వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిందాబాద్‌ (తెలుగు కథ)

నోట్ల రద్దు ప్రభావం ఓ పేద కుటుంబంపై ఎలా పడింది, వారి జీవితాలు ఏ విధమైన మలుపు తిరిగాయనే విషయంపై చింతం ప్రవీణ్ కుమార్ రాసిన తెలుగు కథానిక ఇది...

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏం పేర్రా నీ పేరు...
ఎంకన్న.
ఏం పని చేత్తవ్‌రా నువ్వు
అయ్యా...కూరగాయలు అమ్ముత.
ఇంతకుముందు ఏం చేసేటోనివి
ఓ సేటు దగ్గర వాచ్‌మెన్‌గా చేసేది.
సరే...రోజుకెంత దొరుకతయ్‌రా బిడ్డా
అయ్యా రోజుకో వంద దొరుకుతయ్‌...సీజన్ల రెండొందలు.
ఎక్కడుంటవ్‌...
ఉప్పరి బస్తి దగ్గర నాలుగో గళ్ళీ...

పోలీసు అడుగుతున్న ఒక్కో ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు ఎంకన్న...సమాధానం చెప్పుకుంట తాపతాపకు కౌన్సిలర్‌ పాపయ్య మొఖం చూస్తున్నడు ఏమి అర్థం కానట్టు...పాపయ్య కూడా ఎంకన్న మొఖం చూస్తూ వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పమన్నట్టు సైగ చేస్తున్నడు. పోలీసు అడిగిన షానా ప్రశ్నల్లో కొన్నింటికి జవాబిచ్చిండు. ఇంకా షానా ప్రశ్నలకు ఎంకన్నకు సమాధానాలు తెల్వకపోయేసరికి తెల్వదనే చెప్పిండు.

పోలీసు అన్నీ అడిగినంక పాపయ్యను పిలిచి ఇప్పుడు పంపిస్తానం ఏమన్న అవసరముంటె పొద్దుగాళ తీసుకరావాలె... అంటూ ఎంకన్నను ఒక పేపర్‌ మీద సంతకం చేయమన్నరు

ఎంకన్న సంతకం అనంగనే కొంచెం సిగ్గు పడి మళ్ళా పాపయ్య వంక చూసిండు

నీకెట్లా పెట్టొస్తే అట్లనే పెట్టురా అని పాపయ్య ధైర్యమిచ్చేసరికి చెమటలు పట్టంగ తెల్ల పేపర్‌ మీద సంతకం ముగ్గేసి గుండె బలంగా కొట్టుకొంటాంటే పోలీస్‌ ఠానానుంచి బయటపడ్డడు.

ఠానానుంచైతే బయటపడ్డడు గని గుండె ధక్‌ధక్‌మని కొట్టుకుంటనే ఉన్నది. ఠాణా బయట నిలబడి పాపయ్య కోసం చూస్తాండు...పాపయ్య అక్కడ పోలీసాయనతోని ముచ్చట బెట్టి ఒక షేకాండ్‌ ఇచ్చి బయటబడ్డడు.

పాపయ్య రాంగానే ' అయ్యా బాంచెన్‌...పోలీసు ఠానాకచ్చుడు గిదే ఫస్టు...మస్తు భయమైందయ్యా ఎక్కడ కొడ్తరేమోనని' అంటూ కాళ్ళు మొక్కబోతున్న ఎంకన్నను ' అరె ఏందిరా బై...లే...గిట్ల చెయ్యకు నాకు నచ్చది...లే ' అంటూ లేపిండు.

Chintham Praveen Kumar's Telugu short story

కొట్టుడు అంటే వట్టిగనే ఉంటదారా...నేను లేనారా అన్నడు.

