వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతు ద్వీపకూటమి-ఒక పరిచయం

|
Google Oneindia TeluguNews

నిజానికి కవిత్వం రాయటం ఎంత నరకమో...రాసిన ఆ కొన్ని క్షణాలూ కవిగా బతకటం మరెంత భాదాకరమో చాలా మందికి అర్థం కాదు. తన చుట్టూ పేరుకున్న సమూహాలతో ఏకీభభవించలేకా.., ఆసమూహ సమాజపు కట్టుబాట్లని సహించలేకా కొట్టుకులాడీ...పరితపించీ..,పరిహసించబడీ.. తననుంచి తానే కొన్నిసార్లు అపహరించబడీ.. ధుఖించీ...వేనవేల సార్లు గుండెని చితగొట్టుకొనీ కవిత్వంగా నాలుగు మాటలు రాసుకోవటం అంటే.... మాటలు కాదు..నిజం కవిత్వమంటే వొట్ఠి మాటలుకాదు.....

కవిగా బతికే ఆ కొద్ది క్షణాలూ ఒక సామాజికుడిగా తనతో తానే విభేదించుకోవాలి..., తనని తాను విశ్లేషించుకోవాలి.. తననీ..,తాను బతికే తన సమాజాన్ని ఒక పక్కన నిలబెట్టి శల్య పరీక్ష చేసుకోవాలి... నిజానికి ఆ కొద్దిసేపూ మనిషిగా కాక ఒక ఆత్మగా మారిపోవాలి.... అప్పుడు... అప్పుడు పుడుతుంది కవిత్వం... పుట్టాక మళ్ళీ ఏమౌతుందీ..?

ఆ వెనువెంటనే మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు కవి. మళ్ళీ ఈ గోడలూ,చెట్లూ రోడ్లూ..,ఆకలీ,నిద్రా,మైథునాలని కోరుకునే మామూలు మనిషి నిద్రలేస్తాడు... అయితే అంతర్ఘతంగా కవి తన స్వప్న ప్రేలాపణలతో ఈ మనిషిని నిత్యయాతనకు గురి చేస్తూనే ఉంటాడు. అందుకే ఒక మనిషి కవిగా జీవించటం అంటే మామూలు విషయం కానేకాదు....

S Naresh Kumar's review on Anant Chintapalli's poetry Dweepa Kutami

చింతపల్లి అనంతు ఇలా ఒక కవిత్వ పీడితుడు. తనలోని కవిగాడు రేపే కల్లోలాన్ని మోసుకు తిరిగే నిత్య పాంథుడు. ఇరవై సంవత్సరాల తీవ్ర మన:కంపనలని ఓపీ..ఓపి.. ఇక నేనోపనంటూ... ఇప్పుడు విస్పోటించి వేలద్వీపాలుగా విడిపోయిన తనని తాను మళ్ళీ ఒకదగ్గరికి చేర్చుకొని.... "ద్వీప కూటమి" గా ఇదిగో ఇప్పుడిలా మనముందు నిలబడ్డాడు... ఇక విస్పోటనం మనలో పుడుతుంది...పాఠకున్ని కదిలించీ, అదిలించీ,లాలించీ.. కన్నీళ్ళు పెట్టించి... ప్రేమగా ఓదార్చీ ఒక్కో ద్వీపమూ ఒక్కో వర్ణం లో మనల్ని చుట్టు ముడుతుంది.... పాఠకుడా నువ్విప్పుడు ద్వీపకూటమి మధ్యలో బందించ బడ్డావ్.... అనంతు ధుఖాన్నీ,అనంతు వేదననీ,అనంతు ప్రేమనీ, అనంతమైన ఒక ఆనందాన్నీ అనంతు తో అనంతులా భరించక తప్పదేమో ఇక.....

