వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కథ: జెన్నీఫర్

ఎండ్లూరి మానస రాసిన కథ జెన్నీఫర్. భార్యతో ఓ పురుషుడు తన అనుబందాన్ని నెమరేసుకుంటూ జ్ఞాపకాల దొంతరలతో తేలిపోతుంటాడు. అతని కథ చదవండి.

By Pratap
|
Google Oneindia TeluguNews

నేనూ నా భార్యా ఇరవై ఏళ్ళు ఆనందంగా జీవించాం. ఎందుకంటే అది మా పెళ్ళికి ముందు సంగతి కాబట్టి!

పెళ్ళంటే తెలీదు. ఆడదంటే తెలీదు. సంసారం తెలీదు, సర్దుకుపోవడం తెలీదు. చచ్చేదాకా కలిసే ఉండాలని మాత్రం తెలుసు. భార్యా భార్తలంటే కలిసి బ్రతకడమని నేర్పుతారు గానీ, అది ఎలా అని మాత్రం ఎవరూ చెప్పలేరు. మాకూ ఎవరూ చెప్పలేదు. అందుకే ఈ రోజు ఈ గులాబీ పూలని చూస్తుంటే ఇంత ఆనందంగా ఉంది నాకు.

గులాబీ పూలంటే జెనీకి ఎంతిష్టమో! అదీ తను చనిపోయే ముందు రోజే నాకూ తెలిసింది. గులాబీలంటే తనకెంతో ఇష్టమనీ ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు ఒక్క గులాబీ పూవుని తన సమాధి మీద పెట్టమనీ చెప్పింది. అయితే, తను చనిపోయి ఎన్నాళ్లైందో ఏ రోజు చనిపోయిందో నాకూ తెలీదు! అందరూ జెనీ ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది కాబట్టి నన్ను ఇక 'మామూలు' మనిషి అవ్వమంటుంటారు. వెర్రి వాళ్లు! నా లోకమే జెనీ అయినప్పుడు నన్ను విడిచి వెళ్ళడం సాధ్యమైన పనేనా జెనీకి?

అందంగా పాలరాతి సమాధి...దాని మీద తనకిష్టమైన బైబిల్ వాక్యం-

'అందుకు యేసు పునరుత్దానమును జీవమును నేనే; నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రదుకును'- యోహాను సువార్త పదకొండవ అధ్యయము, ఇరవై ఐదవ వచనము.

Telugu short story by Yendluri manasa

పాలరాతి పై చెక్కించిన తన రూపం...

సమాధి నిండా ఎర్రని గులాబీ పూలు...రేకలు.

కొన్ని మరీ ఎండిపోయి, కొన్ని సగం ఎండి, కొన్ని ఆమె కనురెప్పల్లా నున్నగా!

సమాధి చేసినప్పటి నుండీ ప్రతి రోజూ వస్తూనే ఉన్నాను, నా జ్ఞాపకాల గులాబీ పూలని సమాధి నిండా పరుస్తూనే ఉన్నాను... సమాధి మీద ఆమె జనన మరణ తేదీలు చూస్తూనే ఉన్నాను. అవి కేవలం సంఖ్యలే! ఆదీ కాదు అంతమూ కాదు. ఆమె పూర్తి పేరు మల్లిపూడి జెన్నీఫర్.

ఎన్ని గొడవలు, కొట్లాటలు, అలకలు, తగాదాలు, తఖరార్లు, ఈసడింపులు మా మధ్య!

'ఓరి దేవుడా! పెళ్ళెందుకు చేసుకున్నాన్రా నాయనా' అని అనుకోని క్షణం లేదు. ఈ క్షణంతో సహా.

అదిగో... 'సంవత్సరానికి ఒక్క రోజు గులాబీపూలు పెట్టమంటే రోజూ పెడతావ్! నా మాటకి ఎదురొడ్డడమేగా నీ పని. పైగా నేను చనిపోయిన రోజు కూడా గుర్తులేదు నీకు. అవున్లే! బతికున్నప్పుడు నా పుట్టిన రోజు గుర్తుండేడిస్తేగా' అన్నట్టు నవ్వుతూ కూడా గుర్రుగా నన్నే చూస్తుంది పాలరాతి చిత్రంలోంచి నా జెనీ.

