• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తరమొచ్చింది (కథ)

By Pratap
|

'ఓ యాడీ...' అని సైకిల్‌ బెల్లు కొట్టుకుంటూ పిలిచాడు నారయ్య. 'ఎవరో పిలుస్తున్నట్టుందే' అనుకుంటూ గబగబ గుడిసెలోంచి బయటకు వచ్చి చూసింది బాజుబాయి. 'నారయ్య నువ్వా! గీ పొద్దు వచ్చినవ్‌' అని అడుగుతుండగానే బాజు చేతిలో లెటర్‌ పెట్టిండు. 'ఎక్కడి నుండి వచ్చిందయ్యో ఈ కారటు' అని ఆత్రుతగా అడిగింది బాజుబాయి. 'చెన్నపట్నం నుండి అంటూ వెళ్ళిపోయిండు. నారయ్య తొందర్లో ఉన్నట్టున్నాడు పోనిలే అని ఆ ఉత్తరాన్ని తీసుకొని ఈ కారట్లో ఏముందో ఏమో?'.......... ముస్లోడు కూడా లేడే! ఎవరొస్తారా, ఎవరితో చదివించాలా అని ఆమె కళ్లు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆ ఉత్తరం కొడుకు నుంచే వచ్చిందేమో అన్న తలంపు మదికి తట్టగానే కొడుకు ఎక్కడున్నాడో, ఏం తిన్నాడోనని గతంలోకి వెళ్ళిపోయింది బాజుబాయి.

సరిగ్గా పద్దెనిమిదేండ్ల క్రితం తండ్రి మందలించాడని అలిగి ఇంట్లోనుండి వెళ్ళిపోయిండు పార్థు. పోతూ పోతూ కొన్ని ఫొటోలు దిగి సూట్లో పెట్టిమరీ వెళ్ళిండు. 'ఒరే నాయనా చదువుకోరా! చదువుకుంటే కలెకటర్‌ అవుతావు' అని బాజుబాయి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. బడి ఎగ్గొట్టి సోప్తిగాళ్లతోటి సినిమాలకు, సికార్లకు తిరిగేటోడు. ఆడ్ని చూసి ఊళ్ళో అందరూ నీకొడుకు హీరోలా ఉన్నాడంటుంటే లోలోన మురిసిపోయేది బాజుబాయి. కానీ చిరంజీవిలాగ హీరోనయ్యి తిరిగి వస్తానని ఉత్తరం రాసిపెట్టి పార్థు పోతాడని కలలో కూడా ఊహించలేదు. పాపం ఆ పిచ్చితల్లి ఎప్పుడూ ఫొటోను పట్టుకొని ఎదురుపడ్డవారినల్లా ''మా పార్థు ఎక్కడైనా కనపడిండా అయ్యా అని దీనంగా అడుగుతూ ఉంటుంది.

అంతలో కొట్టంలో గొడ్లను కట్టేస్తున్న బాజుకి బస్సు వచ్చిన చప్పుడు వినిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిచూస్తే తండా స్టేజి దగ్గర బస్సు ఆగి ఉంది. జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. బాపురే ఈ జనంలో ముస్లోడు బస్సు ఎక్కిండో లేడో అనుకుంటూ చేతిలో ఉన్న కట్టెను తాడును కింద పడేసి ముందుకు సాగింది.

Dr Surya Dhanjay has depicted the life tribals

అందరినీ తోసుకుంటూ ఆగమాగంగా ఊడిన గోసిని సర్దుకుంటూ వస్తున్న భీక్యా చేతిలోని మూటను అందుకుంది బాజు. ''ఏందయ్యో గియ్యాల ఇంతమంది ఉన్నారు'' అన్న బాజు మాటలు పూర్తికాకముందే ''ఇయ్యాల శనివారం మిర్యాలగూడ అంగడి కదా! అందుకే ఇంత ఇరగబడుతున్నరు జనం. ఎన్ని బస్సులున్నా సాల్తలేవు'' అని గొణుక్కుంటూ ఇంటిముందు పడి ఉన్న నులక మంచం మీద కూలబడ్డాడు భీక్యా.