ఓ నలభై కవితలుగా తనని కల్లోల పరిచీ,ఆనంద పెట్టీ,సాంత్వన పరిచిన కాలాలని ద్వీప కూటమి గా ఒక చోటచేర్చుకున్నాడనంతు.... సాహసినీ,పిరికి పందనూ నేనే అని మొదటే చెప్పేసుకుంటాడు కూడా....
నా మటుకు నాకు ఎందుకో/ఈ తక్షణం/దాహం లా/ఆకలి లా /ఆమె వేస్తోంది మరీ!... (ఆర్కిపెలాగో) ఆకలి వేస్తుంది..దాహం వేస్తుంది.. జీవనాకి అత్యంత ఆవశ్యకాలవి బతకాటానికి కావలసిన ముఖ్య మూలకాలు. మరి ఆమె..!? జీవితావసరం భౌతిక దేహాన్ని దాటి జీవించటానికి ఆ "ఆమె" అత్యావశ్యకం.

చిరు ద్వీపకూటమి కదా లో జీవనం.. అన్న ముగిపు ఈ కవితకి మరేదో కాస్త తాత్వికతని అద్దుతుంది.

చాంచల్య మోహ తథాగతిలో తనివితీరని ఒక దేహం... చినుకు ఆరీ.. చినుకు రాలీ.. పదే పదే జరిగే ఈ సైకిల్ మనసులో జరుగుతూనే ఉండాలి... ఎందుకంటే అనంతే చెప్పినట్టు "దేహాతీత దాహ రశ్మి" కదా ఆమె సాంగత్యం....
సద్దు మనగని లోన/వాన రావాలీ /చాన కావాలి.... (చాంచల్య తథాగతి) మొదటి కవితలో "ఆమే" ని విపరీతంగా కాంక్షించిన ఇతను అంతలోనే దేహా తీత దాహ రశ్మి అని చెప్పటం భౌతిక మోహాన్‌ని దాటిన మరేదో అవ్యక్త భావన. ఆమె నుంచి ఈ కవికోరుకునేది.. అసలు ఈ "ఆమె" కేవల స్త్రీ కి ప్రత్యామ్నాయం గా వాడిన పదమూ కాకపోవచ్చు.

S Naresh Kumar's review on Anant Chintapalli's poetry Dweepa Kutami

ఉన్నట్టుండీ ఒకరోజు మీకు ఒకరోజు మీరు ఇష్టంగా తినే ఆహారపథార్థం మీద నిషేదం విధించ బడుతుంది. మీరు సరే అని మిగిలిన వాటితో సర్దుకు పోతూంటారు.. ఇంకోరోజున "ఇలాంటి బట్టలే వేసుకోవాలి" అంటూ ఒక ఫత్వా జారీ అవుతుంది..., మరో రోజున ఒక కవి రాసిv రాతలమీదా ఆంక్షలు మొదలౌతాయి... వీటన్నిటి మీదా స్పందించే తీరు ఎలా ఉందీ?? ఫేస్ బుక్ పారిభాషిక పదాలైన లైక్, కామెంట్ , షేర్ లతో చెప్పుకొస్తాడు...

చేష్టలుడిగి పౌరులూ
నిరుత్తరులై జినులూ
నిరాయుధులై జనులూ మననీ.... (స్లాక్టివిస్ట్) ఇలాగే ఉండిపొమ్మనటం లేదు తిరగబడాలి అన్న మాటని సూటిగా చెప్పకుండా తిరుగుబాటుకి కారణమైన స్థిని చెప్పి మిగతాదేదో.., జరగాల్సిందేమిటో మననే ఆలోచించమంటాడు.... మనల్నే చేయమంటాడు...

ఇప్పటివరకూ మీరు ఇంట్రావర్ట్ లనే చూసి ఉంటారు కానీ అనంతు కాస్త తేడా అతనొక ఇంట్రావెలర్ లోలోపలికి తనలొపలికి ప్రయాణం చేస్తూనే ఒక సమూహం లో తేలతాడు తననుంచి తానే కాస్త ఎడంగా జరిగి సమాజం తోపాటే కదిలే రెండో అనంతుని చూసుకుంటూ అతన్ని నిత్యం ఒక సామాజికుడుగా నిర్వచించుకుంటాడు "బందాలని కలుపుకోవటానికి "పండోరా" వరకూ పయణించి మరీ "జీవితమా/నాపైన ప్రసరించనీయ్/ తన చుంబన బింబాన్ని/మరొక మారు" అంటూ ఒంటరి తనాన్ని వదిలి వేయలేని నిస్సహాయతనీ, మనిషి వదిలి వేయలేని బలహీననీ రెండు పక్కలా ఉంచుకొని అయోమయంగా చూస్తూ నిలబడిపోతే...

