వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వట్టికోట నవలలు - స్త్రీ పాత్రలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Women characters in Vattikota Alwaru Swami's novels
తెలంగాణ నవలకే కాకుండా తెలుగు నవలకు కూడా వట్టికోట ఆళ్వారుస్వామి తన రెండు నవలల ద్వారా ఓ మహత్తరమైన విషయాన్ని అందించాడు. అది వ్యక్తిగతానికి, సామాజానికి మధ్య ఉండే మౌలిక సంబంధం. దానివల్లనే వట్టికోట ఆళ్వారుస్వామి నవలల్లో పరివర్తన, పరిణామం చెందే పాత్రలను చూస్తాం. ఒక నిర్దిష్ట కాలంలో పరిస్థితుల ప్రభావంతో పరిణామం చెందే సజీవమైన పాత్రలను చూస్తాం. అంటే, వస్తు ప్రాధాన్యం పేరుతో ఆయన ఫ్లాట్‌ క్యారెక్టర్స్‌ను (మూస పాత్రలను) సృష్టించలేదు. రౌండ్‌ క్యారెక్టర్స్‌ను సృష్టించాడు. ప్రజల మనిషి నవలలో గానీ గంగు నవలలో గానీ ఆయన నేల విడిచి సాము చేసే పాత్రలు కనిపించవు. నిజానికి, ఆయన నవలల్లో కథానాయకులు, కథా నాయికలు లేరు. అన్ని పాత్రలకూ ప్రాధాన్యం ఉంది. ఓ పాత్రను తీసేసి మరో పాత్రను ప్రవేశపెట్టలేం. ఆయన నవలల్లోని స్త్రీ పాత్రలకు కూడా అదే వర్తిస్తుంది.

సామాన్యమైన స్త్రీలు గుణాత్మకమైన, విప్లవకరమైన మహిళలుగా పరిణామం చెందిన క్రమాన్ని ఆయన అత్యంత సహజంగా చిత్రించారు. అలా పరిణామం చెందడం అది తెలంగాణ విమోచనోద్యమ కాలం కాకపోతే సాధ్యమయ్యేది కాదు. '1935-40 మధ్య కాలం కాకపోతే అది సాధ్యమయ్యేది కాదు' అని వరవరరావు అనడం అందుకే.

అయితే, ప్రజల మనిషి నవలలో స్త్రీ పాత్రలు కనిపించవు. ''ఫ్యూడల్‌ దౌర్జన్యంలో భాగమైన స్త్రీలపై అత్యాచారాలు, స్త్రీల విషయంలో ఫ్యూడల్‌ వర్గ దృక్పథం ఎలా వుంటుంది అనే విషయం ప్రజల మనిషి నవలలో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు'' అని వరవరరావు తన 'తెలంగాణ విమోచనోద్యమ నవలలు' పరిశోధనా గ్రంథంలో అన్నారు. అది నిజమే. అయితే, ఆ నవలలో ఆడబాప కొడుకు రంగడు కనిపిస్తాడు. రంగడు ఫ్యూడల్‌ వ్యవస్థ స్త్రీ పట్ల కనబరిచే హీనతకు ప్రతిరూపం అయినప్పటికీ అది ప్రజల మనిషిలో అది వస్తువు కాలేదు. బహుశా, వట్టికోట నవలా రచనకు ఎంచుకున్న కాలం కూడా అందుకు కారణమై ఉంటుంది.

