వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజయోగి చెప్పులస్వామి

By Pratap
|
Google Oneindia TeluguNews

స్వామి దయానంద రాజయోగి ఒక ఊళ్లో ఊరిపక్కన ఆశ్రమంలో ఉండేవారు.

అతను ఎక్కడినుంచి వచ్చాడో ఆ ఊరివారికి తెలియదు.

ఆ ఊరి ప్రజలు అతను తినడానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి తెస్తుండేవారు.

రాజయోగి ఎవరిని ఇది కావాలని అడిగేవారు కాదు.

ఆ ఊరి ప్రజలు స్వామి దయానంద రాజయోగికి తమ కష్ఠాలు చెప్పుకొని సేద తీరుతుండేవారు.
ఆయన వారికి చిక్కులున్నప్పుడు తనకు తోచినవి చెప్తుండేవాడు.

BS Ramulu

అలా గడచిపోతున్నది.

అతని ఖ్యాతి ఇరుగు పొరుగు గ్రామాలకు పాకింది.

ప్రజల రాకపోకలు పెరిగాయి.

అందరు తమ కష్ఠాలను బాధలను చెప్పుకొనేవారు.

స్వామికి విశ్రాంతి కరువైంది.

ధ్యాన సమయం కూడా మిగిలేదికాదు.

పొద్దున లేచేసరికి ఆశ్రమం ముందు ఎందరో తనకోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉండేవాళ్ళు.
ఏమి చేయాలో తోచక ఆశీర్వదిస్తూ ఈశ్వరార్పణం, భగవదేచ్ఛ అని అంటూ ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాడు.

అయినా ఉదయం నుండి రాత్రిదాకా రకరకాల బాధలు, గాధలు, పంచాయితీలు వినేసరికి అలా విన్నవన్నీ తన మెదడుచుట్టూ తిరిగేవి.

స్వామికి రాత్రి నిదురపోయే సమయానికి నిదుర రాక బుర్ర తిరిగినట్టయ్యేది.

ఆ క్రమంలో ఆశ్రమం సమీపంలోని నారయ్య అనే రైతు పది మందిని పిలిచి ఒక కమిటీగా ఏర్పడి ఆశ్రమం ముందు పెద్ద పందిరి వేశారు.

మంచినీళ్ళు ఏర్పాటు చేశారు.

వచ్చిన ప్రజలను క్రమశిక్షణలో పెట్టేవారు.

స్వామి తనకు నిద్ర కరువవుతున్నదని నారయ్య కమిటీకి చెప్పుకున్నాడు.

దాంతో స్వామి దర్శనానికి టైమింగ్స్‌ పెట్టారు.

స్వామికి కాస్త విశ్రాంతి దొరికింది.

నారయ్య ఆ కమిటీ అధ్యకక్షుడయ్యాడు.

నారయ్యకు ఇంటిలో భార్యపోరు.

భర్త లేనప్పుడు భార్య, భార్య లేనప్పుడు భర్త ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసేవారు.

ఇలాంటి భార్యా భర్తల కీచులాటలు ఎన్ని విన్నా అవి తరిగేవి కావు.

స్వామి దయానంద అలా విని ఇలా వదిలేసినా తిరిగి అవి పట్టి వెంటాడేవి.

అసలు ఇంత కీచులాడుతూ కలసి ఎలా ఉంటున్నారో అని స్వామికి ఆశ్చర్యం కలిగేది.

అపుడప్పుడు ఊళ్లోకి, పొలాల్లోకి నిశ్శబ్దంగా వెళ్ళేవారు. వాళ్ళు చక్కగా కలసి పనిచేసుకుంటూనే ఉండేవారు.

స్వామి దయానంద ఒక విషయం గమనించారు.

మళ్ళీ వాళ్లు కీచులాటలు తనకు పంచేవాళ్ళు.

ఆనంద సన్నివేశాలు తనకు ఎందుకు చెప్పటం లేదు? కష్టాలు, కీచులాటలే ఎందుకు చెప్తున్నారు. అని ఆలోచనలోక పడ్డాడు.

