kasula pratap reddy kavisangamam telugu literature sahithi కాసుల ప్రతాపరెడ్డి కవిసంగమం తెలుగు సాహిత్యం సాహితి
కవిస్వరం: చీకటితో యుద్ధం

సమాజంలో చీకట్లు పరుచుకున్న స్థితిని మొదటి స్టాంజాలో కవి వివరించాడు. సమాజంలోని చీకటినే కాదు, కవి లోలోతుల్లోని చీకటి కూడా అది. బతుకులో వెలుగు ఇరుకైపోయినప్పుడు ఓ వ్యక్తి సృజనకారుడిగా మారి, చీకటేనే ఉలికిపాటుకు గురి చేసే ఓ వ్యక్తి పరిణామక్రమం ఈ కవితలో ఉంది. అతను సృజనకారుడిగా మారి తనలోని చీకటినే కాదు, సమాజంలోని చీకటిని కూడా పారదోలడానికి ఉద్యుక్తుడైన పరిణామక్రమం అది.
అతనికి తొలుత కూనిరాగం తెలియదు. కానీ పాటను కైగట్టే స్థితికి చేరుకుంటాడు. గుప్పిట నిండా అతనికి తొలుత భయమే. కానీ అదే పిడికిలితో ప్రపంచానికి పిలుపునిచ్చే దశకు చేరుకుంటాడు. గురి తప్పని అక్షరాల తూటాలను అతను విసురుతుంటాడు. ఇది కవిత సారం. శ్రీనివాస్ సాహి వ్యక్తీకరణ ద్వారా రెండు వైరుధ్యాలను పక్కన పక్కన పెట్టి ఓ మంచి కవితను అల్లాడు.
ఈ కవితలో మరో విశేషం ఉంది. క్రియారూపాల విషయంలో చూపిన విశేషం అది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలుగు కవిత్వానికి తెలంగాణ కవులు అందించిన కొత్త వ్యక్తీకరణ రూపం అది. తెలంగాణ కవుల్లో ఇద్దరు ముగ్గురు కవులు అటువంటి క్రియారూపాల ద్వారా అప్పటి వరకు ఉన్న వ్యక్తీకరణకు తోసిపుచ్చి తమ అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. అది ముందుకు సాగుతున్నదని చెప్పడానికి కూడా శ్రీనివాస్ సాహి కవిత నిదర్శనంగా నిలుస్తుంది.
- కాసుల ప్రతాపరెడ్డి
కనురెప్పల కింద చీకట్లు
మనసు లోతుల్లోకి ఇంకిపోయి
బతుకులో వెలుగు ఇరుకైపోతది
కూనిరాగమే తెలియని
నీ గొంతుక
చీకటిని చీల్చే
ఓ పాటని
కై కడుతది..
గుప్పిట్ల నిండా
భయాన్ని పోగేసుకున్ననువ్వు
అదే పిడికిలితో
ఓ ప్రపంచానికి
పిలుపువైతవు
గురి తప్పని
అక్షరపు తూటాల్ని
పెన్ను నిండా నింపుకుని
గుండె మీదున్న జేబులో
దాన్ని ప్రతిస్ఠస్తవు
నువ్వన్నా!
నీ రాతన్నా!
చీకటిప్పుడు ఉలిక్కిపడుతది...
- శ్రీనివాస్ సాహి
15 నవంబర్, 2014.