తాము సాగు చేసుకుంటున్న భూమిలో దొర అరకలు కట్టిస్తే తన మనవడ్ని ఎత్తుకుని అడ్డం వెళ్లిన అన్నమ్మ పాత్ర ప్రజల మనిషి నవలలో ఉంది. తన వ్యక్తిగత సమస్యను ఎదుర్కోవడానికి అనివార్యంగా ఆమె ఆ పాత్ర పోషిస్తుంది. ఆ వ్యక్తిగత సమస్య సామాజిక సమస్యగా ముందుకు వచ్చిన తర్వాత ఆమె ఉద్యమంలో నిర్వహించే పాత్ర ఏమిటనేది నవలలో లేదు. తన వ్యక్తిగత సమస్యను ఉద్యమంతో మమేకమై ఆమె పరిష్కరిచంకుని ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నవలలో ఉద్యమానికి నాయకత్వం వహించిన కంఠీరవమే తన తల్లి, తన వదిన సమస్యలను పరిష్కరించడానికి పూనుకోవడం చూస్తాం. ఆ రకంగా స్త్రీ చైతన్య స్థాయి 1940కన్నా ముందు అంతకన్నా ఎక్కువ లేదని భావించడానికి వీలుంది. 1938లో స్టేట్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావానికి ముందు పరిస్థితులను ఆధారం చేసుకుని రాసిన నవల ప్రజల మనిషి. గంగు నవల 1940 - 45 మధ్యకాలంలోని తెలంగాణ ప్రజా రాజకీయాలను చిత్రించిన నవల.

గంగు నవల విషయానికి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతుల్లోకి వచ్చింది. ఆనాటికి తెలంగాణలోని స్త్రీలు కూడా చైతన్యం పొంది ఉద్యమంలోకి రావడం చూస్తాం. సమాజం మొత్తం కదిలిపోయి వర్గ స్వభావాలను బయటపెట్టుకునే సందర్భానికి, సన్నివేశానికి పరిస్థితులు వచ్చాయి. అదే గంగు నవలలో కనిపిస్తుంది. స్త్రీలు తమను తాము విముక్తం చేసుకుంటూ సమాజాన్ని విముక్తం చేసే దిశగా పయనిస్తారు. అయితే, ఇదే సమయంలో వట్టికోట ఆళ్వారుస్వామి ఫ్యూడల్‌ వ్యవస్థలోని భూస్వాముల కుటుంబాల్లోని పాత తరం మహిళలు మారిపోయి ఉద్యమం వైపు వచ్చినట్లుగా చిత్రీకరించలేదు. అలా చిత్రించి ఉంటే ఔచిత్యం దెబ్బ తిని ఉండేది. అంటే దొరల భార్యలు తిరుగుబాటు చేసినట్లుగా చూపించలేదు. గంగు నవలలో ఇద్దరు అటువంటి స్త్రీలు ఉన్నారు. వారు రత్నమ్మ, జానకమ్మ. అయితే, వీరిద్దరి వ్యక్తిత్వం, నడవడిక ఒకే రకంగా లేవు. అలా ఉండకపోవడానికి ఇద్దరు దొరల వ్యక్తిత్వం, నడవడిక కారణంగా మనం చూడవచ్చు. బొత్తలగూడెం జగ్గయ్య దొర మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సిద్ధపడని కరుడు గట్టిన ఫ్యూడల్‌ భూస్వామి అయితే, మద్దిమెట్ల దొర వెంకటరావు మారుతున్న పరిస్థితులను గ్రహించి అందుకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ తన ఆధిపత్యం, సంపద పోకుండా కాపాడుకోవడానికి ఉదారవాద ఫ్యూడల్‌ భూస్వామికి ప్రతినిధి. ఈ ఇద్దరి దోపిడీ, ఆధిపత్య రూపాల్లో తేడా లేకపోయినా ఆచరణలో తేడా కనిపిస్తుంది.

