కవిస్వరం: అమరుడు
ఈ వారం కవిసంగమం ద్వారా ఒక ఆర్ద్రమైన కవితను అందించాడు ఎంవి పట్వవర్దన్. నక్సలైట్ ఉద్యమం, దాని సిద్ధాంతంతో ప్రమేయం లేకుండా తెలంగాణ అంతటా విస్తరించి ఉన్న ఒక్క భావనకు ఆయన చిత్రిక కట్టారు. చివరలో ఆయన చెప్పిన మాటలు చాలా ఎన్నదగినవి. నిస్వార్థంగా, సమాజం మేలు కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించే వీరులు గురించిన కవిత అది.
అన్యాయం మీద యుద్ధం ప్రకటించి, కురుక్షేత్రంలో అభిమన్యుడి లాంటి అమర వీరుడు త్యాగం గురించి ఆయన మాట్లాడాడు. అంతకన్నా ఎక్కువ ఈ కవిత గురించి ఆలోచించ వద్దని ఆయన చెప్పారు కూడా. అన్యాయం, అసమానతలు లేని సమాజం ఏర్పడినప్పుడు కొంత మంది అడువులకు వెళ్లి, అమరులు కావాల్సిన అవసరం కూడా ఉండదు.
అసమానతలను రూపుమాపడానికి, సమసమాజ స్థాపన జరగడానికి అనువైన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం సాయుధ విప్లవం ద్వారానే సాధ్యమవుతుందని నమ్మినవారు ప్రాణాలు అర్పిస్తున్నారు. ఆ త్యాగానికి విలువ ఉంటుంది. ఆ అమరుడు ఎన్నుకున్న మార్గం సరైందా, కాదా అనేది చర్చ ఇక్కడ అప్రస్తుతమే అనిపిస్తుంది. ఓ అద్భుతమైన నెరేషన్ ఈ కవితలో ఉంది. ఆ నెరేషన్ సమాజం కోసం ప్రాణార్పణ చేస్తున్న వీరుల పట్ల సానుభూతి పెంచడమే కాకుండా, అటువంటి త్యాగాలు చేయాల్సిన సమాజం వర్ధిల్లుతున్నందుకు గుండె మండిపోవడమనేది ఎలా ఉంటుందో ఈ కవిత తెలియజేస్తుంది.
- కాసుల ప్రతాపరెడ్డి

తల్లి కడుపులోనో, భార్య గుండెలోనో
కన్నీటి కారు చీకటి పోట్ల వరద పారించి
అడవిలో కాంతి కిరణంలా ప్రసరించిన అతడు
ఆట లాగో, పాటలాగో అడవినంతా అలుముకున్న అతడు
ఆశయాన్నే ఆశించి, శ్వాసించి, ఆశ్వాసించి
ఆయుధానికి సాలంబనగా నిలిచీ ,నిలిచీ
క్రమంగా తానే ఒక ఆయుధమైన అతడు
ప్రతి రోజూ తన కోల్పోతను చుక్కల గుంపుల్లో చూస్తూ
ఉత్సాహాన్ని ఊరించుకుంటున్న అతడు
యుద్ధ శంఖాన్ని పూరించి,నారి సారించిన అతడు
ఒక ఎగురుతున్న ఎర్ర పావురం లాగా అతడు.
ఏదో ఒక నాడు అడవి గాలిలో గంధక ధూమమై గుబాళించే అతడు...
సుప్రసిద్దుడైన కవి గారి ఎదలోనో,,
సురక్షితమైన సెమినారు స్టేజీ మీదో
అద్భుతమైన ఎలిజీగా ఒదిగి పోయే అతడు...
ఒక అసమాపక క్రియ లాంటి అతడు.
ఒక అభిమన్యుడి లాంటి అతడు...
-ఎం.వీ.పట్వర్ధన్
(...నాకు సాయుధ విప్లవం పట్ల అభ్యంతరాలున్నా ఆ నిస్వార్థ త్యాగవీరులంటే ఎనలేని గౌరవంతో.....)
14 ఫిబ్రవరి 2015