• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిస్వరం: కవిత్వ దాహం

By Pratap
|

ఫేస్‌బుక్‌లో కవి సంగమం గ్రూప్ ప్రారంభమై నేటికి మూడేళ్లు. అంటే మూడు కవిత్వ వసంతాలు అని చెప్పుకోవాలి. యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్లి, ఇంటర్నెట్ వాడకంతో సున్నిత భావాలకు దూరమై సాహిత్యానికి కూడా దూరమవుతుందని భావిస్తున్న రోజులవి. యాకూబ్‌కు ఎందుకు అనిపించిందో తెలియదు గానీ కవిసంగమం గ్రూప్‌ను ప్రారంభించారు. అది మొదలు అది అప్రతిహతంగా కొనసాగుతోంది. కవిసంగమం గ్రూప్‌లో యువకులు అనేక మంది కవిత్వాన్ని పోస్టు చేస్తూ కవిత్వ రచనలో, సృజనాత్మకతలో పోటీ పడుతున్నారు. అంతేకాకుండా, కవిత్వ రచనలోని మెలుకువలను నేర్చుకుంటున్నారు.

నిజానికి, అది ఫేస్‌బుక్ వరకే పరిమితం కాలేదు. బయట కార్యక్రమాలను, ఫేస్‌బుక్‌కు అనుసంధానం చేస్తూ సాగుతోంది. కవిసంగమం గ్రూప్‌ను కొంత మంది కవులు, నరసింగరావు వంటి పెద్దలతో ప్రారంభించారు. ఆ తర్వాత ఓ సీనియర్ కవి, వర్తమాన కవి, యువ కవులను ముగ్గురిని కలిపి ప్రతి నెలా రెండో శనివారం తమ తమ కవితా నేపథ్యాలను వినిపిస్తూ కవితా పఠనం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.

సీనియర్ కవులు కాగితాల మీద రాసుకొచ్చిన కవితలను చదువుతూ ఉంటే, తాజా కవులు మొబైల్‌లో దాచిపెట్టిన కవితలను చదువుతుండడం సాంకేతిక పరిణామాన్ని తెలియజేస్తుండడమే కాకుండా అభివ్యక్తిలో తేడాను కూడా పట్టించడం ఓ గమ్మత్తయిన అనుభూతిని అందిస్తోంది. సీనియర్ కవులు సామాజిక నిబద్ధతకు, సిద్దాంతాల అవగాహనకు సంబంధించిన విషయాలనే కాకుండా శైలీ నైపుణ్యాలను చెబుతుంటే, వాటిని యువకవులు జీర్ణం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండడం కూడా అనుభవంలోకి వస్తోంది.

మీట్ ద పోయెట్ పేర సింగిల్ పోయెట్ కవితా పఠనాలు కూడా జరుగుతున్నాయి. ఇతర భాషా కవులను కూడా పిలిస్తూ సమావేశాల్లో వారి అనుభవాలను యువ కవులకు వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సైద్ధాంతిక, ప్రాంతీయ, కుల, లింగ, ఇతరేతాల జోలికి వెళ్లకుండా జయహో కవిత్వం అంటూ కవిత్వానికే పట్టం కట్టే విధంగా కవిసంగమం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా యువకులను, కొత్తవాళ్లను కవిత్వం వైపు మళ్లిస్తోంది. అలా మళ్లిస్తుందని చెప్పడానికి రవీందర్ విలాసాగరం రాసిన కవితే నిదర్శనం. ఆ కవితకు వివరణ గానీ విశ్లేషణ గానీ అక్కరలేదని అనుకుంటున్నా.. ఓసారి చదివితే కవిసంగమం అందిస్తున్న స్ఫూర్తి మనసుకు తడుతుంది.

Kavisngamam poet Ravinder Vilasgaram

- కాసుల ప్రతాపరెడ్డి

నాకు కొన్ని గంపలు కావాలి

మా ఇంటి అటక ఖాళీ కడుపుతో

నకనకలాడిపోతోంది

కొన్ని కవితలు నింపుకెళ్ళాలి

నాకు కొన్ని తట్టలు కావాలి

మా ఇంటి చిలక్కోయ్య కు

ఆకలెక్కువయింది

కొన్ని మాటలు ఏరుకెళ్ళాలి

నాకు కొన్ని బకెట్లు కావాలి

మా ఇంటిముందు మొక్కలకు

దప్పిక ఎక్కువయ్యింది

కొన్ని భావచిత్రాలు మోసుకెళ్ళాలి

నాకు కొన్ని ముంతలు కావాలి

మా ఇంటి కిటికీల

మనస్సు బరువెక్కింది

కొన్ని పద చిత్రాలు పట్టుకెళ్ళాలి

అటకపై పాత కుర్చీలు తీస్తున్నపుడో

చిలక్కోయ్యకు షర్టు తగిలిస్తున్నపుడో

ఉదయం మొక్కలకు నీరు పోస్తున్నపుటో

కిటికీల నుండి వెలుగు ముక్కల్ని తింటున్నపుడో

'కవి సంగమం' దిగుడు బావి నుండి

ముంచుకచ్చిన పద్యాలను వల్లెవేస్తున్నపుఢు

నాతో పాటు అవి కూడా రాగాలు తీస్తాయి

నాతో పాటు అవి కూడా కవిత్వ దాహాన్ని తీర్చుకుంటాయి.

గంపలకొద్ది తట్టలతోని బకెట్లనిండా

ముంతలార కవిత్వాన్ని తాగుతుండగానె

మా ఇంటి అటక విశాలమయింది

చిలక్కొయ్య ముందుకు సాగింది

మొక్కలకు మొగ్గలెక్కువయ్యాయి

కిటికీలు వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి

నా మనసు ఊర బావయింది

కవిత్వ ఊట ఊరుతూ నే వుంది

- రవీందర్ విలాసాగరం

తేది : 09.02.2015 (సోమ వారం).

కవిసంగమం మూడేళ్ల పండుగ కు అంకితం

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kavisangamam group in Facebook is netering fourth year. Ravinder Vilasagaram poem expresses the insiration of Kavisangamam giving to the poets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more