హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాపుల ఓట్లే కీలకమా?

By Staff
|
Google Oneindia TeluguNews

YSR
హైదరాబాద్: ముప్పై ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నప్పుడు సాధారణంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంటుంది. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు, టిడిపి పటిష్టమైన మహాకూటమి, ప్రజారాజ్యంలో చిరు, పవన్ ల జనాకర్షణ కారణంగా జనం ఎటువైపు మొగ్గాలో ఇప్పట్లో తేల్చుకోవడం కష్టమే. మనకు హంగ్ కల్చర్ లేదు కాబట్టి ఈసారి కూడా హంగ్ రాదని కొందరు రాజకీయ పండితులు చెబుతున్నా ఎవరూ ఏదీ నమ్మలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి.

చిరంజీవి పార్టీ కాంగ్రెస్ ఓట్లు చీల్చుకుంటుందా? తెలుగుదేశం ఓట్లు లాక్కుంటుందా అన్నది ఈ ఎన్నికల్లో ప్రధానాంశం. గత ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కాపు, తెలగ, బలిజ తదితర ఉప కులాల వారు కట్టగటుకుని ఓటేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో ఉన్న జాతి వైరం ( మరీ ముఖ్యంగా వంగవీటి రంగా హత్యానంతరం) దీనికి ప్రధాన కారణం. అప్పట్లో తమ జాతికి చెందిన రాష్ట్ర నాయకుడు లేకపోవడం వల్ల కాపులు వైఎస్ వెంట వెళ్ళారు. ఇప్పుడు తమ జాతికే చెందిన చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో దుమ్ము రేపుతుండడంతో ఆ కులం, దాని ఉప కులాల వారు సంఘటితమవుతున్నారు.

కాపుల ఓట్లు చిరంజీవికి వెళ్ళడం కాంగ్రెస్ కే నష్టమన్న విషయం ఈనాడు చిన్న పిల్లలకు కూడా తెలుసు. అయితే జరగబోయే నష్టాన్ని పూడ్చుకోడానికి కాంగ్రెస్ మేధావులు వ్యూహ రచనలో నిమగ్నమై ఉన్నారు. చిరంజీవికి కొన్ని స్ధానాలు వస్తాయేమో కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న ప్రచారాన్ని కాంగ్రెస్ బాగా ప్రచారంలో పెట్టింది. ఆ ప్రచారం ప్రభావం కొంత, గ్రామాల్లో అమలు అవుతున్న కాంగ్రెస్ మార్కు సంక్షేమ పథకాల ఫలితం కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా మారనున్నాయి.

చంద్రబాబు నాయుడి ఆల్ ఫ్రీ మేనిఫెస్టో విమర్శలకు గురవుతోంది. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళూ ఆకాశంలో విహరించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేల మార్గం పట్టి పేదల గురించి, మధ్యతరగతి గురించి మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు నాయుడి మాటలను నమ్మలేమన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు క్షేత్ర స్ధాయిలో ప్రజల్లో కలిగించగలిగారు. చంద్రబాబు మహాకూటమికి అదే పెద్ద దెబ్బ. ఇక తెలుగుదేశంలో ఉన్న కాపు బేస్ కూడా కూడా ప్రజారాజ్యం పార్టీ వల్ల నష్టపోయే అవకాశముంది. అయితే ఆ బేస్ చాలా చిన్నది.

కాపుల ఓట్లు ప్రజారాజ్యానికి పోవడం వల్ల కాంగ్రెస్ బాగా బలహీనపడితే మహాకూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాపుల ఓట్లు పోయినా బిసి, ఎస్ సి (మాదిగలు మినహా) ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న దీమా అధికార కాంగ్రెస్ లో కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X