కవిస్వరం: లత కంటిపూడి కవిత

సాంకేతిక పరిజ్ఞానం ఒకరినొకరికి ఎంత సన్నిహితం చేసిందో, అంతే మేరకు మానసికంగా దూరం చేసిందనే అభిప్రాయాన్ని ఆమె తన కవితలో చెప్పారు. "పరదేశానికి వెళ్లినవారితో సరిహద్దుల్ని/ చెరిపేసి సంతోషంగా దగ్గరపోతాం" అని అంటూనే "కాలిరిగితే కాస్త పలకరించి పోతావని/ నీ కోసం ఒక చిన్న టెక్స్ట్ పేట్టేను వుదయం/ పనిలో పడి చూసుకోకుండా వుండి వుంటావ్/ హడవిడిగా ఏదో వెతుకుతూండి వుంటావ్" మనిషి కోసం మనిషి పడే తపనను తెలియజేశారు.
ఆమె ఎవరికోసమైనా అలా కలవరిస్తుండవచ్చు. ఓ సన్నిహిత వ్యక్తి కోసం పడే తపన అందులో కనిపిస్తుంది. ఆ నువ్వు పరిస్థితి ఏమిటో చెప్తూ - "ఫేసు-బుక్ లో నువ్వు విచారాన్ని ప్రకటించేసావ్/ స్టాటస్ అప్డేట్ వుదయమే మార్చేసావ్/ నీ ముఖం స్థానంలో ఎవరిదో పెట్టేసావ్/ నువ్వు తెలిసినట్టే వుండి తెలియకుండా పోయావ్" చెబుతూ అనుబంధాలు, ఆప్యాయతలు ఎంత కృత్రిమంగా మారిపోయాయో మనసుకు హత్తుకునేలా చెప్పారు కవి.
చివరి స్టాంజా అద్భుతమైన ముగింపును ఇస్తుంది. ఒకరి కోసం మరొకరు కేవలం దూరాన ఉండి పట్టించుకున్నట్లుగానే ఉంటూ పట్టించుకోకపోవడాన్ని తృణీకరిస్తూ తన కోసం వచ్చేవారి కోసం ఏం చేస్తారో కవి చెప్పారు. ఇది ఒక రకంగా సాంకేతిక అభివృద్ధిలో, సమాచార సాంకేతిక పరిజ్ఝానం పెరగడంతో హృదయాలు గడ్డకట్టుకుపోయి, పలకరింపులూ ఆప్యాయతలూ మొక్కబడులు కావడాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఈ కవితలో వ్యక్తీకరించారు లత.
- కాసుల ప్రతాపరెడ్డి
నువ్వు- నేను (I)
నిముషాలు అవర్-గ్లాస్ లో కరిగిపోతాయి
అభిప్రాయాలు ఆప్యాయంగా అత్తుక్కుపోతాయి
స్మైలీలు ప్రవాహమై ముంచేస్తాయి
నీకు నేను నాకు నువ్వు, విడదీయలేనంతగా దగ్గరయిపోతాం
అమ్మతో,నాన్నతో, అత్తమ్మతో,
ఆటో అతనితో, పక్క ఇంట్లో వున్నవారితో
పర దేశానికి వెల్లినవారితో సరిహద్దుల్ని
చెరిపేసి సంతోషంగా దగ్గరయిపోతాం
కాలిరిగితే కాస్త పలకరించి పోతావని
నీ కోసం ఒక చిన్న టెక్స్ట్ పేట్టేను వుదయం
పనిలో పడి చూసుకోకుండా వుండి వుంటావ్
హడవిడిగా ఏదో వెతుకుతూండి వుంటావ్
ఫేసు-బుక్ లో నువ్వు విచారాన్ని ప్రకటించేసావ్
స్టాటస్ అప్డేట్ వుదయమే మార్చేసావ్
నీ ముఖం స్థానంలో ఎవరిదో పెట్టేసావ్
నువ్వు తెలిసినట్టే వుండి తెలియకుండా పోయావ్
కుంటుకుంటు చేసిన ఖీర్ టేబిల్ పై చల్లారిపోతుంది
పార్కులో పంచుకోటానికి పిల్లలెవరన్నా వుంటే పిలవమంటాను
ఏమండోయ్ ఏదో చూసేసానని యదాలాపంగా లైక్ కొట్టకండి
ఏకిభవించిన వారిని కాఫీకి కలవాలి
కలిసినప్పుడు తప్పకుండా కరచాలనం చేసుకుందాం
-కెఎంఎం లత కంటిపూడి
16 జులై 2013
కవిసంగమం గ్రూపు కోసం క్లిక్ చేయండి