కవిస్వరం: ఆశల పాట
సింగిరెడ్డి కార్తిక్ రెడ్డిలో కవిత్వానికి సంబంధించిన మంత్ర దండం ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ వారం ఆయనవి రెండు మూడు కవితలు కవిసంగమం గ్రూపులో ఉన్నాయి. ప్రస్తుత కవిత ఆశల పాట - ఓ దృశ్యాన్ని కెమెరాలో బంధించినట్లు కవితను అల్లాడు. కెమెరామన్ కళాకారుడు అయితే, అతను తీసిన చిత్రంలో ఇతర రహస్యాలు కూడా తెలిసి వస్తాయి. అలాంటి లోలోతులను కూడా కార్తిక్ రెడ్డి తన కవితలో పట్టించాడు.
కార్తిక్ రెడ్డి బొమ్మలు కూడా గీస్తున్నాడు. పెన్సిల్తో లైన్ డ్రాయింగ్ చేస్తున్నట్లున్నాడు. అలా పదాలను కూడా చిత్రం గీసినట్లు అల్లుకుంటూ, కూర్చుకుంటూ వచ్చాడు. ఓ మహిళ చీకట్లో, దీపం వెలుగులో దేని కోసమో, ఎవరి కోసమో నిరీక్షిస్తున్న దృశ్యాన్ని అతను ఈ కవితలో చిత్రిక కట్టాడు. ఆ చిత్రికతో అతను సరిపెట్టకుండా చివరలో అందమైన ముక్తాయింపు ఇచ్చాడు.

ఇరులలోనే కౌముది అందం
తెలుస్తుందని.
ఎడబాటులోనే జ్ఞాపకాల పాటల్ని
మరింత హాయిగా పాడుకోవచ్చని - అటూ ఆ ముక్తాయింపు ఇచ్చాడు. ఈ పాదాలకు వివరణ అవసరం లేదు. ఆమె అంతరంగాన్ని కవిగా సింగిరెడ్డి కార్తిక్ రెడ్డి చెప్పాడు. కవితలోని అల్లిక రహస్యాన్ని కూడా పసిగట్టి, మనం కూడా కొంత కవితానిర్మాణ పద్ధతిని, క్లుప్తతలోని సౌందర్యాన్ని పట్టుకోవచ్చు. అతను స్త్రీఅంతర్లోకంలోని సౌందర్యాన్ని ఈ కవితలో ఆవిష్కరించాడు. కవిత స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించింది.
- కాసుల ప్రతాపరెడ్డి
గదిలో నిశ్శబ్దాన్ని నింపుకొని
దీపపు వెలుతురులో ఉందామె.
కిటికి ఊచల సందుల్లోంచి
ఎవరికోసమో, దేనికోసమో
గుమ్మం వైపే తదేకంగా చూస్తుంది.
ఆమె చూపులు
ఎన్నో యుగాల నీరీక్షణను
అంటించుకున్నట్లున్నవి.
ఆమె పెదాలపై
కలల తీగల మెరుపులు
స్పష్టంగా కనపడుతున్నాయి
అదే దృశ్యం...
అలాగే కొనసాగుతూ ఉంది.
ఆమెలో ఆశ మాత్రం ఎప్పటిలాగే
కొత్త కొత్త కోరికలను పులుముకుంటూ.
ఎందుకంటే ఆమెకు తెలుసు.
ఇరులలోనే కౌముది అందం
తెలుస్తుందని.
ఎడబాటులోనే జ్ఞాపకాల పాటల్ని
మరింత హాయిగా పాడుకోవచ్చని.
- సింగిరెడ్డి కార్తిక్ రెడ్డి