వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సాహిత్య విమర్శ: పరామర్శ

By Pratap
|
Google Oneindia TeluguNews

వాస్తవానికి, 1970 థకం వరకు తెలంగాణలో సాహిత్యమే లేదనే వలసాధిపత్య భావన చెలామణి అవుతూ వచ్చింది. సాహిత్యమే లేనప్పుడు సాహిత్య విమర్శ ప్రస్తావన చేయడం సాహసమే అవుతుందనే అభిప్రాయం కూడా బలంగానే ఉండవచ్చు. అయితే, తెలంగాణ పరిశోధకులు, విమర్శకులు తమను తెలుసుకునే క్రమంలో తవ్వకాలు ప్రారంభిస్తూ వస్తున్నారు. దానివల్ల, తెలంగాణలో ప్రాచీన సాహిత్యం దండిగానే ఉందని, ఆధునిక వచన సాహిత్యం కూడా చాలా ముందుగానే ఉనికిలోకి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అట్లాగే, తెలంగాణ సాహిత్య విమర్శకు కూడా చాలా చరిత్ర ఉందనే విషయం అర్థమవుతూ వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణ సాహిత్య విమర్శ అనే అంశాన్ని ఎలా చూడాలనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్థూలంగా మూడు రకాలుగా విభజించుకోవచ్చు. ఈ విభజన సాహిత్య విమర్శను సులభరీతలో విశ్లేషించడానికి పనికి వచ్చేది మాత్రమే గానీ రూఢి చేయలేం.

ఆ రకంగా చూసినప్పుడు - 1. తెలంగాణ సాహిత్య విమర్శకులు చేసిన సాహిత్య విమర్శ 2. తెలంగాణ సాహిత్యంపై వచ్చిన విమర్శ 3. తెలంగాణ అస్తిత్వకోణంలో వెలువడిన విమర్శ అనే మూడు రకాలుగా విభజించుకోవచ్చు.

అలంకార శాస్త్ర గ్రంథాలు తెలంగాణ నుంచి విరవిగా వచ్చాయి. తెలుగు, సంస్కతృ భాషల్లోనూ అవి తెలంగాణ నుంచి పురుడు పోసుకున్నాయి. విద్యానాథుడి ప్రతాపరుద్ర యశోభూషణం అలంకార శాస్త్ర గ్రంథాలకు మార్ద నిర్దేశం చేసింది. సింగభూపాలుడి ఆస్థానంలోని చమత్కార చంద్రిక, వేంకటగిరిని పాలించిన రసార్ణవ సుధాకరం, బడే సాహెబ్‌గా ప్రసిద్ధుడైన అక్బర్‌ షా శృంగార మంజరి ఈ ప్రాంతం నుంచి వచ్చిన శాస్త్ర గ్రంథాలు. అలాగే, వేములవాడ భీమకవి 'కవిజనాశ్రయం' పద్యలక్షణ వివేచన గ్రంథం. 'అప్పకవీయం' రాసిన అప్పకవి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవాడు. తెలంగాణ నుంచి సాహిత్య, నృత్య, స్వరశాస్త్ర గ్రంథాలు వెలువడ్డాయి.

Telangana literature: Literary criticism

ఆధునిక కాలంలోకి వస్తే పరిశోధన, విమర్శ కలగలిసిన స్థితి కనిపిస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, మానవల్లి రామకృష్ణ కవి, శేషాద్రి రమణకవులు, ఆదిరాజు వీరభద్ర రావు తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పరిశోధన, విమర్శ సాగించారు. వీరిలో సురవరం ప్రతాప రెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు మినహా మిగతా వాళ్లు ఆంధ్ర ప్రాంతంవారే. శేషాద్రి రమణ కవులు పరిశోధన విషయంలో చేసిన కృషి తెలంగాణ ప్రాంతం ఎన్నటికీ మరిచిపోనిది. వీరి పరిశోధనకు, విమర్శకు సురవరం ప్రతాపరెడ్డి నడిపి గోలకొండ పత్రిక కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చింది.