వెంకట్రావు ముందు చూపు ఉన్నవాడు. అందుకే వీరమల్లయ్య గాంధేయవాదాన్ని అనుసరించినప్పుడు తోడుగా నిలబడుతాడు. ఖాదీ కేంద్రానికి సహకరిస్తాడు. అయితే, అది తన ఆధిపత్యానికి అడ్డం వస్తుందని భావించినప్పుడు దాన్ని మూసేయించడానికి కూడా వెనుకాడడు. కానీ, ఎందుకైనా మంచిదని చరఖాలను భద్రపరుస్తాడు కూడా. తన కూతురు సుజాతను పట్నం పంపించి చదివిస్తాడు. ఈ ముందు చూపు ఉన్న వెంకటరావు భార్య జానకమ్మ, జగ్గయ్య దొర భార్య రత్నమ్మ వ్యక్తిత్వాల్లో ఆ తేడా నవలలో స్పష్టంగా రూపుదిద్దుకుంది. ఫ్యూడల్‌ వ్యవస్థలో అణచివేతకు గురై తన భర్త ఓటమిని, నాగభూషణం విజయాన్ని రహస్యంగానే కాకుండా తన మాటల ద్వారా ఆనందించే మహిళగా రత్నమ్మ రూపుదిద్దుకుంది. ఓ సాడిస్టుగా మనకు ఆ పాత్ర కనిపిస్తుంది. ఒక రకంగా తనకు తెలియకుండానే పరిస్థితుల కారణంగా దొరపై అంతర్గతంగా పగ తీర్చుకోవాలనే మనస్తత్వాన్ని ఆమె పొందింది. కంసాలి నాగభూషణంతో ఆమె సంబంధంలో కూడా శారీరక అవసరం కన్నా అదే ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర స్త్రీలతో తన భర్త లైంగిక వాంఛలు తీర్చుకుంటూ తనను పట్టించుకోకపోవడం అనే దుస్థితి ఆమెను నాగభూషణం వైపు ఆకర్షితురాలిని చేయడమే కాకుండా, నాగభూషణం తన భర్తపై సాధించిన విజయాన్ని ఆనందించేలా చేసింది. ఒక రకంగా బానిసత్వం నుంచి బయటపడడానికి ఆమె ప్రయత్నించడానికి తగిన పరిస్థితులు ఆమెకు ఎదురు కాలేదు. అందుకే ఫ్యూడల్‌ వ్యవస్థలో స్వీయ విధ్వంసం వైపు పయనించిన మహిళకు ప్రతినిధిగా ఆమెను చెప్పుకోవచ్చు. ఫ్యూడల్‌ వ్యవస్థ ఆత్మ విధ్వంసానికి ప్రతీకగా కూడా ఆమె పాత్రను తీసుకోవచ్చు. ఆమె మారడానికి అనువైన పరిస్థితులు ఆ కుటుంబంలో చోటు చేసుకోలేదు. జాతీయోద్యమ భావజాలాలు గానీ ఆంధ్ర మహాసభ పరిణామాలు గానీ ఆమె కుటుంబంలోకి చొరబడలేదు. జగ్గయ్య దొరను మాత్రం అవి కుదిపేశాయి. ఆ పరిణామాలేవీ రత్నమ్మను తాకలేదు. నిజానికి, ఆమె ఓ విషాదమూర్తి.

ఆ రకంగా చూసినప్పుడు వెంకట్రావు దొర కుటుంబం పరిస్థితి వేరు. అతను తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ కొత్త దోపిడి రూపాలను సొంతం చేసుకోవడానికి ముందుచూపుతో వ్యవహరిస్తున్న భూస్వామిగా కనిపిస్తాడు. అతను ప్రజాస్వామికవాదిగా, ఫ్యూడల్‌ వ్యవస్థలో ఉదారవాదిగా కనిపిస్తాడు. లైంగిక దోపిడీతో పాటు అన్ని రకాల దోపిడీలు సాగిస్తూ కూడా వాటి రూపాలను మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. విలువలు మాత్రం మారవు. కూతురు సుజాతను చదివిస్తాడు. జాతీయోద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ ఆయన భార్య జానకమ్మలో కూడా కనిపిస్తాయి. అందుకే, ఆమె విలువలను నిర్దేశించే అధికారిక పాత్ర నిర్వహిస్తుంది. రత్నమ్మలో కనిపించే అసంతృప్తి, అసహనం, వేదన జానకమ్మలో కనిపించవు. సమాజం సక్రమంగానే ఉందని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఆమె నిర్దిష్టపరుచుకుని వ్యవహరిస్తుంది. అందుకే, తన కూతురు సుజాతకు ఆడబాప నీలవేణి రహస్యంగా ఉత్తరాలు అందించడాన్ని స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధానికి సంబంధించిన వ్యవహారంగా చూసి, అందుకు కారణం భావించి నీలవేణిని దండిస్తుంది. తన భర్త గానీ ఇతర పురుషులు గానీ పెట్టుకునే వైవాహికేతర లైంగిక సంబంధాలకు స్త్రీలు మాత్రమే కారణమనే అవగాహనకు పరిమితమైన ఫ్యూడల్‌ వ్యవస్థలోని స్త్రీగా జానకమ్మను చూడవచ్చు.

