హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాపారాల్లోనూ నాగార్జున ఘటికుడే

By Santaram
|
Google Oneindia TeluguNews

Nagarjuna
హైదరాబాద్: హీరో నాగార్జున ఇటీవల అనేక వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లోకి ఎక్కుతున్నారు. పైకి ఈజీ గోయింగ్ వ్యక్తిగా కన్పించే నాగార్జునకు తండ్రి కంటే ఎక్కువగా స్ధిరాస్ధుల మీద మమకారం ఉందని అనేక సందర్భాల్లో నిజమైంది. నాగార్జునలో మంచి కళాకారుడే కాదు గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడు. రామోజీరావు ఎందుకూ పనికి రాని భూములను విజయవాడ రోడ్డులో కొని ఈనాడు లాభాలను అక్కడికి తరలించి డెవలప్ చేసి వృద్ధాప్యంలో మరింత అలిసిపోయారు. కానీ నాగార్జున గచ్చిబౌలి సమీపంలోని వరి పొలాలను ఎకరానికి యాభై వేల చొప్పున కొన్నట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ ఉన్నత దశలో ఉన్నప్పుడు ఈ పొలాలు ఎకరం ముప్పై నుంచి నలబై కోట్లు పలికాయి. రామోజీరావుకున్న 1500 ఎకరాల విలువ కంటే హైటెక్ సిటీ సమీపంలో నాగార్జునకున్న వంద ఎకరాల లోపు విలువ ఎక్కువ కావడంతో రామోజీరావే ముక్కున వేలేసుకున్నారట.

నాగార్జున పెద్ద భూ బకాసురుడని కెసీఅర్ ఇటీవల అరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డులో తన భూములను రెగ్యులరైజ్ చేసుకోడానికి నాగార్జున ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు కట్టాడన్న విషయాన్ని టీఅర్ ఎస్ నాయకులు బయటికి తెచ్చారు. తన భూములను కాపాడుకోడానికి నాగార్జున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు అనుకూలంగా మారారు. వైఎస్ పథకాలను అనేక మీడియాల ద్వారా, యాడ్స్ ద్వారా ప్రచారం చేశారు. తన కులానికే చెందిన చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందని తెలిసినా నాగార్జున తన వ్యాపార, ఆస్ధి ప్రయోజనాల కోసం ఇలా చేశారన్న విమర్శ ఉంది.

తాజాగా తన సినిమా టైటిల్ ను ముందుగానే రిజిస్టర్ చేసుకున్న ఒక సినిమా సంస్ధపై ఆరోపణలు చేసి నాగార్జున మరింత భ్రస్టు పట్టారు. "రమ్మి" టైటిల్ వేరొకరు రిజిస్టర్ చేసుకున్నారని తెలుసుకున్న నాగ్ "మోసగాడు" టైటిల్ అనుకున్నారు. చివరికి ఆ టైటిల్ మరొక రకంగా మారింది. తాము "రమ్మి" టైటిల్ కోసం 12 లక్షలు డిమాండ్ చేశామని నాగార్జున ఆరోపించడంపై ఐనెక్స్ కలర్స్ అనే సినిమా సంస్ధ ప్రతినిధి సుధాకర్ మండిపడ్డారు. ఈ సినిమాపై తాము ఇప్పటికే పాతిక లక్షలు ఖర్చు పెట్టామని, నాగార్జున చెబుతున్న ఆ ముష్టి 12 లక్షలకు ఆశపడే స్ధాయిలో తాము లేమని సుధాకర్ చెప్పారు.

తాను నెగిటివ్ గా మీడియాలోకి వస్తున్న విషయం గ్రహించిన నాగార్జున మీడీయా ప్రతినిధులను ఎంతో ఖరీదైన మందు విందులను ఇచ్చి లోబరుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారమోనన్న అనుమానం ఉన్న నాగార్జున అటువైపు కూడా ఒక కాలు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గతంలో ఆ బాధ్యతను తండ్రి నాగేశ్వరరావుకు అప్పగించిన నాగార్జున ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న ముందు చూపుతో ఆ బాధ్యతను కూడా తన భుజాల మీద వేసుకుని బహుపాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ నాగార్జున!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X