వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదో కల్చరల్ షాక్: అడుగుజాడలు అవే....

By Pratap
|
Google Oneindia TeluguNews

సి.వి.కృష్ణారావుగారు 90 వ సంవత్సరంలో అడుగుపెట్టారని తెలియగానే చాలా సంతోషమనిపించింది. మొన్న నేనూ, గంగారెడ్డీ వాళ్ళింటికి వెళ్ళాం. ఆయన్నీ, వారి శ్రీమతినీ చూసాం, పలకరించాం, కాసేపు కూచుని మా జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. తిరిగి వస్తూ అనుకున్నాం- తొంభైల్లోకి అడుగుపెట్టిన ఒక మనిషిని చూడటమంటే ఏమిటి? ఒక శతాబ్దాన్ని చూడటమే కదా!

1.

కృష్ణారావుగారు మాకు పరిచయమయ్యేటప్పటికి ఆయనకి ఏభై ఏళ్ళు. అప్పుడు నేను తాడికొండలో చదువుకుంటున్నాను. ఒక సారి సెలవులకి కాకినాడ వచ్చినప్పుడు మా అన్నయ్య సుందర్రావు 'ఈ రోజు ఒక పెద్దాయన నిన్ను వాళ్ళింటికి భోజనానికి తీసుకురమ్మన్నారు 'అన్నాడు.

75 లో మాట. అప్పుడు నాకు పదమూడేళ్ళు. ఒక హైస్కూలు విద్యార్థిని భోజనానికి పిలిచేవారుంటారు? మా అన్నయ్య మాటలు నేను నమ్మలేదు. కాని మధ్యాహ్నం నిజంగానే వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. కృష్ణారావుగారింటికి. మమ్మల్ని ఆయన గుమ్మం దగ్గరే స్వాగతించారు. కూచోమని కుర్చీ చూపించారు. అప్పుడు 'ఏదీ తమరు రాసిన కవిత ఒకటి వినిపించండి 'అన్నారు. ఆ 'తమరు 'అనే పదం గవర్న్మెంటులో చిన్న ఉద్యోగులు మరీ పెద్ద ఉద్యోగుల్ని సంబోధించడానికి వాడే పదం. కాని అది ప్రతి ఒక్కరినీ పలకరించడానికి వాడే ఇద్దరు అధికారుల్లో ఒకరు కృష్ణారావుగారు. (రెండవది మనోహర ప్రసాద్ గారు).

నా దగ్గర కవిత ఎక్కడుందీ? కాని మా అన్నయ్య తన జేబులోంచి ఒక కాగితం తీసి నాకందించాడు. అది 'చంద్రుడు మండిపోతున్నాడు ' అని నేను రాసిన కవిత. వాడు పూర్తి సంసిద్ధంగా నన్నక్కడకు తీసుకెళ్ళాడన్నమాట. ఆ కవిత చదివాను. ఆ కవితని ఆసాంతం శ్రద్ధగా విన్నారాయన. (అంత శ్రద్ధగా నా కవితను విన్న మరొక ఇద్దరు, ఒకరు నా మిత్రుడు గోపీచంద్, మరొకరు అజంతా). మందహాసం చిందిస్తూ 'ఎజ్రాపౌండ్ కవిత నాకెంత అర్థమయిందో ఈ కవిత కూడా అంతే అర్థమయింది 'అన్నారు. ఎజ్రాపౌండ్ పేరు వినడం నేనదే మొదటిసారి.

అప్పుడు భోజనం. పీట వేసి కూర్చోమన్నారు. దగ్గరుండి తినిపించారు. ఎందుకు అంత ఆదరాభిమానం చూపించారాయన? కారణం చాలా చిన్నది, చాలా చాలా పెద్దది. మా అన్నయ్య ఆయనతో నేను కవితలు రాస్తానని చెప్పాడు. ఒక మనిషి కవిత్వం రాస్తున్నాడంటే ఆయనకంత సమ్మోహం.

Vadrevu china Veerabhadrudu on CV Krishna Rao

2.