శేషాద్రి రమణకవులు 1927లో 'నిజాము రాష్ట్రాంధ్ర కవులు' అనే వ్యాసం రాశారు. బమ్మెర పోతనను ఓరుగల్లువాసిగా నిరూపించడానికి వీరు చేసిన కృషి మరువరానిది. గోలకొండ కవుల సంచికలో ప్రాచీన కవుల పరిచయం రాశారు. ఆదిరాజు వీరభద్ర రావు దేవులపల్లి రామానుజరావు నడిపిన 'శోభ' పత్రికలో 'పల్లె పదాలు', 'తాళపత్ర గ్రంథాలు' అనే వ్యాసాలు రాసి విమర్శకు ఒరవడి పెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక కాలంలో తెలుగు సమాజం యావత్తూ ఎన్నదగిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' అనే గ్రంథం రాశారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను పరిశీలించి తెలుగు ప్రజల సామాజిక చరిత్రను రాశారు. అటువంటి ప్రామాణిక గ్రంథం తెలుగులో ఇప్పటి వరకు మరోటి రాలేదు. ఇప్పటికీ అదే ప్రమాణంగా నిలిచింది. ఆయన రాసిన వ్యాసాలు, పీఠికలు తెలంగాణ సాహిత్య విమర్శకు విస్తృతిని, కొత్త కోణాలను ఆందించాయి.

ఆ తర్వాత తెలంగాణ నుంచి వచ్చిన బిరుదురాజు రామరాజు, పల్లా దుర్గయ్య, సి. నారాయణ రెడ్డి, కె. గోపాలకృష్ణా రావు, ఎం. కులశేఖర రావు, పి. యశోదారెడ్డి, ఇరివెంటి కృష్ణమూర్తి, వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, ముకురాల రామారెడ్డి తెలుగు విమర్శనాసాహిత్యాన్ని అందించారు. బిరుదురాజు రామరాజు జానపద వాజ్ఞ్మయ పరిశోధనకు, విశ్లేషణకు, విమర్శకు ఆద్యుడిగా నిలుస్తారు. అంతేకాకుండా, ఆయన ఆధునిక తెలుగు కవిత్వంపై అభినివేశం ఉన్నవారు. దాశరథి వంటి తెలంగాణ ఆధునిక కవులపై కృష్ణా పత్రికలో వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలతో కూడిన గ్రంథం రావాల్సే ఉంది. అది వస్తే ఆధునిక తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణానికి తోడ్పడుతుంది. తెలుగు సాహిత్యం ప్రధాన స్రవంతిలో తెలుగు కవిత్వాన్ని చేర్చడానికి బిరుదురాజు రామరాజు చేసిన ప్రయ్నతం అది. ఆ ప్రయత్నానికి కోసాంధ్ర సాహిత్య సమాజం సానుకూలంగా ప్రతిస్పందించిన సందర్భాలు లేకపోవడమే విషాదం.

సి. నారాయణరెడ్డి 'ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు' అనే సిద్ధాంత గ్రంథం తెలుగు సాహిత్యంలో ఉన్నతమైన విమర్శ. అయితే, ఇది ఆంధ్ర సాహిత్య విమర్శనాసూత్రాలకు, కొలమానాలకు, భావనలకు అనుగుణంగా వచ్చిన విమర్శ. తెలంగాణ సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం ఇందులో చాలా తక్కువగా జరిగింది. అయితే, ఈ గ్రంథాన్ని తెలంగాణ సమాజం సొంతం చేసుకోవాలా, వద్దా అనేది ప్రశ్నించుకోవాల్సిందే.

ముదిగంటి సుజాతారెడ్డి తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథంలో తెలంగాణ సాహిత్యానికి తగిన స్ధానం కల్పించారు. కానీ, ఆమె చేసిన ప్రయత్నం కూడా తెలంగాణ సాహిత్యాన్ని విస్మరణ నుంచి బయటపడేయలేకపోయింది. వరవర రావు తెలంగాణ విమోచనోద్యమ నవలలపై చేసిన పరిశోధన ఇప్పటికి కూడా ప్రామాణికమైందే. మార్క్సిస్టు దృక్పథంతో తెలంగాణ విమోచనోద్యమ నవలలను ఆయన విమర్శించారు. అయితే, ఇప్పటి ప్రత్యేక పరిస్థితిలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన స్థితిలో తెలంగాణేతరులు రాసిన తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో ప్రతిఫలించిన నిర్దిష్టత, సృజనాత్మక విలువల గురించి అధ్యయనం చేయాల్సి ఉంది. తెలంగాణ నుంచి వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి', 'గంగు' నవలలతో వాటిని వస్తుశైలీ విషయాల్లో తులనాత్మక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

ఎన్‌ గోపి 'ప్రజాకవి వేమన' పరిశోధనా గ్రంథం ఇతరులకు సాధ్యమయ్యేది కాదు. పరిశోధన, విమర్శన, పరిశీలన కలగలిసి అత్యత్తుమ గ్రంథంగా అది తెలుగు సాహిత్యానికి అందింది. ప్రజాకవి వేమనపై అంత విస్తృతమైన, సాధికారిరమైన విమర్శ గ్రంథం మరోటి రాలేదంటే అతిశయోక్తి కాదు.