జెనీని పలకరించబోతుంటే నాకు రోజూ గులాబీ పూలమ్మే కుర్రాడు సమాధులు దాటుతూ కింద పడబోయాడు. పట్టుకుందామని వెళ్ళినా జెనీతో గొడవే! ప్రతి దానికీ పేచీ. అయినా తనని ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ఎలా వెళ్ళగలను? ఏదో ఆ పిల్లోడు పడిపోతాడేమోనన్న భయంతో వాడ్ని పట్టుకుందామని పూర్తిగా లెగను కూడా లెగలేదు. ఈ లోగానే తిట్లు, చీవాట్లు వెళ్లొద్దని. ఇంతకీ వాడు పడనేలేదు! చెంగు చెంగున జింకపిల్లలా సమాధుల మీంచి దూకుతూ వెళ్ళిపోయాడు. కిలకిల జెనీ నవ్వుకి గులాబీ రేకలు రెపరెపలాడాయి...

అయినా ఈ చిరాకులు పరాకులు ఈనాటివి కావు. మా పెళ్ళైన మొదటి రాత్రే మొదలైయ్యాయి. ఫ్యాన్ కింద తలపెట్టుకు పడుకోవాలని నేనూ, కాళ్ళు పెట్టుకు పడుకోవాలని జెనీ రాద్ధాంతం చేశాం. ఫ్యాన్ కింద కాళ్ళు పెట్టుకోడం, ఉప్మాలో పాలు పోసుకు తిండంలాంటి వింత చేష్టలు చాలా ఉన్నాయి జెనీ దగ్గర. అసలు ఫ్యానే వద్దని ఆపేశాను. జెనీ మటుకు ఆగిన ఫ్యాన్ కిందే కాళ్ళు చాపుకొని హాయిగా ముసుగుతన్ని పడుకుంది. ఉన్నదీ లేదు ఉంచుకున్నదీ లేదన్నట్టు గాలే లేకుండా పోయింది గదిలో. ఆ రోజు నుంచీ నా కాళ్ళూ ఫ్యాన్ కిందే!

పెళ్ళైన కొత్తలో ఓసారి మా బావ ప్రభుదాసుగాడు వద్దన్నా నాతో అబద్ధం చెప్పించాడు. అలాంటి ఇలాంటి అబద్ధం కాదు 'బంగారం' లాంటి అబద్ధం. ఈస్టర్ పండక్కి మా చెల్లి, అంటే వాడి భార్య జసింత కోసం బంగారం పూత పోసిన గాజులు కొంటూ నన్ను కూడా జెనీకి కొనమన్నాడు. నాకు తన అభిరుచులు తెలీవు, సైజు అంతకన్నా తెలీదన్నాను. అయినా బలవంతంగా నాతో ఏవో రెండు గాజులు కొనిపించాడు. అవి అచ్చంగా బంగారు గాజుల్లానే ఉన్నాయి. ఇంటికొచ్చి జెనీకిస్తే అవి నిజం బంగారం అనుకుని కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకుంది! 'నా మొగుడికి హఠాత్తుగా ఎంత ప్రేమ పొంగుకొచ్చిందీ' అని. వెంటనే నిజం చెప్పబోతుంటే ప్రభుగాడు నన్ను ఆపి 'కొన్ని రోజుల తర్వాత చెప్పు బావా భలే మజాగా ఉంటుంది!' అన్నాడు. ఈ లోగా జెనీ చుట్టుపక్కలందరికీ చూపించింది. కొంతమంది బంగారం కాదని కనిపెట్టి జెనీ మొహం మీదే చెప్పేశారు. నా మీద నమ్మకంతో వాళ్ళతో మాట్లాడడమే మానేసింది. ఒక సారి పక్కింటావిడ పెళ్లికెళుతూ జెనీని ఆ గాజులు అడిగింది ఓ రోజుకిమ్మని. సొరుగులోంచి తీస్తూ గాజులు నల్లగా మారడం చూసి ఖంగు తిని, ఆ పక్కింటావిడకి అవి ఇవ్వలేక ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే జెనీ పెట్టిన పెడబొబ్బలకి భయకంపితుడనయ్యాను! అప్పటి నుంచీ మా ఇంట్లోకి ప్రభుదాసుగాడు, గాజులూ వస్తే ఒట్టు!

