వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరులేని వెన్నెల (కథ)

ఓ భగ్నప్రేమికుడు జీవితమంతా అయిపోయిందనుకున్న సమయంలో ఆమె అనుకోకుండా వచ్చింది. ఆమె వల్ల జీవిత పరమార్థమేమిటో అతనికి తెలిసిందా..

By Pratap
|
Google Oneindia TeluguNews

"ఊటీ" రైల్వేస్టేషన్..... బోర్డ్ చూస్తూ అలా నిలబడి పోయాన్నేను నందూ ఇంకా ఫోన్లో మాట్లాడ్తూనే ఉన్నాడు..
"హ..!బయల్దేర్తున్నా ఇంకో పదినిమిషాల్లో ట్రైన్. వంశీ గాదొచ్చాడ్లే కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాడు ఆ..! అదే.. లవ్ మాటర్ వచ్చాక చెప్తాకదా..! ఆ ఆ అన్నీ తెస్తున్నా.. ఆ ఫైల్స్ అన్నీ చూసావా నేనొచ్చాక మళ్ళీ ఒకసారి అతన్తో మాట్లాడదాం పర్లేదు.....ఓకే ఓకే బై..!"

"ఉష రా..! అడిగిందే అడిగి దొబ్బుతోంది అదే ఊరు కదా అని దీనికి పనప్పజెప్పటం తప్పైపోయింది సారీ మామా..! వెల్లక తప్పని పరిస్తితి ఇలాంటి కండిషన్లో నిన్ను వదిలెళ్ళాలని లేదు, బట్ తప్పట్లేదు కొయంబత్తుర్ బ్రాంచ్ గురించి చెప్పాకదా. కంపెనీ నిలదొక్కుకో వాలంటే తప్పదు.రెండ్రోజుల్లో వచ్చేస్తా" కార్లోంచి లగేజ్ దింపుతూ అన్నాడు నందూ. బీటేక్ లో నా క్లాస్మేట్ హాస్టల్ లో నా రూమేట్నందూ.ఇప్పుడు ఊటీ లో టీ లీఫ్ ఎక్స్పొర్ట్ కంపెనీ ఎండీ నందకుమార్.

"ఒకే రా పర్లేదు ఐవిల్టేక్కేరాఫ్ మైసెల్ఫ్" చేతిలో లైటర్తో పెదాల మద్య సిగరెట్ జీవితానికి కౌట్ డౌన్ మొదలెట్టిస్తూ చెప్పాన్నేను.

"యోదన్ గాడికన్నీ చెప్పాను ఏం కావాలన్నా చూస్కుంటాడు" ఏంకావాలన్నా అనే పదాన్ని ఒత్తిపలికాడు.లిక్కర్ సిగరెట్లు కాదు ఇంకా ఏదో కావలన్నా యోదన్ అనిపిలవబడే ఒడియా దుర్యోధన్ ఏర్పాటు చేయగలడు.

"అండ్ వమ్షీ...! టూమచ్ గా తాగకు. బ్రేకప్ ని మరీ ఇంత సెలబ్రేటేస్కోవద్దురా" నా జీవితపు శూన్యాన్ని గుర్తు చేస్తూ చెప్పాడు.

"లేదులే రాత్రి కొద్దిగా ఎక్కువైంది అంతే అదేం కొత్తకాదు కదరా మనకి" నాకూ నవ్వటం వచ్చన్న విషయం గుర్తొచ్చింది.
"హ్మ్..! దారి గుర్తుంది కదా జాగ్రత్త."అనౌన్స్మెంట్ వింటూ చెప్పాడు. "తలూపాను"గుర్తుందన్నట్టుగా

**** **** *** ****

"ప్యార్మాంగాహై తుమీసే న ఇంకార్ కరో" నాతో పాటూ తోడుగా ఏడుస్తూ ప్రేమనడుక్కుంటున్న కిషోర్కుమార్.

ఘాట్రోడ్లో మెత్తగా పాకుతున్న కారు. అప్పుడప్పుడు వచ్చె ఒకటీ అరా వెహికిల్స్ తప్ప పెద్దగా ట్రాఫిక్లేదు. మబ్బుపట్టినాకాశం,పల్చని తెరలా కమ్మిన పొగమంచూ,కిరణజన్యసమ్యోజకక్రియల్ని కప్పుకున్న కొండలూ,శూన్యాన్ని నింపుకున్న లోయలూ. కవులకి మందుకొట్టకుండానే కావాల్సినంత ఇన్స్పిరేషన్.........