తనకు వారి సంతోషాలు ఆనందాలు చెప్పుకుంటే తానుకూడా సంతోషించేవాడు కదా అనుకున్నాడు.
అడిగితే సంసార వాసనలు అంటుకున్నాయని మరేదయినా అనుకుంటారని అడగలేదు రాజయోగి.
ఆ ఆశ్రమంకెదురుగా కాస్త దూరంలో ఒక బొంద ఉంది.

అందులో ఆ వీధివాళ్లు రోజు పెంట తీసుకొచ్చి పోస్తుంటారు.

ఒక రోజు స్వామి దయానంద తీక్షణంగా ఆ పెంట బొందనే పరిశీలించారు.

ఏదో సత్యం బోదపడినట్టు అనిపించింది.

పనికిరాని వన్నీ ప్రజలు తమ మనస్సు అనే ఇంటినుంచి తెచ్చి తన మనస్సు అనే పెంట బొందలో పోస్తున్నారని అనిపించింది.

ఆ పెంట బొందలాగే తన మనస్సును ఒక పెంటబొందగా వీళ్లు మార్చేసారని అనిపించింది.
ఆ ఊరు వదలి పారిపోవాలనుకున్నారు స్వామి దయానంద.

మరో ఊళ్లోను ఇలా జరగదని ఏమిటి అనుకున్నారు.

పరిష్కారం తనకే తోచింది.

రోజు రోజుకు మౌనం యొక్క, ధ్యానం యొక్క సమయాన్ని పెంచుకుంటూ పోయారు.

ప్రజలు స్వామివారికోసం ఎదురుచూసి ఎదురుచూసి బయటకు రాకపోవడంతో దండంపెట్టి లేచి వెళ్లిపోయేవారు.

చివరకు స్వామి పూర్తిగా మౌన స్వామి అయ్యారు. మౌన స్వామి పేరు చుట్టుప్రక్కల వ్యాపించింది.
ఇంకా జనం రాక పెరిగింది.

స్వామి దయానందవారికి, కమిటీవారికి ఏమి చేయాలో తోచలేదు.

కమిటీ అధ్యకక్షుడైన నారయ్య కూతురు సరస్వతి స్వామికి సేవలు చేసి చేసి దగ్గరైపోయింది.
ఒక రోజు నారయ్య కూతురు సరస్వతిని లేవదీసుకొని రాత్రికి రాత్రే ఆఊరి నుండి వెళ్ళిపోయారు స్వామి దయానంద.

స్వామి దయానంద తన తొలి గురువును కలిసి జరిగిన సంగతి మొరపెట్టుకున్నారు.

ఆ గురువు కొన్ని సూచనలు చేశాడు.

కొంత కాలం స్వామి దయానంద సరస్వతితో కలిసి అక్కడే ఉన్నారు.

కొన్నాళ్లు వెతికి వెతికి నారయ్య కూతురుజాడ తెలుసుకున్నాడు.

స్వామిని, పెద్దగురువును బతిమాలి తిరిగి తమ ఊరికి రమ్మన్నాడు.

నారయ్య కూతురుకూడా తమ ఊరికి పోదామని పోరుపెట్టింది.

స్వామి దయానంద రాకతో ఆశ్రమం మళ్లీ చిగురించింది.

కమిటీవారు, ప్రజలు కలిసి ఆదరంగా కొత్త పందిరి వేశారు.

అలా స్వామి దయానంద రాజయోగి వారికి విశ్రాంతి దొరికింది.

సరస్వతి స్వామివారికి సమస్త సపర్యలు ఎలా జరగాలో చూసుకుంటూ వుంది.

పందిరి బయట చెట్టుకింద కమిటీ సభ్యులు డ్యూటీలు వేసుకున్నారు.

ఇది చెప్పులు విడిచే స్థలం అని స్వాగత ద్వారం ప్రక్కన చెట్టు ప్రక్కన రాశారు.
వచ్చినవాళ్లకల్లా చెప్పారు.

చెప్పులతోపాటు నీ గతాన్నికూడా ఇక్కడే వదిలేసి లోపలికి రండి అని బోర్డు పెట్టారు.

గతం వదిలేశాక ఈ మండపంలో ధ్యానం చేయండి అని చెప్పారు.

గతం వదిలేశాక ప్రజలకు స్వామికి చెప్పుకోవడానికి ఏమి మిగలలేదు.