ఇలా ఫ్యూడల్‌ వ్యవస్థలో అధిపత్య లేదా ఆగ్రవర్ణ స్త్రీల పట్ల జరుగుతున్న అణచివేతకు ప్రతిరూపాలుగా ఈ రెండు పాత్రలు రూపుదిద్దుకున్నాయి. ఆ పాత్రలు నవలలో వాటి పరిధుల్లో మాత్రమే వ్యవహరించడం వట్టికోట ఆళ్వారుస్వామి సాధించిన పాత్రోచిన ఔచిత్యం.

ప్రజల మనిషి నవలలో రామభూపాల్‌ రావు దొర భార్య చిత్రీకరణ రచయితకు కథను నడపడానికి అవసరం లేకుండా పోయింది. అయితే, పరిణామాలు కూడా వేగంగా మారడం, అన్ని వర్గాల్లో చైతన్యం పాదుకోవడం, సామాజిక రంగంలో మహిళల పాత్ర పెరడగ వంటి కారణాల వల్ల వట్టికోట ఆళ్వారుస్వామి స్త్రీ పాత్రలకు గంగు నవలలో ప్రాధాన్యం ఇచ్చి ఉంటాడు. పైగా, ప్రజల మనిషి కన్నా గంగు నవల కాన్వాసు పెద్దది. దానివల్ల కూడా స్త్రీ పాత్రలకు ఆయన ప్రాణం పోసి ఉంటాడు. గంగు నవలలోని సుజాత పాత్రకు సత్యవతి అనే అప్పటి యువతి ప్రేరణ అనేది వెలుగులోకి వచ్చిన విషయం.

వరవరరావు గంగు నవలలోని మహిళలను మూడు రకాలుగా విభజించి వివరించారు. 1. భూస్వామ్య వ్యవస్థలో స్త్రీ 2. స్త్రీ - నూతన చైతన్యం 3. సామ్యవాద దృష్టిలో స్త్రీ.

భూస్వామ్య వ్యవస్థలో భాగమై కూడా అణచివేతకు గురవుతున్న మహిళలుగా రత్నమ్మ, జానకమ్మ కనిపిస్తే, మిగతా స్త్రీలు వరవరరావు మాటల్లోనే చెప్పాలంటే - 'ఆంధ్ర మహాసభ తెచ్చిన నూతన చైతన్యానికి, ఫ్యూడల్‌ అణచివేత ధిక్కారానికి ప్రతినిధులు' అలాంటి స్త్రీ పాత్రలు అంతమ్మ, సుజాత, నీలవేణి.

