వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథ: చికాగోలో నానమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

''చికాగోలో ఇంత చలిగా వుంటదని తెలువది. నేను ఇండియా పోతనే'' అంది భూదేవి.

చికాగోలో ఉన్నప్పటికీ మనసంతా ఇండియామీదికి తమ ఊరిమీదికి కొట్టుకుంటుంది. పుట్టిన్నుంచి కలిసి జీవించిన జీవితం, ఇరుగుపొరుగు, అక్కచెల్లెల్ల పిల్లలు, బంధువులు... ఎందరో గుర్తుకొస్తున్నారు. ఎప్పుడు చూద్దామా అని ఆరాటంతో రోజులు గడుపుతున్నది భూదేవి. కొడుకు, కోడలు, మనవలేమో ఇక్కడే ఉండాలి. నీ అంత్యక్రియలు కూడా ఇక్కడే... ఇండియాను మర్చిపో... అని పరిహాసాలాడుతుంటారు.

భూదేవి కొడుకు ప్రభాకర్‌ ఏదో స్టోర్స్‌లో పని చేస్తారు. కోడలు సుశీల ఏదో స్కూల్లో పని చేస్తోంది. మనవడు భరత్‌ ఇటీవలే చికాగోనుండి కాలిఫోర్నియాలో ఉద్యోగంలో చేరాడు. స్వప్న చికాగోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. డూటీకి బయలుదేరబోతూ సాక్సులు, షూస్‌ వేసుకుంటూ నాన్నమ్మ మాటలు విని అంది స్వప్న...

''నానమ్మా! నువ్వు ఇక్కడే వుండాలె. అన్నయ్య నీకు గ్రీన్‌ కార్డు కూడ తెప్పించిండు కద'' మనవరాలు స్వప్న గారాలు పోయింది.

BS Ramulu's short story 'Chicagolo Nanamma'

స్వప్న నిటారుగా ఐదున్నర అడుగులుంటుంది. ఇండియన్‌ అమెరికన్‌ లకు ప్రతినిధిలా ఉంటుంది. రంగు కాస్త వేరుగాని తెల్లవారిలో, నల్లవారిలో ఒకరిగా కలిసిపోతుంది. సినిమాలో హీరోని డామినేట్‌ చేసే చురుకైన హీరోయిన్‌లా ఉంటుంది స్వప్న.

''ఈ చలికి ఇక్కన్నే పోతే ఎట్లనే'' అంది నానమ్మ భూదేవి.

''నానమ్మా! నువ్వు పోతే ఇక్కడే అమెరికాలోనే అన్ని కర్మలు చేస్తాం. అయినా ఏంగాదు, మేమందరం బతుకుతలేమా? ఇది ముందే విండ్‌ సిటీ అని అమెరికాలో పేరుపోయింది. గాలి విపరీతం... చలి విపరీతం... మంచు విపరీతం... మిచిగాన్‌ సరస్సు నుంచి చల్లగాలులు ఎప్పుడూ వీస్తనే ఉంటయి.
కొడుకు కోడలు ఆమాటతో లోలోపల నవ్వుకున్నారు.

''... ఇంకా ఏం చూసినవ్‌ నానమ్మా! నిరుడైతే మైనస్‌ 20 డిగ్రీలకు టెంపరేచర్‌ పడిపోయింది. నవంబర్‌, డిసెంబర్‌ అంతా తెల్లారేసరికి మూరెడెత్తు మంచు కురిసింది. పారలతోటి నూకి నూకి కారు బైటికి తీసుటానికి గంట పడ్తుండె. నువ్వు ఎటుతిరుగపొయ్యేదున్నది చలిపెట్టుటానికి, అంతా ఏర్‌కండీషన్‌ ఇల్లేనాయె'' అంది స్వప్న.

కోడలు సుశీల కూడా అత్తను ఇక్కడే వుండమని అంది. కొడుకు ప్రభాకర్‌ కూడా ఇక్కడే ఉన్నప్పుడు ఇండియాకు ఎందుకు అని కోడలు అత్తను సాధిస్తుంది. అయితే భూదేవికి ఇండియామీదే మనస్సు... తన జీవితమంతా అక్కడే గడిచింది. ఇక్కడ చావుకోసం ఎదురుచూస్తూ బతకడంతప్ప ఇక్కడ తనకు ఏముంది... అక్కడి చుట్టాలు పక్కాలు ఎట్లా ఉన్నారో చూద్దామనిపిస్తున్నది.

ఇక్కడుంటే ఏమీ తోస్తలేదు. ముచ్చట పెట్టుటానికి కూడా ఎవరూ లేరు. గంపకింద కోడిని కమ్మినట్టు ఇండ్లదిండ్లనే తిరగాలె.

...ఇక్కడ అన్నీ మంచిగ ఉన్నయి కాని, మాట్లాడుటానికి మనుషులే దొరకరు. ఒకళ్లిద్దరిని కొడుకు కోడలు పరిచయం చేసిండ్రు. కాని వాళ్లతోని ఏం ముచ్చట పెట్టస్తది? వాళ్లదో తీర్గ బతుకు. మనదో తీర్గ బతుకు. వాళ్ళకు పెద్ద పెద్ద వ్యవసాయాలు, బిల్డింగ్‌లు, బిజినెస్‌లు ఉన్నయట. ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. అన్ని ఉన్నోల్లు ఇండియా ఇడిసిపెట్టి ఇక్కడికి ఎందుకచ్చిన్రో... గొప్పలు చెప్పుకొనుడు తనకు రాదు... ఉన్న ముచ్చట చెప్పుకుంటే మనను తక్కువ చేసి చూస్తరని కొడుకు, కోడలు, మనుమలు...