గదే బాంచన్‌ మీరు ఉన్నరనే గింత ధైర్యంగ వచ్చిన...అంటూ మళ్ళొకసారి కాళ్ళ మీద పడబోయిండు

అరె గాడ్ది లేరా...నీ అవ్వా గింత పిరికోనివారా లే అంటూ లేపి వాని భయాన్ని పోగొట్టేందుకు ఎంకన్ని దగ్గరికి తీసుకున్నడు పాపయ్య

ఎంకని వొళ్ళు సలసల కాగుతోంది గమనించి 'అరెయ్‌ పారా నిన్ను ఇంటి దగ్గర దిగబెడ్తా...నీ ఒళ్ళంత కాల్తాంది ' అని ఎంకన్ని బండెక్కమన్నడు

అయ్యా పోదం గనీ ఇంతకు నన్నెందుకు ఠానాకు తీసుకొచ్చిండ్లో జర చెప్పయ్యా నేనేం అనుకోను గని-

ఏమోరా నాకేమెరుకరాపాపయ్య

అయ్యా జెర చెప్పె...నా భయమోందోగని ఇంటికిపోతే నా పెళ్ళాం ముండకొడ్కా...ఎక్కన్నన్న తాగి లొల్లి చేసినవా...లేకపోతే పోలీసోళ్ళకు నీతోని ఏం పని అని తిడ్తదే...

'నీ అవ్వా నీదో లొల్లొయితే నీ పెళ్ళాందో లొల్లారా' కోపమొచ్చింది పాపయ్యకు ఎంకడు పెళ్ళాం ముచ్చట జెప్తాంటె.

ఏం చెయ్యాల్నె పాపన్న వారం ఐతాంది...బ్యారాల్లేక ఇంట్లనుండి ఎళ్తలేను...అదిప్పడికే గుస్సగుస్సగా సూత్తాంది నన్ను...గిప్పుడు పోలీసోళ్ళు పిలిషిల్లంటే అదింక వొర్రుతది...

సరె అది పోనీయ్‌రా...ఏం లేదురా పొద్దుగాళ కొందరు సార్లు మన బస్తీకొచ్చిండ్లు...గప్పుడు నేను మన బండకాడున్న. ఎంకటేశ్వర్లు ఇళ్ళు ఎక్కడా అని అడిగిండ్లు...షాన మంది ఎంకటేశ్వర్లున్నరు...టీచర్‌ ఎంకటేశ్వర్లా...ఫైనాన్స్‌ ఎంకటేశ్వర్లా...బంగారం షాపాయన్నా...షావుకారి ఎంకటేశ్వర్లా అని అడిగినా...వాళ్ళు కన్నెబోనం ఎంకటేశ్వర్లు కావాలన్నరు...ఈ కన్నెబోనం ఎంకటేశ్వర్లు ఎవడని షానా సేపు సొంచాయించినం అక్కడున్నోళ్ళమంత...అట్లాంటి పేరు గళ్ళోడు గీ బస్తీ లేడని చెప్పినం...అందులో ఒక ఆఫీసరు నన్ను పక్కకు పిలిచి ఇప్పటిదాక మేం తిరిగినం గని వీని అడ్రస్‌ దొరకలేదనీ...జర వాని అడ్రస్‌ దొరకబట్టి సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌ తీసుకురా అన్నరు.

ఎందుకని అడిగిన నేను...అవన్నీ తర్వాత చెప్తం...ఇంకా కొంతమందిని దొరకబట్టేదున్నదని కదిలిండ్లు...గంతే
ఇగ నేను పొద్దటిసంది తిరుగుతాన నీ కోసం...తిరిగితే నువ్వేడ దొరుకుతానవ్‌... నువ్వున్నదేమో కిరాయి కొంపాయే...నీకేమన్న ఒక సెల్‌ఫోనన్నా ఉన్నదా తొందరగా దొరకబట్టనీకి...లాస్టుకు దొరకబట్టినమ్‌ నీ ఇళ్ళు...మేమేమో నీ కోసం తిరుగుతాంటే నువ్‌ రాజాసాబ్‌లాగా ఇంట్ల పంటివి...

