హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ దే పైచేయా?

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహామొండి. ఆ విషయాన్ని కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఈ ఐదేళ్ళలో ఎన్నో సార్లు గ్రహించింది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించే వ్యక్తి ఆయన. ఒక్కోసారి రాజకీయాల్లో ఈ మొండితనం అవసరమే. ఈసారి ఆయన మొండితనమే ఆయనకు వరం కానుందా? ఆ అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అధికార పార్టీకి ఎన్నికల్లో ఎదురయ్యే మొదటి భయం ప్రభుత్వ వ్యతిరేకత. ఈసారి అధికార కాంగ్రెస్ పై ప్రభుత్వ వ్యతిరేకత అతి తక్కువగా ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం.

ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఎందుకు లేదంటే- ఈ ఐదేళ్ళూ వర్షాలు బాగా పడ్డాయి. వ్యవసాయ పనుల్లో గ్రామీణులు నిమగ్నమయ్యారు. ఆరోగ్యశ్రీ, చౌక బియ్యం పథకం, వృద్ధాప్యపు పెన్షన్లు సామాన్యులకు బతుకు మీద ఒక దీమాను కలిగించాయి. ఈ పథకాలను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇటు పని పాటలు ఉండడం, అటు సంక్షేమ పథకాలు అందుబాటులోకి రావడం వల్ల జనం ఆనందంగా ఉన్నారని అనేక సర్వేలలో వెల్లడైంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వర్షాలు పడవన్న సెంటిమెంట్ జనంలో ఉంది. అది మహా కూటమికి పెద్ద మైనస్ పాయింట్.

కనీసం 120 సీట్లలో ఖచ్చితంగా విజయం సాధించగలమన్న విశ్వాసం కాంగ్రెస్ మేధావుల్లో, వైఎస్ సన్నిహితుల్లో కన్పిస్తోంది. మరో డెబ్బై స్ధానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని, ఆ స్ధానాలపై దృష్టి పెడితే మేజిక్ ఫిగర్ అయిన 147 కు చేరుకోవడం పెద్ద కష్టం కాదని వారి అంచనా. ఈ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ ప్రజా క్షేత్రంలో పరిస్ధితిని ఎవరూ పూర్తిగా అంచనా వేయలేరు. ఉదాహరణకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్టాక్ మార్కెట్ లాగానే వివిధ సెంటిమెంట్ల ప్రభావంతో తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతోంది. ఆ పార్టీకి ముప్పై స్ధానాలు వస్తాయని మొదట నిపుణులు అంచనా వేయగా ఇటీవల వీక్ సర్వేలో ఆయనకు 57 స్ధానాలు వస్తాయని తేలింది. కానీ ఆ తర్వాత ఆ పార్టీ మూలస్తంభాలైన ఐపిఎస్ ఆంజనేయరెడ్డి, డాక్టర్ సమరం, పరకాల ప్రభాకర్ వైదొలగడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మనో బలం దెబ్బతిన్నది. దీనితో ఆ పార్టీ సెన్సెక్స్ మళ్ళీ దిగజారి 30 లోపు అసెంబ్లీ స్ధానాలకు చేరిపోయిందని ఒక అంచనా.

చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని మహాకూటమి మహా విశ్వసనీయత సమస్యని ఎదుర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో విశాలాంధ్ర నినాదం విన్పించిన బాబు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ అంటూ చంద్రశేఖరరావుతో జోడీ కట్టడం అటు ఆంధ్రలోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా కొన్ని వర్గాల్లో వ్యతిరేకతను సృష్టించినట్టు కన్పిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో జోడీ కట్టి చంద్రబాబును ప్రపంచబ్యాంక్ ఏజెంట్ గా అభివర్ణించిన వామపక్షాలు ఇప్పుడు బాబు వెనుక చేరి గంతులు వేయడం వారి విశ్వసనీయతను దెబ్బతీసింది. సొంతంగా గెలిచే సత్తా లేని వామపక్షాలు ఒక ఎన్నికలో ఒక పెద్ద పార్టీని, మరో ఎన్నికలో మరో పెద్ద పార్టీని ఆశ్రయించడం, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వ్యతిరేక అన్న భావన ఆయన చివరి ఐదేళ్ళ పాలనలో సామాన్య జనంలో బలమైన ముద్ర వేసింది. ఆ ముద్ర ప్రభావం ఇప్పటికీ బాగా కన్పిస్తోంది. తెల్ల గడ్డంతో ఆయన ఒక అమానవీయ శక్తిలా కన్పిస్తున్నారని వస్తున్న విమర్శల్లో నిజం లేకపోలేదు.

వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసింది. ఎన్నో అక్రమాలకు పాల్పడింది. హై కమాండ్ పూర్తి స్వేచ్చను ఇవ్వడంతో వైఎస్ హయాంలో అవినీతి కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులలో, సెజ్ లలో అవినీతి తీవ్రంగా ఉంది. వేలాది కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయి. అయినా సంక్షేమ పథకాల అమలులో కూడా వైఎస్ ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించడం ఆయనకు కలిసొస్తున్న అంశం. హంగ్ అసెంబ్లీ మనకు అలవాటు లేదు. ఆ లాజిక్ ప్రకారం అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. చిరంజీవి పార్టీ ఎన్నికల తర్వాత కీలక పాత్ర వహించబోతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X