• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బార్లా తెరిచిన తలుపులు

By Pratap
|

Rama chandramouli poem on FDIs permission
ఇప్పుడు మళ్ళీ తలుపులు బార్లా తెరువబడ్డాయి

ప్రత్యక్ష అప్రత్యక్ష విదేశీ పెట్టుబడుదారులందరికీ స్వాగతం

డబ్బుంటే చాలు రాబందులూ..డేగలూ..గద్దలూ ఏవైనా ఈ నేలపై వాలవచ్చు

దశాబ్దాలకిందట రక్తసిక్త హస్తాలతో

సంకెళ్ళను అప్పుడే తెంచుకుని పచ్చినెత్తురోడుతున్న శరీరాలతో

ఒక డచ్..ఒక ఈస్టిండియా కంపనీని "స్వాతంత్ర్యం" పేరుతో గర్జిస్తూ

"ఇక అన్యులకు ప్రవేశం నిషిద్ధం" అని మూసిన తలుపులు

ఇప్పుడు మళ్ళీ బార్లా తెరువబడ్డాయి

అతిథులు నేరుగా మా పడగ్గదుల్లోకికూడా రావచ్చు

అది రైల్వేలైనా..రక్షణ రంగమైనా

కిరాణా వ్యాపారమైనా..ఔషద తయారీరంగమైనా నిరభ్యంతరంగా

వందశాతం భాగస్వామ్యంతో ఎవరైనా వర్థిల్లవచ్చు

బానిసతనానికీ..విధేయతకూ

ఆహ్వానానికీ..ఆక్రమణకూ

నిర్వచనాలు రాజ్యాంగ సవరణల సాక్షిగా మార్చబడుతున్న వేళ

అండమాన్ జైళ్ళూ..జలియన్ వాలా ప్రాణార్పణలన్నీ

పరిహసించే ప్రహేళికలౌతున్నపుడు

మనతలలపై పాదతాడనం చేయగల ఏ ధనవంతుడికైనా స్వాగతమే

మేమే మా అంగీలను విడిచి మీకిచ్చి..మా ఇంటిని మీకు తాకట్టుపెట్టి

మాకై మేమే లొంగుబాటు పత్రాలపై సంతకించి

నగ్నంగా నిలబడి అరచేతిలో హారతివెలిగించి స్వాగతం పలుకుతున్నపుడు

ప్రపంచ ధనికులారా ఏకమై మమ్మల్ని ఆక్రమించేందుకు రండి

ఇక్కడి అడవులను..ఇక్కడి నదులను..ఖనిజాలను

ఇక్కడి సమస్త జీవనరంగాలను మీ పెట్టుబడులతో..డబ్బుతో

యధేచ్ఛగా ఏలుకోండి

మేము స్వచ్ఛందంగా ప్రక్కకు తొలగి మిమ్మల్ని స్వాగతిస్తాం

మా దగ్గర పెట్టుబడులు పెట్టగల మగాళ్ళు లేరు

మందికొంపలు ముంచడం తప్పితే మదుపుచేయగల స్వజాతీయులు లేరు

పరాన్నభుక్కులకు స్వంత అస్తిత్వముండనట్టు

పాలకుల మెదడునిండా ఇన్ని బానిస అరలెందుకో తెలియదు

ఒకసారి రక్తరుచి మరిగిన పులి అరణ్యంలోకి ప్రవేశించిందంటే

ఎన్ని జింకలైనా కకావికలై

అడవిని ఖాళీ చేసి పారిపోవలసిందే

పాలకుల అనాలోచిత పాలసీలు

మనకు తెలియకుండానే మనను ఎవరికో..ఎక్కడో..ఎంతకో కుడువబెట్టి

బేహారులను పిలిచి తలలనుతాకట్టు పెడుతున్నారు

అప్పటి 'ఈస్టిండియా ' ఇప్పుడిక మళ్ళీ వర్చువల్లీ ఆక్యుపైడ్

అన్యాక్రాంత ఇండియాగా రూపాంతరం చెందుతూ

ఇంక్యుబేటర్లోకి వెళ్ళింది

సోదరా స్పృహించవా ప్లీజ్.. నిద్రలే -

- రామా చంద్రమౌళి

( భారతదేశం లో రక్షణరంగంతో సహా అన్ని శాఖల్లోనూ వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ పార్లమెంట్ అంగీకారం తెలిపిన విషాద సందర్భంలో)

English summary
A prominent poet from Warangal Rama Chandramouli protest against FDIs in his poem
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X