• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవి స్వరం: గుర్తు తెలియని వ్యక్తి

By Pratap
|

సంఘటనలను కవిత్వీకరించడాన్ని కొంత మంది నిరాకరిస్తున్నారు. సంఘటనలపై కవిత్వం ఎలా రాస్తారని కూడా అడిగే కవులున్నారు. అయితే, ఓ వేదన గుండెను తొలిచివేస్తున్నప్పుడు, మదిలో అగ్ని రాజుకుంటున్నప్పుడు అది కష్టమేమీ కాదు. కొంత మంది సంఘటనలకు వెంటనే ప్రతిస్పందించి కవిత్వం రాయలేకపోవచ్చు. కానీ, కొంత మంది సంఘటనలకు ప్రతిస్పందించి మంచి కవిత్వాన్ని అందించారు. ఈ విషయాన్ని అంగీకరించాలి. అటువంటి కవితే సివి శారద రాసిన గుర్తు తెలియని వ్యక్తి.

ఎన్నేళ్లు గడిచినా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం కేసు మన మదులను తొలుస్తూనే ఉంటుంది. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండె కలుక్కుమంటుంది. అత్యంత దారుణంగా మగమృగాలకు బలైన తీరు కలచివేస్తూనే ఉంటుంది. దేశం మీదే కాదు, మొత్తం మానవత్వం మీదనే ఆదో మచ్చగా మిగిలిపోతుంది. నిర్భయ ఘటనపై కవిత్వం వచ్చింది. కానీ, సివి శారద ఆమె స్నేహితుడి వైపు నుంచి ఓ కవితను అందించారు. ఇది ఆ సంఘటనకు సంబంధించిన కొత్త విషయం.

ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారాన్ని, ఆమె స్నేహితుడిపై దాడిని ఆమె కివితాత్మకంగా వ్యక్తీకరిస్తూనే, అతని మానసిక స్థితిపై, అతని ప్రతిక్రియపై, అతని అంతరంగ మథనంపై శారద మనకు మంచి కవితను అందించారు. చదవండి..

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisangamam poet: CV Sarada on Nirbhaya incident

కదులుతున్న బస్సులోంచి

రెండు అజ్ఞాత శరీరాలు

నగ్నంగా బయటపడినప్పుడు

అక్కడ అలజడి లేదు

ఆకాశం స్తంభించింది!

కాలు విరిగి, నేల కొరిగి

ఇనుపరాడ్డు దెబ్బలతో

దీన హీన దుస్థితిలో

ఆ రోజు మానవత్వం

అతనిలానే బజార్న పడింది!

ఆమె కడుపులోని పేగుల్ని

వెజైనల్ ఎండోమెట్రియాన్ని

చలి చీకటి కబళిస్తుంటే

వేదనని రుధిరంగా స్రవిస్తూ అతను!

ఆడతనాన్ని ఆటవికులు

అతి క్రూరంగా శిలువేసినపుడు

నిస్సహాయతాశ్రువులు నింపుకుని

పరివేదన దృక్కులు ప్రసరిస్తూ అతను!

ఆ నలభై నిముషాలూ

కదలని పైశాచిక యుగాలు

చూసీ చూడనట్లు వెళ్ళిపోయిన మృగాలు

అక్కడ గాయపడ్డ అవమానాన్ని

కప్పడానికి ఓ వస్త్రం వెతుక్కుంటూ అతను!

కాలం శూలంలా గుచ్చుకున్నప్పుడు

ఉద్యమాల కొవ్వొత్తుల కాంతిలో

ఛాయలేమీ లేకుండా కరిగిపోయాడతను

ఎవరికీ తెలియని ఏకాంతంలోకి

భీభత్స దృశ్యాల భారాన్ని మోసుకుంటూ

ఆ రాత్రి పరిచిన ముళ్ళ మీద నడిచిపోయాడతను

అక్కడ కనీసం పాదాల గుర్తులైనా లేవు!

(డిల్లీ చలిరాత్రిలో నిర్భయతో పాటు గాయపడ్డ అవీంద్ర ప్రతాప్ పాండే గురించి...)

శారద సి.వి.

29.12.2014

English summary
Kavisangamam poet: CV Sarada on Nirbhaya incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X