కవిస్వరం: శ్రీకాంత్ కవిత
ఒంటరి దుఖ్కం గురించి, ఒంటరి వేదన గురించి చాలా మంది కవులే రాశారు. ఎవరు రాసినా ఓ తాజా అనుభూతిని అది కలిగిస్తుంది. సమూహంలోనూ మనిషి ఒంటరిగానే మిగిలే దుఖ్కం గురించి మాత్రం చాలా తక్కువ కవితలే వచ్చాయి. జీవితం ఒంటరిగానే సాగుతుందనే ఎరుక నుంచి శ్రీకాంత్ కంటేకర్ ఓ మంచి కవిత రాశారు.
జీవితం పూలపాన్పూ కాదు. జీవితమనే సముద్రాన్ని ఈదడానికి నిరంతరం సమరం సాగించాల్సిందే. అయితే, జీవితంలో అనుకోని ఆటంకాలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకు సంబంధించిన ఎరుకను శ్రీకాంత్ కంటేకర్ తన కవిత ద్వారా కలిగిస్తుననాడు. ఒంటరి సముద్రంలా, ఒంటరి ఆకాశంలా, ఒంటరి వర్ష రుతువులా జీవితం సాగతూ ఉంటుందని కవి చెబుతూ జీవనయానంలో ఎదురయ్యే ఆటంకాలను, కష్టాలను చెబుతాడు.
ప్రతి వ్యక్తీ ఏదో తీరం చేరాలనే ప్రయాణం సాగిస్తుంటాడు. కానీ తీరాలు ఏవీ ఉండవనే విషయం మనిషికి తెలియదని శ్రీకాంత్ అంటాడు. జీవితాన్ని కొనసాగించడమనేది మాత్రమే పరమార్థమని, గమ్యం అంటూ ఏదీ ఉండదనే జీవన తాత్వికతను ఆయన తన కవితలో చెప్పాడు. ఈ జీవన యానం కూడా సాఫీగా ఏమీ సాగదు. వెన్నెల ఖడ్గాలు, వెన్నెల ఇంకిపోయిన రాత్రులు జీవితంలో ఎదురవుతాయనే సత్యాన్ని అతను ఆవిష్కరించాడు. ఈ కవిత మొత్తం చదివితే గాఢమైన అనుభూతి కలిగి నిట్టూర్పు విడవడం పాఠకుడి వంతవుతుంది. ఆ రకంగా ఈ కవిత ప్రయోజనాన్ని సాధించి, నడవడమే జీవిత సత్యమనే భావన నిండుతుంది.
- కాసుల ప్రతాపరెడ్డి

ఒంటరి సముద్రం లెక్క
ఎన్ని పడవలెక్కుతావో
ఒంటరి ఆకాశంలా
ఎన్నిసార్లు రాలిపడతావో
ఒంటరి వర్షపు ఋతువులా
ఎందరి కనుపాపలనుంచి జారిపోతావో
నీకు తెలియదు
తీరాలంటూ ఏవీ ఉండవని
నీకు తెలియదు
రెక్కలు లేని విహంగాలు
నలుదిక్కులా ఉంటాయని
నీకు తెలియదు
నులివెచ్చని బాహువులను
నరికే వెన్నెల ఖడ్గలుంటాయని
అరణ్యాలను దహించే
స్వాతిచినుకులు కురుస్తాయని
కన్నీరై ఇంకిపోని కాగితాల చప్పుడు కోసం
వెన్నెల ఇంకిపోయిన రాత్రులు వేచిచూస్తాయని..
- శ్రీకాంత్ కాంటేకర్