వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారేసిన కథ

By Pratap
|
Google Oneindia TeluguNews

short story
ఆ కథ సబ్జెక్టు ఏమై ఉంటుందనే విషయం అతని మెదడును ఈ మధ్య తరుచూ తొలుస్తోంది. తనకు అవసరమైన విషయం ఏదో ఉండి ఉంటుందనేది అతని ఆలోచన. తనకు నేరుగా చెప్పలేని విషయమేదో సుజాత ఆ కథ ద్వారా తనకు చెప్పిందనేది అతనికి ఎందుకో గాని అనిపిస్తోంది. అందుకే తరుచుగా ఆ కథపై అతని మనసు పోతోంది.

అతను 'వెలుగు' పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నప్పుడు ఇచ్చింది అచ్చుకని. ''నువ్వు ముందు చదువు. చదవకుండా ఇవ్వకు'' అని మరీ మరీ చెప్పింది. అతనికెందుకో చదవాలనిపించలేదు అప్పుడు. తను చదవాలని దగ్గరుంచుకుంటే అచ్చుకు ఇవ్వడంలో ఆలస్యం అవుతుందనిపించింది. అందుకే వెంటనే తీసికెళ్లి 'వెలుగు' వారపత్రిక ఎడిటర్‌కు ఇచ్చేశాడు.

సుజాత అతనికి ఎం.ఎ. తెలుగు లిటరేచర్‌లో క్లాస్‌మేట్‌. అందంగా ఉంటుంది. అందానికి తోడు అమాయకత్వం తోడైంది. దీంతో ఆమె మీద అభిమానం ఏర్పడింది. అది ప్రేమనా, కాదా అని అతను చాలాసార్లు తర్కించుకున్నాడు. అతను అప్పటికే సురేఖ మీద మనసు పెంచుకున్నాడు. దీని వల్ల సుజాతపై తనకుగల అభిమానం ప్రేమ అని అనుకోవాలనిపించలేదు అతనికి. ఆమె తనను ప్రేమిస్తోందా అని కూడా అనుకున్నాడు. కానీ, అలా ప్రేమించడానికి అవకాశం లేదని సర్ది చెప్పుకునేవాడు. ఎందుకంటే, తను సురేఖను ప్రేమిస్తున్న విషయం సుజాతకు తెలుసు.
సుజాత, సురేఖ మంచి ఫ్రెండ్స్‌. సురేఖ మనసును ఆకట్టుకోవడానికి అతను చేయని ప్రయత్నం లేదు. ఆమె తనను ప్రేమిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నమే చేశాడు. సుజాత మనసులో తన స్థానమేదో ప్రత్యేకంగా ఉందని అతను అనుకోసాగాడు. దీనికి, ఆమె తనకిచ్చిన కథకుఏదో సంబంధం ఉండి ఉంటుందనేది అతని ఆలోచన.

ఓ రోజు కాస్తా ముందుగా క్లాస్‌రూమ్‌కు వెళ్లాడతను. అంతకు ముందే సుజాత వచ్చి కూర్చుంది. వెళ్లగానే పలకరింపుగా నవ్వింది. ఆమె నవ్వితే చిరుజల్లు పడినట్లు, మల్లెలు విరబూసి సువాసన వెదజల్లుతున్నట్లు ఉంటుంది. అతను నవ్వాడు. అతను ఆమె వెనుక బెంచీలో కూర్చున్నాడు. ఆమె లేచి వచ్చి అతని పక్కన కూర్చుకుంది.

''జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి అంటే ఏమిటి?'' అని అడిగింది.

''బ్రహ్మ, తదితర దేవతల పూజలందుకునే మన్మధుడి తండ్రి- కృష్ణుడు అని అర్థం'' అని చెప్పాడతను.

''ఎగ్జామ్స్‌ అంటే భయమేస్తోంది'' అంది జాలిగా.

''భయమెందుకు? సురేఖ నోట్స్‌ ప్రిపేర్‌ చేసింది కదా, తీసుకోకపోయావా?'' అన్నాడతను.

''ఆమె ఇవ్వదు మీరు నన్ను కొంచెం గైడ్‌ చేస్తే చాలు'' అంది.

''ఆమె మార్కులు నువ్వు కొట్టేస్తావని భయమా?'' అన్నాడతను.

