• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాహితీ సర్జన్ ప్రతాపరెడ్డి

By Pratap
|

తెంగాణలో అస్తిత్వవాదం వేళ్లూనుకోవడానికి ప్రధాన కారణం పాట. గద్దర్‌, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, అమర్‌, విమ మొదు వందలాది మంది వాగ్గేయకాయి పాట రూపంలో తెంగాణ భావజాల వ్యాప్తి చేసిండ్రు. అయితే ఈ పాటలు కైగట్టడానికి ముడిసరుకుని అందించింది విస్మరణకు, వివక్షకు గురైన విషయాలువెలుగులోకి తేవడంలో చాలా మంది చరిత్రకారులు, పరిశోధకులు కృషి చేసిండ్రు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు ఉద్యమ సందర్భంలో మెగులోకి తెచ్చిన విషయాలు, ఆంధ్రా కుహనా మేధావులు పత్రికల్లో నిత్యం కక్కే విషానికి విరుగుడు రాతలు తెలంగాణ సమాజంలో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించింది. ఈ పరిశోధక విషయాలు కవి, గాయకులకు ముడిసరుకయింది. ఏ ఊళ్లె ధూం ధాం జరిగినా దాని గొప్పతనాన్ని పత్రికలు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడమయింది. ఇది గ్రామాల్లోని యువకులకు ‘మేము కూడా చరిత్రకెక్కిన వారమే' అనే స్థైర్యాన్ని కలిగించింది.

ఇట్లా వెలుగులోకి వచ్చిన అనేకానేక విషయాల్ని, సాహిత్యాన్ని విశ్లేషించి, ముండ్లబాటను బండ్ల బాటగా మార్చిన వారిలో కాసుల ప్రతాపరెడ్డి ఒకరు. ఈ బండ్ల బాటలో తెలంగాణ కచ్చురాన్ని కదం తొక్కించిండు. బోనాల పండుగ జేసిండు. బతుకమ్మను పూదించిండు. మరుగున పడ్డ, పట్టింపులో లేని సాహిత్యాన్ని ఇటుకలుగా పేర్చి తెలంగాణ సౌధాన్ని నిర్మించిన/ నిర్మిస్తున్న అతి కొద్దిమంది సాహితీ విమర్శకుల్లో ప్రతాపరెడ్డి ఒకరు. చాలా సార్లు పనికిరావని పడేసిన రాళ్లను అనుభవజ్ఞుడైన సుతారిగా తీర్చిదిద్దిండు. ఈ సౌధ నిర్మాణానికి మీడియాను ఆయన ఒక పనిముట్టుగా వాడుకున్నడు. వాహికగా చేసుకుండు. గ్లోబలైజేషన్‌కు పునాదులు వేయడమే గాకుండా దాని విస్తరణకు ప్రధానంగా తోడ్పడ్డది మీడియా. ఈ మీడియా రంగాన్ని గ్లోబలైజేషన్‌ రోగాన్ని కుదిర్చే మందుగా వాడి సత్ఫలితాలు సాధించిన ‘సర్జన్‌' జర్నలిస్టు ప్రతాపరెడ్డి. ప్రాణం పోసే ఆపరేషన్లు చేసే అది ఉదయం పత్రికలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌ టైమ్స్‌లో పనిచేసినా, సుప్రభాతం పత్రికను నడిపించినా, ‘వన్‌ ఇండియా'ను నిర్వహిస్తున్నా ఎప్పుడూ తన కలాన్ని భూమిపుత్రుల తరపున ఝలిపించాడు. రాజకీయ విశ్లేషణతో రహస్య ఎజెండాను, కుట్రాజకీయాలనూ బహిరంగం చేయడం వృత్తిగా ఎంచుకుండు. ప్రవృత్తి అయిన సాహిత్యాన్ని అంతే సీరియస్‌గా సృజించిండు. రాజకీయ విశ్లేషణల్లో తెరవెనుక భాగోతాన్ని తెలియజెప్పినట్టుగానే ప్రతాపరెడ్డి తన సాహిత్య విమర్శలో అచ్చులో అగుపించే అక్షరాలు, రచనలే గాకుండా కనీ, కనబడకుండా ఉండే ‘బిట్వీన్‌ ద లైన్స్‌' విషయాల్ని ఈ పుస్తకంలో పటంకట్టి చూపించిండు. తెలంగాణ సాహిత్యాన్ని చదువుకోవడమే గాకుండా, దాన్ని లోతుగా అధ్యయనం చేసినవాడు కావడంతో విషయాన్ని పిన్‌పాయింటెడ్‌గా పట్టుకోవడమే గాకుండా, సందర్భానుసారంగా అన్వయించిండు. కథ, కవిత, దీర్ఘకవిత, విమర్శ రూపంలో ఎప్పటికప్పుడు కొత్తగా తన్ను తాను ఆవిష్కరించుకుంటూ తెలంగాణతో 25 ఏండ్లు కలిసి నడిచిన తొవ్వ ఈ పుస్తకం. సాహిత్య సంస్థలూ, జర్నలిస్టు సంఘాలతో మమేకమై తెంగాణ ఉద్యమంలో పాల్గొన్నడు. ఫోరం ఫర్‌ ఫ్రీడమ్‌ అఫ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ సభలు, సాహిత్య సమావేశాలు, రచయిత సంఘాల నిర్వహణలో భాగస్వామి అయ్యిండు. ఆ అనుభవాు సాహిత్య విశ్లేషణకు/అంచనాకు తోడ్పడ్డాయి.