కాని కృష్ణారావుగారిలో మరో కోణం కూడా ఉందని కొన్నాళ్ళకే తెలిసొచ్చింది. 1975 లో అయిదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశమంతటా ఐ.టి.డి.ఏ లు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా మా తూర్పుగోదావరిజిల్లాలో కూడా ఐ.టి.డి.ఏ ఏర్పాటయ్యింది. మొదట్లో కొన్నాళ్ళ పాటు కాకినాడలో ఉండేది. తర్వాతరోజుల్లో రంపచోడవరం తరలించారు. ఆయన ఆ ఐ.టి.డి.ఏ కి మొదటి ప్రాజెక్టు ఆఫీసరు.

మా నాన్నగారు తూర్పుగోదావరి మన్యంలో విశాఖ సరిహద్దుల్లో శరభవరం అనే ఊళ్ళో గ్రామకరణంగా పనిచేసేవారు. ఆ ఊరితో పాటు తొమ్మిది గిరిజనగ్రామాలకు ఆయన సర్వాధికారి. ఆ మారుమూల గిరిజన ప్రాంతానికి అధికారులెవరూ వచ్చేవారు కాదు. ఒక జిల్లాకలెక్టరుగానీ,ఆర్డీవో గాని మా ఊరు రావడం నేనెప్పుడూ చూడలేదు. యెల్లవరం పేరిట అడ్డతీగెలలో ఉండే తాలూకా కార్యాలయంలో ఒక డిప్యూటీ తహసీల్ దార్ స్థాయి అధికారి తహసీల్ దారు గా ఉండేవాడు. రాజవొమ్మంగిలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఉండేవాడు. మా చిన్నప్పుడు మాకు తెలిసిన అతి పెద్ద ప్రభుత్వోద్యోగి ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మటుకే. ఆయన మా ఇంటికొచ్చి మడత కుర్చీలో కూచున్నంతసేపూ మా నాన్నగారు నిలబడే ఉండేవారు. ఆ అధికారి గిరిజనులతో మాట్లాడటంగాని, వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని పలకరించడంగాని నేనెప్పుడూ చూడలేదు.

కాని మొదటిసారి కృష్ణారావుగారు మా ఊళ్ళో అడుగుపెడుతూనే మా ఇంటికి కూడా రాకుండా (ఏ ప్రభుత్వోద్యోగి ఆ ఊరికొచ్చినా ముందు కరణంగారి ఇంటికే వచ్చేవారు)మా పక్కనుండే గిరిజనుల ఇంట్లో ఎంతొ చొరవతో, బంధువులాగా ప్రేమతో 'ఏం ముర్ల సీతమ్మా బావున్నావా, ఏమి పప్పుల గంగయ్యా బావున్నావా ' అని పలకరిస్తుంటే నేను విభ్రాంతితో ఆయన్నే చూస్తూండిపోయాను.

అది నాకు అతిపెద్ద culture shock. అది ఆ పసివయసులో నా మనసులో ఎటువంటి ముద్రవేసిందోగాని, నా జీవితమంతా నేను గిరిజనసంక్షేమ శాఖాధికారిగా గడపడం వెనక నా తండ్రితో పాటు కృష్ణారావుగారు కూడా ఉన్నారని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను.

3.

ఫణికుమార్ గోదావరి గాథలు (1989) పుస్తకానికి కృష్ణారావుగారితో పరిచయం రాయించేరు. శంకరన్,కృష్ణన్, యుగంధర్, వేణుగోపాల్ వంటి ప్రజాప్రేమికులైన సుప్రసిద్ధ అధికారులతో రాయించకుండా కృష్ణారావుగారితోనే ఆ పరిచయం రాయించడంలో ఫణికుమార్ చూపించిన విజ్ఞత గొప్పది.

ఆ పరిచయంలో కృష్ణారావుగారి రాసిన వాక్యాలు పాతికేళ్ళకు పైగా నాకు దారిచూపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాక్యాలు:

'గోండులూ, కొలాములూ, కోయవారు, నాయకపువారు, కొండరెడ్లు, బంజారాలు నివసించే ప్రాంతమిది. ఇక్కడి నీరు తీపి, కొండలు ఆశయస్ఫూర్తి, మృగసంతతి తేజస్సునిస్తాయి. మదేరునది, పుల్లంగితోటలు, గోదావరిలోయ, కొయడా కొండలు, సింగరేణిగనులు, మేడారం సమ్మక్క, మహదేవపురం టస్సర్, బాబెఝరివీరగాథ-వీటితో పరిచయం కావాలంటే కాలినడక లేక ఫోర్ వీల్ జీపు..'

