వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక కాస్మోపాలిటన్ తాత్వికుడి అస్పష్ట ప్రతిబింబం- గాలి అద్దం

|
Google Oneindia TeluguNews

అద్దం కిటికీలోంచి వీచిన కొన్ని కళ్ళు, వాటిలోంచి జారి పడ్డ కలలూ అద్దం ముందు కుడిఎడమలుగా కనిపించి...ఏ కలల్రాని అర్థరాత్రుల్లోనో కొన్ని కలని కోరుకుంటే...? దొరికిన స్వప్న శకలాలు అస్తవ్యస్తంగా పేర్చుకు పోతే..!? గాలి అద్దం లా..... ఒక కంగాళీ పద చిత్రాల్ని చిత్రించుకొని ఎమ్మెస్ నాయుడు పుస్తకమైపోదూ...!

రహస్యాలు బహిరంగమవటం కొత్తేం కాదుగానీ...! ఇదిగో ఇలా...! ఒక వెళ్ళిపోయాక, అఙ్ఞాతం నుంచి హఠాత్తుగా తనని తాను గాలి అద్దం లో చూపించిన ఎమ్మెస్ నాయుడు. మళ్ళీ కవిజీవన స్రవంతి లోకి రావటం, అదీ అర్థరాత్రి పిచ్చుక గూటిలోంచి రాలుతున్న ఒకానొక పక్షి ఈకలా మార్మికంగానే మళ్ళీ కాస్త మనమధ్యకు వీయటం బాగానే ఉంది... చెప్పొద్దూ...! సరిగ్గా ఒక సిగరెట్ పఫ్ ని గుండెలనిడా పీల్చి ఉఫ్...మంటూ ఊపిరి వదిలినంత "రిలీఫ్" గా ఉంది....

మనిద్దరమూ/తొంగి చూసేవాళ్ళమే/దేనిని చూశామో/ గుర్తుంచుకోమూ/దేనిని చూడాలో / ఎప్పటికీ తెలియదు... ఓహ్..! ఒక నిరంతర మార్మికాన్వేషకుడై కనుగుడ్ల వెనక రోజూ దాచుకునే భౌతిక దృశ్యాల గురించేనా ఈ పలవరింత.!? కాదేమో..! ఇంకా..ఇంకికా..వెనక్కి కనుగుడ్లకి వెనకాల ఉన్న మస్తిష్కాన్ని కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి... ఔనింతకీ మనమంతా దేనికోసం ఎదురుచూస్తున్నాం..!? సమాధానం కవి కూడా చెప్పడు. ఇక అక్కన్నుంచి పాఠకుడే కొంతసేపు ఆలోచనల్లో కూరుకుపోయీ,ప్రశ్న నుంచి పారిపోలేకా....సమాఢానాన్ని పట్టుకోలేకా.. ఆ పంక్తుల దగ్గరే తచ్చాడుతాడు."నాయుడూ...! జీవితపులోతుల్లో పడేసావు కదా". అనీ వాపోతాడు...

S Naresh Kumar on MS Naidu's poetry collection Gali Addam

జరపకు చంద్రున్ని/ రేపోమాపో/ ఒక గాజు చంద్రున్ని ఆమెకివ్వాలి...(ఉప్పాడ చీకటి)., ఏ రాత్రి నిశ్శబ్దంలో ఉప్పాడ కెరటం విరిగిన చప్పుడిది...? "ఆమె" అంటే అమ్మేనా? అమ్మంటే స్త్రీ నేనా..? ఒక తాత్వికానుభూతి కను కొలుకులనుంచీ చెక్కిలి పైకి ప్రవహించి... కవిత్వమేనా? ఈ మార్మిక ప్రయోగం కవిత్వమేనా? ఒక కాస్మో పాలిటన్ తాత్వికుడై కవి మనల్ని నిశ్శబ్ద శూన్యం లోకి తీసుకెళ్ళే మరోకవిత... "హాఫ్లాంగ్" ఎక్కడో మంచుకొండల మధ్య ఉన్న చిన్న ప్రదేశం "హాఫ్లాంగ్".ఇతని నిరంతర ప్రయాన పిపాస ప్రకృతితో కోరుకున్న ఘాఢమైన అనుబందం ఇక్కడ ప్రస్పుటమౌతుంది.. ముఖాలు లేని మేగాలు/ఎక్కడున్నా దీవిస్తాయి/అర్హత ఎవరిక్కావాలి.... ముక్కలు ముక్కలుగా కొన్ని అనుభవాలు... ఇదే హాఫ్లాంగ్ మరో కవితలోనూ కనిపిస్తుంది.. కొండల పైనా/కొండలకింద మనుషులే గానీ/మనిషిలో ఏ కొండా లేదు/సీతాకోక చిలుకా/నీ నగ్నత్వాన్ని ఎవరికి చూపించావో చెప్పు/వారికి ప్రణమిల్లుతాను (హాఫ్లాంగ్ కి దూరంగా)...

