వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కథ: మొగులు

|
Google Oneindia TeluguNews

రిషి బుదారపు

పనికాడికి పోయిచ్చిందన్న మాటేగని. మన్సేం సుద్రాయించుత లేదు లక్ష్మమ్మకు. పొయ్యిమీద బియ్యం పడేసుకుంటనే. ఇంట్లకు బయిటికి తిరుగుతనే ఉన్నది.

"పొద్దుగాల పొయిండు సావుకారు దగ్గరికి ఇంక జాడలేకపాయే పోరడు కడుపు కాలవట్టే" అనుకుంట కొడుకు కోసం గల్మ పొంటి సూత్తనే ఉన్నది. "చో...! కోడిపిల్లలు సల్లగునండ" అనుకుంట గాబుల కెల్లి కొన్ని ఇత్తులు తీశి కోల్ల ముగట వోశింది....

చూరుకు కట్టిన వరి గొలుసుని పొడుసుకు తినే ఊర పిచ్చుకలను సూసుకుంట గల్మలనే గూసుండి కొడుకు కోసం సూడవట్టింది.
"ఈని నెత్తిల నాలుగిత్తులు వడ్తే ఆని సంసారం ఆనికైతది.ఆ నారాయణుడు సల్లగసూత్తె మన్వల సూస్కుంట బత్కచ్చు. అనుకుంట పొంగిపోయే అన్నం గంజు మీది మూత తీయవొగింది.చెయ్యి సుర్రుమనంది సెగకు...

ఆలోశనన్నుంచి బైటవడ్డ లక్ష్మమ్మకు ఇంటికత్తున్న కొడుకు కండ్ల వడ్డడు.

"ఏ కాలమాయెరా..! అగ్గజాం బొఇనోనివి సదలవడ్డంక రావడితివి మొకం సూడు ఎట్ల మీదికచ్చిందో. కాళ్ళు గడుక్కో. బువ్వ తిందువుగని" అంటూ ఉట్టి మీది కూర గిన్నె తీసి కిందవెట్టి. కొంగుతోటి మొకం దూడ్సుకున్నది.

దిగులుగా అరుగుమీద కూసున్నడు మల్లేషు."ఆ అత్తున్న తీయ్యే నాకాకలైతలేదు గని నువ్వుదిన్నవా" నీరసం నిండిన గొంతుతో అన్నడు.

Telugu short story by Budarapu Rishi

"గదేందిరో నువ్వు తినకుంట నేనెట్ల దింట బిడ్దా..! పొద్దుగాల వొఇన పోకట గిప్పుడత్తివి పో పొయి కాళ్ళు గడుక్కోని రా బుక్కెడంత దిను" కొడుకుని బుదురకిచ్చింది.

"సరే తీయ్ అత్తాన" అనుకుంట బాయికాడికి వొయి గోలెం ల్ల నీళ్ళ తోని మొకం గడుక్కుంటున్న కొడుకుని సూశి..
"ఏమైందొ కొడుక్కు నాయిన వొయిన్నడన్న గిట్ల లేడు శావుకారేమన్నడో ఏమో" అనుకున్నది

అన్నం దినకుంట ఒక్కొక్క మెతుకు లెక్కవెడ్తున్న కొడుకును సూశి - "ఏం ఆలోశనరా బువ్వదినకుంట తిను. అవ్ గనీ సావ్కారేమన్నడు" అడగవొయ్యింది.

"మద్యలనే అందుకున్నడు మల్లేషు "మంచెకాడ పాలేరు పంటనన్నడానె.కల్లం కాడ మనిషిలేకుంటే అడ్లగింజలన్ని ఆగమైతయ్. అడివి పందుల ఆప వశం గాదు"

"అవ్వెటువోతయ్ రా..! కాలమంత జేశినం కడుపుగొడ్తడా కార్యంగల్ల దేవుడు" గాలిలనే ఎముడాల రాజన్నను తల్సుకుంట మొక్కింది.

మొదాటి ముద్దను నొసటికాడవెట్టి మొక్కిండు మల్లేశుఒక్కొక్క ముద్దే లెక్కవెట్టినట్టు తింటుండు.సావుకారి మాట ఎట్ల జెప్పాల్నో సమజైతలేదు."గిప్పుడు జెప్తె ఎట్ల ఆగమాగమైతదో అవ్వ" అనుకుంటనే ఉన్నడు. అడ్గనే అడిగింది లక్ష్మమ్మ "సావుకారి దగ్గరికి పోతా అంటివి ఏమన్నడు మరి"అని.

