కవిస్వరం: మూడు పదాలు
ఈ వారం ఎందుకో గానీ కవిసంగమం గ్రూపులో చాలా వరకు ప్రేమ కవిత్వమే కనిపించింది. ప్రేమ సార్వజనీనమైన వస్తువే. అది సార్వజనీనం కావడం వెనక సామాజిక అంశం కూడా. ప్రేమ అనేది సామాజిక సంబంధాలకు సంబంధించిన విషయం. ఈ వారంలోని అన్ని ప్రేమ కవిత్వాల్లో మోని శ్రీనివాస్ రాసిన కవిత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన సమాచార వినిమయానికి సంబంధించిన అంశం ఉంది.
మోని శ్రీనివాస్ ప్రేయసి పంపే సందేశాల గురించి మాత్రమే ఈ కవితను ఉద్దేశించారు గానీ ఎవరైనా సమాచారం అందించడానికి మాత్రమే కాకుండా విషాదాలను, సంతోషాలను, ఉద్వేగాలను పంచుకోవడానికి ఉత్తరం ఓ వాహికగా పనికి వచ్చేది. నీకింకా గుర్తుందా అనే అనే వాక్యంతో ప్రారంభమయ్యే కవిత ప్రేయసీప్రియులు ఉత్తరాలు రాసుకునే కాలంతో ప్రారంభమై వాట్పప్ సందేశాలు పంపుకునే ఆధునిక కాలంతో ముగుస్తుంది.
ఉత్తరాలు రాసినప్పుడు గానీ వాట్సప్ సందేశాలు పంపుతున్నప్పుడు గానీ కదిలేవి వేళ్లే. కానీ, హృదయ స్పందనలతో కూడిన ఆలోచనల ముసురు ఒక్కటి ఉత్తరాల్లో పరుచుకుంటూ ఉండేది. "ఎన్నెన్ని ఊసులు... ఎన్నెన్ని బాసలు.../ కష్టాలూ, సుఖాలు... సంతోషాలూ, విషాదాలు.../ ఎదైనా... ఏవైనా... అన్నింటినీ చేరవేసేది" అని ఉత్తరాల్లో పరుచుకునే విస్తృతినే కాకుండా ఆప్యాయత, అనుభవ గాఢతను వ్యక్తీకరించాడు శ్రీనివాస్.

మరి, ఈ మెయిల్స్, వాట్పప్ సందేశాలు ఈ భావగాఢతను వ్యక్తీకరిస్తున్నాయా అనేది సందేహమే. పొడిపొడి మాటలు రాలిపడడం లేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అప్పుడైనా, ఇప్పుడైనా రాసేవి ఆ మూడు పదాలే అంటూ ఐ లవ్ యూ అని ముగించాడు. ఆ పదాలు మాత్రమే అనురాగ గాఢతను వ్యక్తీకరిస్తాయా.. అది సరిపోతుందా అనేవి ప్రశ్నలు. వాటికి ఈ కవిత సమాధానం చెప్పలేదు. అనుభవం మాత్రమే చెబుతుంది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా మూడు పదాలే అవుతాయి. అంటే తెలుగులో కూడా అది సరిపోతుంది. మూడు పదాలు అని చెప్పడం ద్వారా కవితావస్తువును శ్రీనివాస్ కుదించాడు. సమాచార వినిమయంలో వచ్చిన విప్లవాత్మక మార్పును పూర్తి స్థాయిలో వ్యక్తీకరించలేకపోయింది. మూడో స్టాంజాలో కాలక్రమంలో అన్న వాక్యం తీసేసినా పెద్ద ప్రమాదం లేదు. మొత్తం మీద, కవిత మంచి అనుభూతిని కలిగిస్తుంది.
- కాసుల ప్రతాపరెడ్డి
నీకింకా గుర్తుందా?...
ఆ రోజుల్లో మనం ఉత్తరాల్లో మాట్లాడుకునేవాళ్ళం!
కాగితమ్మీద...
కొన్నిసార్లు నీలిరంగు, మరికొన్నిసార్లు నలుపు రంగుల్లో...
ఆలోచనల ఊటల్లోంచి ఉబికివచ్చే
అక్షరధార అంతం లేనట్లుగా పరుగులు తీసేది!
ఉత్తరాల ప్రవాహంలో
రోజులు గడిచాయి... నెలలు తరిగాయి...
సంవత్సరాలు దొర్లాయి...
దశాబ్దకాలం కరిగిపొయింది!
ఎన్నెన్ని ఊసులు... ఎన్నెన్ని బాసలు...
కష్టాలూ, సుఖాలు... సంతోషాలూ, విషాదాలు...
ఎదైనా... ఏవైనా... అన్నింటినీ చేరవేసేది
ఆ రోజుల్లో ఉత్తరం ఒక్కటే!
కాలక్రమంలో...
ఉత్తరం కాస్త సందేశంగా మారింది
కాగితం ఎస్సెమ్మెస్ అయింది
ఇంటర్నెట్లో ఇ-మెయిల్ గా రూపాంతరం చెంది
ఇప్పుడేమో 'వాట్సప్' రూపంలో
నా సందేశం
నీ ఫోన్లోకి దూరింది చిత్రంగా!
ఆ రోజుల్లో...
నీకుత్తరం రాయడానికి
నా వేళ్ళు కలం పట్టుకు కదలాడేవి
ఇప్పుడవే వేళ్ళు కీ పాడ్ మీద నర్తిస్తున్నాయి
అప్పుడైనా... ఇప్పుడైనా...
ఎప్పుడైనా రాసేవి అవే మూడు పదాలు...
"ఐ లవ్ యూ"!
- మోని శ్రీనివాస్
తేది : 13-12-2014