• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు కవిత: చెరువు నవ్వు

By Pratap
|

భూమిని తడి తడి చేసిన వాన

కురువక కురువక ఇరుగ కురిసిన వాన
నీళ్లు లేని పల్లెల మీద నీలి నీలి వాన
వాన ..వాన ...
నేల నేలంతా పదన చేసిన వాన

ఇసిరి ఇసిరి కొట్టిన వాన
లగాంచి దంచి సంపిన వాన
తెల్లందాక పొద్దుందాక వొక్కటే వాన
కరువు తీరా వాన ,కుతి తీరా వాన
దూప తీర్చిన వాన ,కడుపు నింపిన వాన
కండ్ల సంబ్రమై తనివి తీర్చిన వాన

వానల జోరుకు ఒర్రెలు ఒర్సుకు పోయినై
వాగులు ఒర్రెలు కల్సి చేరువుల్లు నిండినై
అలుగులే దునికినై ,మత్తల్లు బోర్లినై
నదులు నాదాలై నాట్యాలే చేసినై

వాన ..వాన ...వాన ..
ఇంట్లకెళ్ళి ఎల్లకుంట రాలిపడిన వాన
కాళ్ళు తర్ర పెట్టకుంట ఆపిన వాన
దారులన్నీ నదులై ప్రవహించిన వాన
కాలువలు తెగ తెంపిన కనరు వాన
పాత ఇండ్లు గోడలు పడగొట్టిన వాన
ఎవసాయదారులకైతే నెనరైన వాన

నదుల నిండార్గ పరుగు పెట్టిన నీళ్లు
ప్రాజెక్ట్ లకు కళ తెచ్చిన నీళ్లు
బ్రిడ్జిలను రోడ్లను ముంచెత్తిన నీళ్లు
కెనాల్లు కొట్టుక పోయేట్టుగ నీళ్లు ..నీళ్లు
గల గల నీళ్లు జల జల నీళ్లు
నీళ్లంటే జీవితం నీళ్లుంటేనే జీవునం
నీళ్లు నాగరిక వికాసానికి ప్రాణా ప్రాణం

Annavaram Devender Poem: Cheruvu Navvu

ఇన్నోద్దులుగ
నీళ్లంటే సుడులు తిరిగిన కన్నీళ్లు
నేల నెర్రెలిడిసిన పర్రెలు పర్రెలు
పాతాళం లోకి పారి పోయిన పదన
సుక్క నీళ్ల కోసం తపిచ్చిన తనువులు
నీళ్ల కోసమే మైళ్ళకు మైళ్ళు కాళ్ళు

కాలం కలిసివచ్చి గంగను నెత్తిన తెచ్చింది
ఎల్నినోను ఎల్లెల్కల పడగొట్టి
లానినో ఎండిన నేలను ముద్దాడింది
నిండు చూలాలై నీళ్లు నీల్లాడినై

నీళ్ళోస్తే పునాసలు పువ్వులైతై
పైర్లు పచ్చ పచ్చగ ఊగుతై
మక్క కంది గట్టి గింజలు పోస్తయి
ఆరోక్క పంటలకు నీళ్లు బంగారం
పల్లె పల్లెకు చెరువులు సింగారం

నీరు కట్టెలు నీళ్లల్ల బిరబిర ఉరుకుతై
గొండ్రిగాల్లు గుర్రు గుర్రు మంటై
కోర్రమట్టలు సందమామలు జల్లలు పర్కలు
శాపలన్నిటికీ నీళ్ళు సంబుర సంసారం
చెర్లు కొప్పురంగ నిండితేనే చేలకల నవ్వు
చెర్లు గంగాళం అయితేనే ఎవుసం పువ్వు

వాన కాలం వాసనకు దువ్వెనల గుంపులు
ఊరవిశ్కల కిస కిస దనులు
మడికట్ల పొన్న తెల్లతెల్లని కొంగల గుంపు
కంచెలల్ల పచ్చని గర్కపోసల గవ్రాంతం
గొర్లు మ్యాకలకు కడుపు నిండే అన్నం

ఆకాశం మీద నీలి మబ్బుల యానం
నేల మీద నీళ్ల వయ్యారం
ఇయ్యడు పల్లెలన్ని
పెద్ద ముత్తైదువలై నవ్వుతున్నై
నిత్తె పెద్ద బతుకమ్మలై ఆడుతున్నై

- అన్నవరం దేవేందర్

English summary
A prominent Telugu poet Annavara Devender expresses his feeling on the changes after rain in his poem Cheruvu Navvu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X