...ఇంటికాడి ముచ్చట్లు ఇక్కడ ఏవీ చెప్పద్దు. వెనుకటి విషయాలు చెప్తే పరువు తక్కువైతదని అంటరు. ఇగ ఇండియా ముచ్చట్లు ఏం చెప్పకపోతె మాట్లాడుకుంటానికి ఏముంటది?... తిన్నవా, పన్నవా, ఏం కూర, టీవిల ఏం జూసినవ్‌, డివీడీలల్లో ఏమేం సినిమాలు చూసినవ్‌ ఏయే సిటీలు తిరిగిన్రు... అని తప్ప ఇగ అడుగుటానికి ఏం లేదు. అర్థం కాకపోతే తెలుసుకొనుడు...

ఓసారి టీవీల బతుకమ్మ పండుగ గురించి వచ్చింది. చికాగోలో బతుకమ్మ పండుగ జరుపుకున్నరు. అందరం పోయినం. ఆరేడు వందల మంది ఆడపిల్లలు, పెద్దోల్లు, చిన్నోల్లు చాలామంది వచ్చిండ్రు. అందరు ప్యాంట్లు షర్టులు వేసుకొని డ్యూటీకిపోయే స్వప్నంత వయస్సున్నోల్లు కూడా చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుతుంటే ఇండియానే చికాగోకు తరలివచ్చినట్లు అనిపించింది. ఆటలపోటీలు, భోజనాలు, అందంగా పేర్చిన బతుకమ్మలకు ఎన్నోతీరుల బహుమతులు, ఉపన్యాసాలు, తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేయాలో... సూచనలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రందాక ఇది అమెరికా అని మరిచిపోయి ఎంతో ఆనందంగా ఉన్నామో... ఎన్నెన్ని పూలో... ఎన్నెన్ని రకాల బతుకమ్మలో... ల్యాప్‌టాప్‌లో బతుకమ్మ పాటలు వస్తుంటే ఎంత ఆనందంగా ఆడుకున్నరో...

మా అవతలి వాడవాళ్లు బతుకమ్మ గురించి అడిగిండ్రు. చిన్నప్పుడు బతుకమ్మ ఎట్ల ఆడుకుందురో సంతోషంగ చెప్పుమన్నరు. బతుకమ్మ కథ చెప్పి బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఆడపిల్లలు పెళ్లి కాకముందు ఎట్ల ఆడుకుంటరో, పెళ్లయిన తర్వాత ఎట్ల ఆడుకుంటరో, బతుకమ్మ పండుగకు పెళ్లయిన యేడు అత్తగారు వెండికోలలు కొనిచ్చి ఆడుకుంటానికి తల్లిగారింటికి పోతనంటే ఎట్ల పంపిస్తరో... సత్తుపిండి ఎన్నిరకాలు చేసుకుంటమో... ఎన్ని రకాల పూలు పేరిస్తమో, ఎంతో ఉత్సాహంగా చెప్పింది. ఇంకా ఎన్నో జ్ఞాపకాలు కలిసి పంచుకోవాలనిపించింది.

... కొడుకు కోడలు వద్దని మాట మార్చిండ్రు. వెనకటి ముచ్చట్లు చెప్తే, పేదరికం బయట పడుతదని భయమట. తమ కులం తెలిసిపోతదట. అక్కడికి ఇక్కడేవో కులపట్టింపులు లేనట్టు దాసుడెందుకో... ఇక్కడ కులాలవారీగా అమెరికా తెలుగువాళ్ళ సంఘాలు చీలిపోయాయని వేరే కులాలవాళ్లను వేరే తీరుగా చూస్తారని అందుకే వాళ్లతో కలిసి తిరగలేకపోతున్నాం అని వాళ్లే అంటారు... నన్నేమో మాట్లాడొద్దంటారు... మనకులం పట్ల మనం గడిచివచ్చిన దారిపట్ల మనకు చిన్న చూపెందుకు? అని అడిగితే ఏదేదో మాట్లాడి నానోరు మూయిస్తారు.

వెనకటి కాలంల ఇట్లలేకుండె. ఏదుంటే అదే తిన్నం. ఉన్నకాడికి తృప్తిగ ఉన్నం. ఇప్పుడు ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఉరుకుడు ఉరుకుడు. రోజొక తీరు ఏదేదో కొనుకొస్తరు. గంత గంత ధరవెట్టి గవన్ని కొనుడెందుకు అని మనవన్ని అంటే వెనకటి కాలం కాదు నానమ్మా! అని నవ్వుతడు మనవడు.
స్టోర్స్‌లో, మాల్స్‌లో, ట్రెయిన్‌లో, ఫ్లైట్‌లో, ఎగ్జిబిషన్‌లో, మ్యూజియంలో ఎక్కడ ఇండియావాళ్లు కలిసినా, ఎక్కడ బాకీ అడుగుతారో అన్నట్టు మొఖం అటుతిప్పుకుంటారు. కనీసం పలకరించరు. అదే అమెరికావాళ్లయితే ఎవరు కలిసినా హాయ్‌... హాయ్‌... అని నవ్వుతూ చెయ్యి ఊపుతూ సాగిపోతారు. ఇండియావాళ్లు తెలుగువాళ్లయినా మనం పలకరించినా దులుపుకొని పోతారు. ఈ ఇంతదానికి ఏందో తాము పుట్టిపెరిగిన జీవితాలు... తమ గతం తెలవద్దని... ఆరాటం ఎందుకో...