ఉన్మత్త రాగాల్ని ఉన్మిషించే ప్రకృతి. ఆలోచిస్తూండగానే..

వెనక సీట్లోంచి సగం కూల్డ్రింక్ తాగేసిన జానీవాకర్ చేతుల్లోకొచ్చి పెదాల మీదుగా గొంతులోకీ,పొట్టలోకీ అక్కన్నుంచి మెత్తగా మత్తుగా మెదడ్లోకి చేరీ..... ఊహ్... ఈ మందే లేకుంటే ఎన్ని ఆత్మహత్యల్జరిగుండేవో ప్రపంచం లో...
ఔనూ..! డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమేనా..!? భగ్న ప్రేమికులకి కన్సెషన్లేం ఉండవా? అసలెవడు భగ్న ప్రేమికుడు? అమ్మాయినొదిలేసినోడా,అమ్మాయొదిలేసినోడా? ప్రేమికుడిగా వీడు విఫలమౌతాడా లేక ప్రేమే విఫలమౌతుందా? ప్రశ్నాలోచలతో బాటే జానీ వాకర్ నో.. నో.. ఇప్పుడు జానీ రన్నర్..... ఘాట్రోడ్లో 90కేయంపీహెచ్ లో...
ఇప్పుడ్డు తనుంటే ఏమనేదో...? "యూ స్టుపిడ్.! ఐనో యూవిల్నెవర్చేంజ్.నీకసలు బతకటమే తెలీదు.అసల్నిన్ను ప్రేమించాను చూడూ నన్ననుకోవాలి......."

ప్రేమించిందా..!? తను నన్ను... నాలాగే ఉండే నన్ను ప్రేమించిందా!?

నెమ్మదిగా గతం లోకి,గతం లో నా గదిలోకి,గతం లో నా గదిలో జీవితం లోకి..... జారిపోతూ.... "పాస్ బైటొ జరా అబ్ తో".. రఫీ పాడ్తూనే ఉన్నాడు.

** ** **

"వంశీ...! నువ్వెం చేస్తున్నావో అర్థమౌతోందా?"

ప్రశ్న ముందొచ్చిందో తనుముందొచ్చిందో గానీ. విసురుగా వచ్చి బీన్ బ్మాగ్ మీద సీడీని తీయకుండానే కూర్చుంది ఉమ... గదంతా తనతో బాటే వచ్చి నిండుకున్న ప్లేబాయ్ విమెన్ స్ప్రే పరిమళం ..

ఉమ ఎవరంటే మూడేళ్ళ కింద నాలాగేకొన్ని పుస్తకాల్చదివి ఒక సర్తిఫికెట్ సంపాదించటానికొచ్చిన ఉమ... గంటల తరబడి నాతో సబ్జెక్ట్స్ డిస్కస్చేస్తూ నా ప్రాణమైపోయిన ఉమ.... ఇరవై ఐదేళ్ళకి అరవై ఎనిమిది వేల జీతం తీస్కుంటున్న ఉమ.....

మల్టీనేషల్ కంపెనీలో ఉద్యొగావకాశాన్ని వదులుకున్నందుకు నన్ను తిట్టటానికొచ్చిన ఉమ... ముప్పాళ్ల ఉమా మహేశ్వరి
తన కింద బీన్ బాగ్ మీద ఇరుక్కుపోయిన అద్నాన్ సమీ తల్చుకొని జాలి పడాలో కుళ్ళుకోవాలో తెలియని అయోమయ సంధిగ్దావస్తలో నే ఆలోచించకుండానే సమాధానం చెప్పాను...

"అర్థం కాకపోవటానికేముంది..! షూ పాలిష్చేస్కుంటున్నా"

నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని ధారుణంగా అవమానించి నవ్వుల పాల్చేస్తూ... అరిచింది తను....

"స్టాప్ జోకింగ్ వంశీ..! ఆ హెచార్ వసంత్ పాండే ఇదివరకు మా కంపెనీ లోనే చేసాడు. నీ జాబ్ కోసం వాన్నెంత రిక్వెస్ట్ చేసానో తెల్సా? ఆ జాబ్ కి సెలెక్ట్ ఐతే రెండేళ్ళలో యూఎస్ వెళ్ళొచ్చు."

"ఉమా ప్లీస్...! నాకా జాబ్ ఇస్టం లేదు. ఐ కాంట్ లీవ్లైకె మనీప్లాంట్. ఐనా ఇప్పుడేం తగ్గిందని. సొంత ఫ్లాట్ ఉంది, కారుందీ, మనం బతకటానికి సరిపోయే జాబ్ ఉంది. ఇవి చాలవా?" తన మీది ప్రేమో... డబ్బు సంపాదించలేని నా చేతగాని తనమో... మాటలింకా మెత్తగానే పలికింది నా గొంతు.

