వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కథ: ఎచ్చులు

By Pratap
|
Google Oneindia TeluguNews

''ఐ విల్‌ విన్‌ ద సీట్‌ వితౌట్‌ కాంపెయినింగ్‌. ఇట్స్‌ ఎ ఛాలెంజ్‌'' అన్నడు ధీమాగా సైదిరెడ్డి. కాలు మీద కాలేసుకుని దర్జాగా ఇంటి ముందల వరండలో సోఫా మీద కూర్చుండు ఆయన. ఎడమ కాలి మీద ఉంచిన కుడి కాలు పాదాన్ని లయబద్దంగ ఊపసాగిండు. ఎదురంగ కూర్చున్న నర్సింహారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. అది ముఖంల కనిపంచకుండ జాగ్రత్త పడి చిన్నగా నవ్విండు. ''ఏమంటవు, నర్సిం?! గెలవనంటవ? గెలిచి తీరుత. ఐ యామ్‌ ఎ మాస్‌ లీడర్‌'' అన్నడు సైదిరెడ్డి.

నర్సింహారెడ్డి నోరు తెరువలె.

''మాట్లాడవేంది?'' అని గద్దించినట్లు అడిగండు సైదిరెడ్డి.

సైదిరెడ్డి నాలుగు సార్ల ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తుండు. మొదటి రెండు సార్ల ప్రాంతీయపార్టీ తరఫు అభ్యర్థిగా, చివరి రెండు సార్ల జాతీయ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిండు. ఇప్పుడు ఐదోసారి మల్ల జాతీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నడు. తెల్లని పైజామా మీద తెల్లటిది కుర్తా ఏసుకుండు. నల్లటివి ఆకు చెప్పులు తొడుగతడు సైదిరెడ్డి. మాట్లాడేటప్పుడు ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలుకతడు. ఇది తెచ్చి పెట్టుకున్న స్టయిలని ఎరుకైతనే ఉంటది. మనిసి కొద్దిగంత నలుపు. మాట్లాడేటప్పుడు పండ్లు మల్లెమొగ్గల లెక్క మెరుస్తయ్‌. ప్రాంతీయ పార్టీల ఉండంగ మినిష్టర్‌గ పని చేసిండు. నెంబర్‌ టూ అని సుత అనిపించుకుండు. కొద్ది రోజులైనంక ముఖ్యమంత్రితో పడలేదు. బయటికి రావాల్సి వచ్చింది.
ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినంక తెలంగాణ పొలిటికల్‌ ఫోరమ్‌ పెట్టిండు. చిన్న చిన్న పార్టీలను చేర్చుకుండు. ఒక ప్రెషర్‌ గ్రూప్‌ లెక్క పని చేయాల్నని అనుకుండు. కానీ పెద్దగ బలం సూయించలేకపోయిండు. దీంతోటి జాతీయ పార్టీల చేరిండు.

 Telugu short story 'Yetchulu'

''ఛాలెంజ్‌ చేసె ముందట కొద్దిగంత ఆలోచన చేస్తె మంచిదేమో!'' అన్నడు మనసు నొప్పించొద్దని మెల్లగ చెప్పిండు నర్సింహారెడ్డి.

''ఆలోచించెతందుకు ఏముంది? జనం నన్ను గాకుంటె ఎవల్ని గెలిపిస్తరు?'' అని భుజాలు ఎగిరేసిండు.

''ఏమో, ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటదని..'' అన్నడు నర్సింహారెడ్డి.

సైదిరెడ్డికి నియోజకవర్గంలో నర్సింహారెడ్డి కుడిభుజమూ, ఎడమ భుజము కూడా. నర్సింహారెడ్డి పలుకుబడి సైదిరెడ్డికి కలిసొస్తున్నది. నర్సింహారెడ్డి ఇండస్ట్రియలిస్టు. హుజూర్‌నగర్‌ ప్రాంతంల సిమెంట్‌ ఫ్యాక్టరీలల్ల వాటాలున్నయ్‌. సైదిరెడ్డికి పైకం సర్దుతుంటడు. ప్రభుత్వపరంగా ఏం అవసరమొచ్చినా నర్సింహారెడ్డికి సైదిరెడ్డి చేసి పెడుతుంటడు. సైదిరెడ్డి రాజకీయ నేతగా, నర్సింహారెడ్డి ఇండస్ట్రియలిస్టుగా ఒక్కసారే ఎదుగుతూ వచ్చిండ్రు.