ఎన్ని జ్ఞాపకాలు జెనీతో! నా జీవితంలో సగభాగం కంటే ఎక్కువే గడిపాను తనతో. నా జీవితాన్ని రెండు భాగాలు చేస్తే జెనీకి ముందు జెనీకి తరువాత అని చెప్తాను. ఏ విషయం గుర్తుచేసుకున్నా గొడవలే. ఎదురింటామె నా వైపు ఓరగా చూసిందని నా తల పగలగొట్టింది! ఆరు కుట్లు పడ్డాయి.

ఆమె వదలదు, నన్ను వదలనివ్వదు. వదలనివ్వంది జెనీ కాదు. ఆమె సాంగత్యం, సహచర్యం, ఆమె కోపంలో దాగిన స్నేహం, ఆమె రౌద్రం చాటునున్న నిష్కల్మషమైన ప్రేమ.

ఎప్పుడూ ఏకవచనంతో 'ఇదిగో', 'ఓయ్', 'ఏవయ్యా' అని పిలిచేది. పరాయి వాళ్లున్నప్పుడు మాత్రం గౌరవం నటిస్తూ 'ఏవండి' అని సంబోధించేది. నన్ను కాదనుకుని చలనం లేకుండా నిలబడేవాడ్ని. అప్పుడు నన్ను వెనుక నుంచీ ఎద్దుని పొడిచినట్టు పొడిచేది! ఉలిక్కిపడి "ఆ(" అనేవాడ్ని.

హహ్హహ్హ! తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. కాని అప్పుడు పీకల్లోతు కోపం వచ్చేది.

రోజూ యుద్ధాలే! ఎప్పుడు ప్రేమించుకున్నాం గనుక! కూర నచ్చలేదంటే పళ్ళెమిసిరి కొట్టేది. 'ఇదేం అలవాటు!' అంటే మా అమ్మా నాన్నల్ని తిడుతున్నావనేది. చివరికి నేనే తగ్గేవాడ్ని.

ఫోటోల్లో తప్ప జెనీ మొహం ఎప్పుడూ కంపరంగానే పెట్టేది. నేను బయటికెళ్తే తొమ్మిది లోపు వచ్చేయాలి. పోనీ మా ఇంటికే నా స్నేహితులొస్తే ఎనిమిది లోగా వెళ్లిపోవాలి. ఆంక్షలు తప్ప ఆకాంక్షలు ఎక్కడివి? సినిమాకెళ్తే విరిగిన సీటు ఖచ్చితంగా జెనీకే వచ్చేది! ఇక అక్కడ మొదలయ్యే రగడ ఇంటికొచ్చేదాకా పూర్తవదు. పెళ్ళిళ్ళకి, భోజనాలకి వెళుతూ తయారయ్యేటప్పుడు వాచీ కనబడలేదని గొడవ. వెళ్ళాక చీర మీద పెరుగు పడిందని రభస. పనిపిల్ల అంట్లు సరిగ్గా తోమకపోయినా, వాచ్ మాన్ చెప్పిన పని చెయ్యకపోయినా, వాళ్ళని తిట్టే తిట్లు పెట్టే శాపనార్ధాలు కూడా నేనే పడాలి. అబ్బబ్బా! ఎన్ని తంటాలు పెట్టేదో! ఇప్పుడేమీ ఎరగనట్టు చక్కగా నవ్వుతూ శిల్పంగా మారిపోయింది నా జెనీ...