"వాట్వాట్..! నువ్వు సంపాదిస్తున్నావా..!ఎంతా? ఇరవై వేలా? ఇరవై వేలా జస్ట్ ట్వెంటీథౌసెండ్బక్స్ ఫరె మంథ్.!? అసల్నీ ఎంటెక్ గోల్డ్ మెడల్కీ నీ సాలెరీ కీ ఎక్కడైనా పొంతనుందా?" తన కోపానికి బలైపోతున్న కాఫ్కాని రక్షించలేక మనసులోనే మన్నించమని వేడుకుంటూ.. ఆ చేతివేళ్ల నెయిల్ పాలీష్చూస్తూ..

తన దగ్గరగా నడిచి గ్రీన్ కలర్ జరీ వర్క్ అనార్ఖలీ డ్రెస్ లో.... అందమైన కళ్ళతో నన్నే చూస్తూ నిల్చున్న తనని దగ్గరికి తీస్కుంటూ...

"ఉమా..! ప్లీజ్ ట్రై టూ అండర్స్టాండ్మై..." చెప్తూండగానే.

"ఓహ్..! షట్ యువర్మౌత్ యూ..." నన్ను విదిలిస్తూ..

"వంశీ...! రెపు మాడాడీ "అబ్బాయేం చేస్తాడూ?" అంటే ఒక చిన్న మాగజైన్లో సబ్బెడిటర్ అని చెప్పాలా? ఎవ్రీ ఇయర్ ఇండియాకొచ్చే మా కజిన్స్ ముందు ఒక మిడిల్క్లాస్ వుమెన్ గా నిలబడాలా?"

"ఉమా..! నువ్వు నా గురించి ఆలో చించవా??"

"ఏం ఆలో చించాలి? మన పెళ్ళికి మా నాన్న ని ఎలా ఒప్పించాలీ అని ఆలో చిస్తున్నా,రేపు నీ భర్త ఏం చేస్తాడూ? అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలీ అని ఆలోచిస్తున్నా... పుట్టబోయే పిల్లలకి మనం ఇవ్వబోయే స్టేటస్ గురించి ఆలోచిస్తున్నా.. ఇంకా ఏం ఆలోచించాలీ? నీకివేం పట్టవు ఈ చెత్త పుస్తకాల్చదువుతూ,ఏదో ఉద్దరించేలా రాస్తూ... షిట్....!" తన కోపానికి నాలుగడుగులు గాల్లోకెగిరి నా చాతీని బలంగా కొట్టుకొని కొన్ని పేజీల్చింపుకున్న మొపాసా.... తన చేతి దురుసుకి వెనక్కి తూలిన రంగనాయకమ్మ బరువునాపలేక టేబుల్మీదినుంచి డస్ట్బిన్లోకి దూకేసిన శ్రీనాథుడు,అయో మయంగా చూస్తూ ఆఖరి క్షణం లో నిలదొక్కుకున్న హోమర్ ,కాళిదాసూ తదితరులు... వీళ్ళని ఉమ నీ మౌనంగా చూస్తూ డబ్బుసంపాదించటం చేతకాని ఒక చవట...

"సారీ వంశీ..! ఇలాగే ఉంటానూ అంటే నీ ఇష్టం.. కానీ నావల్లకాదు...."

తన అడుగుల చప్పుడుకు ముందు నేను తననుంచి విన్న ఆఖరి శబ్దాలా మాటలే......

పెద్దగా ఏం జరగలేదు గానీ... తను వెళ్ళిన ఓ వారం పాటు ఫోన్లిఫ్ట్ చేయలేదు,నాక్కనపళ్ళేదు..

ఓ సాయంత్రం నా ఫ్లాట్ముందు ఒక అ'శుభలేక నా కాలికి తగిలి.... తెరిచ్చూస్తే...

ఉమా ముప్పాళ్ళ వెడ్స్....!!????.... ఓహ్...! కళ్ళు మసకబారి ఇంకేమీ కనిపించక "కనీసం ఇప్పుడైనా ఏడువ్రా నాయనా" మెదడు సంకేతాలందుకున్న కళ్ళు ఆఙ్ఞలను అమల్లో పెడుతూ...

