జియో బిగ్ ప్లాన్- శాటిలైట్ టు మొబైల్ ఫోన్..అన్ లిమిటెడ్
Reliance Jio: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. దేశంలో ఇంటర్నెట్ సేవలను మరింత వేగవంతం చేయడానికి, దీన్ని విస్తరించడానికి స్టార్‌లింక్‌తో ఒప్పందాన్ని కుదర్చుకోనుంది.
ఉపగ్రహ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యాన్ని కుదర్చుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించింది. దీనికి టెలికం రెగ్యులేటరీ కమిషన్ అనుమతులు లభించాల్సి ఉందని పేర్కొంది.
ఈ ఒప్పందానికి అనుమతులు లభిస్తే- దేశంలో డిజిటల్ కనెక్టివిటీ మరింత విస్తృతమౌతుందని రిలయన్స్ జియో తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీలో ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోతుందని పేర్కొంది. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించింది.

దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ అవుట్‌లెట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్టార్‌లింక్ సొల్యూషన్‌లను వినియోగదారులకు ప్రొవైడ్ చేయగలమని, గ్రామాలకు సైతం శాటిలైట్ బేస్డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకునిరాగలమని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది.
లో- ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తోంది రిలయన్స్ జియో. స్పేస్ఎక్స్‌తో ఒప్పందం కార్యాచరణలోకి వస్తే- ఆ సంస్థకు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్‌తో దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని అందించగలుగుతుంది. మారుమూల గ్రామాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చిరు వ్యాపారులకు డిజిటల్ సేవలు లభిస్తాయని ఆ సంస్థ స్పష్టం చేసింది.
ఇప్పటికే ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లు, జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్‌తో స్టార్ లింక్ సేవలను అనుసంధానం చేయడానికి వీలు కలుగుతుంది. ఫైబర్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని సంక్లిష్ట ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందినట్టవుతుందని రిలయన్స్ జియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాథ్యూ ఊమెన్ అన్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏలుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు సైతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌కు కనెక్టివిటీని పెంచడానికి జియోతో కలిసి పని చేస్తామని స్పేస్‌ఎక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షాట్‌వెల్ అన్నారు.












Click it and Unblock the Notifications