''నర్సిం! నువ్వు అనవసరంగ బాధపడుతున్నవ్‌'' అన్నడు సైదిరెడ్డి.

''నేనేం భయపడతలేను. గెలవడం ముఖ్యం. చాలెంజులెందుకు చెప్పు!'' అన్నడు నర్సింహారెడ్డి.

''అట్ల గెలిచినమనుకో రికార్డు అయితది'' అన్నడు సైదిరెడ్డి. అతని కండ్లల్ల ఎంతో విశ్వాసం కనిపించింది.

''నీ ఇష్టం!'' అన్నడు నర్సింహారెడ్డి. సైదిరెడ్డి ఏదన్న పట్టుకున్నడంటే మొండే అని నర్సింహారెడ్డికి ఎరుకే. ఇక అతనితో వాదులాటకు దిగినా ఫలితం ఉండదని మాట్లాడలేదు.

''నేను పోత'' అని చెప్పి లేచిండు నర్సింహారెడ్డి. సైదిరెడ్డి అతని వెంట దర్వాజ దాకా పోయిండు. నర్సింహారెడ్డి కారు స్టార్టు చేసి కదలబోతుంటె చేయి ఊపి లోపలికి వచ్చిండు సైదిరెడ్డి.

''రేపు మార్నింగ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అడ్రస్‌ చేద్దాం. ప్రెస్‌ను పిలువు'' అని చెప్పి సైదిరెడ్డి ఇంట్లకు పోయిండు సైదిరెడ్డి.

సైదిరెడ్డి తలిదండ్రులు జాన్‌పాడ్‌ సైదులు భక్తులు. వాల్లు ప్రతి యేడు జాన్‌పాడ్‌ ఉర్సుకు పోతరు. తమకు పుట్టిన ఒకే ఒక బిడ్డకు సైదులు పేరు మీద సైదిరెడ్డి అని పేరు పెట్టుకుండ్రు. సైదిరెడ్డి సుత జాన్‌పాడ్‌ సైదులుకు మొక్కుకున్నంకనే మొదలుపెడతడు. అటెన్క కార్ల జాన్‌పాడ్‌ దర్గాకు పోయొచ్చిండు.

సైదిరెడ్డి ఎప్పటి లెక్కనే కుర్సీల దర్జాగా కూసుండు. ఎదురంగ కుర్సీలల్ల పెన్నులు, కాయితాలు తీసి రిపోర్టర్లు కూసుండ్రు. జిల్లాల అతనే పెద్ద నాయకుడు. అందుకని రిపోర్టర్లందరు టంచనుగ ఒస్తరు.
అందరికీ బిస్కట్లు, చాయ్‌లు వచ్చినై. చాయ్‌ తాగుకుంట- ''ఏదైనా బాంబు పేలుస్తారా, స్పెషల్‌గా పిలిచారు?'' అన్నడు ఒక లీడింగ్‌ పేపర్‌ రిపోర్టర్‌. ఆ రిపోర్టుర్‌ విజయవాడ నుంచి ఈడికొచ్చి సెటిల్‌ అయిండు. అందుకని ఇక్కడి మాట రాలె.

''నా లెవల్‌ నీకు తెల్వదా యేంది?'' అని నవ్విండు సైదిరెడ్డి.

''ఇగ రాసుకోండ్రి. నేను ఇంట్ల నుంచి కాలు బయటపెట్ట. ప్రచారం చేయ. ఇది నా చాలెంజ్‌'' అన్నడు సైదిరెడ్డి.

''ప్రచారం చేయకుండా గెలుస్తాననే నమ్మకం మీకు ఉందా?'' ఇందాకటి రిపోర్టరే.