ఆ ముగ్గురు స్త్రీలు నిర్వహించిన పాత్రను కూడా ఆయన నిర్వచించారు. ఆంధ్ర మహాసభ రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో నాగభూషణం కుటుంబం కుటుంబంగా పాల్గొనడానికి చొరవా, పూనికా అంతమ్మ నుంచి వచ్చిందని ఆయన చెప్పారు. భూస్వామ్య వ్యవస్థలో పుట్టి భూస్వామ్య వ్యవస్థకు చిచ్చు పెట్టిన స్త్రీగా సుజాతను ఆయన చెప్పారు. తనను తాను విముక్తి చేసుకుంటూ సుజాతకు కూడా విముక్తి కలిగించిన స్త్రీగా ఆడబాప నీలవేణి కనిపిస్తుంది. ఈ ముగ్గురిలో అంతమ్మ, నీలవేణి తమ వ్యక్తిగత సమస్యలను తీర్చుకోవడంతో ప్రారంభమై సమాజానికి విముక్తి కలిగించడానికి జరిగే ఉద్యమంలో భాగస్వాములవుతారు. సుజాత ఊహాజనిత ఆదర్శవాదం నుంచి ప్రారంభమై ఆచరణాత్మక ఆదర్శవాదం వైపు పయనిస్తుంది. ఈ రకంగా వ్యక్తిగతానికీ సమాజానికీ మధ్య గల సమస్యను లేదా ఆత్మాశ్రయానికీ వస్త్వ్రాశ్రయానికి మధ్య గల తేడాను వట్టికోట ఆళ్వారుస్వామి అర్థవంతంగా, సృజనాత్మకంగా పరిష్కరించారు. ఈ విషయంలో విఫలమైన రచనలే పఠనయోగ్యతను కోల్పోతున్నాయి.

నీలవేణి, అంతమ్మ తమ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం వెతుక్కునే క్రమంలో, తమను తాము ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి విముక్తం చేసుకునే క్రమంలో ఉద్యమాన్ని ఆలంబన చేసుకుని, మరింత మందిని విముక్తం చేయడానికి సిద్ధపడిన స్త్రీలుగా రూపుదిద్దుకున్నారు. సుజాత తనను విముక్తి చేసుకోవడానికి నీలవేణిని ఆలంబనగా చేసుకుని ఇతరులను విముక్తం చేయడానికి సిద్ధపడి ఉద్యమంలోకి వస్తుంది. వచ్చీరావడంతోనే ఆమెకు నాయకత్వం వస్తుంది, ఆమెకు ప్రచారం కూడా వస్తుంది. ఈ విషయంలో కూడా వట్టికోట ఆళ్వారుస్వామి వాస్తవికతకు దూరం జరగలేదు. ఎక్కువగా అగ్రవర్ణాలవారే తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వ స్థానంలో ఉండడానికి, మిగతావారు ప్రచారానికి, కార్య రంగానికి పరిమితం కావడం చూస్తాం. ఇది వట్టికోట ఆళ్వారుస్వామి దార్శనికతకు నిదర్శనం. పరిస్థితుల, వర్గాల లేదా వర్ణాల క్రమోన్మీలాన్నీ, పరిస్థితుల పరిణామ క్రమాన్నీ లేదా సామాజిక పరిణామ క్రమాన్నీ ఆయన సరిగ్గా పసిగట్టిన రచయితగా వట్టికోట మనకు కనిపిస్తాడు.

మరో విశేషం ఏమిటంటే - తమను తాము విముక్తం చేసుకోవడానికి నీలవేణి, అంతమ్మ వంటి పీడిత వర్గ మహిళల చొరవ వారి పురుషులను కూడా విముక్తం చేసుకునే దిశగా నడిపిస్తుంది.