'దయ్యంవాగు దాటి పసరాలో, మహబూబ్ ఘాట్ ఎక్కుతుంటే ఫోక్సుపేట పొలిమేరదాటగానే గోదావరి ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫారం నుండి ఎ.సి కోచ్ లో అడుగుపెట్టినట్లుంటుంది. ఆలొకమే వేరు.
ఆకలైతే ఆ పూట ఉడతనో, ఉడుమునో కొట్టుకురావలె;వంటిమీద గుడ్డ ఆగంతుకుని గౌరవం కోసమే కట్టుకోవలె; దుర్భాషలకు తలుపులు మూసి మితభాషులు కావలె; క్రూరమృగాన్ని జూసి భయపడరు-కాని నగరవాసుల్ని జూసి నోరుమూసుకోవలె; ఇవి గిరిజనులు పాటించే సూత్రాలు.'

'గిన్నధరి, మార్లవాయి, ఉత్నూరు,తుపాకుల గూడెం,రంగాపూరు. లవాలబందాల పంకెన, నీలంపల్లి, కొయిదా, కింద్ర, గుర్తేడుగ్రామాల్లో ఉద్యోగరీత్యా ఉండటం ఒక అనుభవం. ఒక మహదవకాశం. లిపిలేక నిక్షిప్తంగా ఉన్న సంస్కృతి, చరిత్ర వాటిది.'

'పసిపిల్లవాడు ఒళ్ళోనుంచి జారిపోయినట్టూ,ప్రాణప్రదమైన మిత్రుల్ని జ్ఞపకానుభవం, కస్తూరివాసన ఆవరించిఉంటుంది వారీని వదిలిరాగానే.'

-ఇప్పటికీ ఈ వాక్యాలు చదువుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రోజువారీ ఆఫీసు జీవితం వల్ల నా మీద నివురు ఎంత దట్టంగా పేరుకున్నా ఎవరో ఉఫ్ఫని ఊదినట్టు ఎగిరిపోతుంది.
ఆ పరిచయంలో ఆయన ప్రస్తావించిన ప్రతి ఒక్క ఊరూ, ప్రాంతమూ చూడటం గత ఇరవయ్యేళ్ళుగా నాకు నేను విధించుకున్న ఒక అసైన్మెంటు. కొన్నేళ్ళ కిందట మొదటిసారి కరీంనగర్ జిల్లలో మహదేవ్ పూర్ వెళ్ళినప్పుడు అక్కడి సహాయప్రాజెక్టు అధికారిని అడిగాను కనకనూరు ఎక్కడుందని. కొంత ట్రాక్టరుమీదా, కొంత నడిచీ వెళ్ళాం ఆ ఊరు. ఎంతో కష్టమ్మీద ఆ ఊరు వెళ్ళగానే నేను చేసిన పని కృష్ణారావుగారు రాసిన కనకనూరు చూడగలిగానని నాకు నేను చెప్పుకోవడం.

మొదటిసారి ఏటూరునాగారం వెళ్ళినప్పుడు, తుపాకుల గూడెం ఎంత దూరమని అడిగాను. ( ఫణికుమార్, వి.ఎన్.వి.కె.శాస్త్రి, ఎల్.వి.సుబ్రహ్మణ్యం వంటివారివల్ల ఏటూరునాగారం పట్ల కూడా గొప్ప క్రేజ్ ఏర్పడ్డా). తుపాకుల గూడెం నుంచి రాగానే ఒక కవిత రాయకుండా ఉండలేకపోయాను:

అడవిదారిన నాకన్నాముందు నడిచినవాళ్ళ
అడుగుజాడలు
అవే బాధలు, అదే ఆగ్రహం
అంతే నిర్లిప్తత.