ఏం చెయ్యాలె బాంచెన్‌ వట్టప్పుడే బతుకుడు గగనమైతాంది...గిప్పుడు చిల్లరల్లేక బ్యారాలేడున్నయ్‌...చెప్పిన గద వారం ఐతాంది బ్యారానికి పోక...

సరేరా గది పోనీగని నీకు చెప్పలేదారా ఎంకా...ఎందుకు పిలిచిండ్లో

చెప్పలే...

ఏమేం అడిగిండ్లురా

గదే అయ్యా ' నువ్వేం చేత్తవ్‌...నీ ఆందాన్‌ ఎంత...ఇంతకు ముందేం చేసినవ్‌ అని షాన అడిగిండ్లు...కొన్నేమో చెప్పిన కొన్నేమో నాకర్థం కాలె...'

ఇంకేం అడిగిండ్లురా

ఎమ్మో అయ్యా నీకు పాన్‌ ఖాతా ఉందా అన్నరు...నాకు మందు అలవాటుంది గని నేను పాన్‌ తిననని చెప్పిన...అందరు ఒకళ్ళ మొఖాలు ఒకళ్లు చూసుకుని ఒకటే నవ్విండ్లు...నాకర్థం కాలే వాళ్ళెందుకు నవ్విండ్లో

ఓర్నీయవ్వా...అది పాన్‌ షాప్‌ ఖాతా కాదురా పాన్‌ అని ఒక ఖాతా ఉంటది అదడగవచ్చు

కావచ్చునే...బ్యాంక్‌ పుస్తకం గురించి కూడ అడిగిండ్లు

సరే సరేరా నేను వచ్చేటప్పుడు గీ సంగతేందో తెల్సుకోమని ఆ కానిస్టేబుల్‌ చేతుల ఐదొందలు పెట్టిన...వాడు ఏ గంతెందుకన్నా అని వంద కాయితం చాలన్నడు...వాడు మనోడే...వానికి చెప్పిన...నువ్వేం ఫికర్‌ చెయ్యకు...వాడు సంగతేందో తెల్సుకుని పొద్దుగాళనే చెప్తనన్నడు...

నా అట్లాంటోనికి సాయం చేత్తె పుణ్యమొత్తదే...నీ సొమ్మేం ఉంచుకోనే...

సరే తీరా...ఇగ పా పోదాం నాకు వేరే పనున్నది...

చేసినోనివి చేసినవ్‌ కొంచెం ఇంటిదాకా వచ్చి నా పెళ్ళాంకొక మాట చెప్పవే...లేకపోతే అది గయ్యిన లేత్తది...

సరే పా అంటూ కౌన్సిలర్‌ పాపయ్య బండి స్టార్ట్‌ చేసిండు.

ఎంకన్ని ఇంటికాడ దింపి ఎంకని పెళ్ళాంకి సర్ది చెప్పి అక్కడినుండి కదిలిండు పాపయ్య.

కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తిందామని కూసున్నడు ఎంకడు...కొంచెం భయం భయంగానే. అసలేమైందని పెళ్ళాం ఎక్కడ అడుగుతదోనని...

ఎంకని పెళ్ళాం రత్నం ఎందుకనో పరేషాన్ల ఉంది. ఎంకనికి అన్నం పెట్టి పోయి ఓ మూలకు కూసుంది. దీన్ని కదిలిస్తే ఎందుకొచ్చిన లొల్లి అని జల్దిన పచ్చడితో నాలుగు మెతుకు తినేసి పక్క మీద ఒరిగిండు ఎంకడు. కాని ఓ కంట పెళ్ళాంను కనిపెడ్తనే ఉన్నడు. అది ఏదో బాధలో ఉందనే విషయం అర్ధమైంది ఎంకనికి. ఒక్కసారిగా మనసంత ఎట్లనో ఐంది...ఆలోచన్ల పడ్డడు ఎంకడు