ప్రతాపరెడ్డి తాను ఇన్‌సైడర్‌గా ఉంటూ 1990`2015 సంవత్సరాల తెలంగాణ సాహిత్య చరిత్రను పార్టిసిపేటరీ హిస్టోరియన్‌గా, క్రిటికల్‌గా రికార్డు చేసిండు. కాసుల ప్రతాపరెడ్డి వృత్తిరీత్యా జర్నలిస్టు కావడం ఒక అవకాశం, అడ్డంకి కూడా! అవకాశం ఎందుకంటే తన వద్దకు సమీక్షకు, అభిప్రాయం కోసం, చర్చ కోసం వచ్చే రచనల్ని పరిశీలించి రాసేందుకు, రాసిన దాన్ని అచ్చేసేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం వృత్తిరీత్యా ఎంతోమందితో ఇంటరాక్షన్‌లో ఉండడం మూలంగా ఎన్నో అభిప్రాయాను కలబోసుకోవడానికి వీలు కలుగుతుంది. తనను తాను క్రాస్‌ చెక్‌ చేసుకోవడానికి దోహదపడుతుంది. చదవడం, రాయడం అనివార్యం కావడం ఒక గొప్ప అవకాశం. అడ్డంకి ఏంటంటే ప్రధానంగా సమయం. జర్నలిస్టు ఎప్పుడూ హర్రీలోనే ఉంటాడు కాబట్టి ఒక సృజనాత్మక రచనపై అన్ని పార్శ్వాల్లో ఆలోచించి అతి తక్కువ సమయంలో రాయడం, అంచనా కట్టడం, విశ్లేషించడం చాలా కష్టసాధ్యమైన పని. ఈ రెండింటిని కాసుల ప్రతాపరెడ్డి సమర్ధవంతంగా నిర్వహించిండు. మామూలు జర్నలిస్టుకు రాజకీయ విశ్లేషణ, చారిత్రక సంబంధమైన లోక జ్ఞానం ఉంటే సరిపోతుంది. కాని సాహిత్య రచనపై సాధికారికమైన వ్యాఖ్య చేయాలంటే కచ్చితంగా పూర్వాపరాలు తెలియాలి. సాహిత్యంపై, సాహిత్యకారులపై స్వీయ అంచనా ఉండాలి. ఇవన్నీ ప్రతాపరెడ్డి నిరంతర అధ్యయనం ద్వారా వొంట పట్టించుకుండు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియపై పట్టుఉన్న ప్రతాపరెడ్డి తన పాతికేళ్ల జర్నలిస్టు జీవితంతో పాటు, వివిధ అకడెమిక్‌ సదస్సులో విషయ నిపుణిడిగా పాల్గొని సమర్పించిన విలువైన పత్రాలను కూడా ఈ నాలుగు వందల పేజీ పుస్తకంలో అందించిండు.