వినిపించకపోతున్న ఆ పాటలింక వినజాలను
అదే ఆకలి, అవే చావులు
ఆగని పోరు.

మద్దిచెట్ల అడవిలో వైశాఖగానం లేదు
అడుగడుగునా మందుపాతర్లు.

కృష్ణారావుగారూ
ఇప్పుడది
నిజంగానే తుపాకుల గూడెం.

4.

ఒక్క గిరిజన శ్రేయోరంగంలోనే కాదు, దళిత జీవితాల్లో కూడా ఎంతో కొంత వెలుగునింపటానికి కృష్ణారావుగారు చేసింది మామూలు కృషికాదు. వరంగల్, కరీంనగర్, అదిలాబాదు జిల్లాల్లో మొదటితరం సోషల్ సర్వీసు ఇన్స్ పెక్టర్ గా ఆయన తన వృత్తికీ, ప్రవృత్తికీ మధ్య అభేదంతో జీవించాడు. 'మాదీ మీఊరే మహరాజ కుమారా (1959)', 'వైతరణి 'కవితాసంపుటాల్లో ఆయన రాసిన ప్రతి ఒక్క వాక్యం ఆయన సంపూర్తిగా నమ్మిందీ, ఆచరించి చూపించిందీను. దళిత అభ్యున్నతికోసం పోరాడుతున్న మహనీయ ఉద్యమకారులెందరో ఉన్నారు. కాని ఒక ఉద్యమకారుడిలాగా దళిత సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వోద్యోగులు ఎందరో లేరు. వాళ్ళల్లో నాకు బాగా తెలిసిన వ్యక్తి కృష్ణారావుగారు మటుకే.

తన 'కిల్లారి' (1996) కావ్యానికి నన్ను ముందుమాట రాయమని అడిగినప్పుడు 'ఒక లక్ష బొటమన వేళ్ళు చదివినవాడు 'అని రాసాను. మునిపల్లె రాజుగారికి ఆ శీర్షిక ఎంతో నచ్చింది. కాని ఆ పదబంధం కృష్ణారావుగారిదే. తన 'వైతరణి ' (1968) కావ్యానికి ముందుమాటలో ఆయనిట్లా రాసుకున్నారు:

'వాళ్ళు..గుడిశముందు మురికిగుంటల ఒడ్డున నులకమంచం కోడు పొందించి దగ్గరకు రావచ్చునో లేదో అనే భయభ్రాంతి పొడుస్తుంటే సగం చెప్పి సగం చెప్పక పూర్తిగా బాధ చెప్పటానికి మాటలు రాక అర్జీ రాసుకోవటానికి ఇళ్ళల్లో కాగితం లేక చేతుల్లో కలాలు లేక ఏకలవ్యుల్లా నాకు వారి బొటిమనవేళ్ళిచ్చారు. ఒక లక్ష బోటిమనవేళ్ళు నేను వ్రాశాను-చదివాను.ముదుసళ్ళవీ, వయస్కులవీ, స్త్రీలవీ, పురుషులవీ, ఆరోగ్యవంతులవీ, రోగులవీ, పాపలవీ, వీరులవీ..'

వాస్తవమూ,మెటఫర్ ఇంత అద్భుతంగా ఒక్కటైపోయిన సాహిత్యవాక్యాలు చాలా అరుదుగా కనబడతాయి.

సాహిత్యంలోనూ, ఉద్యోగంలోనూ కూడా ఒక్కలాగే బతకాలనే నా తపనకి కృష్ణారావుగారే దిక్సూచి.పదిహేనేళ్ళ కిందట, రాజకీయమైన ఒత్తిడివల్ల నన్ను శ్రీశైలం నుంచి బదిలీ చేసి హెడ్ క్వార్టర్స్ లో ఎవరూ కూచోడానికి ఇష్టపడని ఒక పోష్టులో నియమించారు. ఆ మాట కృష్ణారావుగారికి చెప్తే తాను అప్పటికి పాతికేళ్ళకిందట ఆ పోష్టులో పనిచేసాననీ,అందులో భాగంగానే మొదటిసారి చెంచుప్రాంతం చూసాననీ చెప్పారు. కృష్ణారావుగారు కూర్చున్న కుర్చీలో నేను కూర్చున్నానని తెలియగానే ఆ పోష్టుపట్ల నాకు చెప్పలేనంత ఆరాధనాభావం రేకెత్తింది.