''ఇదిగో చూసినవ అయ్యా ఈ కారటు చెన్నపట్నం నుండి వచ్చిందట సూడు సూడు'' ఆదరబాదరగా లెటరు తన భర్త చేతిలో పెట్టింది. ''జరథమ్‌ నీయ పాణి పీయెద'' (కాస్త ఆగవే నీళ్ళు తాగనీయు) అంటూనే ఉత్తరాన్ని అందుకున్నాడు. ఉత్తరం చదువుతున్న భీక్యా కళ్ళనుండి ధారగా కన్నీళ్ళు కారడం చూసి ''యాడీయే ఏం అయిందో సెప్పయ్య'' అంటూ లబోదిబో మొత్తుకుంటుందిబాజుబాయి. మన పార్థూ జాడ దొరికిందే. ''ఈసారి పెద్దోడిని తోలుకొని పోతా. లేక పోతే ఆల్ల భాష మనకు రాదు. మన భాష ఆల్లకు రాదని''. బాజుబాయితో చెబుతూ మంచాన ఒరిగిండు భీక్యా. మంచాన ఒరిగిన భీక్యకు క్రితం సారి కూడా ఇలాగే ఉత్తరం రావడం, ఎంతో ఆశతో ఆ అడ్రసుకు వెళ్ళడం, అక్కడ పార్థు లేక పోవడం, ఉత్తరం నెల రోజులు ఆలస్యంగా పోస్ట్‌మ్యాన్‌ తెచ్చివ్వడం వల్ల భీక్య ఆలస్యంగా ఆ అడ్రసుకు చేరుకోవడం ఇవ్వన్ని ఒక సారిగా కళ్ళలో రీలు లా తిరిగాయి. ఎంతకీ నిద్రపట్టడం లేదు. అందుకే పొద్దున్నే పట్నంలో ఉన్న కొడుకు దగ్గరకు బయలుదేరాలని ఇద్దరు అనుకున్నారు.

ఆ రోజు రాత్రి మబ్బులు పట్టి వర్షం మొదలయింది. రాత్రంతా ఆగకుండా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఎప్పుడు తెల్లవారుతుందా! కోడి ఎప్పుడు కూస్తుందా! అని కోళ్ళ గూడు వైపు చూస్తూ... తెలవకుండానే నిద్రలోకి జారాడు భిక్యా. పక్కనే ఉన్న బాజుబాయికి తమామ్‌ నిద్రపట్టడం లేదు. లేసి వర్షంలో తడుస్తున్న దూడలను కొట్టంలో కట్టేసి గడ్డివేసింది. గంపకింద ఉన్న పిల్లల కోడిని ఇంట్లోకి తోలింది. మేఘాలు ఉరుముతుంటే అర్జునా, హరిహర, మహదేవ అంటూ జొన్నలను తెచ్చి బయట చల్లింది. ఇంట్లో మూలన ఉన్న గడ్డపారను ఇంటిముందు వేసింది. మళ్ళీ వెళ్లి కాసేపు మంచం మీద అటూ ఇటూ దొర్లింది. అయినా నిద్ర పట్టలేదు బాజుకి. వర్షం కొంచెం తేరుకోగానే పొయ్యి ముట్టించింది. ఇరవై దాకా జొన్న రొట్టెలు చేసింది. ఉల్లి గడ్డ కారం దంచి సద్ది కట్టింది. ''ఏందయ్యో లే! లే! ఇంకా నిద్రొస్తొందా నీకు'' అన్న బాజు మాటలు చెవుల సొరబడి గబాలున లేసిండు భీక్యా. పంతలో నుండి వేడి నీళ్ళు తీసుకొని స్నానం చేసి అప్పటికీ బాజు సర్దిపెట్టిన జొన్న రొట్టెల సద్ది పట్టుకొని బస్సుకోసం రోడ్డుమీదకొచ్చి నిలబడ్డరు ఇద్దరు.