Sangisetty Srinivas on Kasula Pratap reddy's literary essya

గడచిన రెండున్నర దశాబ్దాలో చిన్న చిన్న మినహాయింపులతో తెలంగాణ సాహిత్యం ఎదిగొచ్చిన తీరు, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలంగాణ సాహిత్యం, అస్తిత్వ ఉద్యమాలకు ఆలవాలమైన తెలంగాణ సాహిత్యం తీరు తెన్నులను ఈ పుస్తకం పట్టిస్తుంది. భాష, కవిత్వం, దీర్ఘకవిత, పరిశోధన, కథ, నవల, విమర్శ ఇలా భిన్నమైన అంశాలపై, కవులు, కథకులపై సాధికారికమైన వ్యాఖ్యానమిది. దళిత బహుజన, ముస్లిం, స్త్రీ వాదాలకు సంబంధించిన రచనలపై తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి వాటికి సాహిత్య చరిత్రలో శాశ్వతత్వాన్ని కల్పించిండు. తెలుగు సాహిత్యంలో వివిధ వాదాలు ఎదిగి వేళ్లూనుకున్న దశను, దిశను తెలంగాణ సోయితో రికార్డు చేసిండు. చైతన్యశీలమైన తెలంగాణ సాహిత్యాన్ని ‘పిషికి' పోకుండా పట్టుకొని పాఠకులకు అందించిండు.

పదేళ్ల తెలంగాణ సాహిత్య ఉద్యమం పేరిట 1997`2007 మధ్యన తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన రచనను వాగ్గేయకారులను, సాహిత్యకారులను, సాహిత్య సంస్థలను, పత్రికలను, సంపాదకులను లెక్కగట్టిండు. ‘‘కోస్తా పాలకవర్గాల వసాధిపత్యాన్ని బాహాటంగానే నిరసిస్తున్నారు (కవులు), తెలంగాణ భాషకు, నుడికారానికి కవిత్వంలో పట్టం కడుతున్నారు. స్పష్టంగా తెలంగాణ కవులు రాజకీయాలే మాట్లాడుతున్నారు. తెలంగాణ కవుల రాజకీయావగాహన సంకుచితమైనది కాదు. దానికి విశాల ప్రాతిపదిక వుందని ఆ కవిత్వాన్ని చదివితే అర్థమవుతుంది. సామాజిక ప్రయోజనాన్ని, సామాజిక ఉద్యమాలను, ప్రజా రాజకీయాలను వారు తమ భుజస్కంధాల మీద మోస్తున్నారు'' అంటడు. తెంగాణ వాగ్గేయకారులకు నిలయం అంటూ పలువురు గేయ రచయితలు, వచన కవులు ఎట్లా తెలుగుసాహిత్యంలో ప్రాంతీయ చైతన్యాన్ని ప్రోది చేసిండ్రో చెప్పిండు. 1990లో ఆరంభమయిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తొలిదశలో తెలంగాణ ప్రభాకర్‌ నడిపించిన ‘నా తెలంగాణ' పత్రిక బాసటగా నిలిచింది. అయితే 1990వ దశకం మధ్యభాగం నాటికి తెలంగాణ సాంస్కృతిక వేదిక, ఆ తర్వాత తెంగాణ రచయితల వేదిక ఆ సంస్థ నడిపించిన సోయి పత్రిక, ఈ పత్రిక స్ఫూర్తితో కర్ర ఎల్లారెడ్డి వెలువరించిన ‘మన తెలంగాణ', వేనేపల్లి పాండురంగారావు లాంటి వితరణశీలురు తెలంగాణ సాహిత్యానికి చేసిన దోహదం ఈ రచనల్లో రికార్డయింది. విశ్వవిద్యాయాలు, రీసెర్చి సెంటర్లూ, అకడెమీషియన్లూ అన్ని హంగలూ, వనరులూ ఉండి చేయలేక పోయిన పనిని కాసు ప్రతాపరెడ్డి చేయడం విశేషం.