గదిలోంచి..గదిలోంచి...గతజీవితపుగదిలోంచి... జారి... కార్లో పడి.... అయోమయం నుంచి తేరుకునేలోపు
జానీ రన్నర్ వేగం 120కేయంపీహెచ్... హెయిర్పిన్ బెండ్ మలుపులో ఎదురుగా వచ్చే టీ లీఫ్ లోడ్ వాన్ ని తప్పించబోయి...

మూడొందల డిగ్రీలు తిరిగిన స్టీరింగ్ వీల్,అరవైఐదు డిగ్రీలు తిరిగి ఎడమ పక్క చెట్టునాసరా చేసుకొని ప్రాణాలు కాపాడుకున్న కార్లో జరిగిందేంటో అర్థమౌతూ సుప్త చేతనావస్తలోంచి చేతనా వస్తలోకి తర్జుమా ఔతూ జరిగిందేంటో అర్థమౌతూ నేనూ...

**** **** **** ****

నెమ్మదిగా రెప్పలు తెరుచుకున్న కళ్ళు వస్తువులపైనుండి పరావర్తన కాంతిపుంజాల అస్పష్ట ప్రతిబింబాల్ని మెదడులోకి వొంపి విశ్లేషిస్తూ...

"ఎక్కడున్నానూ!?" ఆశ్చర్యపోయాను. పరమ రొటీన్ ప్రశ్న.

కొండ మలుపులో కార్నదుపు తప్పించిన జానీ వాకర్ ఎప్పుడో పారిపోయుంటాడు. మరి నాముందుకొచ్చే ఆకారం!?
"ఎలా ఉంది సార్?" ప్రశ్నిస్తూ యోదన్. ధుర్యోధన్ నందూ గెస్ట్ హౌస్లో పనివాడైన ఇరవై రెండేళ్ళ ఒరియా దుర్యోధన్.
"హ్మ్...! ఎలా..! ఎలా వచ్చానిక్కడికి?"

మనసులో ప్రశ్నని అర్థం చేసుకున్నట్టు "ఎవరో అమ్మాయి తీస్కొచ్చింది.మీ చేతికి కట్టు కట్టించి." చెప్పాడు....
"కారు కూడా తెచ్చీసేం నేనూ వాచ్ మేన్ పాండి" రెండో ప్రశ్నకీ అడక్కముందే సమాధానం. ఒరియా,శ్రీకాకుళం యాస ,తమిళ్ కలగలిసిన విచిత్ర మైన భాష.

"జ్యూస్ తేనా సా..?" ఆఙ్ఞ కోసం చూసే సేవకుడి లా అడిగాడు.

"వద్ద"న్నట్టుగా సైగ చేసి. కళ్ళుమూసుకున్నాను. మగతగా నిద్ర కమ్ముకుంది..

సాయంత్రం నాలుగ్గంటలా ముప్పైరెండు నిమిషాలకి నిద్ర లేచి...

యోధన్ తెచ్చిన టే కప్పందుకో బోతూ కలుక్కుమన్న కుడిచేతి మణికట్టు పైన కట్టిన కట్టుంచూసుకొని....
"ఆ.. యోధూ..! నన్ను తీస్కొచ్చిన అమ్మయెవరూ?" అడిగాను.

"తెలీద్సా...! మన నందు సార్ కి తెల్సిన డాక్టర్ దగ్గరికే తీస్కెళ్ళారట. ఆయన కి మీరే నందు సారు కార్డు సూపిచ్చినారట. కట్టు కట్టినాక ఇక్కడికి తీస్కొచ్చినారు. డాక్టర్ గారితోనే అంద పొన్నూ వచ్చినాది. నిన్ను లోపల కి తెచ్చిమళ్ళీ వెల్తే మళ్ళీ కనిపించలేదు" అదే విచిత్రమైన యాసలో చెప్పాడు.

ఒళ్ళు నొప్పులుగా అనిపించింది.. మత్తులో ఉన్ననేమొ జరిగిన సంఘటనలేవీ గుర్తు రావట్లేదు..

స్నానం చేసి యోధన్ తెచ్చిన టీ తాగి "సరె నేనలా బయటికి వెళ్ళొస్తాను" సిగరెట్ వెలిగించుకుంటూ నడిచాను.

***** **** ***** *****

"హెలో..! మిమ్మల్నే ఆ సిగరెట్ కాస్త ఆర్పుతారా ఇది పబ్లిక్ ప్లేస్" పెద్ద కళ్ళు ఎత్తు ఐదూ-ఐదుండొచ్చు నార్తిండియన్ ఫేస్ ఇరవయైదేళ్ళుండొచ్చు పోనీ టైల్ తో "పర్లేదు" కంటే అందంగానే ఉంది.