'' ఎల్లీఎల్లని సంసారం బాధలు...దాన్ని ఏమనేదున్నది...రోజు చేసుకుంటనే బతుకుడాయే...పెద్ద నోట్లేమోగని ఒక్కసారి బతుకంత పరేషానైతున్నది...భవిష్షత్‌‌ల గిది మంచికో చెడుకో గని గిప్పుడైతే షాన ఇబ్బంది పెడ్తాంది...''
అవ్వ శాంతవ్వను వెతికిండు...అవ్వ ఓ మూలన నిద్రబోతాంది...నిన్న అవ్వ పించన్‌ కోసం బ్యాంకుకు బోయి అడ్డం బడ్డ విషయం గుర్తొచ్చి షాన బాధపడ్డడు...

''ఐన ఉన్నోని దగ్గర పైసలు జప్తు చేత్తె ఐపోయేదానికి...గింత మందిని ఆగమాగం చేసుడు ఎందుకో...కొన్ని రోజులు గిట్లున్నా...తర్వాత మంచిగనే ఉంటదంటాండ్లు గని సూడాలే ఏమైతదో...ఐనా ఉన్నోడు ఎవ్వడొత్తలేడు బ్యాంకుకు వాళ్ళ రూపాలెట్ల మారుతానయో...ఉన్నోడొక్కడు బ్యాంకుకు రాంది నల్ల పైసల్‌ బైటికెట్ల వత్తయో...ఎవ్వడేం చేసిన తిప్పలొచ్చేది పేదోనికేనంటూ''...రకరకాలుగా ఆలోచిస్తూ ఏ అర్థరాత్రో నిద్రబోయిండు ఎంకడు.

......................

తెల్లవారింది.

ఎంకడు లేవకముందే లొల్లి లొల్లి వినబడుతున్నది. ఆ లొల్లితోనే ఎంకనికి తెలివొచ్చింది. లేద్దామనుకున్నడు కాని రత్నంతో మున్సిపాలిటీలో స్వీపర్‌ పని చేసే రత్నం గ్యాంగంతా మాట్లాడుకుంటున్న మాటల లొల్లి విని అట్లనే పక్క పైన కదలకుంట పన్నడు.

వాళ్ళు షాన బాధగా మాట్లాడుకుంటున్నరు.

ఎల్లీ...అసలు నీ నోరు కొంచెం చిన్నగుంటె ఐపోయేదె...మన కట్టాలన్నీ తీరేవి-రత్నం

ఏం జెయ్యాల్నే సూడక సూడక చూసెసరికి నాకు దడచ్చింది...ఆ దడతోనే గట్టిగ వొర్రిన...గిట్లయితదని అనుకోలే నా మీదొట్టు...ఏడుస్తున్నది ఎల్లి

వొర్రితె వొర్రినవ్‌ గని ఈ విషయం మనమధ్యనే ఉంటె ఐపోయేది...తలా ఇంత వచ్చేటియ్‌...పోయి బ్యాంకుల ఏసుకునేటోళ్ళం...గా జవాన్‌గానికి ఈ విషయం తెల్సి చెత్తచెత్తయ్యింది...అసలు జవాన్‌కు ఎట్ల తెలిసిందో అర్థమైతలేదు-ఈరమ్మ

మన గ్యాంగులనే ఎవళో పుణ్యాత్ములు వానికి చెప్పిండ్లు...గ్యాంగుల పది మందున్నరు...మనిషికి రెండు లక్షలచ్చేటియ్‌...చేతులారా పోగొట్టుకున్నటయ్యింది-గౌరమ్మ

నాకైతే నిన్నట్నుండి మనసుల మనసు లేదే...ఆ జవానుగానింట్ల పీనుగెళ్ళ..వానికి తెలిస్తే మనకింత ఇచ్చి వాడింత తీసుకుంటె ఐపోవు-రత్నం

