వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు దినపత్రికల్లో భాష

By Pratap
|
Google Oneindia TeluguNews

భాష అనేది సమాచార వినిమయానికి పదజాలం ద్వారా లేదా సంకేతాల ద్వారా ఉపయోగపడేది. ఈ నిర్వచనం భాషకు సంబంధించిన సామాజిక కార్యాచరణను తెలియజేస్తుంది. తమను తాము వ్యక్తం చేసుకోవడానికి భాష ఉపయోగపడుతుంది.

సరళంగా చెప్పాలంటే - భాష అనేది సమాచార వినిమయానికి సాధారణ మానవుడు వాడే సహజసిద్దమైన సామర్థ్యం.

ఈ రకంగా చూసినప్పుడు సమాచార, ప్రసార సాధనాలు సమాచార వినిమయానికి భాషను వాడుకుంటున్నాయి. దినపత్రికలు కూడా ఈ దిశలో తాము అందించే సమాచారాన్ని ప్రజలకు లేదా పాఠకులకు సులభమైన రీతిలో, వారికి అర్థమయ్యే రీతిలో అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.

తాము అందించే సమాచారాన్ని పాఠకులు ఆదరించడానికి లేదా తమకు ఆదరణను పెంచుకోవడానికి నిత్యం దినపత్రికలు కసరత్తు చేస్తున్నాయి. దానివల్ల భాషను ఆధునీకరించడం లేదా సరళీకరించడం అనే ప్రక్రియ దినపత్రికల్లో ప్రతి రోజూ జరుగుతుంది.

సమాజం ఎప్పుడూ లేనంత వేగంగా మారిపోతున్నది. ఆధునిక ఆవిష్కరణలు ప్రజలకు చేరవేయడానికి తెలుగు దినపత్రికల మీద కొత్త బాధ్యతలు పడుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆధునిక సమాచార సాంకేతిక రంగం ప్రాంతీయ భాషలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఈ సవాళ్లను తెలుగు దినపత్రికలు ఎదుర్కోవడానికి నిత్యం ఓ యుద్ధమే చేస్తున్నాయి.

ఇంటర్నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి అనేక ఆవిష్కరణలను తెలుగులో అందించడానికి, వాటికి తెలుగు రూపాలు ఏర్పరచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కొత్త పదజాలం సృష్టించుకోవాల్సిన అనివార్యతలో అవి పడ్డాయి. ఇంటర్నెట్‌ను అంతర్జాలం అని, ఫేస్‌బుక్‌ను ముఖపుస్తకం అని అనువదించి పాఠకులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వాటికి ఆదరణ లభించిన సూచనలు కనిపించడం లేదు. తెలుగులో వాటిని అనువదించి లేదా అనుసరించి అందించలేనప్పుడు అదే పదజాలాన్ని వాడడం కూడా చూస్తాం.

నిజానికి, దినపత్రికలకు సంబంధించి ఒక విషయాన్ని చెప్పాలి. ప్రతి వ్యక్తికీ తనదైన వ్యక్తీకరణ విధానం లేదా భాషా శైలి ఉంటాయి. కొంత మంది వ్యక్తుల సమూహం ఓ దినపత్రికలో పనిచేస్తుంది. ఆ సమూహం పత్రికలో ఏకరూపత కలిగిన భాషను, వ్యక్తీకరణ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. దీన్నే పత్రికకు సంబందించి భాషా శైలి (స్టయిల్ షీట్) అంటారు. తెలుగు దినపత్రికలు ఈనాడును మినహాయిస్తే ఇలాంటి స్టయిల్ షీట్‌ను నిర్మించుకున్నట్లు లేదు.

తెలుగులోని దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలకు జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. ఈ జర్నలిజం స్కూళ్లలో కొత్తవారికి వివిధ విషయాల మీద అవగాహన కల్పించడంతో పాటు భాషాప్రయోగానికి సంబంధించిన శిక్షణ కూడా ఇస్తారు. ఆ భాషా ప్రయోగం విషయంలో ఈనాడు సాధించిన ఏకరూపత లేదా తనదైన ప్రత్యేక శైలిని మరో పత్రిక సాధించినట్లు కనిపించదు.

