కవిస్వరం: సందె మాపున మా వూరు!
ఉదయ సంధ్యను అద్భుతంగా తమ్మెర రాధిక చిత్రిక కట్టింది. ఈ కవిత చదివితే ఓ అందమైన దృశ్యం కళ్లకు కడుతుంది. స్వాభావిక అలంకారాలతో ఇంత హృద్యంగా కవిత చెప్పడం కాస్తా కష్టతరమైన పనే. కానీ కవయిత్రి ఆ పనిని అత్యంత సమర్థంగా నిర్వహించింది.
ఉదయ సంధ్య వేళ ఓ ఊరు దృశ్యం కళ్లకు కట్టింది. రాధిక తన ఊరు గురించే మాట్లాడిన బహుశా అన్ని ఊర్లకూ ఇది వర్తిస్తుంది. ప్రకృతి నిద్ర లేచి ఒళ్లు విరుచుకుంటున్న వైనాన్ని ఈ కవిత మనకు అనుభూతం చేస్తుంది. అనుభూతి ద్వారా గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.
కోడి పుంజు ఊరిని నిద్రలేపిన తీరు అత్యంత అందమైన ప్రతీక ద్వారా ఆమె చెప్పారు. ఒంటి రెక్కని టపటపలాడిస్తూ
కాలం గుండెలపై పటకా దెబ్బలు కొడ్తూ అంటూ అందమైన చరణాలను మనకు ఆమె మనకు అందించింది. అలాగే కోడి మేలుకొలుపునకు చెర్లో రక్తం కడుక్కుంటున్న సూర్యుడు ఉలిక్కి పడ్డాడంటూ అత్యంత అందమైన ప్రతీక ద్వారా ఆహ్లాదాన్ని కలిగించింది కవయిత్రి. ఈ కవితలో ఇటువంటి అందమైన వాక్యాలు చాలా ఉన్నాయి. చదివి అనుభూతి చెందండి.
-కాసుల ప్రతాపరెడ్డి

ఊరు లేవక ముందే
బొడ్డు మల్లె వాకిట్లో పూలు దులిపేసింది
రాము- తమ్మెర రాధిక,లోరి గుళ్ళో గుంట
గాలికి గణగణ మంటూ బదులిచ్చింది.
నెమరేస్తున్న ఆవు కళ్ళు
కొట్టాన్ని కావలి కాస్తూనే వున్నాయి రాత్రంతా.
చింత చెట్టు మీది కాకిగూడులో
కోయిల - స్వరాలను కూడదీసుకుంటోంది సూర్యోదయానికి
స్వాగత రాగాలను ఆలపించడానికి.
నూతుల ప్రక్కన పచ్చిక
తలల మీద మంచు బిందువు కిరీటాలనప్పుడే సింగారించుకుంటోంది.
చెరువు అంచుల మీది పొల్లూ నెల్లూ
రెక్కలతో చెదరగొడ్తూ పచ్చి పసుపు రంగు పిట్ట
చేపలు పడుతోంది!
ఇంకెప్పుడు తెల్లారునో గానీ...
కొప్పెర క్రింది కంది మోళ్ళు అప్పటికే భగభగమంటున్నాయి.
చుట్టు ప్రక్కల రాలిపడ్డ మామిడి పిందెల
పసరు వాసనకు - వేకువ గాలి విసురును తప్పుపడుతోంది.
ఇంకా కాసేపు నిద్రపోనీ వేంటని!
రాత్రి గండాలన్ని దాటి ఒంటి నిండా రక్తపు గాయాలతో
ఎర్ర సూరీడు చెరువు మధ్యలో తామరలా మొలిచాడు.
అలుకుముచ్చట్లు ముగిసి ముగ్గుమురిపాలు
చలితో పాటే వాకిట్లో పరుచుకు పోయాయి.
బాగూ ఓగూ తెలియని పొగమంచు
కుక్కి మంచంలోని ముసలమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ఊస్.... అబ్బా....
ఎండ రెక్కలు విదల్చ దేం ఇంకా!
గంప కింది కోడి పెడబొబ్బతో
చెర్లో రక్తం కడుక్కుంటున్న సూరీడు ఉలిక్కిపడి
పరుగో పరుగో వూరుని వదలని మంచు దుప్పటి క్రిందికి.
ఇహ లాభం లేదు...
గంప కింది కోడి గడపదాటి ఇల్లెక్కింది,
ఒంటి రెక్కని టపటపలాడిస్తూ
కాలం గుండెలపై పటకా దెబ్బలు కొడ్తూ
పల్లె నిదుర ఒదల్చమని.!!
- తమ్మెర రాధిక
మార్చి 15, 2015