''ఒక యాడాది జీతం నాకియ్యిరా ఇండియాల ఇరవై ఎకరాలు మామిడితోట పెట్టిపిస్త అంటే, మనవడు నవ్వేది నవ్వుతడు. గిప్పుడు ఈ వయసుల ఇంకా మామిడితోట పెట్టిపిచ్చి సంపాదిస్తవా?'' అని అంటరు.

''మీకేరా ఇరవై ఎకరాల మామిడితోట ఉంటే ఊల్లె మీకు ఎంత గౌరవం. ఒక మంచి బంగ్ల ఉన్నఊర్లె కట్టిస్తె ఇండియాలో ఎంత ఖదరు'' అని అంటే...

''అక్కడ ఎవరుంటరు?'' అని అడుగుతడు మనవడు భరత్‌.

''ఎవరుండకపోయినా మీరుకూడా మాకు పెద్ద తోట ఉందని, పెద్ద బిల్డింగు ఉందని సంతోషంగా చెప్పుకోవచ్చు. మీరు వాళ్లతోటి సమానంగా, దైర్యంగా మేం ఎవలకు తక్కువ కాదని మాట్లాడవచ్చు'' అంటే వినరు.

ఒకసారి దసరా అప్పుడు పండుగు మునుపు ఎట్ల చేసుకుందుమో మనవడి స్నేహితుడి తల్లిదండ్రులకు చెప్పబోతుంటే 'నానమ్మా పనుంది దా' అంటూ ఇంట్లకు పిలుసుకపోయిండు.

నానమ్మంటే స్వప్నకు ఎంతో గురి. స్వప్న పెళ్లిచేసుకోవడంలేదు. ఎవరినీ మెచ్చడంలేదు. నానమ్మనే స్వప్నను పెళ్లికి ఒప్పించాలని కొడుకు కోడలు డూటీలో నియమించారు. అందువల్ల వారిద్దరి మధ్య చనువు మరీ ఎక్కువ.

భూదేవి ఆ విషయం తీసినప్పుడల్లా చర్చలు కొట్లాటదాక దారి తీస్తున్నాయి. నేను వచ్చి ఈల్ల నడుమ కొట్లాట పెట్టిచ్చినట్టయితంది. ఈ కాలం పిల్లగాండ్లు ఎవరి మాట వింటరు? ఎవరిష్టంవారిది. మనవరాల్లో తన బాల్యాన్ని చూసుకుంటుంది నానమ్మ. నువ్వు ఆమెకే సపోర్టు చేస్తున్నవని కొడుకు, కోడలు గొణుగుతున్నారు.

''నానమ్మా! ఇక్కడున్నోల్లందరు బాగ వున్నోల్లు. ఇండియాల కూడ మంచిగ బతికినోల్లు. వాల్ల కట్టు బొట్టు వేరె తీరు ఉంటది. భాష కూడ వేరె తీరుగుంటది'' అంటడు మనవడు. స్వప్న ఎందుకు చెప్పకూడదు అంటుంది. ఎవరి భాష వాళ్ళు మాట్లాడాలి. ఒక భాష తక్కువ కాదు. ఒక భాష ఎక్కువ కాదు. చరిత్ర క్రమంలో ఆయా ప్రకృతి నైసర్గిక క్రమంలో సమాజాల మధ్య పరస్పర సంబంధాల్లో భాషలు పుట్టి పెరిగాయి. ఎవరో కావాలని ఇలాగే మాట్లాడాలని భాషను తయారు చేయలేదు'' అని వాదిస్తుంది స్వప్న.

'స్వప్న ఎవరో పిలగాడ్ని ప్రేమించినట్టుంది. ఇంజనీరింగ్‌ చదివే టప్పుడు పరిచయమయ్యాడట!

అప్పటినుంచి డేటింగ్‌లు పెట్టుకుంటూ కలుసుకుంటున్నారట... ఆ పిల్లగాడ్ని రెండుమూడుసార్లు ఇంటికి తీసుకు వచ్చింది. పిల్లవాడు మంచిగనే ఉన్నడు. అమెరికా పిలగాడు తెల్లగా ఉంటాడు. ఇండియన్‌ పిలగాన్ని వీలైతే తెలుగువాన్ని, ఇంకా వీలైతే సొంత కులంవాడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో అంటారు తల్లిదండ్రి'. మధ్యలో నానమ్మ నలిగిపోతున్నది.

''నానమ్మా! మేం ఇప్పుడే పెళ్లి చేసుకోం. జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాను. అతడు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. మేమిద్దరం మా లక్ష్యాలను సాధించేదాక పెళ్లి వద్దని నిర్ణయించుకున్నాం.'' అంటుంది స్వప్న.

''నానమ్మా! రిచర్డ్‌ చాలా మంచివాడు. ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే అమెరికా సమాజాన్ని మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అమెరికాలో నేరాలు తగ్గాలంటే ప్రభుత్వం, సమాజం చర్యలు తీసుకోవాలి. వారి దృష్టి మారాలి. బ్రిటన్‌లోలాగ యుఎస్‌ఎలో ఉన్నత విద్య, ఉచితవైద్యం అన్ని స్థాయిల్లో ప్రభుత్వ ఖర్చుతో అందించాలి.