వ్యక్తీకరణలో ఏకరూపత లేదా సామాన్యీకరణ కోసం బూదరాజు రాధాకృష్ణ ఈనాడు భాషా స్వరూపం అనే పుస్తకం రాశారు. అంటే ఈనాడుకు ఓ స్టయిల్ షీట్‌ను రూపొందించారు. అలా సాధారణీకరించాల్సిన అవసరాన్ని బూదరాజు రాధాకృష్ణ ఇలా చెప్పారు - "ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శైలి ఉండే మాట నిజం. అయితే పత్రికా ప్రచురణ ఎవరో ఒక వ్యక్తి చేయగలిగింది కాదు. అందులోనూ దినపత్రికల విషయంలో అసలు సాధ్యం కాదు. రకరకాల అనుభవాలూ, విద్యాసంస్కారాలు ఉన్న వ్యక్తులు పత్రికల్లో పనిచేస్తుంటారు. వారంతా ఒక ప్రాంతంవారు గాని, ఒక మతం వారు గాని కారు. విద్య, కులం, మతం, వృత్తి, ప్రాంతం వంటివన్నీ భాషలో బేధాలు తెచ్చిపెట్టేవే. భాషలో ఉన్న ప్రత్యేకత వైవిధ్యంలో ఏకత్వం, భిన్నవ్యక్తులు రాసే భాషలో ఏకత్వం సాధించటం అంటే భిన్న మాండలికాల నుంచి ఒక సాధారణ భాషా లక్షణాన్ని ఏర్పరుచుకోవటమే. ఒకే పత్రిక భిన్న ప్రాంతాల నుంచి ఏక కాలంలో వెలువడేటప్పుడు ఆ పత్రికా భాషలో సాధ్యమైనంత ఏకరూపత లేకపోతే అది ఒకే పత్రిక అనిపించదు. అందువల్ల అందరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలి. ప్రపంచ భాషా పత్రికలన్నింటికీ భాషా విషయకంగా కూడా కొన్ని నియమనిబంధనలున్నాయి. అలాగే ఈనాడుకూ కావాలి".

ఏకరూపత సాధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతూనే - నియమం చేసినంత సులభంగా పాటించడం సాధ్యపడదు. అందుకు ప్రయత్నం, సాధన అవసరం. నియమంలో గొప్ప ప్రయోజనాలున్నాయి. మొదటి ప్రయోజనం సంయమనం. రెండోది ఏకరూపత. మూడోది నాది అనే భావన నుంచి మనది అనే అభిప్రాయానికి మారడం. నాలుగో బహుజన సమ్మతి అని అన్నారు.

బహుజన సమ్మతి కోసం దినపత్రికలు విశేషమైన భాషా సేవ చేశాయి. కొత్త పదజాల సృష్టితో పాటు అనువాదం ద్వారా కొత్త పదజాల సృష్టి కూడా దినపత్రికలు చేసిన సేవలో ఇమిడి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో భాషను సరళీకరించడం ఉంది. సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిలో వార్తలను అందించాలనే లక్ష్యంలో భాగంగా భాషా సరళీకరణ జరుగుతూ వచ్చింది. ఈ ప్రక్రియలో వ్యాకరణ నియమాలను కూడా ఉల్లంఘించి, దినపత్రికలకు ప్రయోగాలు చేసి, విజయం సాధించాయి.

తెలుగు దినపత్రికల గురించి డాక్టర్ జె. చెన్నయ్య తెలుగు దినపత్రికలు - భాషా సాహిత్య స్వరూపం అనే మంచి పరిశోధనా గ్రంథాన్ని అందించారు.

పత్రికలకు నిత్యం ఓ యజ్జంలా సాధించే లక్ష్యాలు - సాధాకరీకరణ, సరళీకరణ, క్లుప్తత.

ఇందుకు గాను కొత్త పదజాలం సృష్టి, ఇతర భాషల సాంకేతిక పదాల అనువాదం, పాత పదాలను కొత్త అర్థంలో వాడడం, ఇతర భాషా పదాలను తెలుగు భాషాస్వరూపానికి అనుగుణంగా మార్చుకుని వాడుకోవడం.

 Telugu language in daily news papers

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇతర భాషల్లోని సాంకేతిక పదాలను తెలుగులోకి తేవడం అత్యంత క్లిష్టమైన పని. వాటిని తెలుగులో అర్థస్ఫురణ చెడకుండా వెంటనే అర్థమయ్యే విధంగా మలుచుకోవడం చాలా క్లిష్టమైన పని. అయితే, నిరంతరం ఆ ప్రయత్నం, ప్రయోగం జరుగుతూనే ఉంటుంది.