ఇంకా సన్నసన్నగా చినుకులు రాలుతూనే ఉన్నాయి. రాత్రి వర్షానికి ఊరు చుట్టూ కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అందులో చేప పిల్లలు చెంగుచెంగున ఎగురుతున్నాయి. తండా పిల్లలు గుంపులు గుంపులుగా అక్కడికి చేరి లుంగీలు పట్టి చేపలు పడుతున్నారు. ''రోజూ ఐదు గంటలకు వచ్చే లైటు బస్సు తెల్లగ తెల్లారిన ఇంకా రావట్లేద''ని పరేషాన్‌గా అటుఇటు తిరుగుతున్నాడు భీక్యా. ''బస్సు వెల్లిపోయిందేమో''నని అనుమానం వ్యక్తం చేసింది బాజు. అంతలోనే మారెమ్మగుడి మూల మలుపులో చెట్ల సందుల్లోంచి వస్తున్న బస్సును చూసి సంచిపట్టుకొని ''ఏమేయ్‌! నేను వెళ్లొస్తా! జర ఆవుదూడ భద్రం. దాని మూతికి బుట్టికట్టు. అది మట్టి గిట్టి తినగాల. ఆ భంగారి ముందు పచ్చిగడ్డి వేసి పాలుపిండు. లేదంటే రేపు తినడానికి సల్లబొట్టుకూడ మిగలదు. జాగ్రత్త''! అని ఆదరబాదరగా బస్సెక్కి ఒక సీటుంటే కూర్చున్నాడు. బస్సు కదిలింది. అతని మనస్సు బస్సుకన్నా వేగంగా పరుగెడుతుంది. కళ్ళ నిండా కొడుకును ఎప్పుడు చూస్తానా! చూసి వాడ్ని ఎప్పుడు గుండెలకు హత్తుకోవాల... ''వాడు ఇప్పుడు ఎట్లున్నడో ఏమో! అసలు నన్ను గుర్తు పడ్తడో లేడో'' ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు తన మదిని తొలుస్తూనే ఉన్నాయి. ఒక్కసారి ఊపిరి పీల్చుకొని దేవుడా! వాడక్కడే ఉండాలి. వాడు గినకా దొరికితే 'మంత్రుసాద్‌' గుడి దగ్గర మంచినీళ్ళబాయి తొవ్విస్తానని మొక్కుకుంది. వాడి పిచ్చితల్లి. దాని కలనెరవేర్చు సామి'' అని తనలో తాను మాట్లాడుకుంటుండు భీక్యా.

నార్కట్‌పల్లి బస్టాండులో డ్రైవర్‌ బస్సు ఆపి ''ఎవరైనా టిఫిన్‌ చేసేవాళ్ళుంటే చేసిరండి. బస్సు పదినిమిషాలు ఆగుతుంద''ని చెప్పి బస్టాండులోని హోటల్‌కి వెళ్ళి పోయిండు. భీక్యా తేరుకుని బస్సుదిగి చెట్టు కింద కూర్చొని ముసల్ది కట్టిన రొట్టెల సద్దిని ఇప్పిండు. కాని కొడుకు ధ్యాస తప్పా అతనికి ఏమీ తినబుద్ది కావట్లేదు. ఏం చేయాలో తోచక రుమాల్‌ నుంచి చుట్టను తీసి ముట్టించిండు. హోటల్లోకి వెళ్ళి నీళ్ళు తాగి బస్సెక్కాడు. బస్సు వేగంగా చెట్లను, చేమలను, ఊర్లను దాటుతూ హైవేమీద పరిగెడుతుంది. అయినా భీక్యాకి మాత్రం ఒక్కో నిమిషం ఒక్కొక్క గంటలా గడుస్తుంది. కళ్ళలో కొడుకు రూపమే కదలాడుతెంది. నేను చేసిన చిన్న తప్పుకు ఇన్ని ఏండ్లు శిక్ష అనుభవించా. కాదు కాదు నేను తప్పు చేయలేదు. వాడు సినిమా కోసమని బడి ఎగ్గొట్టినందుకు తండ్రిగా మందలించానే తప్పా ఇందులో తన తప్పేమీ లేదని తనను తాను నిందించుకుంటూ, సమర్ధించుకుంటూ భీక్యా మనస్సు ఎంతో సంఘర్షణకు గురవుతుండగానే బస్సు ఆగింది. ''బాపురే హైదరాబాదు వచ్చేసినట్లుంది'' అనుకుంటూ ఉత్తరం ఉందా లేదా అని జేబును చెక్‌ చేసుకున్నాడు.

