ఏనుగు నరసింహా రెడ్డి కవిత 'గాయం'
గాయపడకుండా
ఉండాలనుకుంటాను
నిద్ర లేచింది మొదలు
కనిపించని బాణాలను
కనిపెట్టుకొని తిరగాలనుకుంటాను
అడుగు బయటపెట్టింది మొదలు
ఏ మాటల తూటా తగలకుండా
ఒడుపు చేసుకుంటుంటాను
దారిలో నడుస్తుంటే
చక్కగా నడవరాదా.... అంటారొకరు
వాహనం మీద పోతుంటే
డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నారంటారొకరు
ఏదైనా వస్తువు ధర అడుగుతుంటే
నీకు బేరం చేయడం వచ్చా అని
దెప్పిపొడుస్తుంది ఆవిడ
చిన్న బాణాల గాయాలు
మాన్పుకుందామని ప్రయత్నిస్తుంటానా?
పెద్ద పెద్ద అభాండాల జడివాన
అమాంతంగా మీద కురిసిపోతుంది
తేరుకోక ముందే
తేనెపట్టు నుండి కందిరీగలు లేచినట్లు
ఏవో వార్తల బాంబులు పడి
కనిపించని పొగలు లేస్తాయి
నిజాన్ని వీలైనంత వివరంగా
చెప్పడానికి ప్రయత్నిస్తాను
వెక్కిరించే నొసళ్ళ మీద
సత్యపు సమాధానాల్ని
నమోదు చేయజూస్తాను
గాయానికి లేపనాన్ని
పూయజూస్తాను
గాయపడకుండా
ఉండాలనుకుంటాను

కనిపించని యుద్ధ రంగంలో
వినిపించని బాంబుల మోత
అదృశ్యంగా ఆయుధాలు
సద్రుశ్యంగా తేనె పలుకులు
ప్రకటించే నీతుల మధ్య
బయట పడని ఎజెండాల నడుమ
అన్ని చురకత్తుల్ని
తప్పించుకోవాలనుకుంటాను
గాయపడకుండా
ఉండాలనుకుంటాను
చివరికి
గాయపడ్డాకే ఇల్లు చేరుకుంటాను
-ఏనుగు నరసింహా రెడ్డి