క్షేత్రస్థాయి కార్యకర్తగా, అధికారిగా కృష్ణారావుగారు కాలంకన్నా ఎంతో ముందున్న వ్యక్తి. ఆయన్ను చూసే నేను నా ఆఫీసు గది తలుపులెప్పుడూ తెరిచి ఉంచడం నేర్చుకున్నాను. మనల్ని ఎవరేనా ఎప్పుడేనా కలవచ్చును, మన గదిలోకి రావడానికి ఎవరూ చీటీపంపనక్కర్లేదు, ఎవరూ చెప్పులు విడిచి రానక్కర్లేదు, మనని చూసి వాళ్ళు నిలబడటం కాదు, వాళ్ళు వచ్చినప్పుడూ, వెళ్ళినప్పుడూ మనమే లేచినిలబడాలనేది కృష్ణారావుగారు జీవితమంతా ఆచరించి చూపించింది.

తపాల్లో ఉత్తరాలు వచ్చినప్పుడు ఎంత పెద్ద అధికారైనా చేసేది ఆ ఉత్తరం మీద ఒక పొట్టి సంతకం పెట్టడం. ఆ తర్వాత పనంతా ఆఫీసు చూసుకుంటుందనేది అందరూ భావించేదే. ఈస్టిండియా కంపెనీ రోజుల్లో టాటెన్ హాం అనే వాడు రూపొందించిన జిల్లా కార్యాలయాల మాన్యువల్ పరిధినుంచి ఇప్పటికీ మన ప్రభుత్వం బయటపడలేదు, ఒక్క కృష్ణారావుగారు తప్ప. ఆయన తపాల్లో ఉత్తరం చూడగానే వెంటనే ఆ ఉత్తరం వెనక పక్క జవాబు రాసేసి దాన్నే టైపు చేసి పంపమనేవారట. టైపు కూడా లేకపోతే, కార్బన్ పేపర్ పెట్టి ఒక కాపీ తీసి పంపెయ్యడమే. ఒకవైపు రాసి, మరోవైపు ఖాళిగా ఉండే పాతకాగితాలమీదనే బీదవాళ్ళ సంక్షేమకార్యక్రమాల ఉత్తరప్రత్యుత్తరాలు నడవాలనీ, వాళ్ళడబ్బుని జిరాక్సు కాగితాలకోసం వృథాచెయ్యకూడదనీ నమ్మిన మనిషి. తాను కాంప్ కి వెళ్తే తన జీపులోనే మొత్తం ఆఫీసు సిబ్బందిని తీసుకుపోయేవాడు. ఒక కాంపుకోసం ఒకటికన్నా ఎక్కువ బళ్ళు ఉపయోగించకూడదని నమ్మినమనిషి.

మొన్న కృష్ణారావుగారి శ్రీమతి చెప్తున్నారు. తామొకొసారి గిన్నెధరి కాంపుకి వెళ్తే అక్కడి చింతచెట్లు పచ్చగా చిగురించి ఉన్నాయట. అక్కడే అన్నం వండుకోవడం కాబట్టి అక్కడి గిరిజనుల్ని చింతచిగురు కొయ్యమని అడిగారట ఆవిడ. వాళ్ళు కోసిచ్చారు. అది చూసిన కృష్ణారావుగారు కోపం పట్టలేకపోయారట. మనం గిరిజనులకి ఇవ్వడానికి వచ్చామా, వాళ్ళనుంచి తీసుకోవడానికి వచ్చామా అని ఆ చింతచిగురు వాళ్ళకిచ్చేసిందాకా ఊరుకోలేదట.

ఈ మాటలన్నీ ఇప్పటి ప్రభుత్వోద్యోగులెవరైనా చదివితే నమ్మశక్యంగా ఉండవని నాకు తెలుసు.