"సిగరెట్ నా పెదాల మధ్యనుంచి కాలికిందకి స్థానభంశం చెంది నలిగిపోతూ... నేనూ పక్కకి తిరిగి వెళ్ళిపోతూంటే
"ఓయ్..! ఆ పక్షి చూడెంత అందంగా ఉందో" అరిచినట్టుగా చెప్తోంది తన పక్కనున్న అమ్మాయికి. కొన్ని నిమిషాల క్రితం అదే పక్షి చెట్తు పై వాలిన సీతాకోక చిలుకను కర్కశంగా చీల్చి తిన్నప్పుడు చూసుంటే ఏమనేదో.... నవ్వుకుంటూ నడిచాన్నేను ..

ఎంతసేపలా తిరిగానో తెలియలేదు. టైం ఎనిమిదిన్నరయుండొచ్చు చంద్రుడు కొద్దిగా పైకెగబాకుతున్నాడు గెస్ట్ హౌస్కొచ్చి లాన్లో కూర్చున్నా.. జానీ వాకర్ సోడా సిగరెట్పాకెట్ తెచ్చి పక్కనే ఉన్న టీపాయ్మీద పెట్తి "ఇంకేమన్నా కావాల్నా సార్." అదిగాడు యోధన్ వద్దన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపొమ్మన్నా.పక్కనే ఉన్న మ్యూసిక్ ప్లేయర్లోంచి. సన్నగా హరిప్రసాద్ చౌరాసియా బాన్సురీ...

A Telugu short story by Naresh Kumar Sufi

"ఎక్స్ క్యూజ్మీ..! ఓసారి మీ లైటరిస్తారా" గంట తర్వాత అదేగొంతు. తిరిగి చూస్తే తనే.. నవ్వుతూ
"సారీ నాకు సిగరెట్పొగ నోటితో తప్ప ముక్కుతో పీల్చటం నచ్చదు" చెప్తూనే చనువుగా టీ పాయ్మెదున్న లైటర్తీస్కొంది. మార్ల్బెరో లైట్స్.... పక్కనే కూర్చుని "అదిగో ఆ కాటేజ్ లో దిగాం మూడ్రోజులు టూర్ కోసమని వచ్చాం నాకు కొత్తేం కాదు బట్ ఫ్రెండ్స్ కోసం వచ్చాను"

"ప్లీస్ ఇక వెల్తారా" అసహనం బయటపడకూడదనుకుంటూనే గట్టిగానే అన్నాను

"ఓకే ఓకే..!" వెళ్ళ బోతూ ఆగి "వావ్ చక్రవాకం వింటూ... మందేస్తూ... సూపెర్ టేస్ట్"

"జుస్ట్ షట్ యువర్ మౌతండ్ గెటౌట్ ఫ్రమ్హియర్ అది చక్రవాకం కాదు ఆహిర్ భైరవి" చిరాకు కప్పిపెట్టుకోదల్చుకోలేదు నేను.

హాన్..! హిందుస్తానీ ఆహిర్భైరవే కర్ణాటిక్ చక్రవాకం 'సోలా బరస్ కీ బాలి ఉమర్ కొ సలాం'.. సాంగ్ విన్నారు కదా ఎక్ దుజె కెలియె సినిమాలో అదే రాగం.. మాండొలిన్ శ్రీనివాస్ ఎక్కువగా ప్లే చేసిన రాగం ఇదే అనుకుంటా...ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి పిబరే రామరసం వినే ఉంటారు కదా..!"

"క్లాసికల్మూజిక్ టచ్ ఉందా??" నా గొంతులో మార్పు నాకే తెలుస్తూ.

"కొద్దిగా అమ్మ పాడేది బతికున్నప్పుడు"

"అంటే...!"

"హ...! చనిపోయి మూడేళ్ళయ్యింది ఎప్పుడో నాన్నతో విడిపోయాక. ఇళ్ళు గడవటానికి కొన్నాళ్ళు ఇంట్లో మ్యూజిక్ క్లాస్ లు చెప్పేది అలా నాకూ కొంత తెల్సు"

"ఐనా ఇలాంటి వాతావరనం లో మెహదీ హసన్ కూడా గొంతు కలిపితే ఎంత బావుంటుందో కదా.."

"హ్మ్.. కానీ ఘజల్స్ విషయం లో మెహెదీ కంటే నాకు జగ్జీత్ ఎకువ నచ్చుతాడు"

"అదేంటి..?"

