వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగు కవిత 'విముక్తి'

ఊరి మొగసాల మీద
అసాఫియా రాజముద్ర అనాగరిక రూపం తీసుకుంది
అదొక వింత కాలం
గంజి కాదు
గట్కా కరువైన కాలం
కలలు కాదు
కంటినింద నిదురా కరువైన కాలం
భూమి కాదు
పండించిన పంటా పరాయీదైన కలం
మాట కాదు
మనసులో తలపోతకూ దిక్కులేని కాలం
వెట్టి చేయబోమని ధిక్కారం కాదు
బుక్కెదు బువ్వ
బండమీద పోయమనీ అడగలేని బానిస కాలం
తరాలుగా దున్నిన భూమికి
కౌలుదార్లుగా మిగిలిపోయిన
సేద్యగాళ్ళు దిగాలుపడ్డ కాలం
కాలం ఒక ప్రవాహం కదా
చరిత్ర వేసిన సంధి యుగపు పొలికేకను
అందుకున్న తరమొకటి
ప్రజల్ని జెండాల్ని చేసి
గొంతుల్ని గేయలుగా పాడింది
మతం కత్తితో గెలవాలనుకున్న
రజాకార్ల రాజకీయ యుద్ధ్హాన్ని
ప్రజాబలంతో
గుత్ప సంఘంతో గెలిపించింది
నిజాం పీఠభూమిని భారతావనిలో కలిపేసింది
ఆ తరానికి జేజేలు
తరాన్ని పుట్టించిన కాలానికి జేజేలు
- ఏనుగు నరసింహా రెడ్డి