సూర్యుడినీ,సైకతాలనూ,ఋతు పవణాలనూ, కాలాన్నీ హత్తుకొని కొద్ది సేపు అదే అయోమయావస్తలో పాఠకుడూ కాసేపు తనపేరు కూడా అనంతూ అనుకోడా... నిజానికి సహేలూ లో ఉన్న ప్రేయసి ఒక స్త్రీ అనే అనుకోనక్కరలేదు ఇది విశ్వప్రేమను వెలిబుచ్చే ఎక్స్ప్రెషన్ కూడా అయిఉండవ్వచ్చు...

ఒక మనిషి ఎంతటి స్వార్థపరుడవనీ,మరెంత ఏకాంత వాసి గానీ అతను తన చుట్టూ ఉన్న సమాజాన్నీ దానిపట్ల ఉన్న ఒక ప్రేమనూ విస్మరించలేడు... కూలిపోతున్న ఈ సామాజికతకోసం కొన్ని సార్లు అతనూ విలపిస్తాడు,ఎదిస్తాడూ.... ఈ కవీ అంతే ఉన్నట్టుండీ ఒక వీదిమలుపులో ఉండే ఎర్రని ఝంఢా స్తంబం దగ్గర ఆగిపోయినట్టు "మీరూ,మీరగల్ పిడికిలీ/దాల్చిన దాని కొడవలీ/చూపుడు వేలుకు పరితపిస్తున్న తపంచా/దాని కొన అంకురించిన మెరుపూ" (వేకువ) అంటూ తనకు తానే ఒక శవపేటికగా... ఒక వీరుడి భౌతిక కాయాన్ని తనలో దాచుకున్నట్టుగా అనుభూతి చెందుతాడు. నిజానికి ఒక ఓపలేని ప్రకంపణ ఈ "వేకువ"....

ఒక సూఫీనీ,ఇంకొక ఏకాంత ద్వీప వాసినీ,ఒక సామాజికున్ని ఇలా మరెంత మందిని నీలోపలే మోస్తూ... నిన్ను నువ్వే వందల కోణాల్లో ఆవిష్కరించుకున్నావు..! కవీ..! నిజం కదా నువ్వు చెప్పింది "ధిక్కారం నెలవున్న వీరుడి ఊప్పిరి ఎప్పటికీ నిశ్చలమే...

ఔను అన్నీ చిన్న చిన్న శవపేటికలే/పొడవు ఒకటిన్నర తుపాకులు/అడ్డం అరతుపాకీ కొలతలున్న చిన్ని చిన్ని శవపేటికలు...(పిల్లలూ...శవపేటికలూ) 2014 లో పాకిస్థాన్ పిల్లలమీద కురిసిన బుల్లెట్ల వాన లో తానూ ఒకడై ఒళ్ళంతా పెల్లెట్ గాయాలతో నిలబడి "ఈ శవ పేటికల సంఖ్య 786 కాదు ముమ్మాటికీ కాదు, ఎలా చెబితే అర్థమౌతుంది మీకు!? " కవిత పూర్తయ్యే లోపు రెండు కన్నులూ కల్లోలపడి ఆ పిల్లల దేహాల మీదపడి గుండెలవిసేలా రోదించిన కవితో బాటు కొన్ని కన్నీళ్ళు రాల్చి... అల్ల చేష్టలుడిగి పోతాం ఈ కవిత చదివాక తేరుకోవటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చు... కనీసం ఒక జీవితకాలం...

నడుంపై శెనగ పూల మాలని పోలిన ఆదిమ నిప్పు పుట్టించి,విప్ప పూయించీ ఒకానొక మత్తులోకి తప్ప తాగించీ... పరవశపారిజాతం నాటుతాడట... "కుహరాన"...(పూమాల) ఓహ్...! సంభోగాన్ని కేవల సెక్స్ అనుకునే జనం మధ్య ఇలాంటి వాడొకడూ అందరిలాగానే ఎలా తిరిగాడూ.. తానూ అందరి లాంటి వాన్నే అని ఈ జనాన్ని ఎంతగా నమ్మించాడూ..! కవీ..! ఎంతటి మోసగాడివి నువ్వు.. మూసగాడిలో బతికే మా మధ్యా నువ్వు నవ్వుతూ తిరుగుతున్నది...!?

