శవం కాదు – ప్రాణంలో సగం
పుట్టినూర్ల బతుకు లేక
బతకడానికి పట్నం పట్టుక వేలాడిండ్లు వాళ్లు
ఆమెకతను పెనిమిటి
వాళ్లకొక బిడ్డ
వాళ్లు ఎట్లా బతికిండ్లో తెల్వదు
ఏంతిన్నరో తెల్వదు
రోడ్డుపక్కనో చెట్టుకిందనో పాడుపడ్డ వొదిలేసిన పడావుపడ్డ శిధిలాల కుప్పలకాడనో
కూసుండో కాళ్లు సాపుకొనో ఆకాశపు సుక్కలు సూసుకుంటనో
మాగన్నుగనో జాగారమో చేసుంటరు
వాళ్ల బతుకు ఆధార్ కార్డ్లో వుందో లేదో తెల్వదు
వోటర్లలిస్టు కెక్కిందో లేదో
పింఛండ్ల పథకంలోవుందో లేదో
అసలింతకు వాళ్లకు సర్కారు ఆసరానే తెల్వదు
సర్కారు మీదపడి బతకడం తెల్వని అతనికి
అనారోగ్యంగా వున్న ఆమెను బతికించుకోవడం కోసం
సర్కారు దవాఖానాకు చేర్పించడం ఎట్లా తెలిసిందో ?

ప్రాణంగా దవాఖానాలో పెడితే
ఆమె శవాన్ని దవాఖానా బయట పడేసిండ్లు -
పేదశవాన్ని ఇంటివరకు తీసుకెళ్లే అంబులెన్సులు కదల్లేదు
సుట్టూమూగిన జనమంతా మౌనంగా పారిపోయిండ్లు
గుండె చెదిరిన బిడ్డ
తోడుకరువైన భర్త -
కట్టతెగిన చెరువు ఊర్ల పడ్డట్టు
శవాన్ని మూటకట్టి భుజానికెత్తుకొని
బిడ్డతో కలిసి ఊరి రోడ్డుమీద పడ్డడు ..
బేతాలుని శవాన్ని ఎత్తుకొని నడిచిన రాజు కథ కాదిది
బతుకును శవంగా ఎత్తుకొని
పుట్టినూరి మట్టిలో సమాధవుతున్న పేదల బతుకిది -
సత్తే నలుగురైనా నాలుగడుగులు మోయని దేశమిది -
చూస్తూ వుండండి
మన పాణాలమీదికెళ్లి శవాన్ని మోసుకుంటూ
ఒక్కడే శవాన్నెత్తుకొని నడుస్తున్నడు
పేదలబతుక్కి విలువలేని దేశంలో
శవానిక్కూడా విలువిచ్చిన బతుకతను -
( ఓడిసా లోని కలహండి జిల్లాలోని తువాముల్ రాంపూర్ బ్లాక్ కు చెందిన ఆదివాసి దానా మాంఘి భార్య అమంగాదేవి శవాన్ని తీసుకెళ్లడానికి డబ్బులులేకపోవడం వల్ల అంబులెన్సువాళ్ళు తిరస్కరిస్తే భుజంపై శవాన్ని మోసుకుంటూ బిడ్డతోసహా నడుచుకుంటూ సొంతూరుకు బయలుదేరిన వార్తకు.. )
- అన్వర్