''గెలిసి తీరుత. నేను గెలువకుంటె ఎవరు గెలుస్తరు. నా మీద సిఎం నిలబడ్డ ఈ నియోజకవర్గంల గెలుపు నాదె. ఈ జనం మీద నాకు నమ్మిక ఉంది'' అన్నడు సైదిరెడ్డి. ఇంకా కొంత సేపు మాట్లాడినంక రిపోర్టర్లు పోయిండ్రు.

తెల్లారి పెద్ద పెద్ద అక్షరాలతోటి ఫ్రంట్‌ పేజీల వార్త అచ్చయింది. అది చూసుకుని తల ఎగిరేసిండు సైదిరెడ్డి.
ఇంట్ల కూసుండుడు కష్టంగనే ఉంది సైదిరెడ్డికి. పొద్దు పోతలేదు. ప్రాంతీయ పార్టీల నాయకులు పావులు కదపడం మొదలైంది. సైదిరెడ్డి బలం, బలహీనతలు వాల్లకు ఎరుకే. నర్సింహారెడ్డి లేకుంటే సైదిరెడ్డి పని అయిపోయినట్లే. ఇసొంటి టైమ్‌ల నర్సింహారెడ్డి లేకుంటే సైదిరెడ్డిని ఓడించడం చాలా తేలిక. నర్సింహారెడ్డి తమ వైపు తిప్పుకునే దారులు దొరుకతలేవు. తండ్లాడతనే ఉన్నరు. కింద మీద పడతనే ఉన్నరు.

శివకుమార్‌ రెడ్డి గెస్ట్‌హౌస్‌ల గోలగోలగ ఉంది. ఒక్కొక్కటే కారు వచ్చి ఆగుతంది. గెస్‌హౌస్‌ దర్వాజ దగ్గర నిలబడి శివకుమార్‌ రెడ్డి అందరిని రిసీవ్‌ చేసుకుంటుండు. లోపలకు తీస్కపోయి కూసుండబెడుతుండు. అందరు వచ్చిండ్రని అనుకున్నంక తను సుత లోపలికి పోయిండు. పని మనుషులు విస్కీ, బ్రాండీ, బీరు సీసలు పట్టుకొచ్చి టేబుల్‌ మీద పెట్టిపోయిండ్రు. తినతందుకు సుత పెట్టి పోయిండ్రు. పని మనుషులందరిని బయటకు పంపించి అందర్ని టేబుల్‌ దగ్గరకు పిలిచిండు శివకుమార్‌ రెడ్డి. పెద్ద టేబుల్‌ చుట్టు అందరు కూసుండ్రు. ఉంది ఐదుగురే. వీల్లంత శివకుమార్‌ రెడ్డి సుట్టాలే. ఇందుల దగ్గరి సుట్టాలున్నరు, దూరపు సుట్టాలున్నరు. సుట్టరికం కంటె ఒకలి పానానికి మరొకరి పానం అడ్డం పెట్టెటంత దోస్తాన ఉంది వాల్ల నడుమ. ఇది అత్యంత కీలకమైన మీటంగని విందు ఏర్పాటుకు తీసుకున్న జాగ్రత్తను బట్టే ఎరుకైతంది. అందరు కూసున్నంక ఎవలికి కావాల్సింది వాల్లకు తన చేతుల మీద అందించిండు శివకుమార్‌ రెడ్డి. మొదటి రౌండ్‌ అయిపోయింది. రెండో రౌండ్లకు వచ్చిండ్రు.

సైదిరెడ్డి మీద పోటీ చేస్తూ ఓడిపోతున్న శివకుమార్‌ రెడ్డికే ఈసారి కూడా టికెట్‌ ఇచ్చింది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు గెలవకపోతే తన రాజకీయ జీవితానికి తెర పడుతుందన్న విషయం శివకుమార్‌ రెడ్డికి తెలువంది కాదు. అందుకని ఆయన సర్వశక్తులు ఒడ్డుతుండు. అందుకనే ఈ విందు ఇస్తుండు.

''వాడేంది పెద్ద పోకడ పోతుండు?!'' అని అన్నడు పుల్లారెడ్డి. ఈ మాట సైదిరెడ్డిని గురించని అందరికి అర్థమైంది.