''ఏమో...'' అంది. అతని పైకి ఒరిగి అతని ఎదురుగా డెస్క్‌ మీద ఉన్న 'అమృతం కురిసిన రాత్రి' అందుకుంది. ''ఏ పేపరు ఎలా రాయాలో నాకు అవుట్‌ లైన్స్‌ ఇస్తే చాలు. ఏదో నెట్టుకొస్తాను'' అంది అతని పైకి అలాగే ఒరిగి.

''ఎందుకంత భయపడతారు? నేను చెప్తాలెండి'' అని భరోసా ఇచ్చాడు. ఆమె అతని అతని పుస్తకాలను ఒక్కొక్కటే తిరిగేయసాగింది. తన శరీరానికి పిల్ల తెమ్మెర తాకినట్టనిపించింది అతనికి. తల్లి ఒడిలో పడుకొని సేద తీరుతున్న హాయి. ఒక్కొక్కరి స్పర్శకు ఒక్కో గుణం ఉంటుందా అనిపించింది అతనికి. మన చెంతకు వచ్చిన స్త్రీ మనసును బట్టే మనలో భావసంచలనం కలుగుతుందా అని అనుకున్నాడు.

''నాకు వ్యాకరణమంటే భూతంలా తోస్తుంది'' అని అన్నది.

''మీరేం భయపడకండి. నేను అన్నీ చెప్తా'' అన్నాడతను దయగా.

''మీరు ఆ భరోసా ఇస్తే హాయిగా నిద్రపోతాను'' అంది.

చాలా సేపు ఇద్దరే కూర్చున్నారు. ఆమె మాటల్లో ఏదో ఆత్మీయత పలికినట్లనపించింది అతనికి.

''ఎందుకు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లుంటారు మీరు?'' అని అడిగింది.

కాస్తా తడబడి- ''అదేం లేదే...'' అన్నాడతను.

''సండే మా ఇంటికి రండి. నాకు పాఠాలు చెప్పినట్టుంటుంది. మా ఇంటికి వచ్చినట్లూ ఉంటుంది'' అంది.

''సరే'' అన్నాడతను.

దిల్‌సుఖ్‌నగర్‌లో వాళ్ల ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాడతను ఆదివారం సాయంత్రం. అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆమె ఇంటి ముందే నిలబడి ఉంది. అతను దగ్గరకు రాగానే ''లోపలికి రండి'' అని ఆహ్వానించి ఆమె ముందు దారి తీసింది. ముందు గదిలో కూర్చున్నాడు. ఆమె లోనికి వెళ్లి వాళ్ల నాన్నను, అమ్మను, తమ్ముడ్ని, చెల్లెను పిలిచి పరిచయం చేసింది. అందరూ ఎంతో ఆత్మీయంగా పలకరించారు. అందరూ లోనికి వెళ్లారు. వాళ్లతో పాటే ఆమె లోనికెళ్లి పూరీలు, కర్రీలతో తిరిగి వచ్చింది. టీపాయ్‌ మీద పెట్టి ''తినండి'' అంది.

అతను మొహమాటపడ్డాడు. ''ఇన్ని తినలేను'' అని అన్నాడు.

''ఇవి తినలేరా? నేను చేశాను'' అంది.

అతను మెల్లగా తినసాగాడు. ఆమె అతని పక్కన వచ్చి నిలబడింది. ఆమె శరీరం అతనికి తాకీ తాకనట్లుగా ఉంది. అభిమానం జల్లులు కురుస్తున్న అనుభూతి.

''ఎలా ఉంది? బాగుందా?'' అని అడిగింది.

తినడం ఆపి ''బాగుంది'' అని చెప్పాడు. నిజానికి ఉప్పు ఎక్కువైంది. నోట్లోకి దిగడం లేదు. ఆమె ఉత్సాహం, అభిమానం చూసో, మొహమాటం వల్లనో అతను ఆ విషయం చెప్పలేకపోయాడు. వద్దంటుంటే పక్కనే నిలబడి మరీ మరీ తినేలా చేసింది ఆ తర్వాత ప్లేట్లన్నీ తీసేసి చైర్‌ తెచ్చుకుని పక్కనే కూర్చుంది. ఆమె పుస్తకాలు, నోట్స్‌ తీసుకొచ్చి టీపాయ్‌ మీద పెట్టింది. ప్రాచీన, ఆధునిక కవిత్వాల పేపర్‌లో ఏయే క్వొశ్చన్స్‌ వచ్చే అవకాశం ఉంది, ఏ క్వొశ్చెన్‌ వస్తే ఎలా రాయాలి- చెప్పాడు.

