• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదింతే..చెప్పుకో పో దిక్కున్నచోట

By Pratap
|

Rama Chandramouli's poem Identhe..
రెండు సజీవ అభిన్న ధృవాలవి
యుగయుగాలుగా ఘర్షిస్తూనే ఉన్నాయి నిరంతరం
మృదుజలమొకటి.. భారజలమొకటి ప్రక్కప్రక్కనే ఏకానేక ద్వంద్వాలతో-

ఆమె గాలితో సంభాషిస్తూ పొలంలో కలుపునేరుతూ బురదలో పనిచేస్తోంది
మొక్కలు ఆమె పాదాలచుట్టూ అల్లుకుని పసిపిల్లల్లా తారాడుతూంటాయి
అతడు ఒక గొడ్డలిని భుజంపై ఆయుధంగా ధరించి
తుమ్మ కంపను కొట్టేస్తూంటాడు
దుష్టాంగ నిర్మూలన అత్యవసరమని అతనికి తెలుసు
వాడు పరుగెత్తే రైలులో ఉదయం నాలుగ్గంటలనుండి
వేడి వేడి సమోసాలమ్ముతాడు..మోసంమాత్రం చేయడు
ఒక అఖండిత రైలుపట్టాల లోహధ్వని లయాత్మకంగా
గుండెల్లో శృతి..టకటకా టకటకా స్వయంపునరావేశం
ఆమె రోడ్డుప్రక్కన ఇడ్లీబండిపై ఐదుగంటలకే పొయ్యంటిస్తుంది
నూనే..హృదయం సలసలా కాగుతూ..ఒక అనివార్య పోరాటం
అతను మెరుపులా కదిలే చేతులతో పొట్లాలనందిస్తూ చిల్లర తీసుకుంటాడు
ఒక పన్నెండేళ్ళ పేపర్ బాయ్ వచ్చి అన్నా అన్న పిలుపుతో అందర్నీ స్పర్శిస్తాడు
చుట్టూ మనుషులు పగులుతున్న పత్తికాయల్లా తెల్లని నవ్వులై
జీవితం చేతికందుతున్న ఆకాశమౌతుంది
కమ్మరీ, కుమ్మరీ, కంసాలీ, ఉప్పరీ ధ్వంసమైన తమ వృత్తుల్ని తలుచుకుంటూ
మూగబోయిన తమ పనిముట్లవైపు చూస్తూంటారు
ఒక సుత్తె, ఒక సారె, వాము, పట్కారు, పిన్సర్, ఒడంబం, ఒక కొలిమి..ఎర్రగా మంట
లోపల ఎక్కడో ఏదో దహించబడ్తూ..అర్థంకాని నిశ్శబ్ద నిరంతర అనివార్య పోరాటం
వీళ్ళందరూ..దినమంతా పనిచేసి చెమటతో తడిచి రాత్రుళ్ళు నిద్రపోతారు
ఒట్టి అలగాజనం..బేవార్సుగాళ్ళు..ఓట్లకుమాత్రమే పనికొచ్చే అతి సామాన్య భారతీయులు-

వాడు బ్యాంకుకు పోడు
డాక్యుమెంట్లను పట్టుకుని బ్యాంకులే ఫైవ్ స్టార్ హోటళ్ళలోకి వినమ్రంగా విచ్చేస్తాయి
‘అసలు' మనుషులు అదృశ్య మానవులై ఎప్పుడూ కనబడరు
వాళ్ళ "ప్రాక్సీ"లు మాత్రం కార్య ' నిర్వాహకు 'లుగా కానుకలతో ప్రత్యక్షమౌతారు
అన్నీ తీయని నవ్వులూ.. విందులూ.. చీరలే లేని నగ్న దేహాల అగ్నిస్పర్శలూ
కాగితాలపై ఒట్టి సంతకాల కాగితాల మార్పిళ్ళు
డబ్బు నోట్లుగా కనబడదు..అంకెలు అంకెలుగా కోట్లు కోట్లుగా బ్యాంకుల్లో దూరి
ఇంద్ర భవనాలుగా.. బెంజ్ కార్లుగా.. క్విడ్ ప్రోకో ట్రాన్స్ ఫర్లుగా దర్శనమిస్తాయి
ఏమిస్తావు.. ఏమితెస్తావులుగా.. బెయిల్లుగా.. కాంట్రాక్టులుగా.. ప్రాజెక్టులుగా
మొబిలైజేషన్ అడ్వాన్స్ లుగా.. పథకాలు పథకాలుగా విస్తరిస్తూ
అన్నీ టెలిఫోనిక్ "తంతు"నాం,
సిద్ధాంతీకరిస్తాడు వాడు
"ఈ ప్రపంచంలో అమ్మబడని మనిషి లేనేలేడు" అని
కొనగల విధానాన్ని కనుక్కోవడమే ఎంటర్ ప్ర్యునర్ పని
ఎవ్రిథింగ్ ఈజ్ ఫర్ సేల్..అందినకాడికి దోచుకో
గెట్ అండ్ రన్.. దొరక్కుండా దాక్కో జాగ్రత్తగా..రాత్రుళ్ళు..చీకట్లో
గొప్ప దొంగలెప్పుడూ రాత్రుళ్ళే చురుగ్గా పనిచేస్తారు
వాళ్ళది గుడ్లగూబ జాతి
కనబడరు..బాగా తాగి..తూలి..పొద్దంతా ఎ సి గదుల్లో నిద్రపోతారు
వాళ్ళ పాదాలదగ్గర దేశం కుక్కపిల్లలా కుక్కినట్టు పడుంటుంది
ఈ అసామాన్యులు పేపర్లోకి ఎక్కినపుడు
వందల వేలకోట్లలో బ్యాంకుల అప్పు ఎగవేతదార్లుగా కనబడుతారు
కాని..వాడు "ఆడి"కార్లో వెళ్తూంటే ఏ పొలీసువాడికీ కనబడడు

పదిహేను వందల ఋణం చెల్లించలేదు..ఓ ఇడ్లీ బండివాడా
నిన్ను జప్తు చేస్తున్నాం-
లక్షన్నర కోట్ల ఖనిజాన్ని తిన్నవాడా నీకు బెయిల్ మంజూరు చేస్తున్నాం
అంతే.,
చెప్పుకో పో నీకు దిక్కున్నచోట
గో డర్టీ ఫెలోస్..పూర్ ఓటర్ అలగాజనం..కామన్ ఇండియన్స్-

- రామా చంద్రమౌళి

English summary
An eminent Telugu poet from Warangal in his present poem described the plight of poor people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X