''ప్రచారం చేయకుండ గెలుస్తడట'' అన్నడు రామిరెడ్డి.

''మరే'' అన్నడు చికెన్‌ ముక్క నోట్లె పెట్టుకుంట శివారెడ్డి.

''ఏందన్నా! ఈసారి మనం దెబ్బ తీయకుంటే మనకు పుట్టగతులుండయ్‌'' అని అందరి ముఖాలు చూసిండు శ్రీనివాస్‌ రెడ్డి. శివకుమార్‌ రెడ్డి మాటలే శ్రీనివాస్‌ రెడ్డి నోటి ఒస్తయని అందరికీ ఎరుకనే. శివకుమార్‌ రెడ్డి సగం గ్లాసు ఖతం చేసి టేబుల్‌ మీద పెట్టిండు. అట్ల పెట్టినప్పుడు పెద్దగ చప్పుడయింది. అది ఆయన అసహనాన్ని పట్టిచ్చింది.

''శివన్నా! ఎందుకే గింత బాధపడతవ్‌? మేమున్నం గద!'' అని ధైర్యవచనాలు పలికిండు బుచ్చిరెడ్డి.
శ్రీనివాస్‌రెడ్డి ఒక&కటే వీరందరి కంటె ఐదారేళ్లు చిన్న. మిగతా అందరికీ కొంచెమంత అటూఇటూ యాభై యేళ్లుంటయ్‌. అందరూ తెల్లటివి పంచెలు కట్టుకుండ్రు. లాల్చీలు ఏసుకుండ్రు. బుచ్చిరెడ్డికి మాత్రం బుర్ర మీసాలుంటయ్‌. మాట్లాడితే బోదురుకప్ప నోరు తెరిచినట్లు ఉంటది. శివారెడ్డికి ఆ నియోజకవర్గంల రెండు కాలేజీలున్నయ్‌. కానీ కాలేజీలు ఆయన ఎప్పుడూ పోడు. అన్నీ బావమరిదే చూసుకుంటడు. రామిరెడ్డికి ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉంది. శ్రీనివాస్‌ రెడ్డి మాత్రమే ప్యాంటు, షర్టు ఏసుకుండు. అతను నాపరాళ్ల బిజినెస్‌ చేస్తడు. శివకుమార్‌ రెడ్డికి సలహాదారు. శ్రీనివాస్‌ రెడ్డి ఏదన్న అన్నడంటే అది శివకుమార్‌ రెడ్డి అన్నట్లే. అయితే యవ్వారం నడిపే తీరు, పరిస్థితులను చక్కబెట్టే తెలివి శివకుమార్‌రెడ్డికి అతడ్ని దగ్గర చేసినయ్‌. మిగతా కులాల నాయకులను తమకు అనుకూలంగా వుంచుకోవడంల, మల్చుకోవడంల శ్రీనివాస్‌రెడ్డిది ముఖ్య పాత్ర.

''ఇప్పుడు కొత్తగున్నర? మొదట్లనుంచి నాతోని ఉన్నోల్లేనయితిరి'' అన్నడు శివకుమార్‌ రెడ్డి అయినా నేను గెలువలేదు అనే అర్థం స్ఫురించెటట్లు.

ప్లేట్లు ఖాళీ అయితున్నయ్‌. బాటిల్స్‌ ఖాళీ అయితున్నయ్‌.

''ఏం చేస్తం? మనోడే వాడి సంకల చేరె. ఎంత చెప్పినా ఇనడాయె'' అన్నడు శివారెడ్డి. ఎవరు ఎవరి చంకల చేరిండ్రో విడిగా చెప్పవలసిన పని లేదు. సైదిరెడ్డికి నర్సింహారెడ్డి అండడా నిలబడుతున్నదాన్ని చెప్పిండని అందరికీ అర్థమై పోయింది.

''వాడు మోటాటి పుట్టుక ఎట్ల పుట్టిండో, గుడాటోనితోటి జత కట్టిండు'' అన్నడు బుచ్చిరెడ్డి.

