kasula pratap reddy naveen kumar kavisangamam telugu literature కాసుల ప్రతాపరెడ్డి నవీన్ కుమార్ కవిసంగమం తెలుగు సాహిత్యం
కవిస్వరం: నవీన్ కుమార్ రాత్రి!!
ఈ వారం కవిసంగమంలో ప్రకృతి, ప్రేమకు సంబంధించిన కవితలే ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది కొత్తవాళ్లు కూడా కవిసంగమం గ్రూపులోకి ప్రవేశించినట్లు కనిపిస్తున్నారు. చాలా మంది కవితలు మనసుకు హత్తునేట్లే ఉన్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని అచ్చు పోసినట్లు కవితాత్మకంగా వర్ణించడంలో చాలా మంది విజయం సాధించారు. ప్రకృతిని ఆసరా చేసుకుని ఆంతరంగిక మనోభావనలను వెల్లడించడానికి ప్రయత్నించారు.
నవీన్ కుమార్ రాత్రి కవిత మొత్తం ఓ ప్రతీకగా కనిపించింది. రాత్రి కావడం మొదలు పెట్టినప్పటి నుంచి చీకటి అయ్యే వరకు అది నిర్వహించే పాత్రను ఆయన కళ్లకు కట్టారు. రాత్రికి సంబంధించిన ఒక్కో దృశ్యాన్ని తీసుకుని అలంకార ప్రయోగాలతో అందంగా చెప్పాడు. చాలా కళాత్మకంగా దృశ్యాలను కళ్లకుకట్టాడు. ఉదయాన్ని, ఉదయ సమీరాన్ని వర్ణించిన కవితలు చాలానే ఉన్నాయి. రాత్రిని మనం భయంకరంగా ఊహిస్తాం గానీ అది మానవ జీవితానికి అందించే ప్రశాంతత ఏమిటో నవీన్ కుమార్ చాలా సున్నితమైన పదాల కూర్పుతో చెప్పాడు.
సాయం సంధ్య నుంచి మనిషి నిద్రపోయే వరకు రాత్రి పూట ప్రకృతిలో సంభవించే పరిణామాలను వరుసగా పేర్చుకుంటూ వెళ్లాడు. రాత్రి ఎంత మధురంగా ఉంటుందో చెప్పాడు కవి. ఆ కవితను మీరే ఆస్వాదించండి.
- కాసుల ప్రతాపరెడ్డి

పడమటి అంచు
అందంగా రంగులు మారుతుంటుంది
అదృశ్యశక్తులేవో
నింగిపైకి నక్షత్రాల వర్షం కురిపిస్తాయి
పిల్లకాలువలో కాగితప్పడవలా
చందమామ తేలుతూ వస్తాడు
నిశ్శబ్దంగా రాత్రి నిద్రలేస్తుంది
శీతాకాలపు సమీరంలా
పాదాలను తాకి
నిగూఢ సందేశాలు దాగిన పరిమళంలా
దేహాన్ని చుట్టి
నిస్సారపు నీడలు దూరంచేసి
ఆలోచన అడుగులు నెమ్మదిచేసీ
మనసును మరోలోకంలోకి తీసుకెళ్తుంది రాత్రి
కలలకౌగిట బంధించి
వెన్నెలవీధుల తిప్పించి
గుప్పిట గుట్టుగాదాచిన మధురక్షణాలను
గమ్మత్తుగా విప్పుతుంది రాత్రి
శ్రుతితప్పని ఈ లాలిపాటకు
నిదురించని దేహమూ లేదు పులకించని ప్రాణమూలేదు
సుతిమెత్తని ఈ రాత్రిస్పర్శకు
కదలని హృదయమూ లేదు కరగని శోకమూలేదు
నవీన్ కుమార్
04 జనవరి 2015