ఈ పుస్తకంలోని తొలి విభాగంలో ఉన్న నాలుగు వ్యాసాలు తెంగాణ అస్తిత్వానికి వేసిన పునాదులని చెప్పొచ్చు. ‘పదేళ్ల తెంగాణ సాహిత్యం', ‘నిత్య చైతన్యం తెంగాణ సాహిత్యం', ‘తెంగాణ సాహిత్యం- స్థానీయత, ప్రపంచీకరణ', ‘తెంగాణ సాహిత్యం సైద్దాంతిక పునాది' వ్యాసాలు గత 25 ఏండ్లలో తెలంగాణ సమాజం సాహిత్యంలో ఎలా ప్రతిఫలించిందో రికార్డు చేసింది. తెంగాణ సాహిత్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పోషించిన పాత్ర కూడా దీనిద్వారా అవగతమవుతుంది. మొత్తం తెలుగు సాహిత్యంతో తెలంగాణ నుంచి వెలువడ్డ తెలుగు సాహిత్యాన్ని పోలుస్తూ ఏది? ఎందుకు భిన్నమైందో, ఘనమైందో హేతుబద్దంగా చెప్పిండు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ‘వేర్పాటువాదం', ‘విచ్ఛిన్నత' వాదంగా చెప్పిన కమ్యూనిస్టుల కుతర్కాన్ని ఎండగడుతూనే రాష్ట్ర ఆకాంక్ష ఎందుకు న్యాయబద్దమైందో, దాని సైద్ధాంతిక బసమేమిటో కూడా ప్రతాపరెడ్డి విస్తృతంగా చర్చించిండు. ఆంధ్రా వలసాధిపత్యానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి మధ్యగల అవినాభావ సంబంధం గుట్టు విప్పిన తెలంగాణ కవులను గుర్తించి గుండెకు హత్తుకుండు. ‘తెల్లోని మారేశమై వస్తివి గదరా'' అన్న సుంకిరెడ్డి నారాయణరెడ్డి (దాలి) కవిత్వాన్ని గుర్తించిండు. విప్లవోద్యమ వైఫల్యాలపై ‘తోవ ఎక్కడ' అనే ప్రశ్నని సంధించిన సుంకిరెడ్డి కవిత్వాన్ని సమీక్షిస్తూ ‘‘ప్రస్తుతం విప్లవ కవిత్వం నగిషీల మధ్య నటన మధ్య కొట్టుమిట్టాడుతున్నది. దీనికి విప్లవోద్యమాల తాత్విక వెనుకబాటే కారణం'' అని తీర్మానించిండు.

1970వ దశకంలోనే తెలంగాణ భాషలో కవిత్వాన్ని రాసిన దేవరాజు మహారాజు, పంచరెడ్డి లక్ష్మణ, తెలిదేవర భానుమూర్తి, టి.కృష్ణమూర్తి యాదవ్‌ కవిత్వాన్ని విశ్లేషిస్తూ ‘వస్తువేదైనా వ్యక్తీకరణ వ్యాకరణం (గ్రామర్‌) అంతర్గతంగా ఒక దారంలా కొనసాగడానికి పదజాలం పనిచేస్తూ వుంటుంది. వచన కవిత్వం ఆధునిక ప్రక్రియ అయినందున కవికి పాత పదబంధాలు, పాత పదజాలం సరిపోదు. కొత్త విషయాలను, ఆధునిక పరిణామాలను, వాటి ప్రభావాలను మాట్లాడదుచుకున్నప్పుడు, దాన్ని బలంగా వ్యక్తీకరించాలనుకున్నప్పుడు కవి కొత్త డిక్షన్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది. కొత్త వ్యక్తీకరణ వ్యాకరణాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది' అంటూ తీర్మానించిండు. ఈ భాషలో దళిత ఈస్థటిక్స్‌ని అక్షరీకరించిన వేముల ఎల్లయ్య, గ్యార యాదయ్యకు గౌరవం కల్పించిండు.