మెల్లిగా బస్సు దిగి పెద్దకొడుకు రాజు (రాజునాయక్‌) ఇంటికి చేరుకున్నడు. తండ్రిని చూసి రాజు ''బాపు నువ్వేంది చెప్పకుంటొచ్చినవ్‌'' అని కంగారుగా అడుగుతుండగా ఉత్తరం కొడుకు చేతికిచ్చిండు భీక్యా. అది చదివిన రాజుకు ఒక్కసారిగా తమ్ముడి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. తమ్ముడుతాను చిన్నప్పుడు చేసిన అల్లరి, ఆడిన ఆటలు అన్నీ గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. తన తల్లికి పార్థూ అంటే ఎంత ఇష్టమో వారి అనుబంధం ఎలా ఉండేదో కాసేపు తండ్రి కొడుకులు లోకాన్ని మర్చిపోయి మాట్లాడుకుని ఆలస్యం చేయకండా వెంటనే బయలుదేరారు.

తండ్రికొడుకులు రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలు ఎక్కారు. రైలు చెన్నై చేరుకుంది. బండిదిగి స్టేషన్‌ బయటకు వచ్చి ఆటో ఎక్కి అడ్రస్‌లోని హోటల్‌ ముందు దిగినారు.

హోటల్‌ని చూడగానే భీక్యాకు ఒకింత ఆనందమైన లోపల మాత్రం భయం, ఆందోళన, బాధ కలగలసి కక్కలేని దుఃఖసాగరమేదో ఉబికి వచ్చినట్లయి గజగజ వణుకుతుండు భీక్యా. ''ఏంది నాయనా అట్లా పరేషన్‌ అయితున్నవ్‌ ధైర్యగుండు'' అన్నాడు రాజు. ధైర్యం జాలట్లే బిడ్డా వాడు గీ హోటల్లో ఉండోలేడో. మనల్ని జూడగానే పారిపోతడో యేమో. గాడ్ని సూడకుంటే ఇంగ నేను బతకలేను. వాడ్ని తోలుకు పోకుండా వట్టిగా పోయి మీ యాడికి మొకం జూయించలేను అంటూ బోరున ఏడవ సాగాడు భీక్యా. 'ఊరుకో బాపు ఆ దేవుడు మాత్రం మనల్ని ఇంకా ఎన్నాళ్ళు శరబెడతడు. అంతా మంచే జరుగుతది... రా' ... అంటూ లోపలికి తోలి పోయాడు రాజు.

హోటల్లో ఎదురుగా ఒక లావుపాటి నల్లని మనిషి కూర్చొని ఉండు. చేతికి ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు అతని వెనక దేవుడి ఫొటోలు చూసి అతనే మేనేజర్‌ అని గుర్తించి దక్కరకు వెళ్ళి ఉత్తరం చూపించాడు రాజు. ఉత్తరాన్ని చూసిన మేనేజర్‌ 'పార్థూని పిలచుకు రమ్మని హోటల్‌ సర్వర్‌తో చెప్పాడు. కొడుకు పేరు పలకగానే మిణుగురుల కాంతిలో కనిపించే పువ్వులలోని వెలుగు జాడలు వర్షించి తడి ఆరిన భిక్యా కండ్లలో, కనిపించడం గమనించాడు మేనేజరు.

తన తండ్రి అన్నా వచ్చారన్న సంగతి తెలియని పార్థూ మేనేజరు పిలిచాడని వంట గదిలో గ్యాసు స్టౌ తగ్గించి అటూగా నడిచాడు.

'పార్థూ గురించి కబుర్లేవో మేనేజరు వాళ్ళతో చెబుతున్నాడు కానీ భీక్యాకి అదేమి వినిపించడం లేదు. అదే కాదు చుట్టూ నడుస్తున్న సర్వెంట్లు కనిపించడం లేదు. టేబుళ్ళమీద అప్పటిదాకా చప్పుడైన ప్లేట్లు, గ్లాసుల చప్పుడూ వినిపించడం లేదు. ఒక్కసారిగా చుట్టు నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు భీక్యాకి ఒక్కటే వినబడుతుంది తన కొడుకు పార్థు గుండె చప్పుడు. ఒక్కటే కనబడుతుంది తన గుండెలపై మెత్తగా కదలాడిన చిన్ని పాదాలు తనవైపు నడిచిరావడం.