ప్రస్తుతం పన్నెండో తరగతిదాక ఉచిత విద్య అందిస్తున్నారు. అది చాలదు. ఆతర్వాత ఆరేళ్ల చదువుకు కూడా హాస్టల్‌, కాలేజి, యూనివర్శిటీ ఫీజులు ప్రభుత్వమే భరించాలి. అందుకు గ్రాంటులు, సబ్సిడీలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లు ప్రభుత్వం అందించాలి. అలా ఇరవైరెండేళ్ల వయస్సుదాక ఉచిత విద్య, ఉచిత హాస్టల్‌ వసతి అందించాలని రిచర్డ్‌ జీవిత లక్ష్యం. తద్వారా నేరాలు చాలా తగ్గిపోతాయని అతని నమ్మకం.
ఇప్పుడు పన్నెండో తరగతి అయిపోయాక సొంతంగా సంపాదించు కుంటూ సొంతంగా ఉంటూ చదువుకునే క్రమంలో క్రమశిక్షణ లోపించి టీనేజ్‌లో రకరకాల స్నేహాలు, స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడి ఎదగాల్సిన జీవితాలు ఎదగకుండా పోతున్నాయి. నేరాలకు ఈ విద్యావిధానంలోని లోపం ప్రధాన కారణం. ఆధునిక ఆయుధాలు, పౌరులకు యధేచ్ఛగా అందే ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్‌ చేయాలి.

రిచర్డ్‌ లక్ష్యాల్లో నేనుకూడా పాలుపంచు కుంటాను. అతనితో కలిసి పనిచేస్తున్నాను. అంతేగాని ఇప్పుడే ఇద్దరం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటుంది స్వప్న. ఆమెను మార్చడం ఎవరితరం...? ఆమెను ఒప్పించాలని కొడుకు కోడలు తనను రోజూ నసపెడుతున్నారు. ఇద్దరి నడుమ తాను నలిగిపోతున్నది.
...ఇదంత బాధెందుకు? ఇండియాకు పోతనంటె అక్కడెవలున్నరు అందరం ఈడనే ఉంటిమి. ఈ వయసుల ఒక్కదానివి కూలిపోయే పాతింటికాడ అండుకుంట తింటవా? అని అనిరి.

... వానలకు ఓ రాత్రి ఇల్లు గూలితె ఎట్ల? ఇంతమందిమి ఉండి నువ్వు గక్కడ దిక్కులేని సావు సస్తవా? అని కొడుకు కోడలు కోపానికస్తుండ్రు. అందరం ఇక్కడే ఉన్నాం. ఇండియా మాట మర్చిపో. నువ్వు చనిపోయినా అన్ని కర్మలు అమెరికాలోనే! అన్నారు కొడుకు, కోడలు. నానమ్మకు ఏం చేయాల్నో తోస్తలేదు. ఇదో మనాది ఐపాయె అనుకుంది నానమ్మ భూదేవి.

ఒకసారి మాల్స్‌కు పోతే ఎంతో సంతోషమేసింది. పదమూడు తీర్ల ఉల్లిగడ్డలు చూసి ఆశ్చర్యపోయింది. ఎనిమిది తీర్ల క్యాబేజీ రంగురంగుల క్యాబేజీలు... బీరకాయలు, పచ్చిమిరపకాయలు ఎన్నితీర్లో... ఎన్నెన్నో దేశాలనుండి అమెరికాకు వస్తాయట... ఒక్కొక్క మాల్స్‌ వాడకట్టంత ఉంటది. నడవలేక కాల్లు నొస్తయి. అందులోనే తోవతప్పి ఒకరికొకరు దొరుకుడు కష్టం... కొత్తిమీర కాన్నుంచి ఫ్రిజ్‌లు, కంప్యూటర్‌లు, బట్టలు, టైర్లు, కండ్ల అద్దాలు, టీవీలు, అన్ని ఒకటేకాడ పెట్టుడు విచిత్రం అన్పించింది... తనకు మెక్‌డొనాల్డ్‌ హోటల్లో బర్గర్లు, ఫ్రెంచ్‌ ప్రైస్‌లు ఎంతో ఇష్టం.

రైల్లో మిచిగాన్‌ సరస్సు ఒడ్డుకు తీసుకుపోయి ఏవేవో చూపించిన్రు... సరస్సు ఒడ్డుపొంట ఎటు చూసినా నున్నటి రోడ్డు... ఆ రోడ్డుపొంట వందలాది పెద్ద పెద్ద బిల్డింగ్‌లు... మిచిగాన్‌ సరస్సు మంచినీళ్ల సరస్సు. నాలుగు రాష్ట్రాలకు మధ్యన ఉందట. నాలుగు రాష్ట్రాలకు అవే మంచినీళ్లట. సరస్సులో బోటులో తిరుగుతుంటే ఎంత ఆనందమో...

నేపర్‌విల్లి, ఆరోరా చికాగోకు హైదరాబాద్‌లో వనస్థలిపురం, బిహెచ్‌ఇఎల్‌లా అంటుకొనే ఉంటయి. నేపర్‌విల్లి రైల్వే ప్లాజా అపార్ట్‌మెంట్‌ లలో అందరు ఇండియావాల్లే కిరాయికుంటరు. ఆరోరాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో మంచిగ కట్టిండ్రు. మాట, మర్యాద టిఫిన్‌లు, భోజనాలు అక్కడ ఎంత చక్కగ ఏర్పాటు చేసిండ్రో... లెమన్‌ టెంపుల్‌లో అన్ని దేవుళ్లను ఒకటేకాడ ఏర్పాటు చేసిండ్రు. స్వామి వివేకానందుని విగ్రహం, గుడి ప్రాంగణంలో ఎంతో అందంగా కన్పిస్తది. అక్కడ పార్క్‌చేసిన వెయ్యికార్లలో ఎక్కువ కార్లు జపాన్‌ కంపెనీలవే. ఈ కార్లను చూస్తే అమెరికావాళ్లు మన అమెరికా కార్లు కొంటలేరని ఇండియావాళ్లమీద కోపం తెచ్చుకుంటరు అని మనవడు భరత్‌ చెప్పిండు. ఏ పండుగ ఏరోజు వచ్చినా శనివారం, ఆదివారంకు వాయిదా వేసి ఆ సెలవు రోజుల్లోనే జరుపుకుంటరు.