''మేం క్రిస్టియన్లమండి, మా కుటుంబంలో నేనొకదాన్నే ఇలా తెలుగు సాహిత్యానికి వచ్చాను. మాకు ఒంటబట్టాలంటే కష్టం కదా!'' అంది.

''అదేం ఉంది? నేను సైన్స్‌ స్టూడెంట్‌ను. ఎక్కువ అక్కర్లేదు, కాస్తా దృష్టి పెడితే మనమూ బాగానే రాయగలం'' అన్నాడతను.

వీలు దొరికినప్పుడల్లా అతను వాళ్లింటికి వెళ్లడం, ఆమెకు చెప్పుతున్న క్రమంలోనే అతనూ చదువుకోవడం సాగిపోతూ వచ్చాయి. ఆమె మునుపటి కన్నా యాక్టివ్‌గా కనిపించసాగింది. సబ్జెక్ట్‌ విషయాలు చర్చకు వస్తే క్లాస్‌లో కామ్‌గా ఉండే సుజాత వాటిలో యాక్టివ్‌గా పాల్గొనడం ప్రారంభించింది. నిజానికి, ఆమె అంత త్వరగా నేర్చుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎగ్జామ్స్‌ మరీ సమీపించాయి. అతను తన ప్రేమ విషయం తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు ఒంటరిగా క్లాస్‌లో కూర్చోవడం గమనించి సురేఖను నేరుగా అడిగేశాడు- ''మీరంటే నాకిష్టం, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం'' అని.

''నాకు ఇష్టం లేదు'' అంది సురేఖ.

అతను అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. క్లాస్‌కు వెళ్లడం మానేశాడు.

ఓ రోజు వెతుక్కుంటూ సుజాత అతని గదికి వచ్చింది. ఆమెను, అతడ్ని అతని రూమ్‌మేట్స్‌ ఆసక్తిగా చూడసాగారు. అతను కలవరపడ్డాడు.

రూమ్‌ తలుపు దగ్గర నిలబడిన ఆమెను- ''లోపలికి రండి'' అని పిలిచాడు.

''మీరే ఇవతలికి రండి. అలా నడుచుకుంటూ మాట్లాడుకుందాం'' అంది.

ప్యాంట్‌, షర్టు వేసుకునే వరకూ ఆమె అక్కడే నిలబడింది. ఇద్దరు బయటకు వచ్చారు. ఆర్ట్స్‌ కాలేజీ వైపు నడవసాగారు.

''మీరెందుకు ఫీలవుతారు?'' అని అడిగింది.

అతను మాట్లాడలేదు.

''సురేష్‌గారూ! మీకు చెప్పగలిగినంత తెలివితేటలు నాకు లేవు గానీ ఆమె కాదన్నంత మాత్రాన క్లాస్‌కు మానేయాలా?'' అని అంది.

''మీకెవరు చెప్పారు?''

''సురేఖనే చెప్పింది. సురేష్‌ రెడ్డి క్లాస్‌కు రావడం లేదు. నేను కాదన్నందుకు బాధపడ్డాడేమో, ఒకసారి మాట్లాడు, నువ్వు చెప్తే వింటాడని నాకు చెప్పింది''

''చాలా మంది క్లాస్‌కు రావడం లేదు. నా గురించి ఆమెకెందుకు?'' అని అన్నాడు చిన్నగా.

''మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పినంత మాత్రాన ఏమీ ఉండదని అనుకుంటున్నారా? రెండేళ్లు స్నేహితుల్లా మెలిగి చివరి క్షణంలో ఇలా దూరం కావాల్సి రావడం దాన్ని మాత్రం బాధ పెట్టదంటారా?'' అని అడిగింది.