చాలా చిత్రమైన మనిషి! 'ఇది కావాలి' అని అడగదు. తేకపొతే అలుగుడు! నా మట్టి బుర్రకేం అర్ధమైయ్యేది కాదు. తిడుతుందనుకుంటే వాటేసుకునేది. మెచ్చుకుంటుందనుకుంటే మొట్టికాయలు వేసేది. కాఫీ ఇద్దరం ఒకే కప్పులో తాగేవాళ్ళం, ఓ గుటక తనూ ఓ గుటక నేనూ. కాని తన పళ్ళెంలో పక్కన పడేసిన కర్వేపాకు తీసుకుంటే మాత్రం భగ్గున లేచేది! ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో తెలీక తలకొట్టుకునే వాడ్ని. చెప్పిన పని చెయ్యకపోగా వద్దన్న పని పదిహేను సార్లు చేసి చూపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే నెలలు నెలలు నాతో మాట్లాడ్డం మానేసేది. నాకు నేనే 'బతికున్నానా?' అనే సందేహం వచ్చేంతగా తృణీకరించేది. ఆ తిరస్కారం చూస్తే నా మరణానికి నేనే మౌనం పాటిస్తున్నంత భయంకరంగా ఉండేది! ఏ ఇల్లాలూ అంత నిష్టగా మౌనవ్రతం పాటించి ఉండదనే అనుమానం కూడా వచ్చేది. ఆ నిశ్శబ్దం కన్నా ఆమె తిట్లే నయమనిపించేవి.

అలా మాట్లాడకుండా ఉన్న రోజుల్లో కావాలని ఆఫీస్ నుండి లేట్ గా బయల్దేరాను ఓ సాయంత్రం. అలా అయినా కంగారు పడి ఫోన్ చేస్తుందని. కానీ రాతి గుండె కరగలేదు...ఫోన్ చేయలేదు. నాలుగు గంటలు ఆలస్యంగా వెళ్లాను ఇంటికి. 'నేనేమయ్యానో కూడా నీకు పట్టలేదా?' అని గట్టిగా నిలదీసాను. జెనీని గదిమే అలాంటి అరుదైన అవకాశాన్ని అస్సలు చేజార్చుకోను. 'ఆలస్యమైతే ఫోన్ చేసి చెప్పే బాధ్యత లేదా అండి మీకు?' అని తిట్టిపోసి వలా వలా ఏడ్చేసింది. కోపమొచ్చినప్పుడు 'మీరు', 'వద్దండి', 'వెళ్ళండి' అనేది. ఆ పరాయి పిలుపులకు పిచ్చెక్కేది! గౌరవం కూడా దహిస్తుందని జెని వచ్చాకే తెలిసింది. ఇలాంటి జీవిత పరమార్ధాలు చాలానే రుచి చూపించింది. కథ మళ్ళీ మామూలే! కాళ్ళూ గడ్డాలు పట్టుకుని క్షమించమని వేడుకున్నాను. ఎవరికీ తెలీదు గానీ అలా జెనీని బతిమిలాడ్డం నాకు భలే ఇష్టం!

జెని నవ్వితే ఉరుములు పెళ పెళ మన్నట్టు, కిటికీలు దబ దబ కొట్టుకున్నట్టు ఉండేది! ఇంటి కప్పు ఎగిరిపోతుందేమో అన్నంత గట్టిగా నవ్వేది. నన్ను రోజుకో పేరు పెట్టి పిలిచేది...ఇష్టానుసారం నోరూ పారేసుకునేది. అయినా ఏదో మాయ నన్ను ఐస్కాంతంలా తన వైపు లాక్కుంటుంది.

ఓ సారి చెంప చెళ్ళుమనిపించాను. జెనీది కాదు, ఆమె తమ్ముడు జాన్ ది. లేకపోతే? 'అక్కతో ఎలా వేగుతున్నావ్ బావా? విడాకులిచ్చెయ్' అంటాడా. వాడెంత వాడి వయసెంత! జెనీ లేకుండా నేను సంస్కారం, సత్ప్రవర్తన ఎలా నేర్చుకునేవాడ్ని? నలుగురిలో శబ్దం చేయకుండా ఎలా తినాలో నేర్పింది జెనియే మరి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కాళ్ళూపకూడదనీ, ఎవరింటికైనా భోజనానికి వెళితే నిండా తినేసి రాకుండా, 'బాగుందని' ఓ మెచ్చుకోలు మాట అనాలనీ, ముష్టి వాళ్లకి ఆ రోజుల్లో అర్ధరూపాయకంటే ఎక్కువివ్వకూడదనీ పొదుపు మంత్రాలు నేర్పింది జెనీయే కదా! కానీ తను లేకుండా ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండాలో నేర్పనేలేదు. అందుకే రోజంతా తన దగ్గరే ఉంటాను.