దీర్ఘకవితలు రాసిన సురవరం, కవిరాజమూర్తి, వానమామలై, దాశరథి, పల్లా దుర్గయ్య మొదలు వేముపల్లి దేవేందర్‌, ఆర్‌క్యూబ్‌ వరకు అందరినీ మననం చేసుకుండు. సినారె, గోపీ, ఎన్‌కె, కె.రామ్మోహనరాజు, వడ్డెబోయిన శ్రీనివాస్‌, కందుకూరి శ్రీరాము, అల్లం నారాయణ, జూకంటి జగన్నాథం, జూలూరు, ఆశారాజు, పులిపాటి, సుంకర రమేశ్‌, గ్యార యాదయ్య, అనిశెట్టి రజిత, రామగిరి శివకుమార్‌, అఫ్సర్‌, కృష్ణుడు, ప్రసేన్‌ ఇలా దీర్ఘకవితలు రాసిన కవుల సాహిత్యన్ని చర్చించిండు. దీర్ఘకవితలతో పాటుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బి.నరసింగరావు, అన్నవరం దేవేందర్‌, కాసు లింగారెడ్డి, రత్నాకర్‌రెడ్డి, బాణాల శ్రీనివాసరావు, వఝల శివకుమార్‌, జూకంటి జగన్నాథం, జూలూరు గౌరిశంకర్‌, వంశీకృష్ణ, ఎస్వీ, రామాచంద్రమౌళి, ఏనుగు నరసింహారెడ్డి, పులిపాటి గురుస్వామి, అయిల సైదాచారి, అన్వర్‌, రహమతుల్లా, స్కైబాబ, షాజహానా పుస్తకాల్ని ఆత్మీయంగా సమీక్షించిండు. ఇందులో రహమతుల్లా ఒక్కడే నాన్‌ తెంగాణ. విప్లవ రచయితల గురించి రాస్తూ తెలంగాణేతరుడైన శివారెడ్డి గురించి విశ్లేషించడమైంది. అంటే ఇవి తెలంగాణ సాహిత్య వ్యాసాలే అయినప్పటికీ కొన్నికొన్నిసార్లు ఆ పరిధిని దాటిండు. నిజానికి అది దాటాల్సిన అవసరం లేదు.
1990 - 2015 మధ్యకాంలో కవిత్వమై తెలంగాణలో వర్షించిన వరవరరావు, టి.కృష్ణమూర్తి యాదవ్‌, గుడిహాళం రఘునాథం, శివకుమార్‌, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జూకంటి జగన్నాథం, పి.లోకేశ్వర్‌, నందిని సిధారెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్క్యూబ్‌, తుమ్మస దేవరావ్‌, కాసు లింగారెడ్డి, ఎం.వెంకట్‌, సిద్దార్థ, అయిల సైదాచారి, జగన్‌రెడ్డి ఇంకా ఎందరో కవుల రచనను కోట్‌ చేస్తూ కవిత్వ విమర్శకు ఈ పుస్తకంలో ప్రతాపరెడ్డి పెద్ద పీట వేసిండు.

1970 తర్వాతి కథా చరిత్రను రికార్డు చేయడమే గాకుండా ఎన్‌.కె.రామారావు, ముదిగంటి సుజాతారెడ్డి, దేవులపల్లి కృష్ణమూర్తి, ఎలికట్టె శంకరరావు, ఆవుల పిచ్చయ్య, గూడూరి సీతారామ్‌, కె.వి.నరేందర్‌, తెలిదేవర భానుమూర్తి కథల పుస్తకాలను రివ్యూ చేసిండు. ఇందులో కె.వి.నరేందర్‌, గూడూరి సీతారామ్‌ ఇద్దరు కరీంనగర్‌ జిల్లా వారు కాగా మిగతా అందరూ ప్రతాపరెడ్డి సొంత జిల్లా నల్లగొండ వారే కావడం విశేషం. తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ఈ కథకులు చిత్రించిన తీరుని ఆయా సంపుటాల్లోని ఆత్మను పట్టుకుండు. కథా చరిత్ర రాసే క్రమంలో ‘విప్లవ కథకు సమాంతరంగా సురవరం ప్రతాపరెడ్డి మార్గమొకటి తెంగాణలో ముందుకు సాగుతూ వస్తోంది. ఈ పాయ దేవరాజు మహారాజు మీదుగా ఈనాటి స్కైబాబా వరకు సాగింది, సాగుతోంది'' అంటూ మళ్ళీ నల్లగొండవారినే పేర్కొన్నప్పటికి అది వాస్తవం. స్కైబాబ కథలు ఇంగ్లీషులోకి రావడం ఆ కథల్లోని బలాన్ని నిరూపించాయి.