కష్టాలు, బాధలు, కీచులాటలు, పంచాయితీలు అన్నీ చెప్పులవద్దే వదిలేసి రమ్మని చెప్పడంతో ఇంకేమడగాలో వాళ్ళకి తోచలేదు.

అందర్నీ చిరునవ్వుతో ఆశీర్వదించి పంపించేవారు స్వామీజీ.

అలా ఆ ఆశ్రమం చెప్పుల ఆశ్రమం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది.

ఆ రాజయోగిని చెప్పుల స్వామి అని ప్రజలు పిలవ సాగారు.

కొంతకాలానికి చెప్పులు విడిచినచోట గతాన్ని వదిలేస్తే చెప్పులు వేసుకున్నాక చెప్పులలాగే గతం మళ్ళీ వెంటపడదా? అని కొందరు భక్తులు ప్రశ్నించారు.

అవును వెంటపడే అవకాశం ఉంది అని అన్నారు స్వామీజీ.

దాంతో అక్కడ వదిలేసిన చెప్పులను వెళ్ళిపోయేటప్పుడు మరచిపోయినట్టుగా అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం ప్రారంభించారు భక్తులు.

కమిటీ తరఫున అక్కడ మరో బోర్డు వెలిసింది.

''మీ గతం మీకు కావాలనుకున్నప్పుడు మీ చెప్పులు మీరు తీసుకువెళ్ళండి'' అని బోర్డు పెట్టారు.
గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించాలని బుద్ధుడు చెప్పాడని స్వామీజీ పదేపదే గుర్తుచేసేవారు.
స్వామీజీ అలా ప్రజలకు మౌనాన్ని, మనశ్శాంతిని అందించారు.

అలా స్వామీజీలాగే రిషికేష్‌ స్వామి శివానంద, జిడ్డుకృష్ణమూర్తి, ఓషో రజనీష్‌, ధ్యానయోగ స్వామీజీలు మౌనంలోని శక్తిని ప్రజలకు చూపించారు.

స్వామీజీలు, ధ్యానయోగులు వదిలేసిన పని ఇవాళ చాలామందికి చుట్టుకుంది.

పార్లమెంటులు, శాసన సభలు, కోర్టులు, పత్రికలు, సినిమాలు, టీవీలు, ఎలక్ట్రానిక్‌ మీడియా రాజకీయ నాయకులు, బహిరంగ సభలు, బహిరంగ చర్చలు మొదలైన వాళ్ళంతా స్వామీజీ వదిలేసిన కర్తవ్యాన్ని స్వీకరించారు.

తమ మెదళ్ళను పెంటబొందలుగా మార్చుకుంటున్నారు.

టీవీలు చూసే ప్రజల మెదళ్ళను పెంటబొందలుగా మార్చుతున్నారు.

పత్రికలు చదివే పాఠకుల మెదళ్ళను మురికినీళ్ళ ప్రవాహాలుగా మార్చుతున్నారు.

అవన్నీ విని, చూసి బాధలు, కీచులాటలు, నేరాలు, ఘోరాలు, పంచాయితీలు, సమస్యలు, కష్టాలు వినివిని ప్రజల మెదళ్ళు, హృదయాలు పెంట బొందలుగా మారిపోతున్నాయి.

ఆనందాలు ప్రజలకు, కష్టాలు, కీచులాటలు వారికి.

ఇలా సామాజిక నిర్మాణాలు, ఉద్యమాలు పరిణామం చెందాయి.

అలా గుళ్ళల్లో చెప్పులు పోతే చాలా మంచిది అనే సామెత మిగిలింది.

చెప్పులు పోతే ఎందుకు మంచిదో తెలువకుండాపోయింది.

గుళ్ళవద్ద చెప్పులతోపాటు మీ గతాన్ని వదిలేసి గుళ్లోకి వెళ్లండి.

చెప్పులుపోతే దరిద్రం పోయినట్టు అనే భావనను ఇలాగే ఏర్పడింది.

అలా సమాజం, సమాచార వ్యవస్థతో, గతంతో పెంటబొందలుగా మార్చబడుతోంది.

- బియస్ రాములు

English summary
A prominent writer BS Ramulu in his satiric Telugu short story explained the absurdity of the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X