"తెలీదు ఆయనా నచ్చడని కాదు గానీ కొన్ని అలా ఉండిపోతాయ్"

"నిజమే లెండి రఫీ అద్బుతమైన గాయకుడే ఐనా ఆయన తెలుగులో పాడినప్పుడు నాకస్సలు నచ్చదు భాష ని విరుచుకు తింటాడు... నేడ్డే.. ఈనాడ్డే.. అంటూ...హ..హ..హ.. "

పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని టీపాయ్మీదున్న పుస్తకాలూ పేపర్లూ చూసి.... ఎడమ కనుబొమ్మొకటే పైకిలేచి..
"మీరూ రైటెరా"? అడుగుతూనే పింగళి సూరన ని చేతుల్లోకెత్తుకొని "ఓహ్..కళాపూర్ణోదయం..! సూపెర్బ్ స్టోరీ కదా! " అంటూ నావైపు చూసి. "ఇఫ్యూడోంట్మైండ్ ఇక్కడ కొద్దిసేపు కూర్చోవచ్చా?" అన్న మాట పూర్తికాకుండానే నా అనుమతివచ్చిందాలేదా చూడకుండానే కూచుని.....

ఎడమచేతిలో సిగరెట్, కుడిచేతిలో పుస్తకం...తను కూచున్న భంగిమా....

కనక పంజర శారికలకు జక్కెర వెట్టి
చదివింప రేలోకో సకియలిపుడు!
కరతాళ గతుల మందిర మయూరంబుల
నాడింప రేలోకో యతివలిపుడు!
క్రొవ్వాడి గోళ్ళ దంత్రులు మీటి వీణియ
ల్వలికింప రేలోకో భామలిపుడు!
కలికి రాయంచ బోదల నల్ల నెలయించి
నడిపింప రేలోకో పడతులిపుడు!
ముక్కుతిమ్మన చెవిలో చేరి,చిరాకుగా నేంతల విదిలించి చూస్తే. కాఫ్కాని లాలిస్తూ,లాలనగా పేజీలను తడుముతూ...
"హ్మ్..! పుస్తకాలూ,సంగీతం వెన్నెల్లో సిట్టింగూ అన్నీ బావున్నాయ్. మరీ ఈ గడ్డం లిమిట్ దాటి తాగేసేట్టున్న వాలకం..!లవ్ ఫెయిల్యూరైన పాత తెలుగు హీరోలా ఏంటీ సెటప్..?" నా కళ్లలోకే చూస్తూ.

"తన పోలికకు నవ్వొచ్చి,అంతలోనే "తను" గుర్తొచ్చి నవ్వానోనో లేదో నాకే అర్థం కాని ఎక్స్ప్రెషనొకటి నా పెదాలపై.. " కొన్ని వాలకాలంతే సినిమాటిక్ గా ఉంటాయ్"

సిగరెట్వెలిగించుకొని టేబుల్ లాంపార్పి వెన్నెల్లో తన మొహం చూసాను. ఇంకా లైఫ్లో ఉన్న పెయిన్ తెల్సినట్టు లేదు తనకి.. ఒక మనిషిని కోల్పోవటం ఎంత భాదో తనకింకా అనుభవం లోకి రాలేదనుకుంటా..

"కొందరు మనుషుల్ని ప్రేమించటం తెలీని మనుషుల వల్ల వచ్చిన రియాక్షనిది.. ఎవర్నైనా ప్రేమించి కోల్పొతే మీకూ అర్థమౌతుంది. తీవ్రంగా కోరుకున్నవాళ్ళు దూరమైతే ఆ భాద ఎలా ఉంటుందో మీకు తెల్సినట్టు లేదు"

"డిస్టర్బ్డ్ గా ఉన్నారని తెలుస్తోంది కారణం కూడా కొంతవరకూ అర్థమైంది గానీ.. అందుకే ఇంతలా కదిలిపోవాలా..? మీకో విశయం చెప్పనా. మనిషులని మనం ఎప్పుడూ మిస్స్ అవ్వం. మన ఇష్టాన్నీ,ప్రేమనీ కొందరికి మాత్రమే పరిమితం చేసినప్పుడే ప్రొబ్లెంస్"

"అంటే?"

"అంటే...! బహుశా ప్రేమ అనేది ఒక డిపెండెంట్ ఫీల్ అంటే ఇంకొక ఫీల్తో కలిసిపోతే తప్ప అది ఇండివిజువల్ గా ఉండలేదు. ఎదో ఒక ఇష్టం,జాలీ,అభిమానం,ఆత్మన్యూనత ఇలా చాలా ఫీలింగ్స్ ప్రేమని కోరుకోవటానికో,లేదా ప్రేమించటానికో కారణమౌతాయ్. ఆ ఫీలింగ్ కి కారణమైన మెయిన్ థింగ్ ని మన సొంత ఇష్టాలు డామినేట్ చేసినప్పుడు ఆటోమాటిక్ గా ప్రేమ తగ్గిపోతుంది"

"అంటే ప్రేమించిన వాళ్ళు దూరం కావటానికి మనమే కారణం అంటారా?"