"ఏమంటడే ఇంటికాయిదాలిత్తా అన్నడు కని ముందుగాల మాట పకారం పైసలిచ్చి తీస్కపో అన్నడు"
"గదేంది రా పొలంల అడ్లు కల్లంలకు రానే అచ్చె.మొదటంచె దేవునికిచ్చి కాంట కేత్తా అని చెప్పక పొయినవా" అంటుండగానే సావుకారి ఇంటికాడి సంగతి కన్లల్ల మెదిలిండి మల్లేసుకు

** ** ** **
"నమస్తే సావుకారి అంత మంచేనా" ఇంటి గల్మల్లనే నిలవడి పండ్లు దోముకుంటున్న. సావుకారిని పల్కరిచ్చిండు మల్లేసు.

"ఆఛ్ రా..! రా...!! మల్లెశు ఏం మంచి వయా..! కాల నడిశినట్టు నడుసుడే" నోట్లె పదుంపుల్ల ఆడిచ్చుకుంటనె పల్కరిచ్చిండు.
"ఏంది కత పెండ్లి అనుకుంటాండ్లాట గదా...! తెలంగాణచ్చింది జల్దిన జేస్కోవోయ్" నవ్వుకుంటనే అన్నడు.

సిగ్గుపడ్డడు మల్లేశు "గా సంగతే మాట్లాడదాం అనచ్చిన. గా పైసలు అడ్డి తోటి ఎంతనో చెప్తే పొలం కాయిదాలు తీస్కపోదాం అనుకుంటాన" పక్క పొంటె ఉన్న ల్యాగ దూడను నిమురుకుంట అన్నడు.

"సరే సూద్దమాగు లెక్కలేడికి వోతయ్"అనుకుంట బాయి కాడికి వొయి మొకం గడగవట్టిండు.

"మల్లేశు మంచిగున్నవ చాయ దాగు" అనుకుంటచ్చింది సావుకారి భార్య

"మంచిగనే ఉన్న సావుకారమ్మ..! అనుకుంట శాయ గిలాస తీసుకున్నడు.

"పెండ్లి అనుకుంటాన్లాట గద మీ అమ్మ జెప్పింది మొన్న. పోశవ్వ గుడికాడ గనవడ్డది. నీ పెండ్లి రంది వెట్టుకున్నట్టున్నది. బక్కవడ్డది ముసలామె. మంచిగ సూస్కో" అనుకుంట సావుకారికి తువ్వాలిచ్చి లోపటికి వోయింది.

"ఆ గిప్పుడు జెప్పు వయా ఏంది కత ఎట్ల నడుత్తుంది" అనుకుంట బుక్కు తీశి లెక్కలేసుడు సురువు జేశిండు.

"ఏమున్నది రాజి గాడు మల్ల పోనే జెయ్యక పాయె ఎట్లున్నడో ఏమొ పిసగాడిది" . తను పైసలు గట్టి దుబాయ్ పంపిన దోస్తు రాజి గాన్ని యాజ్జేసుకున్నడు మల్లేశు.

"ఆని కేంది మంచిగనే ఉంటడు నెలకో సారి పైసలు వంపిత్తున్నడు ఆల్లయ్యకు. మావోడే పట్నవొఇనప్పుడల్లా తెచ్చిత్తాండు మనార్డర్లు"

"ఇల్లు గట్టు నాయినా అరకట్నం మంచిగత్తది అన్నడాట"

మొన్నోసారి కనవడ్డడు ముసలోడు ఓ ఆని సోకు గాదు ఆని కత గాదనుకో. నీ పైసల సంగతి కదిలిచ్చినుంటి "పైసల సంగతి నాకేం ఎర్కలేదూ ఆ ముచ్చటే నన్నడ్గకు అన్నడు"

ఈ మాటలిన్న మల్లేసు పానం సల్లవడ్డది.

"ఎహె గీ ముసలోందేమున్నది సావు కారీ....! రాజిగాడు గట్లగాదు" మాటైతె అన్నడు గని దైర్యంగ లేదామాట.

బుగులు వడ్డట్టు అట్లనే కూసున్నడు."అరె నేను దుబాయ్ వోంగనే నీకు పైసల్ పంపిత్త నువ్వు నా అన్నవు నీ పెండ్లి కి దూం దాం ఉంటది సూడు" దుబాయ్ వొయెటప్పుడు రాజిగాడు చెప్పిన మాటలు శెవుల్లనే ఉన్నట్టనిపిచ్చినయ్.

అట్ల ఎంతసేపైందో తెల్వలేదు.