రెగ్యులర్‌గా క్లాస్‌కు వచ్చే అమ్మాయిలు ఆరుగురు. అతని క్లోజ్‌ ఫ్రెండ్స్‌ నలుగురు. వారి కోసమే ఎదురు చూస్తున్నట్లు కూర్చున్నారు. ప్రొఫెసర్‌ లేడు. ఇద్దరు వెళ్లగానే అందరూ పలకరించారు. సరదాగా మాట్లాడడానికి ప్రయత్నించారు. చాలా సేపు అతను మౌనంగానే ఉన్నాడు. మొత్తం మీద అందరూ కలిసి అతడ్ని మాటల్లోకి దింపారు. సురేఖ ముందు బెంచీలో కూర్చుంది. ఆమె వెనుకే సురేష్‌ కూర్చున్నాడు. అందరూ గలగలా మాట్లాడుతున్న సమయంలో సురేఖ వెనక్కి తిరిగి సురేష్‌ చేయిని సున్నితంగా నొక్కి వదిలేసింది. సురేష్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇదంతా సుజాత గమనిస్తూనే ఉంది.
సండే హాస్టల్‌ మెస్‌లో టిఫిన్‌ చేసి సుజాత వాళ్లింటికి వెళ్లాడు సురేష్‌. కాలింగ్‌ బెల్‌ నొక్కగానే సుజాత తమ్ముడు వచ్చి తలుపు తీశాడు. ''అక్క లేదా?'' అని అడిగాడు సురేష్‌.

''ఉంది. మీరు కూర్చోండి'' అని చెప్పి లోనికెళ్లాడు. పది నిమిషాల తర్వాత సుజాత, ఆ వెనుక ఓ లావటి వ్యక్తి వచ్చారు. ''డాక్టర్‌ అశోక్‌'' అని పరిచయం చేసింది సుజాత. ఆమెకు కాబోయే భర్త అని సురేష్‌కు తెలిసిపోయింది. సుజాతకు పెళ్లి నిశ్చయమైన విషయం సురేష్‌కు తెలుసు. పెళ్లికి ఒప్పుకునే ముందు సురేష్‌కు చెప్పింది. సురేఖతో కూడా మాట్లాడానని చెప్పింది. సురేష్‌ ఏమీ మాట్లాడలేదు.
''చేసుకోమంటారా?'' అని అడిగింది.

''అతను మంచివాడనుకుంటే ఒప్పుకోండి'' అని చెప్పాడు సురేష్‌. ఆమె ముఖాన్ని విషాదం మబ్బులా ఆవరించి వెంటనే తొలిగిపోయింది. దాన్ని సురేష్‌ పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు.
పరీక్షగా చూశాడు. ఎందుకో సుజాతకు భర్త కాదగిన వ్యక్తిలా అనిపించలేదు సురేష్‌కు. నల్లగా, మోటుగా ఉన్నాడు. ఇతను మనుషులకు వైద్యం ఏం చేయగలడని అనిపించింది. మనిషి అలా ఉన్నంత మాత్రాన వైద్యం ఎందుకు ఎందుకు చేయలేడని సర్ది చెప్పుకున్నాడు. కానీ, సుజాతకు కాబోయే భర్త స్మార్ట్‌గా ఉంటాడనే అతని నమ్మకం మీద దెబ్బ పడింది. తను ఊహించుకున్న అశోక్‌కు, కనిపిస్తున్న అశోక్‌కు మధ్య తేడాను అతను భరించలేకపోతున్నాడు. అతను కూర్చున్నాడు. ఆమె లోనికి వెళ్లి మూడు కప్పుల్లో టీ తెచ్చింది. ఈ మధ్య సమయంలో ఇద్దరి మధ్య ఏ మాత్రం సంభాషణ ముందుకు సాగలేదు. అతను టీ తాగేసి బయటకు వెళ్లిపోయాడు. సుజాత మనసును దిగులు ఆవరించింది.