అవునే జవానుగాడు వాని చెత్త బుద్ది పోనిచ్చుకోలే...వాడు మొత్తం తీసుకుందామనె ఆశతో మనల్ని బెదిరిద్దామని వాని దోస్తుకు చేప్పే...వాని దోస్తు ఊకుంటడా అసలే వాడు కానిస్టెబుల్‌ ఆయే...వానికి ఆశ పుట్టి మనందర్ని బెదిరించి వాడు తీసుకపోదమనెసరికి వాళ్ళ సారు ఎస్సయికి తెలిసె...లాస్టుకు ఎవ్వనికి కాకుంట ఐపాయె-మల్లమ్మ

పోతేపోని మనకు పైసలెప్పుడు బాకీ ఉన్నయని ఒక్కచిత్తం చేసుకుందమంటే మనల్ని పోలీస్‌ ఠాణాకు పిలిచే...చివరికి మనమే మనిషి వెయ్యి రూపాలు దండుగ గట్టే పరిస్థితి వచ్చే, ఇయ్యాల ఎట్లయినా కట్టాలె-ఈరమ్మ

ఇగ పోలీస్‌ఠాణాకు పోతే దండుగ కాకుంటె ఇంకేమున్నది...అంత నాదే తప్పు ఆ దేవునికేం పాపం జేసినం...ఎవడో పైసలెక్కువై ఆ రోడ్డుమీదేత్తే...అందినట్టే అంది మాయమే ఐనయ్‌...మళ్ళీ ఏడ్వసాగింది ఎల్లి

ఎల్లి ఏడ్పు చూసి అందరూ శోకాలు పెట్టిండ్లు.

పోలీస్‌ ఠాణా అంటేనే దండుగ కట్టుడేనాయె...మాట వినంగనే ఎంకనికి పై పాణాలు పైనే పోయినయ్‌... బిక్కచచ్చిపోయిండు ... వణుకుడు మొదలైంది. పాపయ్య గుర్తొచ్చిండు.

కాసేపటికి రత్నం గ్యాంగు ఎటోళ్ళు అటు ఎళ్ళిపోయినంక చటుక్కున లేచి పాపయ్య ఇంటికి ఉరికిండు...ఎంకడు లేవంగనే ఎటురుకుతున్నడో అర్థం కాక రత్నం అలాగే చూస్తూ ఉండిపోయింది...వారం నుండి రోజూ పచ్చడే ఐతాంది కడుపు పచ్చి చేసి కట్టకెళ్తున్నడేమోనని తన పనిలో తాను పడిపోయింది రత్నం.

పాపయ్య ఇంటికి చేరి అమాంతం పాపయ్య కాళ్ళ మీద పడ్డడు ఎంకడు ''అయ్యా బాంచెన్‌ నాకు భయమైతాంది..పోలీస్‌ ఠాణాకు పోతే దండుగ కట్టుడేనని భయమైతాందయ్యా...నన్ను నువ్వే రక్షించాలయ్యా'' అంటూ

అరెయ్‌ లేరా...పొద్దుపొద్దుగాళ్నె నువ్‌ పరేషాన్‌ గాకు నన్ను పరేషాన్‌ జెయ్యకు-పాపయ్య

అయ్యా...అట్లగాదయ్యా...నా బాధర్ధం చేస్కోవె జర...నీకు దండం బెడ్త

అరె చల్‌ గాడ్ది...జర ఆగు గా కానిస్టేబుల్‌కి ఫోన్‌ చేత్తా విషయం చెప్తడు

జర చెయ్యండయ్యా...బాంచెన్‌

చాలా సేపటికి కలిసింది కానిస్టేబుల్‌కి ఫోన్‌

కానిస్టేబుల్‌ '' రాత్రే ఒక విషయం తెలిసింది...ఫోన్ల కాదు నేనే వస్తానాగు కలుద్దాం '' అన్నడు

ఇప్పుడు పాపయ్యకు గుబులు షురువైంది అసలేమై ఉంటదని...సోంచాయించవట్టిండు.