తన కళ్ళు..ముక్కు..పెదాలు..ఎప్పుడు నా చూపుడు వేలితో రాద్దామన్నా విసుక్కునేది. ఇప్పుడు తన రాతి బొమ్మని ఎన్ని సార్లు తాకుతున్నానో. మింగేసేటట్టు చూస్తుంది...రాక్షసి! ఇప్పుడూ నన్ను శాసిస్తూనే ఉంది.

మొన్నామధ్య పళ్ళు రాలగొట్టింది. నావి కావు తనవే! పొద్దున్నే లేచి తన పెట్టుడు పళ్ళు శుభ్రంగా కడిగి కాఫీ పెట్టి నిద్రలేపే వాడ్ని. ఆ రోజు ఏమైందో ఏమో లేవగానే గ్లాస్ లో పళ్ళు చూసి సరిగ్గా తోమలేదని విసిరికొట్టింది. పళ్ళు రాలిపోయినయ్! ఫక్కున నవ్వొచ్చింది నాకు. నా అసలు పళ్ళు కూడా రాలిపోతాయేమోనని నవ్వు ఆపుకున్నాను. చచ్చేదాకా నన్ను చావగొట్టింది, ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను...నా జెనీని కలవాలని...జీవితకాలం ఆమెకు నేను చెప్పని విషయాలు చెప్పాలని. తన దట్టమైన మెరిసే కురుల్లోంచి వచ్చే శీకాయ సువాసనలు, తను వండే ఘుమఘుమల కోడి కూరా కొబ్బరన్నం, ఎప్పుడూ నా కోసం నిరీక్షించే నక్షత్రాల్లాంటి కళ్ళు, నన్ను నిద్రలేపి మజ్జిగిచ్చే చేతులు, అక్కరలేని కరుణ చూపిస్తే శపించే పెదవులు..కన్నీరు బయటకు రానివ్వని తన కఠినమైన పెంకి మనసు...ఆమెలో నాకు ప్రతీది ప్రత్యేకమే! ఎన్నని చెప్పను? ఇప్పటికైనా నా మదిలో రహస్యాలుగా మిగిలిపోయిన ప్రశంసలన్నీ ఆమె ముందు పెట్టాలి.

తను మాత్రం ఒంటరిగా ఎన్ని రోజులిలా సమాధిలో ఒక్కతే ఉండగలదు? ఉంటుంది. మొండి ఘటం! నేనే ఉండలేకపోతున్నాను. సున్నితుడ్ని కదా. ఆ మాటంటే ఒప్పుకోదు సుమీ! నాకున్నంత పొగరు ఈ లోకంలో ఎవరికీ ఉండదట. ఎన్ని మాటలనింది! నేను కాబట్టి పడ్డాను ఇంకొకడైతేనా! ఇదే మాట జెనీతో అంటే చీపురు కట్టతో నా కాళ్ళ మీద కొట్టింది. మా అమ్మ గుర్తొచ్చేది నాకు. ముద్దొచ్చినప్పుడు చిన్న పిల్లిలా కోపంలో రాక్షసబల్లిలా...అదో రకం జంతు ప్రేమ మాది. మాకే అంతుబట్టదు!

బాగా చీకటి పడుతోంది...జెనీ పడుకునే సమయమైంది. నే వెళ్ళాలి. రేపు మళ్ళీ ఉదయాన్నే రావాలి. ఆలస్యమైతే ఇంత గొంతేసుకుని అరుస్తుంది నా మీద. అందుకే వానొచ్చినా వరదొచ్చినా ఏ రోజూ ఆలస్యం చేయలేదు. ఒకవేళ ఆలస్యమైతే ఆ కుర్రాడికి ఇక ఈ సమాధుల తోటలో గులాబీ పూలమ్మే అవసరం ఉండదు..!

ఎండ్లూరి మానస
9160734990

English summary
Yendluri Manasa in her Telugu short story tells a man's experiences with his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X