ఏనుగు నరసింహా రెడ్డి కవిత 'కలల వేదిక'

అర తెర తీసిన రంగస్థలం
వివిధ వర్ణాల పుష్పాల వింత తోట
గట్టును దాటేయాలని
ఎగిసిపడుతున్న అలల సమూహం
వంకర్లు తిప్పుకొన్న ప్రవాహాన్ని కలుపుకొని
తళతళ మెరుస్తోంది కాలేజీ
సకల కాలుష్యాల కాసారాల నడుమ
స్ఫటికంలాంటి స్వచ్చత
ఇక్కడే దాగి ఉంటుంది.
ఇక్కడ విద్యార్ధుల్ని చూస్తే
అన్ని రుతువుల్ని వసంతం చేయదగ్గ
కోయిలలు గుర్తుకొస్తాయి.
తండ్రికీ కొడుక్కీ మధ్య ఘర్షణలా మాష్టార్లతో ఏర్పడ్డ భ్రమ
చదువు పూర్తయ్యే దాకా స్పస్ఠపడదు
కలల వేదిక
అప్పుదప్పుదు కలాహాల వేదిక అయి
జీవితమంతా నేర్చుకున్న నైతికతను
తిక్కతిక్కగా ధిక్కరిస్తుంది.
కారణాలేమైనా
సందర్భాలూ వేదికలూ
ఎలా విడదీస్తాయో
అంతగానూ కలిపేస్తాయి
తోటలో ఏపూవు స్థానం
దానిదే ఐనట్లూ
ఆఖర్న అందరూ ఒక పూల మాలగా
కలాషాల మెడలో ఒదిగి పోతారు
కలలున్న చోట కలహాలున్నట్లే
జీవితమన్నాక కలలు శాశ్వతం కాదని
విడిపోయినప్పుడు ఇక వేదిక నుండి దిగిపోయినట్టు
ఒక తాత్కాళిక గంభీరతలో మునిగిపోతుంది ఒక బ్యాచి
భావనలు తప్ప భావాలు లేని దశలో
అవి కొట్టుమిట్టాడుతున్నా
జీవితానికి సరిపడా స్వేచ్చ మాత్రం
ఇంకా అక్కదే తిష్ఠవేసింది
అందుకే అన్ని దశల కాలేజీ దాటి వచ్చినా
మల్లీ అక్కడికే చేరుకోవాలనుంది
స్వేచ్చ అనే మూల ధనాన్ని
వారెలా ఖర్చు పెడుతున్నారో
అదే వాళ్ళ భవిష్యత్తు అని
చెప్పి తీరాలనుంది
-ఏనుగు నరసింహా రెడ్డి