విప్లవ సాహిత్యం పైచేయి సాధించిన తర్వాత తెలుగు కథకు ప్రాధాన్యం వచ్చింది. తెలుగు సాహిత్యం తెలంగాణ సాహిత్యాన్ని తనలోకి తీసుకున్న సందర్భాలు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి - తెలంగాణ సాయుధ పోరాట సాహిత్య సందర్భం, రెండోది - విప్లవ సాహిత్య సందర్భం. రెండో సందర్భంలోనే అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కవిత్వంపై విస్తృమైన చర్చనే జరిగింది. అల్లం రాజయ్య కథల్లోని భాష పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చిన వ్యాసాలు చాలానే ఉన్నాయి. గురజాడ అప్పారావు నుంచి ఇప్పటి వరకు కోస్తాంధ్ర భాష ప్రయోగం విషయంలో తలెత్తని వివాదం తెలంగాణ భాషా ప్రయోగం విషయంలో తలెత్తింది. వస్తువును అంగీకరిస్తూ, భాషను వ్యతిరేకించే ధోరణి కనిపిస్తూ వచ్చింది.

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి 'పనిపిల్ల' కథపై పెద్ద యెత్తున చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్నవారు చాలా మంది తెలంగాణకు చెందినవారే. ఈ కథను ఆలంబనగా చేసుకుని సిద్ధాంత చర్చ జరిగింది. వస్తువును రచయిత నిర్వహించిన తీరుపై అభ్యంతరాలు, సమర్థనలు ముందుకు వచ్చాయి. తెలంగాణ నుంచి విరవిగా విప్లవ కవిత్వం వచ్చినప్పటికీ పెద్దగా దానిపై విమర్శ వచ్చినట్లు లేదు. సమీక్షల వరకే అవి పరిమితమైనట్లు ఉంది. ఇదే సమయంలో అనుమాండ్ల భూమయ్య, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య సంప్రదాయ విమర్శను ముందుకు నడిపించారు. కెకె రంగనాథాచార్యులు తెలుగు సాహిత్య విమర్శను సామాజిక దృక్కోణం నుంచి, తెలుగు సామాజిక పరిణామాల నేపథ్యం నుంచి విశ్లేషించారు.

దళిత, ముస్లిం సాహిత్య విమర్శలో తెలంగాణవాళ్లదే పైచేయి. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'బహువచనం' దళిత, బహుజన కవిత్వ సంకలనానికి, 'జల్‌జలా' ముస్లిం కవితా సంకలనానికి రాసిన ముందు మాటలు సాహిత్య విమర్శనా సాహిత్యంలో అత్యంత ప్రధానమైనవి. కె. శ్రీనివాస్‌, సురేంద్ర రాజు, కాసుల ప్రతాపరెడ్డి దళిత, ముస్లిం సాహిత్య విమర్శనా రంగంలో విశేతషమైన కృషి చేశారు. బిఎస్‌ రాములుకు సంబంధించి దళిత సాహిత్య విమర్శనా రంగంలో ప్రత్యేకమైంది.