నేపర్‌విల్లి లైబ్రరీ ఎంత పెద్దగా, ఎంత శుభ్రంగా ఉందో... చిన్నపిల్లల కాడ్నుంచి, ముసలోల్లదాక అందరూ లైబ్రరీకి వస్తరు. ఏనెల విడుదలైన కొత్త పుస్తకాలు ఆనెలలోనే లైబ్రరీకి వస్తయట. కొనుక్కొనటానికి కూడా కొన్ని పెడతరట. సినిమాలు, డివిడిలు, పిల్లల సీడీలు కూడా లైబ్రరీలో ఇంటికి ఇస్తుంటరు. ఐదారేండ్ల పిల్లలు కూడా బొమ్మలు పుస్తకాలు చూస్తుంటే చూడముచ్చటేస్తది. నేపర్‌విల్లిలో రోడ్డు పక్కకు ఎక్కడ చూసినా పచ్చని గడ్డి... ప్రతి కమ్యూన్‌కు ఆటస్థలం, పిల్లలతోపాటు, తల్లులు ఆడుకుంటారు. తమ అపార్ట్‌మెంట్‌ ఏరియాలో అందరూ ఆత్మీయంగా పలకరిస్తారు. ఎక్కడ చూసినా కార్లు మక్కంకులు ఆరబోసినట్లు కనపడతయి. ఇక్కడ మనిషికొక కారు లేకపోతే ఒక్కరోజు కూడా నడవది.
ఎక్కడికిపోయినా కారులోనే పోవుడు. ఒకసారి త్రీడీ ఐమ్యాక్స్‌కు పోయినం. ఒక్కొక్క పాము మీద పడ్డట్టే న్పించింది.

కోడలు, మనువరాలు చెప్పినకొద్ది విని ఇంగ్లీషులో కొన్ని పదాలు నేర్చుకున్నది. హోటల్‌లో చెంచాలతో తినుడు నేర్చుకున్నది. చెప్పులకు బదులు బూట్లు వేసుకొనుడు కూడా అలవాటు చేసుకుంది. రగ్గులు, స్వెట్టర్లు ఎట్ల వాడాలనో తెలుసుకున్నది...

...ఇట్ల అంత మంచిగనే అన్పిచ్చింది. ఇగ ఇంట్ల కూసుండుడు మొదలైన్నుంచి యాస్ట వస్తంది. తిరిగే కాలు, చెప్పే నోరు ఉత్తగ ఉండదన్నట్టు ఇట్ల కూసుండుడు ఎట్లనో అనిపిస్తంది. అన్నీ ఉండంగ కూడ ఎందుకు బతుకుడు అన్పిస్తంది. అదే ఇండియాల అయితె పొద్దుందాక ఎట్లనో పొద్దు గడిచేది. పెండ్లి సంబంధాలు చూడు అంటూ ఎందరో వచ్చి అడిగేవారు. ముచ్చట్లు పెట్టేవారు. ఇసొంటి ఆలోచనలే రాకపోవు. ఇవన్నీ ఎవలకు చెప్పుకునుడు? మనవడు ఇనడు. కొడుకు కోడలు ఆయింత ఇనరు. ఒక్క మనవరాలు స్వప్న చెప్పు నానమ్మా అనుకుంట కూసుంటది. నాతోటి మాట్లాడుకుంట ఏదో టేపు రికార్డుల రికార్డు చేస్తంటది. ఏదో రాస్తుంటది. ఇంకా చెప్పు అంటది. ఆల్లేమో గవన్ని గిప్పుడెందుకు అంటరు.

మనవరాలు స్వప్న ఆల్లమీదికి మర్లవడ్తది. ''మీరు ఇండియా అంటారు తెలంగాణ అంటారు. నేను అమెరికన్‌ని. ఇండియా అంటూ మీరెందుకు అంత కలువరిస్తారో అర్థంకాదు. అంత కలవరించేవాళ్లు ఇండియాలో ఉండిపోక యుఎస్‌కు ఎందుకొచ్చారు? ఇండియన్‌ కల్చర్‌ అని అనడంలో ఏమైనా అర్థముందా? అమెరికాలో ఉంటూ అమెరికన్‌లాగ బతకాలి. పోనీ ఇండియా కల్చరేమైనా గౌరవిస్తున్నారా... అంటే నానమ్మ ఏది చెప్పినా వద్దంటారు. ఇకమీరు ఇండియాను, ఇండియన్‌ కల్చర్‌ను, ఇండియాలోని జీవితాలను ఏం గౌరవిస్తున్నట్లు? నానమ్మ చెప్పేదే నిజంగా ఇండియన్‌ కల్చర్‌... తెలంగాణ కల్చర్‌... ఇండియన్‌ హిస్టరీ...'' అని స్వప్న వాదిస్తుంది.

''నీకు ఇపుడు ఇరవైనాలుగేండ్లు. ఉద్యోగం చేస్తున్నావు. నీ పెళ్లాయ్యాక, భరత్‌ పెళ్లి చేసుకుంటానంటున్నడు. నువ్వేమో నా పెళ్లి నా యిష్టం అని అంటున్నావు''. అని అడుగుతుంది. నానమ్మ.