ఇద్దరూ/రెండు భువనాలు/రెండు భవనాలు.... రెండూ అందని కవిసమయాలూ. (ఇద్దరే) పక్క పక్కనే ఉన్న ఇద్దరిలో ఎన్ని వేల వైరుధ్యాలో. కలిసినట్టే అనిపించినా నిజానికి ఏ ఇద్దరి అస్తిత్వాలూ ఒకటే అయిపోవు ఔను ప్రతీ ఒక్కరూ ఎంతోకొంత ఎవరికి వారే. ఈకవితలో ఒక చోట రెండు "వేరులూ/రెండు వేరులూ" అంటాడు మామూలుగా ఈ పంక్తులని దాటబోయి మళ్ళీ ఒకసారి చదివి...ఇంకొక్కసారి మళ్ళీ చదివితే అర్థమౌతుంది రెండు వేరులూ లో వేరు అన్న పదాన్ని వేరు(రూట్) గా వాడాడూ అన్న విషయం ....

"కూన కలాపం" ఒక చిన్నారి సపోటాల బుట్టని మోసుకు వచ్చి ఆ సపోటాలని దింపే బుట్టని ఖాళీ చేసింది" ఈ సంఘటనని చెబుతూ చివరలో ఇలా అంటాడు "సపోటాల చోట/కేరింతలు/బుట్టనిండుగా"... జరిగింది మామూలు సంఘటనే అయితే దాన్ని కవిత్వం చేసిన తీరుమాత్రం బుట్టను మోసి ఎర్రబడ్డ ఆ చిన్నారి అరచేతులని అలా మొహానికి అద్దుకుని ఆ స్పర్శని అనుభవించినట్టు అనిపిస్తుంది. ఒక్క క్షణం ఆ చిన్నారి నవ్వు... మన ముఖం లో మొఖం పెట్టి నవ్వినట్టుగా... సచ్ ఎ క్యూట్ పోయెం... రగల్ పిడికిల్లనీ, తూటా గాయపు దేహాలనీ...మార్మిక మొహాల మనుషులనీ చూపిస్తూ... ఒక్కోసారి మోహా వీచికల్నీ,ప్రవాహం లేక ఎండిన నదీపాయల ఇసక దిబ్బలనీ పరిచయిస్తూ వచ్చి ఒక్కసారి " ఓ కూన మోసుకొచ్చిన సపోటా పళ్ళ బుట్టలో" మనల్నీ పడేస్తాడు....

అనంతు విపరీతంగా ప్రేమిస్తాడు స్త్రీనీ, మనిషినీ, శరీరాన్నీ, ఆత్మనీ, వస్తువునీ, ఆత్మనీ అన్నిటినీ ప్రతీదాన్ని ప్రేమిస్తాడు అయితే అదే తీవ్రతలో ఆగ్రహిస్తాడు కూడా అసలు మధ్యలో ఒక్కొసారి ఎర్రచొక్కా వేసుకున్న అనంతుకీ "జీరంగి" వంటి కవితలో కనిపించే అనంతుకీ అసలు పోలికౌండదూ అదిక ద్వీపం, ఇదొక ద్వీపం అంతే.... నడివయసు గణిక... ఈ పదం పుస్తకమ్మొత్తం లోనూ నన్ను విపరీతంగా ఆకర్శించింది ఎందూకూ అంటే నేను చెప్పలేను... ప్రతీ వృత్తికీ ఒక ఫ్రొఫెషనలిజం ఉంటుంది ఇప్పుడు మనమంతా (పైపైన) అసహ్యించుకునే వేశ్యా వృత్తికీ ఒక మాస్టర్ లాంటి "గణిక" అనే మనిషి నాలో లోపల ఒక గొప్ప స్థానన్నే ఆక్రమించుకోవటం వల్ల కావొచ్చు...