"హ్మ్..! ప్రేమించిన వాళ్ళు దూరం ఐతే మరీ ఎక్కువ బాద పడాల్సిన అవసరం లేదంటాను" మన మీద వాల్లకి ఉన్న "స్పెషల్" ఫీల్ పోయి ఉండొచ్చు లేదా మన ఇష్టాన్ని వాళ్ళ కోసం వదల్లేక మనమే వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. రెండిట్లో ఏది జరిగినా.. అక్కడ ప్రేమ లేదనీ అర్థం ప్రేమే లేనప్పుడు వాళ్ళు మన పక్కనే ఉన్నా లేకున్నా తేడా ఏముందీ..?"

"............"

"మనం మనుషులని మనుషులుగా ఎప్పటికీ ప్రేమించలేమేమో..! వాళ్ల హోదా,జాబ్,ప్రవర్తన,వాళ్ళలో ఉండే ఏదో ఒక ప్రత్యేక టాలెంట్.. సెక్షువల్ నీడ్స్ ప్రేమ ల స్తాయినీ,ప్రేమ హద్దులనీ నిర్ణయిస్తాయి.

"............"

"హలో...! ఏమైంది అలా ఐపోయారు? ఎనీథింగ్రాంగ్ విత్మీ!?"

"నో..నో..! అయామోకే...!"నా గొంతులో నాకే తెలియని అనుమానం "ఈజ్ అయాం ఒకే..?

...................... ఇద్దరిమధ్యా కొన్నిక్సనాలు నిశ్సబ్దంగా నిష్క్రమించాక అడిగాను

"ఏం చదూకున్నావ్ నువ్వు?"

"హ్మ్..! ఏదో లెంది కాస్త చదూకున్నా బట్ వివరాలేం అడక్కండి"

సన్నగా పడ్తోన్న మంచుకి శాల్ని భుజాల మీదుగా వేస్కున్నాను... తన స్వెట్టెర్ జేబుల్లో చేతులు పెట్టుకుంది తను...
రాత్రిమొహంపై మచ్చల్లా ఇద్దరమూ.... ఇక్కడిలా.... ఎలా..?

నాకే తెలీదు కుర్చీకానించి ఉన్న గిటార్నా చేతుల్లోకెప్పుడొచ్చిందో ఎన్నిగంటలలా తీగలపైనుంచి రాలి గాల్లోకలిసిపోయాయో...! వేళ్ల నొప్పి మెదడుని తాకి కళ్ళుతెరిచ్చూస్తే కళ్ళు మూసుకొని ఉన్న తను హఠాత్తుగా కళ్ళు తెరిచి.... "ఏమైంది..!" అన్నట్టు కళ్ళెగరేసి.. గ్లాస్లో ఉన్న ద్రవాన్ని గొంతుకి అనుసంధానిస్తూన్న నన్నే చూస్తూ...

"ఆపేసారేం?"

"అయిపోయింది"

"మ్యూజిక్?"

"కాదు"

"మరి??"

"ఫీలింగ్.... ఏదో కోల్పోయానన్న ఫీలింగ్"

"అంటే.... భాద పూర్తిగా మ్యూజిక్ తో కడిగేసారా?"

"అయ్యుండొచ్చు..."

............

కొన్ని క్షణాలాగి అంది తను "అమ్మొ...! టైం మార్నింగ్ ఐదున్నర" నేను వెళ్ళాలి.

"తప్పదా" అనబోయి "సరే..!"

లేచి వెళ్తూ "బాస్..! లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది ప్రేమకి సరిపడ్డంత మంది మనుషులుంటే మనమే దాన్ని ఏ కొందరికో ఎక్కువ ఇచ్చి కాంప్లికేట్ చేస్కుంటాం. మనకెవరో నచ్చుతారు తర్వాత మనకు నచ్చినట్టు వాళ్ళుండాలనుకుంటాం... అదే బహుశా మనుషులని దూరం చేస్తుందేమో... ఆలో చించారా...