అంతమ్మ దొర లైంగిక దోపిడీ నుంచి తప్పించుకోవడానికి ఊరు నుంచి వెళ్లిపోయే మార్గాన్ని ఎంచుకుని, అందుకు భర్త నాగభూషణాన్ని ఒప్పిస్తుంది. దొరకు సన్నిహితుడు అయినప్పటికీ తనకూ తన కుటుంబానికీ రక్షణ ఉండదనే గ్రహింపు కారణంగా నాగభూషణం ఆమె చెప్పిన మార్గంలో నడుచుకుంటాడు. ఉద్యమ నాయకుడు నవనీతంతో పరిచయం ఆయననే కాదు, మొత్తం కుటుంబాన్ని ఉద్యమం వైపు నడిపిస్తుంది. సాధారణంగా శ్రామికవర్గ మహిళలకు ఉండే గానప్రవేశాన్ని అంతమ్మ ఉద్యమానికి వాడుతుంది. ఉద్యమానికి సాంస్కృతిక కార్యకర్తగా రూపుదిద్దుకుంటుంది. దానికితోడు, కూతురు గంగును ఆ దిశగా నడిపిస్తుంది. రచయిత కథానాయికగా తీర్చిదిద్ద దలుచుకున్న గంగు పార్టీ కార్యక్రమాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే బాలకార్యకర్తగా మనకు కనిపిస్తుంది. నవల పూర్తి కాకపోవడంతో గంగు పాత్ర ఏ వైపు, ఎలా పయనించేదో, దాన్ని రచయితగా ఏ విధంగా తీర్చిదిద్ద దలుచుకున్నాడో తెలియదు. నిజానికి, అంతమ్మది ఆత్మగౌరవ పోరాటం కూడా.

ఇక, నీలవేణికి ఉద్యమంలో పాల్గొనడం వల్ల అదనంగా పోయేదేమీ లేదు. ఫ్యూడల్‌ లైంగిక, శ్రామిక దోపిడీ నుంచి ఆమెకు విముక్తి లభిస్తుంది. దానికితోడు, సమాజంలో గౌరవం పెరిగి ఆత్మగౌరవం అలవడుతుంది. దొర కుటుంబంలోని మగ ఆడబాప రాజంతో కలిసి ఆమె ఫ్యూడల్‌ సాంఘిక దౌర్జన్యం నుంచి బయట పడిన పాత్ర నీలవేణి. రాజం విముక్తికి కూడా నీలవేణి చొరవే కారణమవుతుంది. దొర కుటుంబంలో ఉండి కూడా వీరిద్దరు పార్టీ రహస్య కార్యకర్తలుగానే పనిచేశారు. అలా పనిచేయడం కుదరని పరిస్థితులు వచ్చినప్పుడు, ఉద్యమం విస్తరించి భూస్వాములపై విజయం సాధించే సందర్భంలో బయటకు వచ్చారు. దొరకు తెలియకుండా దొరసానికి, దొరసానికి తెలియకుండా దొరకు అక్రమ సంబంధాల విషయంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసే స్థాయి నుంచి పార్టీ వ్యవహారాల విషయంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసే కార్యకర్తలుగా వారు రూపుదిద్దుకుని, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించే కార్యకర్తలుగా మారుతారు.

'గంగు నవలలో భూస్వామ్య సాంఘిక దౌర్జన్యానికి గురి కాబోయి మెలకువగా తప్పించుకున్న పాత్ర అంతమ్మ. బలియై కూడా జీవితాంతం అది తన కర్మమని దీనంగా బతకడం కాకుండా అవకాశం రాగానే మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లిన పాత్ర ఆడబాప నీలవేణి' అని వరవరరావు సూత్రీకరించారు.

ఇకపోతే, సుజాత చదువు వల్ల అబ్బిన చైతన్యంతో పేదల పట్ల, పీడితుల పట్ల సానుభూతితో వ్యవహరించే స్త్రీగా రూపుదిద్దుకుని పీడిత ప్రజలను విముక్తం చేసే ఉద్యమానికి నాయకత్వం వహించే స్త్రీగా ముందుకు వస్తుంది. నిజానికి, ఆమె హృదయ పరివర్తన సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది. ఉన్నత వర్గాలకు లేదా అవ్రర్ణాలకు చెందిన వ్యక్తులు పీడితులకు, పేదలకు అనుకూలంగా వ్యవహరించడానికి అవసరమైన హృదయ పరివర్తనను ఆమె ఆశిస్తుంది. దానివల్లనే ఆమె తన తండ్రిని మార్చడానికి పూనుకుంటుంది. కానీ, అది సాధ్యం కాదని తేల్చుకుంటుంది.