1990 థకం చివరి నుంచి విమర్శలో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ కోణం ప్రారంభమై, బలపడుతూ వచ్చింది.ముదిగంటి సుజాతారెడ్డి, బిఎస్‌ రాములు, కాలువ మల్లయ్య, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సురేంద్ర రాజు, కె. శ్రీనివాస్‌, నందిని సిధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, గుడిపాటి తొలుత ఈ ప్రాంతీయ కోణాన్ని ఆవిష్కరించినవారు. వీరందరూ విడివిడిగా వ్యాసాలు రాస్తూనే వచ్చారు. తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన సదస్సుల్లో ప్రసంగాలు చేస్తూ వచ్చారు. తెలంగాణ కోణంలో సాహిత్య విమర్శ ఎలా ఉండాలి, దానికి గీటురాళ్లు ఏమిటి, ఇది కోస్తాంధ్ర సాహిత్య విమర్శ కన్నా భిన్నంగా ఎలా ఉంటుందనే విషయాలకు వారు సమాధానాలు వెతుకుతూ తెలంగాణ సాహిత్య ప్రపంచంతో పంచుకోవడం ప్రారంభించారు. అయితే, ఆ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ, లభించిన సమాధానాలతో ఒక నిర్దిష్టమైన ఆకారం ఇచ్చింది మాత్రం తెలంగాణ సాంస్కృతిక వేదిక తెచ్చిన 'తెలంగాణ తోవలు' పుస్తకం. ఇందులోని 18 మంది సాహిత్యవేత్తలు కూడా వివిధ అంశాలను తడుముతూ తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చారిత్రక అంశాలను తెలంగాణ కోణం నుంచి ఎలా విశ్లేషించాలో, పునర్మూల్యాంకనం ఎలా చేయాలో నిర్దిష్టంగానూ నిర్దుష్టంగానూ చెప్పారు. తెలంగాణకు సంబంధించి కొత్త ప్రతీకలను నిలిపే ప్రయత్నం కూడా చేశారు. ఆ ఆలోచనాధార తెలంగాణ సాహిత్య, సాంస్కృతికోద్యమానికి మాత్రమే కాకుండా రాజకీయ ఉద్యమానికి కూడా దోహదం చేసింది. అదే సమయంలో వచ్చిన 'భౌగోళిక సందర్భం' పుస్తకంలోని వ్యాసాలు అప్పటికే ఆ కోణంలో రేఖామాత్రంగా విశ్లేషించినవి. ఒక గుడిపాటి 'ఫాయిదా' విమర్శనాగ్రంథంలోని వ్యాసాలు తెలంగాణ కోణంలో సాహిత్య విమర్శను ముందుకు తీసుకుని వెళ్లింది.

సంగిశెట్టి శ్రీనివాస్‌ 'దస్త్రమ్‌' పుస్తకం తెలంగాణ కథా స్వరూపాన్ని పట్టుకోవడానికి పనికి వచ్చిన గ్రంథం. కె. శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌ వట్టికోట ఆళ్వారుస్వామి వంటివారి మీద చేసిన కృషిని విశేషంగానే చెప్పుకోవాలి. ముదిగంటి సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌ తెలంగాణ తొలితరం కథలకు రాసిన ముందుమాటలు తెలంగాణ తొలితరం కథలను విశ్లేషించాయి. తెలంగాణ కథ పట్ల జరుగుతున్న వివక్షపై ప్రధానంగా దృష్టి సారించి, తెలంగాణ కథను రేఖామాత్రంగా పరిచయం చేసే వ్యాసాలతో 'తెలంగాణ కథ - దేవులాట' అనే పుస్తకం వచ్చింది. వివిధ రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ఇది. ముదిగంటి సుజాతరెడ్డి వివిధ రచయితల వ్యాసాలతో తెచ్చిన 'ముద్దెర' తెలంగాణ సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను విమర్శనాత్మకంగా పరిచయం చేసింది.

ఆ తర్వాత తెలంగాణ సాహిత్యంపై వరుసగా విమర్శనా వ్యాసాలు, వ్యాసాల సంకలనాలు వచ్చాయి. నందిని సిధారెడ్డి 'ఇగురు', కాసుల ప్రతాపరెడ్డి 'కొలుపు', 'ఇరుసు', సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'గనుమ', కాసుల లింగారెడ్డి 'ఇరువాలు' వంటి పుస్తకాలు వచ్చాయి. బన్న ఐలయ్యవంటి వారు రాసిన వ్యాసాలు, తెచ్చిన పుస్తకాలు కూడా తెలంగాణ సాహిత్య విమర్శకు సాధికారితను తెచ్చి పెట్టాయి. భువనగిరి సదస్సులో సమర్పించిన పత్రాలతో తూర్పు మల్లారెడ్డి తెచ్చిన పుస్తకం తెలంగాణ సాహిత్య ప్రక్రియలను స్ధిరపరిచి, మార్గాన్ని చదును చేయడానికి ఉపయోగపడింది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'ముంగిలి' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన సాధికారికంగా ప్రాచీన తెలంగాణ కవిత్వాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచారు. అది తెలంగాణ ప్రాచీన కవిత్వ విమర్శన ప్రాథమిక గ్రంథంగా నిలిచిపోయింది. కర్ర ఎల్లారెడ్డి నడిపిన 'తెలంగాణ' పత్రికలోని వ్యాసాల్లో కూడా సాహిత్య విమర్శనా వ్యాసాలున్నాయి.