''వాళ్లిద్దరి నడ్మల ఏముందో ఎవలికి ఎరుక?'' అన్నడు రామిరెడ్డి.

''ఉండేదేంది బంకచెక్క. సైదిరెడ్డిని అడ్డం పెట్టుకొని వాడు యాపారం చేసుకుంటుండు'' అన్నడు లక్ష్మారెడ్డి. పార్టీల కూర్చున్నప్పటి నుంచి అతను నోరు తెరవడం ఇదే మొదటిసారి.

లక్ష్మారెడ్డి ఎక్కువ మాట్లడడు. మాట్లాడిందానికి తిరుగుండది. కట్టె కొట్టె తెచ్చె అన్నట్లుంటది. తను చెప్పదల్చుకున్నదాన్ని మొహం మీదనే చెప్పేస్తడు. అందుకని అతనంటె అందరికి జంకు. ఆ జంకుతోటే అందరు అతనికి దూరంగ ఉంటరు.

''ఇప్పుడు ఏం చేద్దామంటవే శివన్నా?!'' అని అడిగిండు పుల్లారెడ్డి.

''నర్సిమ్మారెడ్డిని ఇటు లాగితెనె గెలుస్తం'' అన్నడు శివకుమార్‌ రెడ్డి. కొంచెమంత సేపాగి ''ఆడ్ని ఎట్ల లాగాలె?'' అన్నడు బుచ్చిరెడ్డి. ఆ మాటల్లో ఇది అయ్యేపని కాదన్న అర్థం ఉంది.

''ఆయనను ఈడికి పిలిస్తే...'' అన్నడు శ్రీనివాస్‌ రెడ్డి.

''వొస్తడంటవా?'' ఎదురు ప్రశ్న వేసిండు శివారెడ్డి.

''నువ్వు పిలిస్తె ఒస్తడు'' అని శివారెడ్డి ముఖంలకు చూసిండు శ్రీనివాస్‌ రెడ్డి. నర్సింహారెడ్డి, శివారెడ్డి అప్పుడప్పుడు మందు పార్టీలల్ల ఇద్దరే కూసుంటరని శ్రీనివాస్‌రెడ్డికి ఎరుకె. అందుకని ఆ మాటన్నడు. మంచీచెడు మాట్లాడుకుంటరు. ఇద్దరికి సుట్టరికం కూడా ఉంది. శివారెడ్డి ఆలోచనల పడ్డడు.
''వొస్తె వొస్తడు లేకుంటె లేదు. ఓసారి గుంజాయిస్‌ చేస్తె పోయేదేంది?'' అన్నడు రామిరెడ్డి. రామిరెడ్డి ఆ మాట అంటుండంగనె శ్రీనివాస్‌ రెడ్డి కార్డ్‌లెస్‌ ఫోన్‌ తెచ్చి నెంబర్‌ కలిపి ''రింగయితంది'' అని శివారెడ్డి చేతికిచ్చిండు. అందరు శివారెడ్డి వైపు చూడబట్టిండ్రు. ''నమస్తె నర్సన్నా!'' అన్నడు శివారెడ్డి ఫోన్‌ల. అంటే, నర్సింహారెడ్డి ఉన్నడన్న మాట అని అనుకున్నరు అందరు.

''ఊకెనే ఇంట్ల కూసుండుడు ఎందుకే? మేమన్న అంటరానోల్లమా?'' అన్నడు. అవతల నర్సింహారెడ్డి ఏమన్నడో వీరికి వినిపించలె.

''నువ్వు యాదికుండవా? గదేం మాటే. నువ్వే దూరంగుటుంన్నవు, మమ్ముల దూరంగుంచుతున్నవ్‌'' అన్నడు శివారెడ్డి.