"ఆ ఐపొయింది మల్లేశూ" సావుకారి మాట ఇని కన్లు దెర్శిండు. మొత్తం మూలక్షలా ఎనుభై వేలయ్యింది"

పానం జల్లుమన్నది మల్లేశుకు" గదేంది సావుకారీ..! మా బాపుకు పానం మంచిగ లేనప్పుడు ఇర్వై వెయిలూ. సావునాడు ఉంకో ఇర్వయైదు వేలూ దీస్కున్న. రాజిగాని కోసం మా ఇంటి కాయిదాలిచ్చిన్నాడు యాభై వెయ్యిలు మొత్తం తొంభై అయిదు వేలు అడ్డి తోటి మొత్తం ఎంతయితది?" జరంత కోపంగనే అడిగిండు

"మల్లేసూ రాజిగాడు తీస్కున్నది యాబయ్ ఎందుకాయె రెండు లక్షలు గదా" కొద్దిగ గట్టిగనే అన్నడు సావు కారి
లేదు సావుకారీ..! కాయిదం మీద యాబయ్ వేలే రాపిచ్చిన అన్నడు మా రాజి గాడు" మోసపోయిన అని అర్తమతున్నా
దోస్తు మీది ప్రేమ "మా"రాజి గాడు అనే అనిపిచ్చింది.

"మల్లేసూ కాయిదం నువ్వు సదివినవా..?" మతలబు అర్థమైతాంటే అడిగిండు సావు కారి.

"నాకు సదువు రాక పాయె ఆడు చెప్పినట్టు ముద్ర గుద్దిన గా నమ్మిక తోనే ఆ నాడు నా పానం బాగలేకున్నా ఆన్నే పంపిచ్చిన నేను రాలే మీదగ్గరికి. నాకేం అర్దమతలేదు." కండ్లల్ల నీళ్ళు ఆపుకుంట అన్నడు.

"నాకర్థమైంది మల్లేసూ ఆడు నిన్ను ముంచిండయ్యా" నిన్ను పాగలోన్ని జేసి కత నడిపిచ్చిండు. మల్లేశూ ఇశ్వాసం చూపనీకి నువ్వు కుక్కను పెంచుకోలేదు మనిషిని నమ్ముకున్నవ్"బాదపడుకుంటనే అన్నడుసావుకారి.

కాళ్ళు జేతులు వణుకవట్టినయ్ మల్లేసుకు అట్లనే కూసున్నడు.

"మల్లేసూ నీ పొలం నేను గుంజుకోను నీ కష్టం నాకు తెల్సు గింత పిలగానప్పటి సంది సూత్తున్న. మీ నాయిన గూడ నాకెర్కే గదా..! కనీ నా సంగతి గూడ సూడు మూడు లక్షలు లాస్ గాలేను" మల్లేషు భుజం మీద చెయ్యేస్తూ చెప్పిండు.

"సరే సావుకారీ ఇయ్యల గాకుంటే రేపు నీ పైసలు అప్పజెప్పుత. అని అక్కడ నిలవడకుంట. అచ్చేశిండు...

** ** ** ** **

"ఏమాయెరా గట్ల బీరిపోతివి..!? మల్లేశా" అన్న తల్లి పిలుపుకు ఆలోచన ల నుంచి బయటికొచ్చిండు మల్లెషు
మొకంలకే సూత్తున్న లక్ష్మమ్మ ను సూసుకుంట అన్నంలనే శెయ్యి గడిగి బైటికచ్చి అరుగు మీద గూసున్నడు.
వెనుకనే అచ్చింది లక్ష్మమ్మ...

"అవ్వ మోసపొయిన్నే నాయిన కోసం దీస్కున్నది గాక మల్ల గంత గట్టాల్నాట, అడ్లు మొత్తం అమ్మినా రాజిగాని కోసం తీస్కున్నయి కట్టలేం. నాకు సదువు రాదని సావుకారు దగ్గర కాయిదం ల ఎక్కువ పైసలు రాపిచ్చుకున్నడు" ధుఖాన్ని ఆపుకుంట జెప్పిండు మల్లేసు.

"ఆనింట్ల మన్నువడ, ఆడింకా కట్టలేదా!? ఆల్ల అయ్యకు మనార్డర్లు పంపిత్తనే ఉన్నడాట గదరా"

"సావుకారు అడుగుతె నాకు సంబందం లేదు అన్నడాట ఆల్లయ్య"

"ఆడెట్ల మనిషాయెరా ఆని దినాలు గాను ఆరాలు జెయ్య. నాదోస్తో నా దోస్తో అంటివి. తమ్ముడంటివి. ఆడు దుబాయ్ కి వోయి ఒడ్డుకువడ్డడూ. నాకొడుకు మీద అప్పు పారేశిండు. కౌలుకు జేసుకోని నువ్వు బతికి... ఆని దుబాయ్ గంగల వోను ఆడ నౌకరికి వంపిత్తివి. ఇగ నేనేం జేతురా..అని ఏడువ బట్టింది.

"అవ్వ ఊకోవే నాకో తమ్ముడుంటే ఇట్లనే అందువా!? దేశం కాని దేశం ల ఉన్నడాడు. తల్లసోంటిదానివి దీవెనార్తివెట్టాలె. తిట్లు దాకుతై ఆనికి" అన్నడు.

