• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలుగు కవిత: వి'శో'ఖ

By Pratap
|

చాలాసార్లు వాస్తవాలు ఊహలకందవు

అనుభవాలు ప్రళయభయంకరమై విలయిస్తున్నపుడు .. తెలిసిన విషయాలే

కాని .. కొత్త వికృతితో మనిషిని పాదంకింద పచ్చి సబ్బుబిళ్ళను చేస్తుంది

చితికిపోవడం .. చినిగిపోవడం .. కన్నీళ్ళలో కనలిపోవడం తప్పితే

ఏమీ చేయలేని నిశ్శబ్ద దుఃఖం

ఇదిగో .. ఎదుట పోటెతెత్తిన విశాఖ సముద్రమే -

Rama Chandramouli poem on Hudhud disaster

గాలి హోరు చెవులను పగులగొడ్తూ ఇంత హోరెత్తుతుందా.?

తెలియదు .. విశాఖ జనం జీవితంలో ఎన్నడూ వినని అతిబీభత్స శబ్దం

భయపెట్టే ఒక చేదు అనుభవం ఇప్పుడు

నీరు .. నిన్న మొన్నటిదాకా తొట్టిలో పాపాయిలా

సముద్రపుటూయలలో అలరించిందే

కాని .. ఇప్పుడు జలఖడ్గమై నగరాన్ని తుత్తునియలు చేసింది

వందల ఏండ్లనాటి చెట్లు కూలుతూ .. గాలిపటాలై ఇంటిపైకప్పులు లేచిపోతూ

నేల నెర్రెలువాస్తూ .. ఎక్కడో గర్భ విచ్ఛిత్తి .. బహుముఖ ధ్వంసం

చిన్నపిల్లాడు కసికసిగా కాగితాన్ని చించి చించి .. నలిపి నలిపి ఉండను చేసి విసిరినట్టు

కాలం కాటేయడం మొదలెడ్తే

మనిషి ఒట్టి మంట అంటునున్న కాగితమని మళ్ళీ ఋజువైంది

నగరమూ .. జీవితాలూ ఒక్క రాత్రికి రాత్రే ఛిన్నాభిన్న మౌతాయనీ

ఇక కోలుకోలేని లోతుల్లోకి కూరుకుపోతాయని

జీవిత పరిమళాన్నీ , సంస్కృతి వైభవాన్నీ కలగలిపి

ఒక "జ్వలిత చిహ్నం" గా చరిత్రలో ప్రతిష్టించిన "విశాఖ" జ్ఞాపిక ఇప్పుడు

చేజారిన గాజు బొమ్మై .. భళ్ళున పగిలిన అద్దపు పలకై

రక్తాలోడ్తున్న పాదాలేమో నడక ఉడిగి

ఒక అచేతన స్తబ్దతలో.. తలనిండా తుఫానుతో..గడ్డకట్టిన నిశ్చేష్ట-

ఐతే .. తప్పదు .. తాడును పట్టుకుని మళ్ళీ పైకి ప్రాకడం

తప్పదు .. పడి లేవడం .. లేచి పరుగెత్తడం .. గమ్యాన్ని పునర్నిర్వచించుకోవడం

కష్టమెప్పుడూ మనవల్లనే మనకు సంభవించదు

అకారణాలుకూడా కారణాలౌతాయి కొన్నిసార్లు

మన కుక్కే మనను కరుస్తుందొక్కోసారి

జీవితం ఎంత క్షణభంగురమో అర్థమౌతుంది

గాయపడ్డ తర్వాతే

గాయాన్ని మానుపుకోవడం గురించిన స్పృహ కలుగుతుంది

మనిషికి .. అనుభవాలన్నీ పాఠాలే -

- రామా చంద్రమౌళి

English summary
A prominent poet Rama chandramouli responding to the Hudhud cyclone disaster wrote a poem on Visakhaptnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X