అదే ఉంగరాల జుట్టు, అదే చేతులూపుడు, అవే చురకైన కండ్లు, మా అయ్యలెక్కనే ఎదురొమ్ము ఎత్తిపట్టి నిటారుగా నడిసే నడక, అనుమానం లేదు ఆడు నా కొడుకే. అవును ఆడు నా పార్థూనే మనసులో లావాను చిమ్ముతున్న అగ్నిపర్వతంలా ఎగిరిపడుతుండు భీక్యా.

మేనేజరుతో ఎవరో నడివయసు మనిషి మాట్లాడడం పక్కన ఒక ముసలాయన ఉండడం దూరం నుంచి అస్పష్టంగా కనబడింది పార్థూకి. 'ఎవరో కస్టమర్లేమో' అనుకుంటూ దగ్గిర దగ్గిరకు సమీపిస్తుండగా వాళ్ళు తెలుగులో మాట్లాడుతుండడం లీలగా వినిపిస్తుంది. అయినీ అదేమీ అంతగా పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరి కొచ్చాడు. అంతే... ఒక్క సారిగా పార్థూ గుండె బద్దలైంది. ఆకాశంలోని మేఘాలు ఒక్కసారిగా గుద్దుకొన్న చప్పుడు గుండెలో మోగింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళల్లో నీళ్ళు చేరాయి. అంతే... బాధతో, భయంతో, దుఃఖంతో, పశ్చాత్తాపంతో కుప్పకూలి పోయాడు పార్థూ.

'బాపు నన్ను క్షమించు'

'ఊకో బేటా సచ్చి నీ కడుపున పుడతా మళ్లా గిసోంటి పని జేయకు'

'నేను మంచి కొడుకుని కాను... ఏం సుఖం లేదు నన్ను కని మీకు'

'నువ్వు కండ్ల బడ్డవ్‌ గది సాల్‌ బిడ్డా'

'మిమ్మల్నిడిసి నేనేమి సుఖపడలే మిమ్మల్ని కదిలినంక సినిమాలో పోలేక, హోటల్ల పని జేస్తూ మళ్లా మీ కాడికి వచ్చి మొకం చూపించలేక సగం జచ్చిన బాధతో'.

'లేదు బిడ్డా అట్లనకు నువ్వు మళ్ళీ పుట్టినవు. ఇయ్యాల మాకోసం... ఇంటికాడ కండ్లల్ల వత్తులేసుకొని జూసే మీ అమ్మకోసం, మళ్ళీ పుట్టినవ్‌. ఆ మంత్రు సాద్‌ దయవల్ల మళ్లీ పుట్టినవ్‌ బిడ్డా...'

పెరియార్‌ హోటలంతా విషాదమయమైంది. పార్థూ, భీక్యా వర్షిస్తున్న దుఃఖసాగరం ప్రేమసాగరమై చుట్టూరా చూస్తున్న వారికి భాష అర్థంకాకున్నా ఎల్లలులేని తండ్రి కొడుకుల ప్రేమ భావం వారి మనసులను తాకి తడిపివేసింది.

ఎక్కి ఎక్కి ఏడ్చుతున్న తండ్రిని తమ్ముడిని కౌగిలించుకొని రాజు కండ్లు తుడుచుకొని 'తొమ్మిది నెలలు అమ్మ కడుపు తమ్ముడిని మోస్తే పద్దెనిమిదేండ్లు పెరియార్‌ హోటల్‌ పార్థుని సాదిందని' మేనేజర్‌కు కృతజ్ఞతగా దండం పెట్టి, హైదరాబాద్‌ రైలెక్కడానికి చెన్నపట్నం స్టేషన్‌ వైపుగా ముగ్గురూ కదిలారు. మంత్రూసాద్‌ ఎక్కడో లేడు తన కొడుకుని తన దగ్గరకు చేర్చిన 'కారట్‌' రూపంలో తన దగ్గరే ఉన్నాడనుకుంటూ జేబులోని ఉత్తరాన్ని కళ్ళ కద్దుకుంటూ ఇద్దరు కొడుకులతో జతకలిసి అడుగులు వేస్తుండు... భీక్యా.

- డా. సూర్యాధనంజయ్‌

English summary
Osmania University Telugu department faculty member Dr Surya Dhanjay has depicted the life tribals in her Telugu short story Uttaramochindi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X