పరీక్షలు మరీ దగ్గర పడడంతో చాలా తరుచుగా అతను సుజాత వాళ్లింటికి వెళ్లసాగాడు. వెళ్లిన ప్రతిసారీ అశోక్‌ కనిపిస్తూనే ఉన్నాడు. పెళ్లి కాకముందు అత్తగారింట్లో మకాం వేశాడేమిటని చాలాసార్లు సురేష్‌ అనుకోసాగాడు. సురేష్‌ రాగానే అశోక్‌ విష్‌ చేసి బయటకు వెళ్లిపోతున్నాడు. ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపించింది సురేష్‌కు. ఎగ్జామ్స్‌ అయిపోయాయి. సుజాత పెళ్లి కూడా జరిగింది. సురేష్‌ హాస్టల్‌ రూమ్‌లోనే ఉండసాగాడు. ఆ తర్వాత ఎం.ఫిల్‌.లో చేరాడు. అదే టైమ్‌లో 'వెలుగు' పత్రికలో రిపోర్టర్‌ ఉద్యోగం వచ్చింది. సుజాతతో పూర్తిగా సంబంధాలేం తెగిపోలేదు సురేష్‌కు. సుజాత కారణంగానే ఇద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు సాగుతున్నాయి. ఆమె తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సులో చేరింది. ఆమె ఆఫీసుకు వచ్చి అప్పుడప్పుడు సురేష్‌ను కలవడం, ఇతను కాలేజీ వైపు వెళ్లినప్పుడు ఆమెను కలవడం మామూలుగానే సాగిపోతోంది.

ముఖ్యమంత్రిగారు కాషాయవస్త్రాలు ధరించి ట్యాంక్‌బండ్‌ మీద నిరాహార దీక్షకు కూర్చున్నారు. దాంతో సురేష్‌ ఆ రోజు బిజీగా ఉన్నాడు. ఆ నాటకీయ పరిణామాన్ని, ముఖ్యమంత్రి విలేరులతో మాట్లాడిన విషయాలను వార్తలుగా మలచడంలో తలమునకలవుతున్నాడు. ఆ సమయంలో సుజాత ఆఫీసుకు వచ్చింది. సెక్యూరిటీ గార్డ్స్‌ వచ్చి చెప్తే లోనికి పంపించమని చెప్పాడు. ఆమె లోనికి రాగానే క్యాంటిన్‌కు తీసికెళ్లాడు. రెండు చాయ్‌లు తీసుకొని ఆమెకోటి ఇచ్చి తానోటి తీసుకున్నాడు. ఎదురెదురుగా నిలబడి టీ చప్పరించసాగారు. టీ తాగినంత సేపు ఇద్దరి మధ్య మౌనమే. టీ తాగేసి ఆమెనోసారి పరిశీలనగా చూశాడు. మనిషి నలిగిపోయినట్లు అనిపించింది. ముఖంలో కాంతి లేదు.

''బిజీగా ఉన్నారా?'' అని అడిగింది.

''అవును'' అన్నాడతను.

''మీ పనేం చెడగొట్టలేదు కదా!'' అంది.

''ఛా, అదేమిటి?'' అన్నాడు.

''రావాలనిపించింది. మిమ్మల్ని ఓసారి కలుద్దామనిపించి ఇలా వచ్చాను'' అని చెప్పింది.

''మీరు రావడం నాకు ఇబ్బందేమిటి?'' అన్నాడు.

బ్యాగ్‌లోంచి కవర్‌ తీసి అతనికిచ్చింది. అతను అందుకున్నాడు.

''ఓ కథ రాశాను. మీరు రాసినంత బాగా రాయలేను. కానీ ఎందుకో రాయాలనిపించింది. రాసేశాను. మీరు మీకు నచ్చితే పత్రికలో అచ్చు కోసం ఇవ్వండి'' అని చెప్పింది. అతను కవర్‌ మడిచి ప్యాంట్‌ జేబులో పెట్టుకున్నాడు.

''తప్పకుండా చదవండి. మీరు చదవకుండా అచ్చుకు ఇవ్వొద్దు'' అంది.

ఇద్దరూ బయటకు నడిచారు. ''మీరు తప్పకుండా చదువుతారు కదూ!'' అంది.

''చదువుతాను'' అని చెప్పాడు.

''నేను వెళ్తా''

''సరే'' అని ఆమెను ఆఫీసు బయటిదాకా సాగనంపి వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత తాను చదువకుండానే ఆ కథను 'వెలుగు' వారపత్రిక ఎడిటర్‌కు అచ్చుకోసమని ఇచ్చాడు. ఆ తర్వాత సురేష్‌ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

నష్టాలు వస్తున్నాయనే కారణంతో యాజమాన్యం వారపత్రికను మూసేసింది. మూసేసే ముందు ఆ కథ కోసమని ఎడిటర్‌ను అడిగాడు. వెతికి ఇచ్చే బాధ్యతను అతను ఓ సబ్‌ ఎడిటర్‌కు అప్పగించాడు. సబ్‌ ఎడిటర్‌ ఫైళ్లన్నీ వెతికాడు. ఆ కథ కనిపించలేదు.