తెలంగాణ నుంచి కూడా ఏ మాత్రం తక్కువ కాని సృజనాత్మక సాహిత్యం వెలువడిందని చాటడానికి తెలంగాణ విమర్శ ప్రయత్నం చేసింది. దానికి ముందు వివక్షను ప్రశ్నించింది. ఆ తర్వాత తానేమిటో చాటుకోవడానికి పరిశోధన, పరిశీలనలను తెలంగాణ చేపట్టింది. ఆ తర్వాత తెలంగాణ సాహిత్యం తెలంగాణేతర సాహిత్యానికి ఎలా భిన్నమైందో చాటుకోవడానికి ప్రయత్నం చేసింది.

తెలంగాణ సాహిత్య విమర్శ:

1. తెలంగాణ సృజనాత్మక సాహిత్యం ప్రత్యేక అస్తిత్వాన్ని, ప్రత్యేక లక్షణాన్ని తెలంగాణ సాహిత్య విమర్శ చాటింది.
2. సీమాంధ్ర సాహిత్యంలో తెలంగాణ సాహిత్యాన్ని తులనాత్మక అధ్యయనం చేయడం కూడా తెలంగాణ సాహిత్య విమర్శలో ఇమిడి ఉంది.
3. తెలంగాణ సాహిత్య విమర్శకు కొలమానాలు మారాలని చెప్పడమే కాకుండా ఏ కొలమానాల ప్రకారం తెలంగాణ సాహిత్యాన్ని చూడాలో నిదర్శనాపూర్వకంగా చెప్పింది.
4. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్య విశ్లేషణను మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాహిత్యాన్ని కూడా విశ్లేషించింది.
5. సమాజానికంతటికీ, ప్రగతిశీల శక్తులకూ తెలంగాణ సాహిత్య ఎలా దారి చూపుతుందో వివరించింది.
6. తెలంగాణ సాహిత్యం కేవలం కేవలం 'భౌగోళిక తెలంగాణ' సాధన కోసం మాత్రమే వెలువడింది కాదు, దానికో ప్రాపంచిక దృక్పథం ఉందని నిరూపిస్తూ విశ్లేషిస్తూ విమర్శ వచ్చింది.
7. అత్యంత ప్రధానంగా స్థానీయ ఉద్యమం ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమానికి చోదకశక్తిగా ఎలా మారుతుందో చెప్పింది.
8. భిన్న సంస్కృతులను, ఆచారవ్యవహారాలను, ఆర్థిక వ్యవస్థలను, సామాజిక శ్రేణులను రద్దుచేసి, ఏకీకృత మార్కెట్‌ సంస్కృతిని నిలపడానికి ప్రపంచీకరణ శక్తివంతమైన ఆయుధంగా మారి, అగ్రదేశాల గుప్పిట్లోకి ప్రపంచంలోకి ఎలాల& వెళ్తుందో, దాన్ని ఎదుర్కునే ఆచరణాత్మక పనిముట్టుగా తెలంగాణ ప్రాంతీయ లేదా స్థానీయ ఉద్యమానికి ఎలా ఉందో వివరించింది.

ఇకపోతే, మరో విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. తెలుగు సాహిత్య చరిత్రలో యుగవిభజన తెలంగాణ సాహిత్యాన్ని విశ్లేషించడానికి, విమర్శించడానికి, బేరీజు వేయడానికి పనికి రాదని తెలంగాణ సాహిత్య విమర్శకులు, పరిశోధకులు గుర్తించడం. తెలుగు సాహిత్య యుగవిభజనలో తెలంగాణ సాహిత్యం ఇమడదు. ఆ ఎరుకతో తెలంగాణ సాహిత్య చరిత్ర ద్వారా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చేసి పెట్టాడు. తెలుగు సాహిత్య చరిత్ర లేదా తెలంగాణేతర సాహిత్య చరిత్ర ప్రాజ్ఞనన్నయ యుగం నుంచి ప్రారంభమైతే తెలంగాణ సాహిత్య చరిత్ర శాతవాహన యుగం నుంచి ప్రారంభమవుతుంది. ఈ రీత్యా తెలంగాన సాహిత్య విమర్శకు సంబంధించి సమగ్రమైన గ్రంథం ఇంకా రావాల్సే ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Kasula Pratap Reddy's over view on Telangana literary criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X