిని గురించి అద్బుతంగా చెప్పిన కథ "అమ్మీ తుఝే సలాం". ఇలా మరికొన్ని కథలతో కలిపి మొత్తం 15 కథల సంపుటి ఈ "బక్రీ".. కవి గానూ,రచయిత గానూ,సామాజిక ఉద్యమకారుడిగానూ కొన్ని సంవత్సరాలుగా రచయిత 'అన్వర్' అనే పేరు పాఠకుడికి సుపరిచితమే.. వరంగల్ వాసి కావటం వల్ల కథా వస్తువులూ,చెప్పిన తీరూ ఒక చిన్న పట్టణం లో ఉండే వాతావరణాన్నే చూపిస్తాయి. ప్రతీ కథ లోనూ అంతర్లీనంగా ఉండే ఒక మధ్యతరగతి ఆలోచనా విధానం వల్ల ప్రతీ పాత్రా మనం రోజూ చూసే మనుషుల్లా, మనతో తిరిగే వారిలానే అనిపిస్తాయి. మొత్తంగా ఈ "బక్రీ" కథా సంపుటి "ఆదునిక సమాజానికీ-అనాగరికథ కూ మధ్య ఊగిసలాడే మనుషుల జీవన శైలినీ,ఆ వాతావరణాన్నీ, ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని అసమానతలమీద ఆలోచించాల్సిన అవసరాన్నీ గుర్తు చేసే పుస్తకం"

కాపీలు కావాలనుకుంటే డా .జిలుకర శ్రీనివాస్ గారిని 7893753747 నంబర్ లో గానీ లేదా రచయిత అన్వర్ గారిని 9866089066 లో గానీ సంప్రదించవచ్చు.

- నరేష్ కుమార్ ఎస్

English summary
S Naresh Kumar reviewed Anwar short stories published on name Bakri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X