అనంతు తీవ్రంగా దిక్కరించగలడు కూడా ఆ ధిక్కారం అతనికే తెలిసి ఉండకపోవచ్చుకానీ... పదాలని ఎక్కువ మంది కవులని వాడే ఒక "సాంప్రదాయ పద్దతి" లో కూర్చకపోవటం (అర పుష్కరం/ అనంతరం.., లేరు మొ...) లోనూ..., మరీ ఎక్కువ వివరించకుండా కొన్ని చోట్ల సడెన్ గా ఇంకో చోటికి దూకటం లోనూ... "సూరీడుని చేరుకోవాలి/చందురుడినీ తాకాలి అంటూ మందలై వెను వెంటనే మోకరిల్లాను/దిక్కులు మొలవని/రెక్కలు తెరవని/దేహమ్ముందే..." అంటూ రాయటం లోనూ అతని లోలోపలి అసహనం, ధిక్కారం, ఒక ప్రత్యేక పద్దతిలోనే జీవితాన్ని గడపాలి అన్న సమాజ నియమనిభందనల మీద ఉన్న నిర్లక్ష్యమూ కనిపిస్తాయి...

నిజం చెప్తున్నా "అనంతు కి కవితలు రాయతం రాదు., అతనికి తెలిసింది కవిత్వం రాయటం" మాత్రమే... ప్రకృతినీ.. చుట్టూ ఉన్న ప్రతీవస్తువునీ తన కవిత్వం లోకి లాగి ప్రతీక్షణం పరిపూర్ణంగా జీవించాలనే తపనని చల్లార్చుకునే ప్రయత్నం చ్ఘేసాడు... నిజం మామూలుగా జీవించే చోట...తుప్పు మూగిన.., దుమ్ము మూగిన గవాక్షాలూ.., కిటికీ ఊచలూ.., వాటిమీద వాలే రెక్కలు అల్లార్చ లేని చిట్టి గువ్వ.., ఇలాంటివి చూడలేం... ఇలా మన చుట్టూ ఉండే ప్రకృతినీ చుట్టూ ఉండే ప్రతీ వస్తువునీ కలిపేసుకోవటం జానపదాలలో కనపడే లక్షణం ఎక్కడో అనంతు ఒక పల్లె పిల్లవాడు...ఒక ఊరి చెరువుగట్టు మీదుగా పట్నం వైపుగా వీచాడంతే... ఇంకా పాఠకులు గామనకున్న ఎక్స్ట్రా అదృష్టమేమంటే... ప్రపంచ సాహిత్యాన్నీ... దేశీయ కవిత్వాన్ని చదివిన అనంతు... ఎంతో మంది కవిమిత్రులనీ కలిగి ఉన్న అనంతు కవిత్వం మీద ఆ రెండిటిలో ఏ ఒక్క దాని ప్రభావమూ పడనివ్వక పోవటమే...

అంతా చదివాక "వచ్చి వెళ్ళిన వారు అసలు రానట్టే
మరెవరూ పూడ్చలేని ఖాళీ
గుండెల్లో గుచ్చి వెళ్ళక పోతే" అన్న మాటలు ఇంకెప్పుడూ మస్తిష్కం లోంచి చెరిగిపోక ప్రతీ చోటా మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మాత్రం.. ఓ పాఠకుడా..! నన్ను తిట్టుకోవద్దు... ఆ పాపం ఇదిగో ఈ అనంతుదీ..అతని కవిత్వానిదీనూ....

పీ.ఎస్..: అంతా రాసాక ఒక మిత్రునికి చూపించి ఎలా ఉందని అడిగాను.. మొత్తం చదివి ఒక సారి సిగరెట్ దమ్ము గట్టిగా లాగి పోగ వదుల్తో.... "ఇన్ని మైనస్ లు చెప్పావు కవిత్వం గురించి కొన్ని ప్లస్ లు కూడా చెప్పి ఉండాల్సింది" అన్నాడు... హత:విదీ...!

- ఎస్ నరేష్ కుమార్

English summary
S naresh Kumar reviewd Anant Chintapalli's Telugu poetry Dweepa kutamai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X