వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనకూ ఓ మహాకుడ్యం!: నల్లమలలో 120కి.మీ. రక్షణగోడ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్లమల అడవుల్లో కాకతీయ రాజు ప్రతాపరుద్రుని సైనిక దుర్గం ఒకటి వెలుగు చూసింది. ఇది 120 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణం ఎనిమిదో శతాబ్ధంలో ప్రారంభమైంది. 13 శతాబ్దంలో కాకతీయ రాజులు దీనిని పూర్తి చేశారు.

చరిత్రలో కలిసిపోయిన అమ్రాబాద్ కోటకు దుర్భేద్య రక్షణగా ప్రస్తుత అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మున్ననూర్ నుంచి ప్రారంభమై ఫరహాబాద్ మీదుగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల వరకు విస్తరించిన అద్భుత నిర్మాణం ఇది.

కాకతీయ సామ్రాజ్య పతనం.. అనంతరం శత్రు రాజ్యాల దాడులు.. ప్రకృతి ప్రకోపాలు.. ఇలా పలు కారణాలతో ఆ మహాకుడ్యం దాదాపు అంతర్థానమైనప్పటికీ, అక్కడక్కడా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నమస్తే తెలంగాణలో కథనం వచ్చింది. దాని ప్రకారం..

కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ కోటగోడ పొడవు సుమారు 120 కిలోమీటర్లు. అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మున్ననూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కోటగోడ ఫరహాబాద్ మీదుగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల వరకు విస్తరించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

13వ శతాబ్దానికి చెందిన ప్రతాపరుద్రుడు సైనిక పటాలాల కోసం ఈ రక్షణ కుడ్యాన్ని నిర్మించాడు. అమ్రాబాద్ కోటకు వందల ఏళ్ల చరిత్ర ఉందని ఆ కోటలో లభ్యమైన శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పాలించారు.

120 kilometers wall in Nallamala forest

వారి హయాంలో అమ్రాబాద్ ప్రాంతాన్ని పట్టభద్రుడు అనే సామంత రాజుకు అప్పగించారు. ఆయన మన్ననూర్ ప్రాంతంలోని అరణ్యంలో కోట నిర్మాణానికి పునాది వేశాడు. దీన్ని సైనిక పటాలాల కోసం నిర్మించారు. దీన్ని పటాల భద్రత కోటగా పిలిచారు. పట్టభద్రుడి కాలంలో మొదలైనందున పట్టభద్రుని కోటగా కూడా వ్యవహరించారు.

శ్రీశైల క్షేత్రానికి ఉత్తరాన కోట ఉండగా కోట రక్షణ కోసం నిర్మించిన గోడలు నల్లమలలోని కృష్ణానది తీర ప్రాంతంగుండా, 120 కిలోమీటర్ల వరకు విస్తరించాయి. ఇక్ష్వాకుల అనంతరం శాలంకాయనులు, అనంతరంవిష్ణుకుండినులు చక్రవర్తులయ్యారు. విష్ణుకుండినులు ఈ కోటను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు. అనంతరం చాళుక్యులు వారి రాజధాని కల్యాణి నుంచి ఇక్కడ పాలన కొనసాగించారు.

12వ శతాబ్దంలో మహా బలవంతులైన కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట వచ్చింది. గణపతిదేవుడి హయాంలో కొందరు సామంతరాజులు ఈ కోటను ఏలారు. రాణి రుద్రమదేవి హయాంలో కొంత వరకు కోట నిర్మాణం జరిగింది. ఆ నకదమాన ప్రతాపరుద్రుని హయాంలో కోట నిర్మాణం పూర్తైంది.

దుర్గాన్ని రక్షించేందుకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 120 కిలో మీటర్ల వరకు రక్షణనిచ్చేలా కోట గోడలను ఆయన స్వయంగా దగ్గరుండి కట్టించాడు. అప్పటి నుంచి దీన్ని ప్రతాపరుద్రుని కోటగా పిలుస్తున్నారు. కాకతీయుల కాలంలో వైభవాన్ని చవిచూసిన ఈ కోట ఆ తర్వాత పతనమైంది.

కాకతీయుల పతనానంతరం పదిహేనవ శతాబ్దంలో మహ్మదీయులు ఈ కోటపై దండెత్తారు. అయితే ఈ దుర్గాన్ని ఛేదించడం వారి వల్ల కాలేదు. ఆ కాలంలో ఉమామహేశ్వర కొండపై ఓ నిత్యాన్నదాన సత్రం ఉండేది. ఈ సత్రాన్ని నడిపే వారికి ఉడిమిళ్లలో కొంతభూమి ఉండేది.

మహమ్మదీయులు వారి అనుచరులకు బ్రాహ్మణ వేషాలు వేయించి ఈ సత్రంలో చేర్పించారు. అక్కడి ఉమామహేశ్వరం క్షేత్రంలో ఉన్న పూజారులను లోబరుచుకొని ఈ కోట రహస్యాలను తెలుసుకున్నారు. దాడికి నూతన వ్యూహం పన్ని కోటకు ఎదురుగా ఉండే కుప్పగుట్ట పైకి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని, తోపు గుండ్లతో కోటపై దాడులు చేశారు.

ఈ దాడి సమయంలో కోట లోపల ప్రభువు కొలువులో సైనికులకు ఏవో ఆదేశాలిస్తుండగా.. కోట గోడను ఛేదించుకుని దూసుకొచ్చిన గుండు సూటిగా రాజుకే తగిలింది. ఈ తర్వాత జరిగిన యుద్ధంలో దుర్గం పతనం కాగా మహమ్మదీయులకు కూడా చాలా నష్టం వాటిల్లింది.

ప్రస్తుతం అచ్చంపేట మండల రంగాపురంలో పూజలు అందుకునే నిరంజన్ షా వలీ ఆ యుద్ధంలోనే బలి అయ్యాడని చెప్తారు. ఆయన అసలు సమాధి కోట గోడ ఉన్న తలుపుల కురవ వద్ద ఉంది. రంగాపురంలో ఉన్నది ఆయన పేర కట్టింది మాత్రమేనని ఇక్కడ చెప్పుకుంటారు.

ఈ కోటను చివరగా పాలించింది చింతకుంట ప్రభువులు. వీరు పదిహేను శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయపాదం వరకు పాలించారు. వీరి తర్వాత ఈ కోటకు ఆలనాపాలనా లేక శిథిలమైంది. దాంతో పాటే శత్రువుల దాడుల్లో రక్షణకుడ్యం ఎక్కడికక్కడ విధ్వంసమై ఆనవాళ్లు అక్కడక్కడా మాత్రమే మిగిలాయి.

నల్లమల కీకారణ్యంలో ఉండడంతో ప్రకృతి బీభత్సాలు, చోరులు, వన్యప్రాణుల దాడులు, దుండగుల గుప్త నిధుల తవ్వకాలవల్ల చాలాచోట్ల గోడ పునాదులు మాత్రమే మిగిలాయి. సుదీర్ఘ రక్షణ కుడ్యంలో ఇపుడు నాలుగు, ఐదు కిలో మీటర్ల మేర ఉన్న గోడ కూలిపోయిన స్థితిలో దర్శనమిస్తోంది.

English summary
120 kilometers wall in Nallamala forest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X