కొంత యాది, కొంత మరుపు
మంత్రనగరి, మహానగరి
సౌందర్యరాశి, కళ్లు చెదిరే సమ్మోహనం
మీసాలు చిగుళ్లు వేస్తున్న యవ్వనం
రెండు చేతులతో దోసిలి పట్టి మోకరిల్లి
ప్రేమభిక్ష అర్థించిన గుర్తు
సిలోన్ పాటలకు సరూర్‌నగర్ చెరువు కింద
తలలూపిన పచ్చని వరిచేలు
దిల్షాద్‌లో వయస్సును ఊదేసిన రాజ్‌కపూర్
దూపగొన్న మనసుకు ప్యాసా ఊరట
త్రికాలాలు ఒకే కాలమైన యాది

చాదర్‌ఘాట్ వంతెన మీద నడక
ఒక రోజూ రెండు రోజులూ కాదు
నిత్యం భాగమతి ప్రేమతో
మూసీ ఉప్పొంగుతున్న ఉద్వేగ భ్రాంతి
బ్రిటిష్ రెసిడెన్సీపై జూలు దులిపిన తురుంఖాన్ సర్వనామం
తుర్రేబాజ్ ఖాన్ నాకు నామవాచకం, ఉడుకెత్తిన నెత్తురు
మలుపు తిరిగిన డబుల్ డెక్కర్ వెనక్కా, ముందుకా...
వంతెనలూ, రోడ్లూ నా తాతముత్తాతల జ్ఞాపకాలు
ఏం చెప్పుదు, ఎందుబోదు
సరిహద్దులు దాటిన సమ్మోహనం
ఇప్పుడిది అందాల రాక్షసి, మంత్రగత్తె
ఫ్లైఓవర్లు, యూటర్న్లు, వన్‌వేలు
నెక్లెస్ రోడ్లు, కొండచిలువల్లాంటి రహదార్లు
నా నెత్తుటిలో ఇంకని విగ్రహాలు
మొసల్తలేదు, ఒక్కటే ఎగపోత దిగపోత
- కాసుల ప్రతాపరెడ్డి