పైగా, తమ ఆడపిల్లలు హద్దులు దాటుతున్నారని, తమ చెప్పుచేతల్లో ఉండడం లేదని భావించినప్పుడు పెళ్లి చేసి కట్టడి చేయాలని పెద్దలు చూస్తుంటారు. అటువంటి పరీక్షే ఆమెకు ఎదురవుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఆమెకు నవనీతంపై ఏర్పడిన ప్రేమ, నీలవేణి సహకారం ఉపయోగపడుతాయి. చివరగా, కమ్యూనిస్టు సిద్ధాంతాచరణకు పూనుకున్న కమల ఆమెకు చేయూత పనికి వస్తుంది. గంగు నవలలో ఈ అసంపూర్తి భాగం వరకు కథానాయిక సుజాత అని వరవరరావు అన్నారు. ఉద్యమ భవిష్యత్తు పరిణామాన్ని కూడా అది సూచిస్తుంది.

సామ్యవాద దృష్టిలో స్త్రీ ఎలా వుంటుందో వట్టికోట ఆళ్వారుస్వామి కమల పాత్ర ద్వారా చెప్పాడు. సామ్యవాదాన్ని నమ్మే కుటుంబాల్లో స్త్రీల పట్ల ఇతరులకు ఉండే దృక్పథాన్ని కమల కుటుంబంలో చూస్తాం. కమల, ఆమె భర్త మధ్య జరిగే సంభాషణను సుజాత విన్నట్లుగా రచయిత చిత్రించాడు. రాబోయే సమాజంలో స్త్రీకి లభించే సమాన గౌరవం, స్వేచ్ఛను రచయిత చెప్పాడు. కమల సున్నితమైన మానవ విలువలు, సున్నితమైన భావాల విషయంలో కమల ఆవేశపరురాలుగా కనిపిస్తుంది. ఆ రకంగా కమల పిడివాద కమ్యూనిస్టుగా కాకుండా ఆవేశపరురాలైన కమ్యూనిస్టుగా కనిపిస్తుంది. అందుకే ఆమె మాట్లాడినప్పుడు వెంకట్రావు వంటి ఫ్యూడల్‌ వ్యక్తులకు నిష్టూరంగానూ ప్రజలకు ఉత్సాహగానూ ఉంటుంది.

మొత్తంగా వట్టికోట ఆళ్వారుస్వామి నవలల్లో, ముఖ్యంగా గంగు నవలలో స్త్రీ పాత్రలు నేల విడిచి సాము చేయలేదు. పరిమితులకు, పరిస్థితులకు అనుగుణంగానూ, చైతన్య స్థాయికి తగిన విధంగానూ నడుచుకుంటాయి. సందర్భాన్ని, సమయాన్ని అందుకోలేని జానకమ్మ, రత్నమ్మ వంటి స్త్రీలు ఫ్యూడల్‌ వ్యవస్థలో దీపం పురుగుల్లా మాడిమసై పోతే, అంతమ్మ, నీలవేణి, సుజాత వంటి మహిళలు వాటిని అందుకుని ముందుకు సాగుతారు. ఆ సందర్భాన్ని, కాలాన్ని ఆంధ్రమహాసభ వారికి కల్పించింది. అదే కాలమహిమ.

- కాసుల ప్రతాపరెడ్డి

(అక్టోబర్ 30వ తేదీన కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన వట్టికోట ఆళ్వారుస్వామి శత జయంతి సదస్సులో సమర్పించిన పత్రం)

English summary

 We will see evolution of women characters in Vattikota Alwaru Swami's novels Prajala Manishi and Gangu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X