రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్ టెంపరర్లీ సేఫ్
Ravichandran Ashwin replacement: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 26వ తేదీన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. బాక్సింగ్ డే టెస్ట్ ఇది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దీనికి వేదిక. ఈ కీలక మ్యాచ్ కోసం రెండు జట్లు ముమ్మరంగా కసరత్తు సాగిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్నాయి.
ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. 1-1తో సమంగా నిలిచాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ గెలవాలన్నా, డ్రాగా ముగించుకోవాలనుకున్నా బాక్సింగ్ డే గేమ్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో దీన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి రెండు జట్లు.

ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ బూస్ట్ ఇచ్చే సమాచారాన్ని వెల్లడించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. టీమిండయా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కేరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో మొత్తం 904 పాయింట్లను సాధించాడు బుమ్రా.
భారత్‌కు చెందిన ఏ బౌలర్ కూడా ఈ స్థాయిలో టెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లను అందుకోలేదు ఒక్క మాజీ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తప్ప. 2016 సీజన్‌లో 904 పాయింట్లను సాధించాడు అశ్విన్. ఇప్పుడు దానికి సమానంగా నిలిచాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఈ సీజన్‌లో 904 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
గురువారం ఉదయం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఆస్ట్రేలియాతో ఆరంభం అయ్యే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శను చేయగలిగితే ఈ పాయింట్లను అధిగమించినట్టవుతుంది బుమ్రాకు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో డ్రాగా ముగిసిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో 94 పరుగులకు తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో ఒక్కసారిగా 14 పాయింట్లు అతని ఖాతాలో వచ్చి పడ్డాయి.
ఓ టీమిండియా బౌలర్ 900లకు పైగా టెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లను అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 899 పాయింట్లతో రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. అంతకంటే ముందు కపిల్ దేవ్- 877, అనిల్ కుంబ్లే- 859, వినూ మన్కడ్- 811, సుభాష్ గుప్తే 806 పాయింట్లను అందుకున్నారు.












Click it and Unblock the Notifications