• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిస్వరం: కుంకుడుచెట్టు

By Pratap
|

మార్టిన్ కుంకుడు చెట్టు కవిత ఒక్కసారిగా బాల్యజ్ఞాపకాలను తట్టిలేపి, వర్తమానానికి జోడించింది. ఒక మంచి కవిత ద్వారా ఓ మంచి అనుభవాన్ని మిగిలించింది. పాత విషయాలను చెబుతుంటే అంతా వేదంలోనే ఉన్నాయష అని వెక్కిరించుకోవడం మనకు అలవాటైంది గానీ కుంకుడు చెట్టు అందించిన షాంపూను మార్టిన్ గుర్తు చేసిన తర్వాత కాలమెంత మారిపోయిందో, మనమెంత స్వయంశక్తిని, స్వయం ఉత్పాదక సామర్థ్యాన్ని, స్వీయ ఆలోచనలను, ఆచరణను మరిచిపోయామో అనే బాధ హృదయాన్ని నులిపెడుతుంది.

మా అక్క పుష్ప అలియాస్ పుల్లమ్మ కుంకుడు నురుగును దట్టంగా వెంట్రుకలను పట్టించుకుని, తలారా స్నానమం చేసిన తర్వాత ఎదుట దైవంలా నిలబడినట్లే అనిపించింది ఈ కవిత చదివిన తర్వాత. ఇప్పుడు మా అక్కనే కుంకుడు కాయలను వదిలేసి షాంపూలను వాడే స్థితికి వచ్చింది. కాలం నెట్టింది, ప్రపంచ మార్కెట్ మాయాజాలం నెట్టింది. ప్రపంచీకరణ మాయాజాలంలో పడి మా అక్క కుంకుడు కాయల పేటెంట్‌ను కోల్పోయిందా అని అనిపించింది.

గోల్డెన్ త్రెషోల్డ్‌లో కవిసంగమం కవితాపఠనం జరుగుతున్నప్పుడు మార్టిన్‌కు తాను కుంకుడు చెట్టు కింద కూర్చున్నాననే ఎరుక కలిగి, ఆ స్పందనతో ఈ కవితను అందించారు. నిజంగా, ఇది ఇప్పటి కాలానికి అవసరమైన ఓ ఎరుక. గత కాలం జీవనవిధానాన్ని మార్కెటీకరణ జరిగిన తర్వాత ఇప్పటి జీవనశైలికి జోడిస్తూ రాసిన కవిత. బహుశా, కవికోకిల సరోజినీ నాయుడు ఆ కుంకుడు కాయల పొడిని తలకు అంటించి, స్నానం చేసే మనకు హైదరాబాద్ గాజులపై అందమైన కవితలను అందించి ఉంటారనే ఓ అందమైన ఊహకు కూడా ఈ కవిత ఊపిరి పోసింది.

ప్రపంచీకరణ కాలంలో మన వేప చెట్టు నుంచి అన్నీ పేటెంట్ హక్కులను కోల్పోయి, లేదంటే మన గత కాలం జీవనశైలిని పక్కదోవ పట్టించి, మన జేబులను ఖాళీ చేసే మార్కెట్ మాయాజాలం ఆవహిస్తున్న వైనాన్ని కూడా ఈ కవిత గుర్తు చేసింది. కాస్తా వెనక్కి ఆలోచిద్దామా, కాస్తా వెనకడుగు వేద్దామా అనే స్పృహను కూడా ఈ కవిత కలిగించింది. ప్రపంచీకరణను ఎదుర్కోవడానికి స్థానిక ఉత్పత్తి, స్థానిక పంపిణీ, స్థానిక ఉపయోగం అనే ఓ ఆర్థిక వ్యవస్థ రూపొందించాలనే ఎరుకను ఈ కవిత కలిగిస్తే అది ఎంతో ప్రయోజనం నెరవేర్చినట్లే.

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisangamam poet: Martin's Kunkudu Chettu

ఇప్పటి ఇంగ్లీష్ షాంపోలు రాకముందునుండీ

అమేరికన్ కండీష్నర్లు రసెల్స్ దుకాణాల్లో

అమ్మబడడానికి పూర్వంనుండీ

ఇక్కడేవుంది ఈ కుంకుడు చెట్టు

నిఖార్సైన నల్లనికాయలతో నిటారైన దేహంతో

ఎంత దర్పంగా వెలిగిందో

ఆంధ్రభోజులూ, అతిధి బ్రౌన్లూ

ఎంత శ్లాఘించారో దీని సరళసౌందర్యాన్ని

ఎందరు తిక్కనలు ఏతాళ్ళపాక నుండో తెచ్చ్చిన

గుండ్రాళ్ళకింద మెత్తగానలిగి

ధూర్జటుల జటిలహస్తాలలో పిసకబడి

ఎన్నెన్ని తరాల తలల మురికినీ

తేటనైన తమ నురగల్లో ప్రక్షాళన చేశాయో ఆఫలాలు

ఏంవైభవం దానిది... ఏచీడలూ పట్టలేదు దానికి

ఏసముద్రాలు దాటి ఎన్నిరాలేదూ తెల్లతుపానులు?

ఖైబరు కనుమలుదాటి రాలేదా ప్రళయాలు?

విప్పత్తులను దాటి, ఆపత్తులకు నిలచి

ఇప్పటికీ నిలబడేవుంది తననుకన్న గడ్డపై

ఇప్పటికీ ఈ చెట్టుకొమ్మలక్రింద కూర్చుని

ఏ శారదమ్మో తన సి.వి. రాసుకుంటూనేవుంది

ఏరాజో తన కాశీమజిలీ కథల్ని మననంచేసుకుంటూనే వున్నాడు

ఏ యశశ్వో తపస్విగా మారి

ప్రయోక్తగేయాల్ని జపిస్తూనే వున్నాడు

ఏ వీరఫాండ్య 'కట్ట 'బ్రహ్మన్నో అక్కడ చేరిన పిట్టల పాటల్ని

'వాహ్', 'ఖూబ్' అంటూ ఆనందిస్తూనే వున్నాడు

ఏ రా(రాం)కుమారుడో గోలచేస్తున తుంటరి వుడుతల్ని

ప్రేమతో అదిలిస్తూనే వున్నాడు

అటుగా వచ్చిపోయే ఏబాటసారో తనకథను

అనగనగా అంటూ కొనసాగిస్తూనే వున్నాడు

బంగారువాకిళ్ళలో జరుగుతున్న సంగమాల సాక్షిగా

కుంకుడు చెట్టు కొత్తపూత వేస్తూనేవుంది

- మార్టిన్

24 నవంబర్ 2014

English summary
Kavisangamam poet: Martin's Kunkudu Chettu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X