వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్నాళ్లెకెన్నాళ్లకీ వాన
చినుకు చినుకు పట్టుకొని
చివరి దాకా ఎగబాకాలని ఉంది
ఆకాశం అంచులో కూచుని
భూమిని కళ్లారా చూడాలి
జలాశయాలు సెలయేళ్లు
కొండలు గుట్టలు పర్వతాలు
కీకారణ్యాలు మైదానాలు
ఏ మేరకు ఉన్నాయో చూడాలి
పక్షులు, జంతువులు సరీసృపాలు
ఎన్నెన్ని ఒద్దిగ్గా జీవిస్తున్నాయో
జలచరాలు కీటకాలు
పంచ వర్ణాల ఫలపుష్పాలు
అన్నిటినీ చూడాలంటే ఎలా మరి
అందుకే చినుకు చినుకు పట్టుకొని
ఆకాశం అంచుదాకా పాకాలి
ఎడతెగని వర్షం పడుతూనే ఉంది
ఎన్నాళ్లకెన్నాళ్లకు వచ్చిందీ వాన
భూమ్మీద ఇన్ని ప్రాణుల తాపం తీరాలి
ఈ వర్షం ఇలా పడుతూనే ఉండాలి
ఈ లోపల చినుకు చినుకు పట్టుకొని
నేను చివరి దాకా వెళ్లి రావాలి
ఈ వర్షం ఇలా పడుతూనే ఉండాలి