"కావొచ్చు కానీ ఎదుటి వాళ్ళూ అదే అనుకోవాలి కదా.. దూరమైనప్పుడుండే భాద వాళ్ళకి అర్థం కాదు. దే ఆర్ హాపీ ఇలా నాలా కొందరే ఇలా భాదతో మిగిలిపోతారు"

"హ..!హ..!! అదేం లేదనుకుంటా. మనం కొన్నిసార్లు అలా ఉండాలని కోరుకుంటామేమో..! యూ నో ఒక మనిషి చనిపోయినా మహా ఐతే పది రోజుల్లో మనం మామూలుగా ఐపోతాం,ఐపోగలం కూడా కానీ ఆ మనిషి మీద ఉండే ఇష్టం మనల్ని అలా అవటానికి ఇష్టపడనివ్వదంతే వాళ్ల మీద మన ప్రేమ ఇంతేనా అన్న గిల్టీ కాన్షస్ తో కావాలని ఆ భాదని కంటిన్యూ చేస్తూ మనం ఎంత ప్రేమించ గలమో మనకే నిరూపించుకుంటాం అనిపిస్తుంది నాకు.."
ఒక్కసారి పురాస్వరమేదొ పెళ్ళున మోగినట్టు దన్ ధనాధన్మంటూ సత్యమేదో పేలినట్టూ.. నిజమా ఇది నిజమా??ఇదే నిజమా..!!?

ఎంత వయసీ అమ్మాయికి ఎక్కన్నుంచొస్తుందింత భరోసా,ఈ పరిపక్వత...?

ఎలా ఖండించను..!? నా విఫల ప్రేమ వేదన నిజమని ఎలా చెప్పను? అది సమర్థించుకోవటం అవదా!? ఔనూ అసల్నెను తనని నిజంగా ప్రేమించానా..?? ఒకవేళ తనని ప్రేమిస్తే తనే కావాలనిపిస్తే తనకు నచ్చినట్టు నేనెందుకు మారలేదు??
"సరే మళ్ళీ కలుద్దాం".... చెప్పి నిల్చుంది.....

వెళ్ళిపోతూంటే..అడిగాను "నీపేరు?"

"మళ్ళీ కలుస్తాం కదా చెప్తాను" అడుగులచప్పుడు మెత్తని గడ్డిపై పాకుతూ తనతో వెళ్ళిపోయింది
మత్తెక్కిందో లేక మెదడు ఆలోచనల భారం భరించలేకపోయిందో... నిస్సత్తువగా కన్రెప్పలు మూసుకున్నాయ్...

**** **** **** ****

"సార్...! సార్...!" యోధన్ పిలుపుతో కళ్లుతెరిచాను.

టీ కప్పు చేతికిచ్చి "సార్ ఆ అమ్మాయి వచ్చినాదా మీరెలా పట్టుకున్నారు?"

"ఏ అమ్మాయి రా?"

"అదే మిమ్మల్ని నిన్న ఇక్కడికి పూడ్సినాదే అంద అమ్మాయి సార్..! పొద్దున్నే వస్తూంటే గేటు దగ్గర ఎదురైనాది"
"వాట్..! నన్ను హాస్పిటల్ కి తీస్కెళ్ళిందీ ఇక్కడికి తీస్కొచ్చిందీ ఆ అమ్మాయా!??"

"ఆమా..! అంద అమ్మాయే"

"ఐనా..! ఎక్కువగా ఆలోసించావుసరమే ల్యా.. పొద్దున్నే కనుక్కున్న.... అంత మంచిదేం కాదులే అంద కాటేజ్ వాచ్ మెన్ సొప్పినాడు మొన్ననగా ఒక కస్టమర్తో వచ్చినాదట. బేరం కుదరక వాడెళ్ళిపూడుస్తే ఈడే ఇంకొకర్ని పట్టేదానికి ఉండి ఎవ్వురూ దొరక్క. గంటకిందే ఎళ్ళిపోయినాదట.."

పరిణామక్రమాంతరంగ పరిపూర్ణత్వమేదో విచ్చుకున్నట్టు..చర్మపుపొరలలోతుల్లో అణువణువూ ప్లప్ మనివిస్పోటించినట్టూ..విశ్వగర్భంతరాలనీహారికేదో నీరవంగా కృష్ణబిళార్పణమైనట్టూ..నిస్సత్తువ,నీరసం,నిస్పృహ...
అరక్షణం పాటే..... వెనువెంటనే ఏదో ఇంకేదో అర్థమైనట్టు విచ్చుకున్న నా రెండు పెదవులు...

- నరేష్ కుమార్ సూఫీ

English summary
A Telugu poet Naresh Kumar sufi has written Peru leni Vennela Telugu short story. The story depicts the meaning of the human life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X