గాలి అద్దం కవినీ అతని భావాన్నీ ఏమాత్రం చూపించదు ఎందుకంటే...! చదువుతున్నంతసేపూ పాఠకుడు తనలోకి చేసే ప్రయాణమే ఎక్కువ ప్రతీ చోటా కొద్దిసేపు "నేనెక్కడున్నానూ" అనుకుంటూ.. ఆ పచ్చి వాక్యాలని వొంటినిండా పులుముకుంటూ ఒక అనామక దీవిలో వొంటరిగా మిగిలిపోయినట్టు... ఒక విచిత్రానుభూతికి లోనౌతాడు. కవిత్వమంటే ఇదే కదా..! కవిత ఇక కవిది కాదు కవిత్వమూ, భావమూ, ఇప్పుడు పాఠకుడివే...

ఎక్కడో కాస్త ఘాటైన మధ్యపువాసన లీలగా తగిలినట్టుగా అంతర్లీనంగా వినిపించే "ఎలిజీ" పుస్తకమంతా వెన్నాడుతూనే ఉంటుంది. నిరంతర యాంత్రిక జీవనం నుండి బయటకి రావాలనే బలీయమైన కోరిక కూడా కొన్ని కవితల్లో... వేయి సముద్రాల ఇంద్ర ధ్నుస్సై/నిద్ర/దేహంలో జడవిరబోసుకుంది/ ఏ దారీ తెన్నూ లేని సూర్యుడే/ పసిపిల్లల కేరింతల్లా ఒక్కసారిగా/నన్నీ యవ్వన రొమ్ముల్లాంటిదిన చర్యల్లోకి గెంటాడు/ నిద్ర మళ్ళీ ఎప్పుడో... అంటూ రాసుకున్నాడెమ్మెస్ నాయుడు.

నిజానికి ప్రతీ కవితా మామూలుగా అక్షరాల్నీ భౌతిక దృశ్యాలనీ దాటి.. ఆయా సమయాల,సంఘటనల,వస్తువుల వెనక ఉండే ఇంకేదో విషయాన్ని వెతుకుతున్నట్టే ఉంటుంది... పైకి కనిపించే కవిత ఒకటైతే దానివెనుక ఉన్న కవిత్వం మనం అందుకొనే అత్యంత విలువైన బహుమతి... విచిత్రం ఏమిటంటే ఆ బహుమతిని మనకు మనం గా తయారు చేసుకుంటాం,మనకు మనమే ప్రెజెంట్ చేసుకుంటాం..

చెవుల్ని ఎడంగా పెట్టు/కన్నీళ్ళనీఎడంగా పెట్టు/ గాలి లేని కాగితాన్ని తీసుకో/నీ పదాలతో నింపూ చింపూ/ఏమి చూసావో రాయి/నీ గాలి కాయితంలో...(గాలి కాయితం లో). అనుభూతులకు దగ్గరగా లాక్కెళ్ళి మనం ఏదో వివశత్వం లో ఉన్నప్పుడు చటుక్కున చెయ్యి వొదిలేసి కవి అక్కన్నుంచి హఠాత్తుగా మాయమైపోతాడు.. ఇక అక్కన్నుంచీ పాఠకుడే కవిత్వం లో తనని తాను వెతుక్కోవాలి., కోట్ల కన్నీటి బిందువుల ని తప్పుకొనీ,లక్షల నిశీథులగుండా పయణించీ.. దారిలో వాలే రంగురెక్కల పిట్టల రెక్కలని సవరించీ.... పుస్తకం ముగిసే టప్పటికి ఒక రిలీఫ్...అత్యద్బుత ప్రయాణాన్ని ముగించినట్టూ...ఒక రత్యానంతర సుఖాన్ని మళ్ళీ ఙ్ఞప్తికి తెచ్చుకొని అనుభూతించినట్టూ...గాలి అద్దం లో మొహం చూసుకొనీ..అదీ అపారదర్శకం అని అర్థమయ్యీ... కాసేపలా... నిట్టూర్చీ....

ఐతే విపరీతమైన మార్మికత,కొన్ని వాఖ్యాలూ.. మామూలు పాఠకున్ని (సరళమైన భాషకు అలవాటు పడ్డవారికి) కాస్త ఇబ్బంది పెట్టక మానదు, కొన్ని సంక్లిష్ట భావాలూ,వాడిన ఇమేజరీలూ ఈ కవిలాగే కాస్త అర్థం కానట్టే అనిపిస్తాయి... అయితే మార్మికథ లేని కవిత్వం ఎందుకు? చక్కా వ్యాసమే రాసుకోవచ్చుకదా... అనిపిస్తే మాత్రం త్రీ చీర్స్ టూ ఎం.ఎస్ నాయుడు గారు..

పుస్తకమ్మూసి రమణజీవి చిత్రించిన గాలి అద్దపు మొఖాన్ని తడిమీ... శకర్ పామర్తి గీతల అబ్స్ట్రాక్ట్ లో కాసేపు తప్పిపోయిన ఒక స్వేచ్చా సంచారినీ వెతుక్కొనీ..., పలకరించబోయీ... ఓ క్షణజన్మ పాటు నిజ్జంగా బతకాలనిపిస్తే.... 9000528717 కి ఫోన్ చేస్తే వాసిరెడ్డి పబ్లికేషన్ వారి దగ్గర పుస్తకం పొందొచ్చు., www.kinige.com లో వెతుక్కుని తీసుకొని చదవొచ్చు..

English summary
S Naresh Kumar reviews MS Naidu's poetry collection Gali Addam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X