''మా దగ్గరకు వచ్చిన కథలు ఎటూ పోవు. ఎక్కడో ఉండి ఉంటుంది. వెతికి మీకు పంపిస్తాలెండి'' అని చెప్పాడు సబ్‌ ఎడిటర్‌. కథ పేరు, రైటర్‌ పేరు చెప్పి వచ్చేశాడు సురేష్‌. ఆ తర్వాత గుర్తొచ్చినప్పుడల్లా కథ గురించి సురేష్‌ సబ్‌ ఎడిటర్‌ను అడగసాగాడు. దొరకలేదనే సమాధానమే వచ్చింది.
ఆ కథ ఇచ్చి వెళ్లిపోవడమే సుజాత మళ్లీ సురేష్‌కు కలవలేదు. దాంతో ఆ కథ మీద మరింత ఆసక్తి పెరిగింది సురేష్‌కు. ఎప్పటికప్పుడు ఆమె వద్దకు వెళ్లాలనుకుంటూనే ఉన్నాడు. కానీ వెళ్లలేకపోతున్నాడు.

కొన్ని నెలల తర్వాత రోడ్డు మీద ఓ కామన్‌ ఫ్రెండ్‌ కనిపించి సుజాతకు నిజామాబాద్‌లో టీచర్‌ జాబ్‌ వచ్చిందని, అక్కడే ఉంటోందని చెప్పాడు. తన పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే- కనీసం తనను ''బాగున్నారా? పెళ్లెప్పుడు, అమ్మాయెవరు?'' అనే విషయాలైనా అడగకుండా, కనీసం మంచినీళ్లయినా ఇవ్వకుండా ''సురేష్‌ ఎలా ఉన్నాడు'' అని అడిగిందని చెప్పాడు. సుజాత అడ్రస్‌ అడిగితే ''నువ్వు అక్కడకు వెళ్లకపోవడమే మంచిది'' అని చెప్పి అతను అడ్రస్‌ ఇవ్వలేదు.

''ఎందుకు?'' అని అడిగితే ''అదంతేలే... ఆమెను చూసే ప్రయత్నమేదీ నువ్వు చేసినా అది ఆమెకే నష్టం'' అని చెప్పాడు. సురేష్‌ను చెప్పలేనంత దిగులు ఆవరించింది. ఒళ్లు స్వాధీనం తప్పినట్లనిపించింది. సుజాత జీవితం అంత సజావుగా లేదనే విషయం అతని మాటల ద్వారా అర్థమైంది. ఆమె తన చేతికిచ్చిన కథ అచ్చు కోసం కాదేమో, ఆమె తన నుంచి ఏదో ఆశించి నేరుగా అడగలేక కథ రాసి తనకిచ్చిందేమో, అది అసలు కథనో లేక తనకు రాసిన లెటరో అనిపించింది సురేష్‌కు. ఆ కథను ఎలాగైనా సంపాదించి చదవాలనే కోరిక పెరిగింది. ఆ తర్వాత ఆఫీసుకు వచ్చి సబ్‌ ఎడిటర్‌ను పట్టుకుని గదంతా వెతికించాడు. ఫైళ్లన్నీ పొల్లు పోకుండా చూశాడు. దొరకలేదు.

''ఇక దొరకదు, సార్‌!'' అని అంటున్న సబ్‌ ఎడిటర్‌ మాటలు కర్ణభేరులను బద్దలు కొడుతున్నాయి. ఈ కథను చేజేతులా తానే పారేసుకున్నట్లనిపించింది. ఆ కథ చదివి ఉంటే ఆమెకే కాదు, తనకు కూడా ఓ మార్గం దొరికేదేమో అని అనిపించింది. అలా అనుకునేసరికి గుండెలో ఎవరో చేయి పెట్టి దేవినట్లయింది. అనుకోకుండానే కళ్లు వర్షించాయి. ఇక అక్కడ ఉండలేక వెనుదిరిగాడు.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
The lost story depicts the thoughts of a male youth about his girl friend. The main character worries about his friend's unsaid words.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X