ఈమధ్యన భూదేవికి గ్రీన్‌ కార్డ్‌ వచ్చేసింది. గ్రీన్‌కార్డ్‌ ఉంటే ఎంత కాలమైనా అమెరికాలో ఉండవచ్చని స్వప్న, కొడుకు, కోడలు అందరూ సంతోషించారు. తాను సంతోషించాలో, బాధపడాలో తేల్చుకోలేకపోయింది భూదేవి.

మనవరాలు స్వప్న డ్యూటికి బైలుదేరిపోయింది. మనవడు ఈ నడుమ కొత్త ఉద్యోగం కెక్కిండు. ఇప్పుడు మనవడు కాలిఫోర్నియాల ఉంటాండు. కొద్దిరోజులు ఇక్కన్నే ఉండున్రి, నేను సెలవులకు వస్త అంటడు.
''అదంత కాదు గని, నానమ్మా! ఇండియా గురించి నీకు యాదికున్నవి అన్ని చెప్పు, నేను టీవీ సీరియల్‌ తీస్త. ఇక్కడ ఒక అసోసియేషన్‌ పెట్టినం. కష్టపడి పైకివచ్చిన వారి జీవితాలను రికార్డుచేసి భవిష్యత్‌ తరాలవారికి తెలియజేయాలనేది ఈ అసోసియేషన్‌ లక్ష్యం. మనిషికిన్ని డాలర్లు వేసుకుని మన చరిత్రను మనం డాక్యుమెంట్‌ చేయాలని అనుకుంటున్నం. అందుకని వెనకట మీరు ఎట్ల బతికిన్రో ఎట్ల పెరిగిన్రో చెప్పు'' అని అంటది స్వప్న.

*********

నానమ్మ గతాన్ని తలుచుకుంటుంది. మనవరాలు తెలుసుకుంటుంది. కానీ మనవడు, కొడుకు కోడలు ఆ గతాన్ని వదిలివేయాలనుకుంటారు. మరిచిపోవాలంటారు. ఎవరివాదన వారిది. రెండూ సత్యమే అనిపిస్తాయి. మనవడి వాదన మనవడిది. కాలిఫోర్నియా నుంచి చికాగో వచ్చిన మనవడు భరత్‌ ఆదివారం టిఫిన్‌ చేస్తూ తనను తాను సమర్ధించుకున్నాడు.

''నానమ్మా! మనం రెండుమూడు తరాలు కష్టపడి పైకి వచ్చాము. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము. ఎన్నో అవమానాలు, అపజయాలు ఎదుర్కొని ఉన్నత శిఖరాలకు ఎదిగాము... ...మన లక్ష్యం, ఉన్నత శిఖరాలకు ఎదగడం. జీవితాన్ని గెలుచు కోవడం. జీవితాన్ని గెలుచుకోవడం లక్ష్యమైనప్పుడు అది సాధించిన విజయమే వర్తమానం. అదే ముఖ్యం. గతమంతా తవ్వి తిరిగి ఆ అవమానాలు, వైఫల్యాలు, చిన్నచూపులను గుర్తు చేసుకోవాలా? తద్వారా తోటి సమాజం వీళ్లు కిందిస్థాయి నుండి పైకి వచ్చినవాళ్ళు అని రకరకాలుగా సామాజిక వర్గాల రీత్యా, సంస్కృతి రీత్యా చిన్నచూపు చూస్తారు. ఇప్పటికే ఈ అవమానాలు భరించలేక పోతున్నాం...'' స్వప్నవైపు తిరిగి మళ్ళీ కొనసాగించాడు మనవడు భరత్‌.

''స్వప్నా! సామూహిక అత్యాచారానికి గురైన మహిళకు ఆ విషయాన్ని నిరంతరం గుర్తు చేస్తే ఎలా ఉంటుంది?. అప్పుడెప్పుడో నిన్ను వాడెవడో బలవంతంగా కౌగిలించుకొని ముద్దుపెట్టుకున్న విషయం నిరంతరం గుర్తు చేస్తే నీకెలా ఉంటుంది?. చిరాకుగా ఉండదా? అలాగే అభివృద్ధిని అందుకున్నాక వెనుకటి జీవితాలను గుర్తు చేయడం చిరాకుగా ఉంటుంది. అవమానకరంగా ఉంటుంది''. అన్నాడు భరత్‌.
స్వప్న వెనక్కి తగ్గలేదు. ''అన్నయ్యా! నువ్వన్నదాన్లో పాయింట్‌ ఉంది. అయితే మన గతాలను అనుసరించి వర్తమానంలో చిన్నచూపు చూసే సంస్కృతి విలువల వల్ల గతాన్ని గుర్తు చేయడం అవసరం లేదని భావిస్తారు. కనుక ఆ విలువలను మార్చాలి.