''ఇప్పుడు పిలుస్తున్నం కద! రారాదు. కారు పంపిస్త''

''శివకుమార్‌ రెడ్డి గెస్టు అవుజుల ఉన్నం. ఎవరు లేరు. అందరు మనోల్లే. నిన్ను ఎవరు చూడర్లే'' అని ఫోన్‌ ఆఫ్‌ చేసిండు ఆల్సెం చేయకుండ శ్రీనివాస్‌రెడ్డి శివారెడ్డి చేతిలోని ఫోన్‌ తీసుకుండు. పక్కన పెట్టేసిండు. అందరూ గట్టిగ గాలి పీల్చుకుండ్రు. ఖాళీ గ్లాసులు నింపుకుండ్రు. శ్రీనివాస్‌ రెడ్డి మరొక ఖాళీ గ్లాసు తెచ్చి పెట్టిండు. ఎవరూ మాట్లాడుతలేరు. గబగబా తాగేసి గ్లాసులు ఖాళీ చేసిండ్రు. నర్సింహారెడ్డి కారు వొచ్చి అగిన చప్పుడయింది. అందరు లేచిండ్రు. పాటకు దాకా పోయిండ్రు. కారు దిగంగనె అతన్ని ఒక్కరొక్కరే ఎదుర్కొని చేయిల చేయిలు కలిపి కావలించుకుండ్రు. లోపలికి దొర లెక్కన తీసుకుపోయిండ్రు.
శ్రీనివాస్‌ రెడ్డి అందరి గ్లాసులు నింపిండు. ఒక్కరొక్కరే నర్సింహారెడ్డికి చీర్స్‌ చెప్పిండ్రు. ఒక రౌండ్‌ అయిపోదాన్క ఎవ్వరు మాట్లాడలె.

కొద్దిసేపు పిల్లాపాపల గురించి, యాపారాల గురించి, అవీఇవీ మాట్లాడుకుండ్రు. నాలుగో రౌండ్‌ దాన్క ఇట్లనే నడిచింది. ఐదో రౌండ్‌ మొదలు పెట్టెటప్పుడు- ''మీ వోడు ఏమంటుండు?'' అన్నడు శివారెడ్డి నర్సింహారెడ్డిని చూసుకుంట.

నర్సింహారెడ్డి వెంటనె జవాబియ్యలె. శివారెడ్డిని చూసిండు. అందర్ని చూసి నోటి దగ్గర ఉన్న గ్లాసును తాగకుండనె కింద పెట్టి ''ఏమంటడు...'' అన్నడు.

''నువ్వేం అనుకోకు గని, నాకు తెల్వక అడుగత. వాడితో నువ్వు ఎట్ల ఏగుతన్నవే నర్సన్నా? వాడి ఎచ్చులు చూస్తె జెర్రులు పాకినట్లుంటది'' అన్నడు బుచ్చిరెడ్డి.

''అవన్నీ ఎందుకులేయె'' అన్నడు నర్సింహారెడ్డి వైపు దొంగచూపు చూసుకుంట శ్రీనివాస్‌ రెడ్డి.

''తెచ్చి పెట్టుకున్న పోకడాయె, ఎట్లుంటుది మరి?! ఉడుతలు పట్టెడోకి కుర్సీ దొరికింది'' అన్నడు రామిరెడ్డి. ''ఎన్నడన్న అధికారం చూసినోడా, ఏమన్ననా? కుర్సీ దొరకంగనె ఎచ్చులు పోతుండు'' అని ఆయనే అన్నడు.

''అతను మాత్రం రెడ్డి కాడా, యేంది?'' అన్నాడు శ్రీనివాస్‌ రెడ్డి.

శివకుమార్‌ రెడ్డి ఏమీ మాట్లాడడం లేదు. అతనికి టెన్షన్‌గా ఉంది. ఎవర్ని పట్టించుకోకుంట గ్లాసు మీద గ్లాసు తాగుతుండు.

''గూడాటోడు రెడ్డేందిరా?'' అన్నడు బుచ్చిరెడ్డి.

''అవన్ని ఎందుకుగని, అసలు సంగతి చెప్ప రాదురి'' అన్నడు లక్ష్మారెడ్డి.

నర్సింహారెడ్డి ముఖం ఎర్రబారింది. ''చాలు తియిండ్రి. నన్ను మీరు రానిచ్చిండ్రా? వస్తనంటే రానీయకనే పోతిరి. మీరే అడ్డం బడ్తిరి'' అన్నడు.