Cell Phone- సంచారవాణి అని, Outsource - పొరుగుసేవ అని అనువాదం చేసి అప్పుడప్పుడు వాడుతున్నప్పటికీ అవి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అలాగే Facebookను ముఖపుస్తకం అని అనువాదం చేస్తున్నారు. కానీ ఇది కూడా అంతగా ప్రజలకు పట్టలేదు.

తాజాగా, కాంట్రాక్టర్ అనే పదాన్ని గుత్తేదారుగా వాడుతున్నారు. ఇది మెల్లగా ప్రజల్లోకి వెళ్తున్నది. కాన్వాయ్ అనే పదాన్ని వాహనశ్రేణిగా అనువాదం చేయడం కూడా ఉంది.

సరళీకరించే ప్రక్రియ కూడా క్రమంగా జరుగుతూ ఉంటుంది.

Finance ministerను విత్త మంత్రిగా అనువాదం చేసేవారు. తెలుగు పత్రికలు ఆవిర్భంచి కాస్తా ప్రాచుర్యంలోకి వచ్చిన దశలో సంస్కృత పదజాలం ఎక్కువ అనువాదానికి వాడడం ఉండేది. ఇప్పుడు విత్త మంత్రిని ఆర్థిక మంత్రి అంటున్నారు. ఇలా సరళీకరణ పొందడం ఉంది.

Gold medalకు స్వర్ణపతకం, smokingకు పొగ తాగడం, cabinetకు మంత్రివర్గం స్థిరపడిపోయాయి. ఆంగ్లపదాలకు సమానమైన పదాలను ఎంచుకుని, వాటిని స్థిరీకరించే పని కూడా పత్రికలు చేస్తాయి.

ఇదిలావుంటే, తెలుగులో అనువైన, సులభమైన పదాలు ఉన్నప్పటికీ వాటిని కాదని ఇతర పదాలను వాడడం కూడా ఉంది. ఉదాహరణకు - drinking water అనే పదానికి మంచి నీరు అని పదాన్ని తెలుగులో వాడుకోవచ్చు. కానీ తాగునీరుగా రాస్తున్నారు. మొదట త్రాగునీరు అని రాసేవారు. సరళీకరించే ప్రక్రియలో భాగంగా అది తాగు నీరు అయింది. ఇలా పదాలను సరళీకరించడం క్రమంగా జరుగుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే రా వత్తులు ఎగిరిపోయిన పదాలు చాలా ఉన్నాయి. కొత్త వంటి పదాలు అలాంటివే.

ఇక, పత్రికారచనలో క్లుప్తత అత్యంత ప్రధానమైందని చెప్పుకున్నాం. ఈ క్లుప్తత వార్తారచనలోనే కాకుండా పదాల విషయంలో కూడా పత్రికలు అమలు చేయడం చూస్తాం. సంవత్సరం అనే పదం పెద్దగా, సంక్లిష్టంగా ఉంది కాబట్టి దానికి సమానమైన నిరుడు అనే పదాన్ని తెలుగు పత్రికలు తెచ్చుకున్నాయి. అయితే, గత సంవత్సరం అని వాడడానికి గతేడాది అని వాడుతున్నారు. కానీ, దానికి మంచి తెలుగు పదం ఉంది. నిరుడు అనే పదం వాడితే సరిపోతుంది. కానీ, ఉద్దేశ్యవూర్వకంగా గతేడాది అనే పదం వాడుతున్నట్లు కనిపిస్తున్నది.

కొన్ని పదాలను ఇతర భాషల నుంచి యథాతథంగా తీసుకోవడం ఉంది. పార్టీ, రోడ్డు, బస్సు, మాజీ, ఖరీదు వంటి పదాలను తెలుగు పదాలు కావంటే నమ్మలేనంతగా తెచ్చుకుని వాడుకుంటున్నాం.