"తాకనీయ్..! ఎక్కడి పిసోనివి రా..!! ఇంకా ఆని మంచికోసమే సూడవడితివి. నిన్ను ముంచి ఆడు పేరుకత్తాడు సత్యనాశినమై పోతడు" ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూనే ఉంది.

మల్లేశు తల్లిని సముదాయించలేక సాయమాన్ల ఉన్న గడంచెల వొరిగిండు...

గంపల కింది కోల్ల సప్పుడిను కుంట ఏదో ఆలోశన జేసుకుంట అట్లనే కన్నంటుకున్నడు....

** ** ** ** **
"మల్లేశా..! లే బిడ్డా తెల్లారంగనె మొగులువడ్దది.ఆనత్తదో ఏమో ఇత్తులు తడిశినయంటే నోట్లె మన్నువడ్డట్టే. బగవంతా నారాయనా..." అనుకుంట పొయ్యికాన్నుంచే మొత్తుకుంటున్న లక్ష్మమ్మ మాటలకు నిద్ర లేశిండు మల్లేశు.

మెల్లగ బయిటికచ్చి మీదికి సూశిండు మబ్బులన్ని ముసురుకచ్చినయ్.

"దేవుడు మనిషి కాదే ఆడేం మోసం జెయ్యడూ మనుసులనే గులుక్కుంట గోలెం కాడికి వొయి బాయి పక్కకున్న యాపశెట్టు మండ ఇరిశి పండ్లు తోముకుంట రాజిగాన్ని యాజ్జేసుకున్నడు" ఎంత పనై పాయెరా పైస నిన్ను గూడ మార్శె గదరా. అనుకుంట శేద బకీట్లున్న నీళ్ళతోటి మొకం కడుక్కోని. పక్క పొంటి ఉన్న తాటి మొట్టు మీద కూసున్నడు.

చాయ గిలాస వట్టుకోనచ్చిన లక్ష్మమ్మ. కొడుకునే సూసుకుంట "మల్లేసా..! అడ్లు కాంటకెయ్యంగనే సావుకారి పైసలు అయిన కాడికి గట్టు. మిగిలినయ్ అటెంక ఇత్తమని చెప్పు. తెలిశో తెల్వకనో మనం బాకి వడ్డం. ముంచినోడు ముంచే పాయే మనం మాట్రం మాట తప్పద్దు కొడ్కా. పైసలు వొయినా పానమే వొయినా మాట పోవద్దు. ఎంత దొడ్డున్న శెదలువట్టిన శెట్టు మొట్టు కాదన్నట్టు మాట తప్పినంక మనిషి మనిషే కాదు.... నువ్వు బుగులు వడకు నీ కట్టం తిన్నోడు నీ పొయిన జల్మ బాకి కట్టుక పోయిండనుకో లే బిడ్డ...లే... మనాది వెట్టుకోకు"

అంటున్న లక్ష్మమ్మ మొకంలకే సూత్తున్న మల్లేశు బీరి పొయిండు...

గిది మా అవ్వేనా..? నిన్న ఏడుసుకుంట పికిరి వడ్డ మా అవ్వేనా...!!? ఎక్కన్నుంచత్తదింత ధైర్యం? బతుకు తోని కొట్లాడిన అనుభవం గదా అనుకుంట..

మొట్టు మీది నుచి దిగి కింద గూసోని లక్ష్మమ్మ వొల్లో తల్కాయ వెట్టి పండుకున్నడు.

"అవ్వా...! నాకు గియ్యన్ని ఏం ఎర్కనే. కనవడని దేవున్ని నమ్మినోన్ని కనవడే అ మనిషిని నమ్మకుంట ఎట్లుంట. రేపెప్పుడో పంట శేతికత్తదని భూమిని దున్నినట్టు మనిషి పనికత్తడు అనుకోని సయం జెయ్యలే. పైస కోసం గాదు రాజిగాని కోసం ఆని జీవునం కోసమే నేను సాయపడ్డ గంతే అవ్వా. పైస వొయిందని గాదు మనిషి మారిండనే నా రంధి" అనుకుంటనే లేశి నెత్తికి రుమాల్ సుట్టిండు.ఎడ్లబండెక్కి కళ్లం కాడికి బయిలెల్లిండు.......

మొగులు వడ్డ ఆకాశం ల మబ్బుల సాటునుంచచ్చే సూర్యున్నీ కొడుకునూ సూసుకుంట కోడిపిల్లలనిడిశి పెట్టెతందుకు గంపలకాడికి వొయింది లక్ష్మమ్మ....

English summary
Budarapu Rishi's Telugu short story Mogulu for Oneindia Telugu readers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X