చాలాసేపటికి గంభీరంగా వచ్చిండు కానిస్టేబుల్‌...పాపయ్యను పక్కకు తీసుకపోయి విషయం చెప్పిండు. విషయం వింటూ వింటూనే పాపయ్యకు షాక్‌ కొట్టినంత పనై ఎంకన్ని ఎగాదిగా చూసాడు...ఇదేమి అర్థం కాని ఎంకడు అయ్యా ఏమైందయ్యా ' అంటూ వణికిపోతున్నాడు.

పాపయ్యకు ఎంకనికి ఈ విషయం చెప్పడానికి నోట్లోనుండి మాట రావడం లేదు.

''కోటి రూపాయలా '' కలవరిస్తున్నాడు పాపయ్య

''ఏమైందయ్యా....చెప్పండయ్యా ''ఎంకడు పాపయ్య కాళ్ళు పట్టుకుని

పాపయ్య వెంటనే '' ఒరేయ్‌ నేనే నీ కాళ్ళు పట్టుకుంటర...ఇప్పుడు నువ్వు ఎంకనివి కాదురా...ఎంకటేశ్వర్లురా

అయ్యా బాంచెన్‌ ఏమైందయ్యా గట్లంటున్నరు...ఏమైందో చెప్పయ్యా...నాకు షాన భయమైతున్నది

ఎట్ల చెప్పాలెరా...ఇనంగనే నాకే చెమటలు పట్టినయ్‌ నీకు చెప్తె సచ్చేపోతవ్‌..

కొత్తగ సచ్చేదేముందయ్యా...రోజూ సత్తనే ఉన్న...నువ్వు చెప్పకుంటె ఇక్కన్నే సచ్చేటట్టున్న

చెప్పమంటవా...

చెప్పండయ్యా...ఈ టెన్సన్‌కి గుండె ఆగేటట్టున్నది

నీ అకౌంట్‌లో కోటి రూపాలున్నయటరా...

'కోటి రూపాలా...అయ్యా నిజంగానా' అంటూ దీర్ఘాలు తీస్తూ గుండె బరువెక్కి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఎంకడు

గుండాగి సచ్చిండా ఏందోనని కానిస్టేబుల్‌,పాపయ్య ఎంకన్ని గట్టిగ ఊపిండ్లు

కాసేపటికి తేరుకుని పిచ్చిగా అరుస్తున్నడు ఎంకడు...ఆనందం పట్టలేక. నిజమో కాదో అర్థం కాక...నిజమా అయ్యా అంటూ అడుగుతూనే ఉన్నాడు...

నిజమేరా...'పోలీసన్నా జర నువ్వన్న జెప్పరాదే వీనికి'... నేను చెప్తె వీడు నమ్ముతలేడు

నిజమేనన్నట్టు తలాడించాడు కానిస్టేబుల్‌

అసలేమైందిరా ఎంకా...ఎట్లచ్చినయ్‌ నీ అకౌంట్లకు గిన్ని పైసలు-పాపయ్య

అమ్మ తోడు నాకు తెల్వదయ్యా...మీరు చెప్తెనె నాకు తెల్సింది

సరె తీరా...ఎవడో పైసలెక్కువై నీ ఖాతాలెయ్యచ్చురా...అంటూ ఎంకన్ని కాస్త కుషీ చేయనీకి

'ఒరేయ్‌ ఏం చేస్తావురా ఆ డబ్బుతోటి అనడిగిండు పాపయ్య

మా శాంతవ్వను పెద్ద దవాఖాన్ల ఏస్తనయ్యా ఫస్టు...మా రత్నాన్ని పని బంజేపిస్త...అంటూ తన కోరికను చెబుతూనే ఉన్నాడు ఎంకడు.

ఆ పేదవాని చిన్నచిన్న కోరికలను వింటూనే పాపయ్య కండ్లనుండి నీళ్ళు టపటపా కారుతున్నాయ్‌.