రైలును పొగబండి అని అనువాదం చేశారు. మొదట్లో రైలు లక్షణాన్ని బట్టి ఆ పదం వాడారు. బొగ్గుతో నడవడం వల్ల పొగ వెలువరిస్తు నడిచేది. దాంతో పొగబండి అనే పదం వాడుకలోకి వచ్చింది. అయితే, విద్యుదీకరణ జరిగిన తర్వాత ఆ పదం రైలు అనే పదానికి సరైన అర్థం ఇవ్వకపోవడం వల్లనే కాకుండా రైలు అనే పదం దానికన్నా సరళంగా ఉండడం వల్ల ఈ పదమే స్థిరపడిపోయింది.

అలాగే, విమానానికి గాలిమోటారు అనే పదం కూడా ఉంది. దాన్ని వాడవచ్చు. కానీ, విమానమే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. లోహవిహంగం అనే పదం కూడా ప్రాచుర్యంలోకి రాలేదు. పలకడానికి, రాయడానికి సులువుగా ఉన్న పదాలు స్థిరపడిపోతాయి.

అదే విధంగా టూ వీలర్‌కు ద్విచక్ర వాహనం అనే పదం వాడడం చూస్తాం. బస్సులు, కార్లు మొదలైన నాలుగు చక్రాల వాహనాల విషయంలోనూ, ఆటోల వంటి మూడు చక్రాల వాహనాల విషయంలో తెలుగు అనువాదం అంత సులభంగా లేకపోవడంతో వాడడం లేదు. వాటిని అనువదించే ప్రయత్నం కూడా జరిగినట్లు లేదు.

కంప్యూటర్, ఫోన్, పార్టీ, మాజీ, ఖరీదు, పార్లమెంటు వంటి ఇతర భాషా పదాలు తెలుగు స్థిరపడిపోయాయి. మిసైల్ అనే పదానికి క్షిపణి అనే పదం మాత్రం వాడుకలో ఉంది. క్షిపణి కన్నా మిసైల్ పదం కఠినంగా అనిపించడమే అందుకు కారణం కావచ్చు.

అలాగే, తెలుగు పదాలకు ఇతర భాషా పదాలను జోడించి కొత్త పదబంధాలను తయారు చేయడం కూడా ఉంది. వేర్వేరు గ్రూపులు, ఓటర్ల జాబితా, బడ్జెట్ ప్రసంగం, హైకోర్టు న్యాయమూర్తి వంటివాటిని చెప్పుకోవచ్చు.

కాలక్రమంలో ప్రాచీనకాలంలో వాడిన పదాలను కొత్త అర్థంలో వాడడం కూడా ఉంది. సామ్రాజ్యవాదం, వ్యూహం వంటివి అటువంటివి. దీన్ని అర్థపునర్విచనమని జె. చెన్నయ్య అన్నారు.

పదానువాదాలు కూడా ఉన్నాయి. మూల భాషలోని పదాన్ని లేదా కొన్ని పదాలను అనుకరించి తెలుగులో పదాలను అనువాదం చేయడం ఉంది. రోడ్డు రవాణా సంస్థ, కుటుంబ సంక్షేమం, పర్యాటక శాఖ, ప్రాథమిక సమాచార నివేదిక, నిత్యావసర సరుకులు వంటివాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

భావానువాదం కూడా ముఖ్యమైంది. Treasury bench - అధికార పక్షం, provilege motion, సభా హక్కుల ఉల్లంఘన వంటివి.

ఆధునిక తెలుగు పత్రికా రచన అనేది గిడుగు రామ్మూర్తి పంతులు తీసుకుని వచ్చిన శిష్టవ్యవహారిక భాషా ఉద్యమాన్ని అనుసరించి సరళీకరణ జరిగింది. శిష్టవ్యవహారికం లేదా వ్యవహారిక భాష అనే దాన్ని ఆధునిక తెలుగు పత్రికా రచన ఇంకా ముందుకు తీసుకుని వెళ్లింది.

కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ముందుకు వచ్చి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర భాషనే తెలంగాణ పత్రికలు లేదా ప్రసార మాధ్యమాలు వాడాలా అనే సంశయం పుట్టింది. దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

భావజాలంతో పాటు భాష, వ్యక్తీకరణ తీరు మారాల్సి ఉంటుందనే గ్రహింపు అయితే ఉంది. కానీ, అది ఆచరణలోకి పెద్దగా వచ్చినట్లు లేదు. మొదటి తెలంగాణ పత్రికలను చూస్తే స్థానిక పదజాలాన్ని వాడడం గమనిస్తాం. అదే విధంగా క్రియారూపంలో పూర్ణస్వరానికి బదులు నకారం చేర్చి రాయడం ఉంది. ఉదాహరణకు వచ్చిండు అనే పదాన్ని వచ్చినాడు అని రాయడం ఉంది.