5

దళితులకోసం,గిరిజనుల కోసం పనిచేసిన కృష్ణారావుగారిది సంపూర్ణ జీవితం. కాని ఆయన మరొక వర్గం కోసం కూడా పనిచేసారు. వాళ్ళు కవులు. కృష్ణారావుగారి దృష్టిలో కవులు కూడ మూగజీవులే. వాళ్ళని కూడా వెన్నుతట్టాలి, ఆదరించాలి,సేదతీర్చాలి,రెక్కలు దువ్వి విహాయసం లోకి ఎగరెయ్యాలి.

తాను స్వయంగా అగ్రశ్రేణి కవి అయిఉండికూడా ఆయన తోటికవుల్ని పెద్ద చెయ్యడం కోసం తనెప్పుడూ రెండవవరసలోనే ఉండిపోయారు. తాను పనిచేసిన ప్రతిచోటా నెలనెలా వెన్నెల పేరిట కవిరచయితల్తో సమావేశాలు నడిపేవారు. ఆయన కాకినాడలో ఉన్నప్పుడు అటువంటి సమావేశాలు గోదావరిజిల్లాలో ఎంత కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చాయో నేను కళ్ళారా చూసాను.

హైదరాబాదులో 5/ఎ, పోట్టి శ్రీరాములు నగర్ ఆధునిక కవిత్వవికాసంలో ఎటువంటి పాత్రనిర్వహించిందో అందరికీ తెలుసు. ప్రొ.అడ్లూరి రఘురామరాజు తరచూ అంటూంటారు: కృష్ణారావుగారు ఒక లాంచింగ్ పాడ్ లాంటివాడు అని. నేడు తెలుగు కవిత్వసీమలో శక్తిమంతులైన కవులుగా ప్రసిద్ధులైనవారెందరో తమ ప్రారంభదినాల్లో కృష్ణారావుగారి ప్రోత్సాహం మీదనే రెక్కలు విప్పారనడం అతిశయోక్తి కాదు.

ఆయన కవి మాత్రమే కాదు, జిజ్ఞాసి కూడా. ఆయన ఆంత్రొపాలజిస్టు కాడు,కాని ఆదివాసుల గురించి మానవవిజ్ఞానవేత్తలకెంత తెలుసో ఆయనకి అంతకన్నా ఎక్కువ తెలుసు. అయినా కూడా నేను గిరిజన సంక్షేమ శాఖలో చేరుతున్నానని ఉత్తరం రాయగానే ఎ.ఎల్. క్రోబర్ రాసిన 'యాంత్రొపాలజి 'చదవండి అని రాసారాయన! ఇప్పుడు తొంభై ఏళ్ళ వయసులో 'మాడర్నిజం టు పోస్ట్ మాడర్నిజం బ్లాక్ వెల్ కంపేనియన్ 'కావాలని పట్టుబడితే తీసుకెళ్ళాను. అది చూసి నాకు ఫ్రాయిడ్ 'ఇంటెర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్ 'కూడా మరొకసారి చదవాలని ఉంది, పంపిస్తారా అనడిగారు.

నా నీటిరంగుల చిత్రం పుస్తకం పంపిస్తే నాలుగుపేజీల సమీక్ష ప్రజాశక్తికి పంపించారు, అది అచ్చయినట్టు కూడా ఆయనకు తెలియదు. కవిత్వాన్ని ప్రేమించడమంటే,కవుల్ని ఇష్టపడటమంటే అది.

ఈ వాక్యాలు చదివాక ఆయన్ని పలకరించాలని ఉందా, ఫోన్ చెయ్యకండి, ఒక ఆదివారమో,సెలవుదినమో, వాళ్ళింటికి వెళ్ళండి ( 103, బాబూ టవర్స్, చైతన్యపురి, ఫోన్: 040-24044262),వెళ్తూ వెళ్తూ మీరు రాసిన కవితనో, మీకు నచ్చిన కవితనో జేబులో పెట్టుకు వెళ్ళడం మరిచిపోకండి.

- వాడ్రేవు చినవీరభద్రుడు

English summary
A prominent Telugu writer Vadrevu China Veerabhadrudu express his feeling and experiences with CV Krishna Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X