ఎంకనికి అక్కడ నుండి వెంటనే ఇంటికి వెళ్ళి ఈ విషయం రత్నంకు తన అవ్వకు చెప్పాని మనసు తండ్లాడతాంది.

ఇంటికి చేరుకున్నాడు ఎంకడు. విషయం రత్నంకు చెప్పాడు. నిజమా అయ్యా అంటూ రత్నం ఎగిరి గంతేసింది.
ఈ విషయం అవ్వకు చెబ్దామని చుట్టూ చూసి అవ్వ కనిపించకపోయెసరికి అవ్వ ఏదే అనడిగిండు రత్నాన్ని.

'పించన్‌ కోసం బ్యాంకుకు పోయింది నువ్వు లేవకముందుకే...లేటైతే మంది ఎక్కువైతరని'...చెప్పింది రత్నం
అరె నిన్ననే అది నిలబడి నిలబడి అడ్డం పడ్డది కాదే... ఎంకడు

ఏం జేత్తం మన కష్టం సూడలేక పించన్‌ పైసలన్న వస్తే కొన్ని రోజులు గడిచి పోతయని పోయింది.

చిన్నప్పటిసంది తనకోసమే రెక్కలుముక్కలు చేసుకున్న అవ్వ కష్టాన్ని యాది చేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నడు ఎంకడు...ఎంకనితో కలిసి రత్నం ఏడ్వసాగింది.

ఇద్దరూ ఒకళ మీద ఒకళు పడి ఒక దమ్ము ఏడ్సి తమ కష్టాన్ని ఆ దేవుడే తీర్చబోతున్నడని సంతోషంతో కండ్లు తూడ్సుకున్నరిద్దరు.

బ్యాంకుకు పోవాలన్న ఆరాటంతో బ్యాంక్‌ బుక్కు కోసం ఎంకుళాడి సందిగళ ఉన్న బ్యాంక్‌ బుక్కు దొరకబట్టిండ్లు. షానా పైసల్‌ గద ఒక్కన్ని పోవుడెందుకు పాపయ్యను గూడ తీస్కపోదామనుకున్నడు ఎంకడు. రత్నం నేనొస్తనన్నది. సరేనన్నడు ఎంకడు . పెళ్ళికి పోతానట్టు రత్నం పాత చీర విప్పి కొంచెం మంచిది కట్టుకుంటాంటె ఎంకడు మురిసిపోయిండు. ఎంకడు సుత ఉన్నదాంట్లో కొంచెం మంచి అంగి తొడుక్కున్నడు. నడ్సుకుంటనే పోదమనుకున్నరు గని లేటైతదని ఆటో ఎక్కిండ్లు. ఆటో కన్న వేగంగా వాళ్ళ ఆరాటం ఉరుకులాడంగ బ్యాంకు ముందరికొచ్చిండ్లు. బ్యాంకు ముందర ఆ సముద్రమంత లైనును చూసి పరేషాన్‌ ఐనా ఎంకడు రత్నాన్ని అక్కడ కూసోమని చెప్పి లైన్ల నిబడ్డడు.

షానా గంటలు లైన్ల నిబడి చివరికి బ్యాంకు లోపల అడుగు పెట్టిండు. చేతులు వణుకుతున్నయ్‌ ఎంకనికి సంబురంతో. గుబులుతో.

బ్యాంకులంత ఆగమాగముండి ఎంకన్నెవ్వడు పట్టించుకోకపోయెసరికి అక్కడ సదువుకున్న పోరడు కనబడ్తె వాన్నడిగిండు

''రోజుకెన్ని పైసల్‌ తీసుకోవచ్చని...''