తెలంగాణ నవలా చరిత్రపై సుదీర్ఘ వ్యాసంతోపాటుగా నవలల్లో నగర జీవితం ప్రతిఫలించిన తీరుని లోతుగా పరిశీలించిండు. భాస్కరభట్ల కృష్ణమూర్తి, దాశరథి రంగాచార్య, అంపశయ్య నవీన్‌ ముళ్లపొదలు, పరవస్తు లోకేశ్వర్‌ సలాం హైదరాబాద్‌ నవలల్లో హైదరాబాద్‌ జీవితం ప్రతిఫలించిన తీరుని క్రోడీకరించిండు. వట్టికోట నవలపై రెండు వ్యాసాలు, రఘోత్తమరెడ్డి, బి.ఎస్‌.రాములు, బోయ జంగయ్య, లోకేశ్వర్‌ నవలల సమీక్ష ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ నవలలన్నీ తెలంగాణ దళిత, బహుజన జీవితాలను, సింగరేణి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలను రికార్డు చేశాయి. అంతర్లీనంగా ఈ నవలలన్నింటిలోనూ అణచివేతకు గురైన తెలంగాణ మనిషి తిరుగుబాటు, కొట్లాటే ప్రధానం.

కాసుల ప్రతాపరెడ్డి విమర్శపై కూడా విలువైన వ్యాసాలను ఇందులో జోడించాడు. 25 యేండ్లల్లో తెంగాణ సాహిత్యం ఎదిగి వచ్చిన తీరును ఈ పుస్తకంలో అక్షరీకరించిండు. తెలంగాణ సాహిత్యం తాత్విక పునాది, కవిత్వం, కథ, నవల, విమర్శపై సాధికారికంగా ఏక వ్యక్తి వ్యాఖ్యానించగలగడం అభినందనీయమైన అంశం. నిజానికి తెలంగాణ ఉద్యమంలో సంస్థల కన్నా వ్యక్తులే ఎక్కువ కృషి చేసిండ్రు. ఏమైనయిన్నప్పటికీ సంస్థలు చేయలేని పనిని సొంత ఖర్చు, సమయాన్ని వెచ్చించి వ్యక్తులు తమ కర్తవ్యంగా భావించి తెంగాణ తల్లికి సాహితీ మాలల్లిండ్రు. అందులో ప్రతాపరెడ్డి అందించిన సాహిత్యం ఆరిపోని సువాసనల్ని వెదజల్లింది. ఆ సువాసనల్ని ఈ పుస్తకంలోని పేజీ తిప్పిన ప్రతీసారి అస్వాదించవచ్చు.

ఈ పుస్తకంలో కె.శ్రీనివాస్‌, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డితో పాటుగా నేను వెలుగులోకి తెచ్చిన వివిధ సాహిత్య విషయాలకు తగిన గుర్తింపు గౌరవం కల్పించిండు. ఇది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఎవరేది రాసినా ఈ కాలంలో ఆ విషయాన్ని తామే కొత్తగా కనుక్కున్నామనే భావన కలిగేలా రచనలు చేస్తున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి అధిగమించిండు.

తెంగాణ ప్రచురణలు సంస్థ తరపున ఈ పుస్తకం రావడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతాపరెడ్డి సంస్థ బాధ్యుల్లో ఒక్కరు కావడమే గాకుండా నాకు 25యేండ్లుగా మంచి మిత్రుడు. ఉదయం పత్రికలో పనిచేసిన సమయంలో ప్రతాపరెడ్డి లాంటి దస్తూరి అలవాటు చేసుకోవాలనిపించేది. ఉదయం దిన పత్రికలో కలిసి పనిచేయడం మంచి అనుభవం. వివిధ విషయాలపై ఆయన విశ్లేషణ అబ్బుర పరిచేది. అయితే ఆయన సాహితీ ప్రతిభ తర్వాతి కాలంలో మిత్రులతో కలిసి ‘నవకథ' వెలువరించినప్పుడు అర్థమయింది. ఏది ఏమైనా ప్రతాపరెడ్డి రాసిన సాహిత్య వ్యాసాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక్కదగ్గరికి రావడం చారిత్రక అవసరంగా మారింది.

(నవంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఝాన కేంద్రంలో ఆవిష్కరించబోతున్న తెలంగాణ సాహిత్యోద్యమాలు గ్రంథానికి సంగిశెట్టి రాసిన ముందుమాట సంక్షిప్తంగా)

English summary
Sangisetty Srinivas on Kasula Pratap reddy's literary essya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X