ఇక్కడ యుఎస్‌లో నలుగురితో కలిసి తిరిగినా, ఆడవాళ్లు మళ్లీ హాయిగా పెళ్లి పిల్లలతో జీవితం గడిపే అవకాశం ఉంది. భర్తలు భార్యల గత జీవితం తెలిసినా గౌరవిస్తారు. ఇష్టం లేకపోతే విడిపోతారు.
అందువల్ల మారాల్సింది గతంపట్ల కొందరు చూసే చూపు. కష్టపడి పైకి రావడమే అమెరికాలో గొప్ప ఆదర్శం. ఇండియాలో కూర్చొని తినడం తల్లిదండ్రులు సంపాదించింది ఉండడం గొప్ప అనుకుంటారు. ఇక్కడ అది గొప్ప కాదు. ఇలా విలువలు మారాలి. అంతేగాని గతాన్ని నిరాకరించడం కాదు. గతాన్ని నిరాకరించడమంటే మన గతాన్ని, అనగా మన జీవితాన్ని మనమే అవమానించుకోవడం. వాళ్ళు అవమానిస్తుంటే మనం కూడా దాన్ని అంగీకరించాలా?'' స్వప్న తన వాదనను సమర్ధించుకుంది.
నానమ్మ మనవరాలు ఒకవైపు. తల్లిదండ్రులు, మనవడు ఒకవైపు.

''నేను మన గతాన్ని తప్పకుండా రికార్డు చేస్తాను. ఆ స్వేచ్ఛ నాకుంది''. సీరియస్‌గా అంది స్వప్న.
''స్వప్నా! గడిచిన కష్టాలు జ్ఞాపకం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఆనందంగా కూడా ఉంటుంది. కానీ అవే అనుభవాలు ఎదురైతే భరించలేం. అమ్మానాన్నలకు అవి గుర్తు చేసుకోవడం ఇష్టంలేదు.'' అన్నాడు భరత్‌.

''కరెక్టుగ చెప్పినవురా!'' అంటు మెచ్చుకున్నారు కొడుకు, కోడలు.

''నువ్వన్నది నిజమేగాని గతాన్ని రికార్డు చేయడం కూడా అవసరం'' అంటూ తాను అంతదాకా రికార్డు చేసిన కథను సంక్షిప్తంగా వివరించింది స్వప్న. తమ పేదరికం గురించి, కష్టాలు, కొట్లాటలు గురించి విని కోడలు సుశీల కొడుకు ప్రభాకర్‌ ఆశ్చర్యపోయారు.

''ఇవన్నీ ఎందుకు చెప్పినవే అమ్మా'' అని కొడుకు ప్రభాకర్‌ ప్రశ్నించాడు.

''ఇవన్నీ నేనెక్కడ చెప్పిన? నాకేం ఎరుక?'' అంది నానమ్మ భూదేవి.

ముగ్గురు స్వప్నకేసి ప్రశ్నార్థకంగా చూశారు. స్వప్న నవ్వింది.

''ఇంటర్‌నెట్‌ లేదా నానమ్మా! కంప్యూటర్‌ టెక్నాలజీ వచ్చిన తర్వాత, కరెంట్‌ వచ్చిన తర్వాత ప్రపంచమెంత మారిందో అంత మారింది. ఇంటర్‌నెట్‌లో నువ్వు చెప్పినవాళ్లతో మాట్లాడి అనేక విషయాలు రికార్డు చేసిన'' అంది స్వప్న.

కొడుకు, కోడలు, మనవడు, విసుక్కున్నారు. స్వప్నను హెచ్చరించారు. వాళ్ల కోపాన్ని స్వప్న లైట్‌గా తీసుకుంది స్వప్న.

''బెదిరించి నోరు మూయడానికి ఇది ఇండియా కాదు. అమెరికా!'' అంది స్వప్న. ''మీరిట్లా బెదిరిస్తే నా పెళ్లికి మిమ్మల్ని పిలువను. నానమ్మకు ఒక్కదానికే ఇన్విటేషన్‌ ఇస్తాను''. నవ్వుతూనే హెచ్చరించింది స్వప్న. వాళ్ళకు మరింత కోపం వచ్చింది. అయినా ఏమీ అనలేక పోయారు.

''అమ్మానాన్నలు లేకుండా పెళ్లేందే?'' ఆశ్చర్యపోయింది భూదేవి.

''నానమ్మా! నా పెళ్లి నా యిష్టం. ఇండియాలోలాగ ఇక్కడ తల్లిదండ్రులు పెళ్లి చేయరు. ఎవరికివారే పెళ్లి చేసుకుంటరు. తల్లిదండ్రులను పిలిస్తే పిలుస్తారు. లేకపోతే లేదు... నేను అమెరికన్‌నైనా చేసుకుంటా, మెక్సికన్‌నైనా చేసుకుంటా, కెనడియన్‌నైనా చేసుకుంటా, కొరియన్‌నైనా చేసుకుంటాను. అంతేగాని ఇండియన్‌ని మాత్రం చేసుకోను. ఇండియన్స్‌తో ఈ నస భరించ లేను. అమ్మానాన్నలను, అన్నయ్యను చూస్తలేనా... రోజూ ఎంత నస పెడుతుంటారో... అది ఎదుటివారికి ఎంత చిత్రహింసగా ఉంటుందో వాళ్లకు తెలియదు...

తమ అభిప్రాయాలపట్ల వారికి ఎంత గౌరవం ఉంటుందో ఎదుటివారి అభిప్రాయాలపట్ల అంత గౌరవం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం. కనీసమైన సంస్కారం అది. ఒక బ్లాక్‌ బాలిక తెల్లవాల్ల బడిలో చదువుకోవాలను కుంటే స్కూల్లో పిల్లలు, స్టాఫ్‌ అందరూ వ్యతిరేకించినా ఆమెకు అలా చదువుకునే హక్కు ఉందని ఆనాటి అమెరికా ప్రెసిడెంట్‌ అబ్రహాం లింకన్‌ 1860లలో 12వేల మంది పోలీసులను రక్షణగా ఇచ్చి చదువుకునే ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యమంటే అది'' అని స్వప్న వారి నోరు కట్టేసింది.
ఆ వాక్‌ ప్రవాహానికి అందరూ నోరు మూసుకున్నారు.