నాలుగు వేలు

నాలుగు వేలేనా...అయ్యో ఎక్కువ తీస్కోరాదా అని అడిగిండు ఎంకడు పరేషానైతు

నాలుగు వేలు...గంతేనన్నడు ఆ పోరడు

గట్లయితే ఎన్ని రోజులు తిరుగాల్నో అనుకొని ఆ పోరనితోనే విత్‌డ్రాయల్‌ ఫాం నింపించి గుండె దడదడ కొట్టుకుంటాంటె జనాల్ని నెట్టుకుంట క్యాష్‌ కౌంటర్‌ దగ్గరికి బోయి ఫాం ఇచ్చిండు.

అక్కడ క్యాషియర్‌ ఫాంను అటు ఇటు పరిశీలించి కంప్యూటర్ల చెక్‌ చేసి చెప్పిండు...'నీ ఖాతాల పైసల్లేవు' అని.

పాణం బోయినంత పనైంది ఎంకనికి.

'ఉన్నయయ్యా మళ్ళొకసారి చూడండయ్యా' అన్నడు

'నీది జీరో అకౌంట్‌. రూపాయ్‌ లేదు...'గట్టిగ సమాధానం చెప్పిండు క్యాషియర్‌.

గొంతులోంచి మాటరాక 'అయ్యా ఒక్కసారి కన్నెబోనం ఎంకటేశ్వర్లు పేరున చూడండయ్యా...'ఎంకడు దీనంగా క్యాషియర్‌ని బతిలాడిండు.

అరె చెప్తాంటె నీకు మెదడులేదా...నువ్వు ఒక్క రూపాయ్‌ ఎయ్యంది ఎట్లుంటయ్‌ వయా పైసల్‌...పో ఒర్రియ్యకు... గదే పేరు మీద చూసిన గని...అన్నడు క్యాషియర్‌ కోపంగా

ఇక చేసేది లేక ఎంకడు మొత్తం నీరు గారిపోయి ''సారు మా కౌన్సిలర్‌ పాపన్న నీ ఖాతా పైసలున్నయంటెనే వచ్చిన లాస్టుకొకసారి సూడరాదయ్యా '' అంటూ రెండు చేతుల దండం బెట్టిండు

దీనంగ అడుగుతున్న ఎంకన్ని చూసి జాలనిపించి ''మీ కౌన్సిలర్‌ ఎవళకో చెప్పబోయి నీకు చెప్పినట్టున్నడు...నీ పేరుతోనే వంద ఖాతాలున్నయ్‌ ఈ బ్యాంకుల'' అని మళ్ళొకసారి కంప్యూటర్ల చూసి అడ్డంగ తలూపిండు క్యాషియర్‌.

చివరిసారి క్యాషియర్‌ పైసల్లేవని చెప్పడంతో ఎంకడు సల్లబడ్డడు. అట్లనె ఏడుస్తూనే బయటికొచ్చిండు.

బ్యాంకు బయట రత్నంను సూడగానే దు:ఖమాగలేదు...రత్నం మీదబడి వలవల ఏడ్చిండు ఎంకడు.

మనం కట్టపడ్డయే మనకు దక్కుతలేవు...పోనీయయ్యా...మన తలరాతింతే అంటూ ఎంకన్ని ఓదార్చింది రత్నం.

రత్నంకు దు:ఖం రావడం లేదు. మొండిగా నడుస్తూ ఎంకన్ని తీసుకొని ఇంటిదారి పట్టింది.

ఎంకడు,రత్నం వాడలో వాళ్ళ ఇంటికి దగ్గరగా వస్తున్న కొద్ది లొల్లి లొల్లిగ ఉన్నదక్కడ.

వాడలో జనం గుమిగూడి ఉన్నరు.

ఆ జనం మధ్యలోంచి నిర్జీవంగా మారిన ఎంకని అవ్వ.

ఎంకడు పిడికిలి బిగిస్తున్నడు.

ఎంకనికి ఏడ్పురావటం లేదు.

-డా.చింతం ప్రవీణ్‌ కుమార్‌
9346886143

English summary
Chintham Praveen Kumar Telugu short story reflects the effect of demonitastaion on poor people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X