కొద్దిగంత సేపు ఎవరు మాట్లాడలె. శ్రీనివాస్‌ రెడ్డి లేచి గ్లాసు నర్సింహారెడ్డి చేతికి అందించిండు.
''ఏమనుకోకె నర్సన్నా! మన్నోల్లు తాగినంక ఏదో అంటుండ్రు'' అని చెవుల గునిగిండు.

''సరేలేర! ఎవరేమంటే పట్టించుకునేదేంది? మనోల్లను మనోల్లు అనకపోతె ఎవరంటరు? నర్సన్న ఇంకో పార్టీలున్నడని మనోడు కాకుండ పోతడా?'' అన్నడు ఆ మాటలు విన్న శివారెడ్డి.

''ఏం లేదు గని. మన మీది సవాల్‌ చేసిండు. గెలిసిండనుకో. వాడికి పట్టపగ్గాలుండయ్‌. కండ్లు నెత్తి మీదికి ఎక్కుతయ్‌. అప్పుడు నర్సన్న సుత కనిపిస్తడో లేడో అని బాధ పడుతున్నం'' అన్నడు బుచ్చిరెడ్డి.
''అవన్నీ ఎందుకు గని నర్సన్న మనతోటి వొస్తడు, వస్తుండు. మరి ఆయనకు ఏమిస్తరో చెప్పరాదురే'' అన్నడు శివారెడ్డి. నర్సింహారెడ్డి మాట్లాడలేదు. దాన్ని ఆసర చేసుకొని ''ఏది కావల్నో అడుగుమను. ఎంపి టికెట్టు కావల్నా? కార్పోరేషన్‌ కావాల్నా? పైసలు కావాల్నా'' అన్నడు లక్ష్మారెడ్డి.

''పైసలేం చేసుకుంటమే'' అన్నడు శివారెడ్డి.

''మన పార్టీల ఇప్పుడే చేరుడెందుకుగని, ఈ ఎన్నికల్ల ప్రచారం నర్సన్న పని చేయకుంటె చాలు. పార్లమెంటుకు టికెట్‌ ఇప్పిద్దాం. సరేనా?'' అన్నడు శివారెడ్డే.

''నర్సన్న ఒప్పుకోవాలె గని పార్లమెంటేందే. పోటీ లేకుంట రాజ్యసభకు పంపిస్తం. పంపించకుంటే ఎమ్మెల్యే పదవికి రిజైన్‌ చేసి శివన్ననే పార్టీ బయటకొస్తడు. కావాల్నంటే సిఎంతోటి రేపే మాట్లాడుదాం'' అన్నడు శ్రీనివాస్‌ రెడ్డి.

''శివన్న మాటేందో. ఉలుకడాయె పలుకడాయె'' అన్నడు శివారెడ్డి.

''నర్సన ఆ పని చేయాలె గాని నా సగం పెయ్యిని కోసిస్తా'' అన్నడు శివకుమార్‌ రెడ్డి.
పార్టీ అయిపోయిన అందరు బయటకు నడుస్తుండ్రు. శివకుమార్‌ రెడ్డి నర్సింహారెడ్డి దగ్గరికొచ్చి ''పిల్సి అమానించిండ్రని అనుకోకే, నర్సన్నా! నీకు నా మీద నమ్మకం ఉంటే రా. లేకుంటె లేదు. కానీ మనం ఇట్లనె కలిసుండాలె'' అన్నడు.

నర్సింహారెడ్డి సుత సైదిరెడ్డి లెక్కనె ఇంట్ల కూసుండు. సైదిరెడ్డిని కలవలేదు. సైదిరెడ్డి సుత పట్టించుకోలె. దాంతోటి సైదిరెడ్డి ఓడిపోయిండు. శివకుమార్‌ రెడ్డి గెలిసిండు.

మరొక ఏడాదికి నర్సింహారెడ్డి రాజ్యసభకు నామినేట్‌ అయిండు.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
The short story 'Yetchulu' explaines the political dynamics in rural area of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X