''నానమ్మా! నేను అపార్ట్‌మెంట్‌కు అడ్వాన్స్‌ ఇచ్చానని చెప్పిన గదా! ఇలా మాట్లాడితే వెంటనే అందులోకి మారుతాను. నువ్వు నాతోనే ఉండు నానమ్మా!''.

లోకం ఎంత మారిపోయిందో ఆశ్చర్యపోయింది భూదేవి. తన పెళ్లి తొమ్మిదేళ్ల వయస్సులో జరిగింది.
కొడుకు పెళ్లి ఇరవైయేళ్లకే చేసింది. మనవరాలు తన యిష్టప్రకారం అంటుంది. పెళ్లి కాకముందే అపార్ట్‌మెంట్‌ కొనుక్కొని వేరుగా ఉంటానంటున్నది.

''అన్నయ్యా! గతం అనేది ఒక చరిత్ర మాత్రమే. దాన్ని అలా జరిగిందని గుర్తించడం మాత్రమే. అంతవరకే దాని ఉపయోగం. కొత్తను ఆహ్వానించడం నా లక్ష్యం. అంతేగాని గతాన్ని, గత సంస్కృతిని, చరిత్రను పట్టుకొని వేలాడడం గానీ, ప్రేమించడం గానీ, పనికిరాదని వదిలివేయడంగానీ అనవసరం.

అవి మానవ సమాజం గడిచివచ్చిన థలు. వాటిని గౌరవిద్దాం. అంత మాత్రాన వాటిని ఆచరించాల్సిన అవసరం లేదు. మీరు అనవసరంగా టెన్షన్‌ పడుతున్నారు. మీరు ఏ గతాన్ని వద్దంటున్నారో ఆ గతానికి సంబంధించిన సంస్కృతిని మాత్రం... అందులో మీకు నచ్చిన అంశాలు మాత్రం తీసుకొని అలా ఉండాలని నన్ను, నానమ్మను టెన్షన్‌కు గురి చేస్తున్నారు. మీ ప్రయత్నం వృధా ప్రయత్నం. సమాజం, ప్రపంచం గతాన్ని వదిలివేసి నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. చరిత్రను అధ్యయనం చేసినట్లుగానే నానమ్మ చరిత్రను మన అభివృద్ధి పరిణామాల చరిత్రను అధ్యయనం చేయడం అవసరం. దాన్ని నిరాకరించడం మీరింకా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ నుండి బయట పడలేదని తెలుపుతుంది'' అంటూ స్వప్న గతానికి, వర్తమానానికి మధ్య సంబంధం ఎలా ఉండాలో తన అభిప్రాయాలను గిరిగీసి చెప్పి ఏదో పని ఉన్నదానిలా బయటకు వెళ్లడానికి తయారైంది స్వప్న.

''మళ్లీ వాడిని కలవడానికేనా...'' కోపంగా అరిచాడు తండ్రి ప్రభాకర్‌.

''డాడీ... మర్యాదగా మాట్లాడు... వాడు వీడు అని అంటున్నావేంటి? మర్యాదగా మాట్లాడరాదా? నిన్ను రిచర్డ్‌ ఇలాగే అంటే ఊరుకుంటావా? మిమ్మల్ని తల్లిదండ్రులకన్న ఎక్కువ గౌరవిస్తున్నాడు. ఆ గౌరవం కాపాడుకోండి'' విసురుగా అంటూ ''నానమ్మ షాపింగ్‌కి పద'' అంటూ వాతావరణం చల్లబడాలని నానమ్మను అక్కడ్నుంచి బయల్దేరదీసింది స్వప్న.

రిచర్డ్‌, స్వప్నలు భూదేవి చెప్తున్నకొద్ది వీడియోలో రికార్డు చేస్తున్నారు. ఇండియా గురించి మనవరాలు స్వప్న తెలుసుకొని రాయడం ఎంతో తృప్తినిచ్చింది నానమ్మకు. ఇక అమెరికాలో కూడా ఉండవచ్చు. ఇక్కడే అంత్యక్రియలు, పెద్దకర్మలు అన్ని ఇక్కడే జరుపుకోవచ్చు అని అనుకుంది.

అలా అనుకొని ఆరోజు హాయిగా నిద్రపోయింది నానమ్మ.

''నానమ్మ చాలా మంచిది... నా పెళ్లితోపాటు నా బిడ్డ పెళ్లికూడా చూడాలి. నువ్వింకా నూరేళ్లు బతకాలె నానమ్మా!'' అని మెచ్చుకోలుగా అంది స్వప్న.

''నీకు ఇంకా పెళ్లే కాలేదు. నువ్వు బిడ్డను ఎప్పుడు కనాలె? నీ బిడ్డ పెళ్లి చూడాల్నా! అప్పటికి ఇంకెట్లుంటదో... ఇంకా ఎన్ని చూడాల్నో... మునుపటికి, ఇప్పటికీ ఎన్ని మార్పులో... అన్నేండ్లు నేనెక్కడ బతుకుతనే... నీ పెళ్లి, భరత్‌ పెళ్లి చూస్తే చాలు. తృప్తిగా చచ్చిపోతనే... '' అంది నవ్వుతూ నానమ్మ.

- బి.ఎస్‌. రాములు

English summary
An eminent short story writer depicts the relations between the human beinggs in his present Telugu short story 'Chicagolo Nanamma' (Grandmother in Chicago).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X