మౌఖిక భాషలోని ధ్వనులను లిఖిత భాషలోకి తీసుకుని రావడం అనేది సాధ్యం కాదు. కానీ, సాధ్యమైంత సామీప్యంగా ఉండే విధంగా లిఖిత భాషను వాడడమే ఇంత వరకు చేస్తున్నపని. ఇలా చూసినప్పుడు తెలంగాణ ప్రసార మాధ్యమాలు తనదైన భాషా శైలిని రూపొందించుకునే వీలుంది. నమస్తే తెలంగాణ వంటి పత్రికలు ఇటువంటి పని చేయవచ్చు.

కోస్తాంధ్ర పదాలకు సమానమైన తెలంగాణ పదాలు వాడుకలో ఉన్నాయి. క్రియారూపాలను మార్చుకోవడానికి బదులు తొలుత తెలంగాణ పదజాలాన్ని వాడడం ప్రారంభిస్తే స్థానికతా స్వభావాన్ని పత్రికకు తేవచ్చు. గోంగూరకు పుంటికూర అనే పదం ఉన్నట్లే, చాలా పదాలకు పర్యాయపదాలు ఉన్నాయి. చక్రానికి పయ్య అని వాడవచ్చు. పుస్తకానికి వొయ్యి అని వాడవచ్చు. ఇలా వాడుతూ వెళ్లడం అని అనడానికి బదులు పోవడం అనవచ్చు. ఇలా వాడుతూ పోతుంటే ఆ పత్రిక స్థానిక స్వభాలాన్ని సంతరించుకుని స్థానిక ప్రజల మనసులను దోచుకునే అవకాశం ఉంది.

కొద్ది కాలమే అయినా, విస్తృతమైనది కాకపోయినప్పటికీ హైదరాబాద్ మిర్రర్ అనే పత్రికలో ఇటువంటి ప్రయోగం కొద్ది రోజులు నడిచింది. అతివృష్టి కారణంగా పంటలన్నీ కొట్టుకుపోయి, ఇళ్లు ధ్వంసమై ప్రజలు నిరాశ్రయులు, దిక్కులేనివారు అయినప్పుడు ఏర్పడిన పరిస్థితిని చెప్పడానికి పచ్చికరువు అనే పదాన్ని వాడారు. అలాంటి పదాలను ఏరుకుని మరీ వాడడం వల్ల దానికి స్థానిక స్వభావం వచ్చింది. పాఠకులు కొద్ది మందే అయినా ఆదరణ లభించింది.

అలాంటి ప్రయత్నాలు చేయకుండా తెలంగాణ ప్రసార మధ్యమాలు ముఖ్యమైన వార్తలకు, వార్తాకథనాలకు కోస్తాంధ్ర వ్యవహారిక భాషను, పదాలను వాడుతూ స్థానిక భాషతో ప్రత్యేక వార్తాకథనాలను, కార్యక్రమాలను ఇస్తున్నాయి.

ఇదివరకు కూడా అటువంటి ప్రయోగాలున్నాయి. అంజయ్య భాషను యథాతథంగా రాయడం, ఎన్టీఆర్ భాషను యథాతథంగా రాయడం వంటి ప్రయోగాలు దినపత్రికల్లో జరిగాయి. వాటికి స్వల్ప ప్రయోజనాలు, స్వల్పకాలిక మనుగడ మాత్రమే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా తెలంగాణ ప్రసారమాధ్యమాలు తమ సొంత భాషా శైలిని రూపొందించుకోవడం అవసరం. అది ఒక్క రోజులో అయ్యేది కాదు, కానీ అసాధ్యం. క్రమంగా దాన్ని పెంచుతూ పోవచ్చు.

- కాసుల ప్రతాపరెడ్డి

(హైదరాబాద్ ఎస్వీఎస్ డిగ్రీ కళాశాల ఆగస్టు 7వ తేదీన నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో సమర్పించిన పత్రం)

English summary
Kasula Pratap Reddy in his paper submited in a state level seminar held at SVS degree college explained the evolution Telugu language in daily news papers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X